31, అక్టోబర్ 2011, సోమవారం

గడాఫీ


ఎటువంటి కాలం ఇది?

తగలరాని చోట బలమైన గాయమేదో తగిలి
జుట్టు పట్టుకొని నిన్ను బలంగా ఈడుస్తున్నప్పుడు
ముఖమంతా నెత్తుటి చారికలతో
జరుగుతున్నదేమిటో గుర్తించేలోగా
దెబ్బ మీద దెబ్బ మీద విసురుగా తగులుతున్నప్పుడు

అనేకసార్లు
ముఖంమీద ధారలు కట్టే నెత్తుటి కన్నా

నీ మస్థిష్క మూలలలో ఒక సంభ్రమానుభూతియై
ఒత్తుకపోయే మృత్యువుకన్నా

వెగటుగ భయం కలిగించే ప్రశ్న ఒకటి
తలెత్తుతూనే ఉంటుంది

నీ చుట్టూ అల్లబడిన కంచెలో
నువ్వొక చిన్న గొర్రెపిల్లవు

నోటికంది వచ్చే నాలుగు గడ్డి పరకలు తప్ప
ఇంకేదీ పట్టని నీ తెలివికి హద్దు ఫలానా అని
తెలుసుకొనేలోగా నువ్వొక బందీవి

నీ చుట్టూ ఊపిరాడకుండా పేర్చిన వార్తల దొంతరలు

నువ్వు తలెత్తి చూసేలోగా నీ మీద నీకే
అనుమానం కలిగించే ప్రతికథనాలు

నిజమే
ఇది దూరాలు కరిగి దగ్గరవుతున్న కాలం
సముద్రాల కావల చిన్న అలికిడికే
పడకటింట్లో ఉలిక్కి పడి లేచే కాలం

కానీ నీ ఇంట్లో జరుగుతున్నదేమిటో నీకు తెలిసేలోగా
ఒకదానికొకటి పొంతన లేని నాలుగు రకాల కథనాలు

సత్యాసత్యాల విచికిత్సలో
సమస్తమూ రద్దయి
కథకుడొక్కడే త్రివిక్రముడై సమస్త లోకాలనూ ఆవహిస్తున్న కాలం

మనుషుల చావుల కన్నా
ఊహించని ఓటముల కన్నా
ఒక భయద వాస్తవమై ఇప్పుడు నాలికలు చాస్తున్న
ఈ యుద్ధం పేరు విశ్వాసాల విధ్వంసం

ఇది నమ్మకంగా
అపనమ్మకాలను పేని
నీ మెడను కాలం కోట గుమ్మానికి ఒక గురుతుగా వేలాడదీస్తున్న కాలం


25, అక్టోబర్ 2011, మంగళవారం

రీస్టోరింగ్ పాయింట్

అపురూపమైనవి ఎలా రూపొందుతాయి?

ఒక ప్రత్యూషానికి ముఖం ఎదురు చేసి
కొద్ది కొద్దిగా విచ్చుకునే లోకపు
రంగులలో నీవు

లేదా నీవే నీకు తెలియకుండా కొన్ని తుషార బిందువులను
దేహంపై విప్పారే రెక్కలుగ చేసుకొని
మెలమెల్లగ రేకులు విచ్చుకునే అనుభూతి

కొన్ని గులాబీ వర్ణపు కలలను
తన చేతి వేళ్ళ కదలికలతో సుతారంగా నీ చుట్టూ మంత్రించి రాసే
అప్పుడే పుట్టిన పసికందు

లేదా సున్నితమైనవేవో నీలోనే మెదలి
నీ చుట్టూ నీవు కొన్ని కొల్పోయినవాటినేవో తలచి, తలపోసి
ఒక ఆలంబన కోసం వెతుకుతూ

మళ్ళీ మళ్ళీ నీవు నీలోంచీ పుట్టుక రావడం



 

16, అక్టోబర్ 2011, ఆదివారం

నీ పేరు

ఒక సంశయం

కూర్చిపెట్టుకున్న పదాలలో
ఎక్కడైనా ఈ క్షణం ఒదుగుతుందా?

ఊహించిన భావ చిత్రాలతో
వాస్తవం రక్తి కడుతుందా?

సున్నితమనుకున్నవి కర్కశ పాషాణస్పదమై
నిన్ను తునాతునకలు చేయలేదా?

బండ రాతి మూలలలో
ఒక పుష్ప రాగమేదో గోచరమై నిన్ను కన్నీటి మడుగును చేయలేదా?

అనేకానేకాలుగా పగిలిన తునకలలో
నిన్ను నీవు ఏరుకునే ప్రయత్నం వేలి కొసలు తెగి
రక్తాలాపనలుగా నిన్ను నీవు తాత్కాలికంగానైనా శాంత పరుచుకోలేదా?

ఒక పదం ఎదిగి
పొరలు పొరలు నీ ముందర
శత పుష్పదళమై
ఫణి శిరసున మణియై
అనేకానేక చీలికల నాలికై
జఠరాంతర్గత నాళికలలో కాలకూట విషమై
ఒక్క ముఖమా నీది?

ఇంతకూ ఈ ఫూట నీ పేరేమిటి?


