18, జనవరి 2013, శుక్రవారం

దూరంగా



అప్పుడప్పుడయినా నీ లోకాన్ని ఒదిలి దిగివొచ్చి కిందికి
సర్వమూ విడిచి 
ఇదిగో నీ దేహం నీ ఊహా సరికొత్తగా
అపపరిచితమై నిన్ను నీవు అన్ని విదిలించుకొని చూసినట్టుగా

 ఎత్తయిన గుట్టపై కాకుంటె ఒకానొక అలల చింపిరి జుట్టు సముద్రం ముందర కదిలే ఆకుల సడి లీలగా

వస్తూ పోతూ ఉన్న కదలికల పురా పురా ఙ్ఞాపకాల ఆవరణంలో
తడి బారిన ఇసుక తీరాల ఒడ్డున చెరిగిపోయే పాదముద్రలతో ప్రాచీనపు దారులలో మలిగిన అడుగుల నిద్రిత నిరామయ ధ్వానంలో 

బహుశా నిన్ను నీవు చూసుకుంటున్నప్పుడు
నీలోని ఖాళీ నీ చుట్టూ పరివ్యాపితమవుతున్నప్పుడు
పాడే పిట్టగొంతుకలోని పచ్చదనపు కాంతుల నడుమ 
లోపలెక్కడో ఒదిగిన ఒక పారవశ్యపు కదలికలలో పరాగ రేణువై నీవు విశ్వ ధూళిలో కలగలసి తిరుగుతున్నప్పుడు

ఒకటి కాని తనం ప్రవాహమై నిన్ను ముప్పిరిగొని తనలోనికి లాగి
రంగులు కలగలసి ఒక తెల్లని ఆవిష్కరణమై దివ్య సంచారిగా పరిభ్రమిస్తున్నపుడు

ఒక దూరానికి నీవు కేవల బాటసారిగా పయనమై పోతుంటావు

11, జనవరి 2013, శుక్రవారం

అమ్మకు ప్రేమతో



అలలను సవరిస్తూ దుఃఖపు సడిలో

ఒక ప్రవాహం ముంగిట నిలబడ్డాను


దరులను ఒరుసుక పారే నదికి

ఈ వైపు నేను ఆవైపు నేను


ప్రవాహం ఒక దూరమే కాదు

ఇద్దరినీ కలిపే ఒక దగ్గర కూడా

2

బహుశా నదికి తెలియదు

అనేకానేక చలనాల నడుమ గిరికీలుకొట్టే పక్షికీ తెలియదు


ఒకే సమయంలో సమాంతరంగా రెండు కాలాలు

అన్వేషణల ఒరిపిడిలో ఇద్దరు మనుషులు

3

నది ఇవాళే మా ఇంటి కొచ్చింది

యుగాలన్నీ ఇన్నాళ్ళూ ఉత్తినే దొర్లి పోయాయి


నది అంచున కవిత్వం

ఇప్పుడే కదా మొదలయింది


ప్రవాహం ఒక దూరమే కాదు

ఇద్దరినీ కలిపే దగ్గర కూడా

4

అవ్యక్తం ఒకానొక ఒత్తిడి


ఒంటరి తీరాలను అలా మోసుక తిరగడం

ఆమెకూ తెలుసు నాకూ తెలుసు


మాటలు చాలని ప్రతి సారీ

ఆమె నా వైపు ప్రేమగా విస్తరిస్తుంది


నేను ఆమెకు అర్థమవుతాను

6, జనవరి 2013, ఆదివారం

బంక బేదులు

ఓఫిక లేక అట్లా చేరగిల పడి
చదువుతున్న పుస్తకాన్నిభారంగా బోర్లా పడుకోబెట్టి
కాసేపు గాలిలోకి అటుపైన నీలోకి శూన్యంగా చూసుకొని నీరసంగా అనుకుంటావు కదా
ఎదురయే అనేకానేకం కన్నా
అమర్చి పెట్టిన దానికి కాసింత ఆవలికి జరిగి
ఎప్పుడూ ఏదో వెతుకుతున్నట్లుగా ఉండే "క్రైం అండ్ పనిష్‍మెంట్" సెమ్యవ్ జహరోవిచ్ తాగుబోటు అన్వేషణల కన్నా

కడుపులో మెలి తిప్పినట్టుగా ఏదో కదలడం
ముక్కుతున్నప్పుడు ముడ్డిపీకుడే నయంగా ఉంది

తెలిసిన దానికన్నా
నీ దేహంలో దేహమై ఇంద్రియాల ప్రతిఫలనపు అనుభూతులలో
నిన్ను ఇరికించుకొని లోకాలనన్నీ చంకనెట్టుక చూపించే దానికన్నా

చిక్కినట్టే చిక్కి తెలిసినట్టే తెలిసి
అవ్యక్తానికి జారిపోతూ ఒక నిరంతర ప్రేలాపనం నీతో నడవడం
నిజంగా ఎంత కష్టం

5, జనవరి 2013, శనివారం

అతడు నవ్విన రాత్రికి వెన్నెల పూచింది




ఒకానొక రాత్రి మిణుగురు పూల దారిలో
అతడిని నేను వెతుకుతుంటాను

అతడు మోరలెత్తి ఊగే ప్రవాహాలకు
మురళిని ఊదుతుంటాడు

పాడే పెదవులై
చేమంతి పువ్వలుగా విచ్చుకొనే అరమోడ్పు కన్నుల ఙ్ఞాపకం

అతడు ఉన్నట్టుండి
ఒక ఆకస్మిక కవి సమయంలా అదాటు పడతాడు

అతడు కొంచెం యుద్ధం
కొంచెం కవిత్వం
నాగేటి కర్రుకు పొదిగిన చంద్రవంక

ఒంటరి దుఃఖమయ సమయాలకు
సామూహిక స్వాప్నికతను అద్దే ఓడ సరంగు

అతడు కొంచెం బెంగ కూడా
కాలం ఙ్ఞాపకాలను అతడు ఒక తాత్వికతగా మోసుక తిరుగుతాడు

అతడిని నేను ఇలా అడుగుతాను
ఇంత దుఃఖం కదా ