30, డిసెంబర్ 2012, ఆదివారం

కూతురు ప్రశ్న





ఒక దృశ్యానికేసి చూపుతూ మర్మాంగమంటే ఏమిటని
ఏడేళ్ళ కూతురు అడిగిన ప్రశ్నకు
దూరంగా ఉదయం నుండి తిరుగుతున్నాను

ఒక్కో పూవునూ ఏరి కూర్చి కథా మాలికలను
దిగంతాలకు పరిచినట్టో

ఒక దృగ్విషయపు లోతులకు దూకి
పొరలను తొలుచుకొని కాంతియానం చేసినట్టో కాదు కదా

అదే పనిగా ఎవరూ చెప్పకపోయినా
సరిగా కూర్చోవాలనీ దాచ్చుకున్నట్టుగా తిరగాలనీ తన చుట్టూ ఉన్న వారిలోనే తప్పుక తప్పుక తిరుగుతూ
జీవన క్రియలనూ జీవితాన్నీ సాగించాలనీ
నేర్చుకుంటున్న నా బిడ్డ అడిగిన ప్రశ్నకు నా దగ్గర మాటలు లేవు

దుఃఖం కూడా స్థంభించి లోపలి అరలలో దగ్ధమవుతున్న మంట
పేగులు తెగి దేహం ఒరుసుకపోతూ స్థల కాలాదులను అధిగమించి విస్తరించే గాయపు స్పృహ

మెదడు రసి కారుతున్న పుండులా జిగటలు వారుతోంది

ఈ రోజును పెగల్చుకపోయే ఒకలాంటి మౌనంతో మూసి ఉంచగలను గానీ
బహుశ కొన్నాళ్ళకు ఆమెకు ఇలా చెబుతాను

తల్లీ,  ఇది పవిత్ర భూమి
అయితే ఇక్కడ యోనులలో తాగి పడేసిన సీసాలను జొనుపుతారు

 స్త్రీలను తల్లిగా చెల్లిగా పూజించడంతో పాటుగా
మర్మాంగాలను కర్రలు, కడ్డీలు పెట్టి తిప్పినా కుతి తీరని మార్మిక రంద్రాంశాలుగా తలపోస్తారు

గఢీలలో తెలియని కోటగోడల ఆవల

సత్యాహింసలను ప్రబోధించిన మహాత్ముల శిలాహృదయాల ముందర
బరిబాతల భయ విహ్వల విహంగమై ముడుచుక ముడుచుక పోయి నీ దేహం  వందే మాతరమని నినదించి ప్రాధేయపడింది

గుజరాత్ కాషాయపు నడి బజార్లలో కశ్మీర్ ప్రాయపు విచ్చిత దేహాంగాలలో తలవొంచని ఈశాన్యపు గాలులలో
దేశభక్తి మువ్వన్నెల జెండాగ మురిసి మన గగనాలను అలంకరించింది

పట్టెడు మెతుకులు అడిగినపుడో
ఒక విశ్వాసం ఊపిరిగా నిలబెట్టినపుడో పట్టి పట్టి పాలిండ్లను పిసికి బాలింతతనానికి పరీక్షలు పెట్టింది

ఒకటేమిటి, దేశమే ఒక ప్రశ్నగా మారి సందేహం వచ్చిన ప్రతీసారీ
తనను తాను పోల్చుకోవలసివచ్చిన ప్రతి సందర్భమూ
తొడల మధ్యన ఆవిరులెత్తే ఉన్మాదపు మృగయానందమై చిందులు వేసింది

ఒకరిద్దరు  కాదు
ఒక్క సందర్భమూ కాదు

ఈ పూటకు దహించి నిలుచుని చీల్చుక పోయే జీవితపు క్షణాలను అనుభూతికి తెచ్చిన మన సగం ఆకాశమని తనకు జవాబు చెబుతాను

ఒక కాలానికి
రాజ్యమే నగ్నతను సింగారించుకున్న అంగమని తను తెలుసుకుంటుంది



25, డిసెంబర్ 2012, మంగళవారం

గెలుపు మన కాలపు అవసరం




గెలుపు మరీ ముద్దొస్తుంది
మత్తెక్కిన దాని వాసనలో లోకం కవి పులకాంకితమవుతుంది

వేల పరాజయాల నడుమ నువొక్కడివే గెలుపు గుర్రంపై ఊరేగే ఊహ
నిన్ను చిత్తుగా లోబరుచుకొని తన్మయత్వపు డోలికలపై
ఊపుతున్నప్పుడు ఈ కాలానికి ఒకే ఒక్క లక్ష్యం ప్రకటితమవుతున్నది