11, అక్టోబర్ 2011, మంగళవారం

జాడలు


తెలియనిదేదో మార్గం

దారి పొడవునా అతడు ఒక్కో విత్తును జారవిడుస్తూ పోయాడు


ఒక్కో విత్తూ ఒక్కో మొక్కయింది

మొక్కలు ఎదిగి
పుష్పించి ఫల భరితమయ్యాయి

నడచిపోయిన మనిషి తిరిగి రాలేదు

కానీ వేసిన ప్రతీ అడుగూ
ఒక ఆకుపచ్చని కవిత్వమయింది

9, అక్టోబర్ 2011, ఆదివారం

ఒక రోజు గడవడం


౧.ఎప్పటిలాగే  ఉదయం :
 నిర్ణయాలన్నీ ఎప్పటికప్పుడు ఎలా తారుమారవుతాయో ఆలోచిస్తూ ఉండగనే
 చేజారి భళ్ళున ఎక్కడో బద్దలవుతుంది

 ఊపిరి వెన్నులో గడ్డకట్టి
తీగలు తెగిపోతూ మిగిలిన శబ్ధ స్థంబన ఒక్కటే ఇక దేహమంతా

ప్రేమలు లేవు
లేత రంగుల అల్లికతో గాఢంగా పెనవేసుకునే సంస్పందనల
ఉదయాస్తమయ జమిలి మేలిమి అనుభూతులు లేవు
సున్నితమైనవన్నీ ఒక్కొక్కటీ
రెక్కలు విరిగి -

ఈ క్షణం ఇది  మూలాల కుదుళ్ళను
తలకిందులు చేసి సుడివేగంతో ఎక్కడికో విసిరివేసే పెను ఉప్పెన

మనుషులు ఎందుకింత యాతన పడాలో
ఈ శాపాన్ని తలదాల్చి ఎన్నాళ్ళు ఇలా మోయాలో

౨.పగటి పూట :
ఈ దారులకు అలవాటయిన పాదాలు

ఎక్కడికెక్కడికో కొనిపోతూ; నువ్వు నడుస్తున్నప్పుడు ఎచటికో తెలియని నీ పయనాన్నీ,నిన్నూ అన్నీ తెలిసిన ఒక తల్లి, బిడ్డను తన  చేతులలోకి సుతారంగా తీసుకున్నట్టుగా
తన లోనికి, తన శరీరంలో శరీరంగా తనలోనికి తీసుకొని దారులన్నీ నీతో నడుస్తూ ఉన్నప్పుడు -

కాసేపు నువ్వు వెక్కివెక్కి ఏడ్చే చంటి బిడ్డవు. తెలియని దన్ను ఏదో  ఒక ఎరుకగా నీలో నీకే పొటమరించిన తల్లి చన్నయినపుడు నువ్వే ఒక ఓదార్పు మాటవు. నీ చుట్టూ నువ్వే అనేక యుద్ధాలను అల్లుతూ, ఉన్నవి  నీకు రెండు చేతులేనని  సమయానికి గుర్తురాక చివరకు వేసటపడీ, అలసీ,నీ  నీ పైన నువ్వే గురి చూసుకొనే నిర్ధాక్షణ్యతవు

౩.రాత్రి :
ఉన్నది ఇక కేవలం అలసట

గుడ్డి దీపం వెలిగించిన ఒక గుహ-
నెత్తురు కరుడు కట్టి కొసలపై తడి ఆరని రాతి ఆయుధాల చీకటి కారడివి-
ఏ యుగమో తెలియదు
ఈ రాతిరికిక ఈ ఆదిమ మానవుడు నిదురించాలి  


 

8, అక్టోబర్ 2011, శనివారం

జ్వరస్థితి

లోలోపల ఏమవుతుందో తెలియదు
కొన్నాళ్ళపాటా లేకుంటే కొన్ని రోజులా?

చేతనం సందిగ్ధమై ముందుకూపోకా వెనుకకూ రాకా
ఒక లోలోతులలో పొరలు పొరలుగా కాగే సన్నని మంట
దేహపు ఆవరణలో ఎవరో ఏదో వైనవైనాలుగా హడావిడీ పడుతున్నసవ్వడి

వినిపించీ వినిపించనట్టు ఒకమూల ఒక నేపథ్యానికి
ఒకింత ఓరిమితో ఒక అలవాటయిన స్థితిలో
కంగారూ కాకుండా నిర్లిప్తమూ కాకుండా
తెలియని సన్నద్ధత ఏదో కవచధారియైనిలుచునే  వేళ

ఏకాంత దీపాల వెలుగులో
రణగొణ ధ్వనులను విడిచి కించిత్ కాలాతీతమై
రెండు చేతులనూ చాచీ అలసిన దేహంతో

నువు మూగన్నుగా పడుకొని
మెలకువకూ నిద్దురకూ నడుమ నేడూ రేపులలాగే
సన్నని కంచెను అల్లుతుంటావు

 

5, అక్టోబర్ 2011, బుధవారం

కవిత్వం

ఎగిరే సీతా కోక చిలుకల రెక్కల చప్పుడు
ఏకాంతం


దిగంతాలకు విస్తరించిన  కనుదోయి చూపు
పాట


చెట్లు గుబురులెత్తే కాలంలో గాలిలో కలగలసిన సుతిమెత్తని ఆకుపచ్చ పరిమళం 
ఊహ


అనంత దూరాల యానంలో నిరంతరమూ సాగే కాంతి వేగాల జలపాత ఉరవడి
కవిత


రాలి పడిన పూవుల దుఃఖాన్ని వేలి కొసలకెత్తి దేహానికలుముకునే గంథలేపనం
మనిషి