26, నవంబర్ 2011, శనివారం

సంబోధన


కొన్నిసార్లు చెప్పేందుకేమీ ఉండదు

మండే దివిటీలా  దేహన్ని మార్చి
వెతకడం తప్ప

ఏదీ వ్యక్తం చేయలేని సమయంలా అది లోలోపల భగ్గున మండుతుంటుంది

కత్తిమొన  కుత్తుకలో పదునుగా దించినపుడు
చిందే నెత్తుటి ధారలా ప్రాణం కోసుక పోయే ఆరాటమై ఉంటుంది

చాలా మరణాలు ముందే తెలిసిపోతాయి
జవజవలాడే నిలువెత్తు జీవితం గప్పున ఆరిపోవడం నీవు ఊహించగలవు

ఒక్కొక్కటీ కదలబారి మసక మసకగా వెనుకకు జారిపోతూ
గతంలో కరిగి పోవడం
కాలానికి ఒక బీభత్స మాపని

కొన్ని సార్లు ఏమీ చెప్పలేకపోవడం
చెప్పిన దానికన్నా అర్థవంతంగా ఉంటుంది





18, నవంబర్ 2011, శుక్రవారం

ఎక్కడైనా


అక్షరాలు కొన్ని

వేలికొసలు తెగి నెత్తురు గోరింటలో స్నానమాడే
మేలిమి ముత్యాలని పిలుస్తాను


పదాలు కొన్ని

రోదించడానికి కూడా అశక్తుడవై నిస్సహాయంగా నిలబడిన వేళలలో
నీ ముఖం మీద రాలి పడే వాన చినుకులంటాను

వాక్యాలు కొన్ని

పెగలని గొంతుకతో డగ్గుత్తిక కత్తి కొనయై
నాభికొసల వరకూ దిగి ప్రాణం ఆర్చుకపోతూ
ఒక కొస దాకా నిన్ను రాసుకుంటూ పోయే పేర్పులా తలపోస్తాను

కవితలు కొన్ని

చెంపలపై
ఇక్కడ ఇంకిన చారికలకు
మరెక్కడో టీకా తాత్పర్యాలు రాసే
విశ్వ వ్యాకరణమని భావిస్తాను


17, నవంబర్ 2011, గురువారం

రోడ్డు మీద


రాలినపూవుల నేరుతూ
శూన్యపు గీతాలను మాలగా అల్లి
బరువుతనాన్ని దిక్కులకు వేలాడదీసేవాడా

రెమ్మల నుండి వేరయిన ఆకుల
నిశ్శబ్ధ పతనానికి  ఊర్పుల లయను జతచేసి
ఒక చెమ్మగా  నేలకురాలి, ధూళిలో ఒదిగి
జ్ఞాపకమై కరిగి పోయేవాడా 

తిరుగాడిన ఒక్కోక్క చోటుకు ఒక్కొక్క గుర్తును
సున్నిత స్పర్శగ
వీడని జలదరింపయి మేనిపై మోసుక తిరిగేవాడా
                                
కదిలే నీ దృశ్యాల పొందికలో
విచ్చిన్నతయే అవిచ్చిన్నమై
అవిభాజ్యత అనేక శకలాలుగా సాక్షాత్కారమై

చేయి చాచిన ప్రతిసారీ జవజవలాడి
నిలువునా ఒక తీరని మహోగ్రమై నిను ముంచెత్తీ

ఏమయితేనేం ఇక-

నడిచే పాదాలలో ఉన్మాదం వరదలెత్తి
ప్రపంచం తుడిచి పెట్టనీ

పెగలని మాటల వెతుకులాటలో 
ఊపిరి ఆడని అంతిమక్షణ శ్వాసల పెనుగులాటగా
గడవనీ రోజులన్నీ



     

11, నవంబర్ 2011, శుక్రవారం

రంగులొద్దు


ఒక భ్రాంతి కావాలి
కోరి కోరి ఒక కొరుక్క తినే దుఃఖం కావాలి
జీవితాన్ని అద్దంలో చూసుకోవడానికి ఒక శతృవు కావాలి
తెలిసి తెలిసి ఒక ఎక్‍స్‍ట్రీమ్ ఎండ్‍కు లాగడానికి ఏదో ఒక మత్తు కావాలి ప్రభో మత్తు కావాలి

అర్థం కాని వాస్తవానికి అవాస్తవమైనా సరే
అయితే తెలుపు లేదా నలుపు
రంగునలిమిన ఒక ఊరట కావాలి

ఊహించడానికి స్వప్నించడానికి
రమించడానికి విశ్రమించడానికి
రంగులేవీ చోరరాని మహా దుర్గమొకటి కావాలి నాయనా దుర్గమొకటి కావాలి

తెలుపో నలుపో
జీవితం కాకుండా
ఏదో ఒకే ఒక్కటి కావాలి









6, నవంబర్ 2011, ఆదివారం

సదా



జ్ఞాపకం ఒకటి రూపొందడం నీకు తెలుసా?

నాయన చావుగానో, వాము దొడ్లలో ఒంటరిగా
మోకాళ్ళ సందున బాల్యం తలకాయ నిరికించుకొని గీసిన గీతల శూన్యంగానో,
ఉన్మత్తమై భాషకు ఊపిరి ఆడక నీవు రాసిన పిచ్చి రాతలుగానో

అన్నీ పైపైకి  కాల గమనంలో
ఎప్పటివో చెదరిన గురుతులు

కానీ ఙ్ఞాపకం అంటే అంతేనా?

మనిషి కాలాతీతమై లేదా హద్దులు చెరిగిన మహా ప్రవాహమై
ఒక బిందువు వద్ద ఘనీభవించి లేదా కాలం నుదుటన పచ్చబొట్టై -

ఙ్ఞాపకం అంటే అంతేనా?

నీకు నీవే విచ్చుకొనే కొత్త చూపై
పరచుకొనే దృశ్యంలో కాంతులీనడం

నీ చుట్టూ నీవు గీసుకొన్న వలయంలో మహాద్భుత పుంజమై గిరికీలు కొట్టడం

తృటిపాటులో నిన్ను నీవు రగిలించుకొని
ఒక కాలం యావత్తూ విద్యుల్లతయై వ్యాపించి తిరిగి నిన్ను నీవు ఆవిష్కరించుకోవడం

ఙ్ఞాపకం బుగిలిపోయిన కాగితాలలో
పాతగ వాసనలు కొట్టే శకలం కాదు

నడిచే దారిలో
నీ ఎత్తు కొలమానం

నీ ఙ్ఞాపకాలలో తిరిగి తిరిగి నీవే రూపొందుతుండడం నీకు తెలియదూ?















1, నవంబర్ 2011, మంగళవారం

దారిలో


సర్దుకొని అంతా
ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఏమి మిగిలిందో చెప్పు


ఎలుకలు కొరకగా
మిగిలిన కొన్ని సుప్త కంకాళాలు
పుస్తకాలు

అద్దం పగిలి
ఎప్పటిదో గురుతుగా అమ్మ నిన్ను ఎత్తుకున్నందుకు గాను
నీ కూతురుకి చూపేందుకని తెచ్చిపెట్టుకున్న ఫొటో

గది నిండా రాసి కొట్టేసిన కవిత్వ పంక్తుల కాగితాలు

దేన్నీ దాచిపెట్టుకోనవసరం లేని పయనంలో నీవు