చావు, హననం, మృత్యు క్రీడ
దౌర్భాగ్యుల ప్రారబ్ధం

గెలవడమెట్టాగో చూడు
ఒక్కో గెలుపు కథనూ పుక్కిట పట్టు
గెలవడం కల
గెలుపు కళ

ఆవరించుకున్న ఆకాశం దాటి
విస్తరించుక నిలుచున్న దృశ్యాలను దాటి
చెట్టును దాటి చెట్టు కొమ్మలను దాటి
వొంటిగ నిలుచున్న పక్షికన్నును చేధించే
 అర్జునులవడం ఇప్పటి అవసరం

మృత్యువును అవతలికి తొయ్
చేతులకంటిన నెత్తురు కడిగి పారెయ్

గెలిచిన వాళ్ళను కావలించుక తిరగడం
నువ్వే గెలుపయినంత పుణ్యం

వచ్చిపొయ్యి ఒట్టిపోయిన కాలానికి
నువ్వే ఒక మోడీ అవ్వచ్చునో ఏమో

16, డిసెంబర్ 2012, ఆదివారం

దుఃఖపు భాష



ఈ రోజు నీ భాష కొంచెం మృత్యు వాసన వేసింది

కొన్ని పదాలలో లుంగలు చుట్టుక పోయిన నొప్పి

ఆవరణమంతా వ్యాపించి

దిగులు ధూపంలా నన్ను చుట్టుకొని నీ ఉనికిని పదే పదే స్పురణకు తెచ్చింది


కొన్ని సమయాలలో

భాష ఒక్కోలా ఎందుకు ధ్వనిస్తుందో ఒక్కో తావిని తన చుట్టూ ఎందుకు అద్దుకుంటుందో

నేను చెప్పలేను బహుశా నీవు కూడా


ఒక కాలం మనుషులను కలిపే వంతెనగ మారి

ఒక దుఃఖం నీకూ నాకూ సామూహిక చిరునామాగా నిలచి

పెగలని మాట, వొడలని అశాంతి

ఉనికిగా ఎందుకు రాజిల్లుతుందో మనం చెప్పలేం


ఎవరు ఎప్పుడు ఊహించడం మొదలు పెట్టారో తెలియదు గానీ

ఒక బాధాకర క్షణానికి తెగిపడే ముగింపుగా చావును


మనుషులు చావును ఏ స్వరంతో కోరుకున్నా

ఏ ఙ్ఞాని ఏ విధంగా అంతాన్ని వర్ణించి చెప్పినా


తెలియని ఆ ఉద్విగ్నత

ఎప్పడూ  జీవితాన్నే చూపుడు వేలుగా నిలబెడుతుంది



ఎల్లెడలా అలుముకపోయిన

అపసవ్యపు భారం

భుజాలమీద మోయలేనిదిగా చిత్తరువు కడుతుంది

 

11, డిసెంబర్ 2012, మంగళవారం

కట్ల పాము స్వప్న వృత్తాంతము




మచ్చల రాత్రులు
తెల్లని పవళ్ళు
చుట్ట చుట్టుకొని పడుకొని ఉంది కట్లపాము

సన్నని కదలిక ఏదో
పారదర్శకమై
పొరల డొంకపై పడి చెల్లాచెదరై

చలివారిన చీకటి జాముకు మూలగ
సన్నని కలుగులో
మెదిలే సుప్త చేతనంలో

తెరలు తొలిగి
దారులు కరిగి
సంకెళ్ళు తెగి
గీతలు దాటి
సంలీనమవుతున్న రంగుల చీకటి

మెలికలు తిరిగిన కలలప్రవాహపు వడిలో
ఎటుపోతున్నదీ ఎరుగని
కట్ల కట్ల కదలిక

చీలిన నాలికల కొసల
చీకటి పాడిన మహత్తర గానం

నిజంగా
ఉన్నది ఒక్కటి కాదు


10, డిసెంబర్ 2012, సోమవారం

జాడ









ఇక్కడ నిన్నుకలుస్తాను



బహుశా ఒకే శిక్షకు గురయిన ఇద్దరు నేరస్తులు మాట్లాడుకుంటున్నట్టుగా, వేళ్ళను కాసింత లోపలికి జొనిపి కొసలకంటిన నెత్తుటిమరకలనూ,కనుకొలుకులలో  ఆరని తడిని ఏదో గొప్ప పనిలో పడి యధాలాపంగా  తుడుచుకుంటున్నట్టుగా



ఇక్కడ నిన్ను కలుస్తాను



మాటలలో పడి,  ఉత్తి మాటలతో మాటాడీ మాటాడీ చివరకు ఎదురుబొదురుగా కూర్చుని అసహాయపునీడ అద్దంలో  ఎవరినివారు చూసుకుంటూ    మోకాళ్ళ నడుమ తలకాయలిరికించుకుని నేలపై వేళ్ళతో ఏవేవో గీతలు గీస్తూ  ఉన్నట్టుండీ దిగ్గున లేచిపోయే ఆ ఇద్దరినీ చూసి పెగిలీపెగలని సన్నని నిట్టూర్పేదో నీకు మాత్రమే తెలిసిన అర్థంతో నీ నుంచీ తొలుచుక వచ్చేందుకు వేదన పడుతున్నప్పుడు



ఇక్కడ నిన్ను కలుస్తాను



కేవలం కవిత్వం  కోసం, కవిత్వం తప్ప మరేమీ కనపడక గుంపులో తల్లి చేతిని విడవకుండా ఒక అప్రమత్తత ఏదో సన్నని వణుకై తన సన్నని లేత  వేళ్ళతో  పట్టుకొనజూసే పిల్లవాడిలాగా ఒకింత బేలగా, ఇంకా నిను కని పెంచిన తల్లి ముందరయినా దిగంబరంగా సాగిలబడగల ధైర్యాన్ని ప్రోది చేసుకుంటూ,  అపుడపుడయినా జీవితం ముందర భుజాల మీద చేతులు వేసుకుని మాటాడే వాడొకడికోసం వెతుకులాడుతూ



ఇక్కడ నిన్ను కలుస్తాను




6, డిసెంబర్ 2012, గురువారం

రాముడిచ్చిన తీర్పు





ఒకసందర్బాన్ని విశ్వరూపవిన్యాసంలాగా నువ్వు ఊహిస్తావు
కొన్నిపదబంధాలతో రూపుకట్టేందుకు గొప్పప్రయత్నం చేస్తావు

దేహాన్ని చుట్లుచుట్టి బంధింపజూసే
కొండచిలువ ఉచ్చ్వాసనిచ్చ్వాసాల ఊపిరివేడిని
బాధిత ముఖంపై జారిపడే మృత్యుధారగా నువ్వు చిత్రిస్తావు

ఆ క్షణంలో నువ్వే ఒక గొర్రెపిల్లవుగానో మరో అల్పాతి అల్పమైన ప్రాణివిగానో
కడగట్టుకపోయే ఊపిరియై అలమటిస్తావు

లిప్తకాలిక ఉద్వేగభరిత భ్రమ

నదులన్నీ సముద్రోపగతమయినట్లూ
జీవితం ఒక్కబాటగ కలగలసి కొనసాగుతున్నప్పుడూ

రాముని ధనుష్టంకారమే లీలగా
కనులముందర  యుగధర్మమై సాక్షాత్కరిస్తున్నప్పుడూ

నువ్వు  నిలుచున్న నేల
నిన్ను ఒక మామూలు చూపుతో అనుమానితునిగా నిర్ధారిస్తున్నప్పుడూ

నీకు అవతలగా నువ్వు ఏది మాత్రం రాయగలవు

ఇది మహాయుద్ధం
నువ్వు ఎక్కుపెట్టిన బాణానికి గురిగా ఎప్పటిలాగే ఇంకో నువ్వు

ఇది నిన్ను నువ్వు ఖండఖండాలుగా తెగనరుకుకొని
తిరిగి మళ్ళీ నెమ్మదినెమ్మదిగా ఒక్కొక్క ముక్కనూ తెచ్చి అతికించుకునే
బీభత్సకర అతి సృజనాత్మక జీవన దృశ్యం

తెలిసితెలిసి ఒక మాటకు ఇంకో మాట బదులిచ్చినంత తేలికగా
ఒక పద్యాన్ని రాయడం -

రాస్తూ రాస్తూ ఉండగానే
ఈ చేయి రెండు పీలికలుగా విడిపోయి నిన్ను నిస్సహాయుడిని చేయడం -

ఇది తరాలతరబడి కొనసాగుతున్న పోరాటం
రాముడు సర్వాంతర్యామియే కాదు
ఆయన బహురూపి

హనుమంతుడి హృదయ పటంపై కొలువుండినట్లుగానే
ఇదిగో ఇక్కడా వాని సంతకం






2, డిసెంబర్ 2012, ఆదివారం

అన్వేషణ




పొరల రాతిరి తిరిగి తిరిగి
దారులన్నీ చెరిగి
కలగలసి కదలని డొంకయి
వెతుకుతామా ఒక తెన్ను కోసం-

దొరకదు
కలిపికుట్టగల మాట
పలుకదు కొసల చివరల చెదిరి కలవని బింబపు ముడి

దృశ్యం విరిగి తునాతునకలై పరిపరి విధాల పగిలిన అద్దంలో
కొంచెం కల కొంచెంవిరామం
సుప్త చేతనం కలవరం భయం వాంచాన్వితం

ఒక చోట మొదలుపెట్టి ఎక్కడికో ఇక తోవ
గిర్ర్రున తిరిగి రంగులు అలుముక పోయిన తెల్లని చీకటి

కళ్ళు వెతుకుతాయి ఇక కనుగుడ్డుని

రాత్రిని వెతుకుతూ
ఒకడు  తనను కోల్పోయాడట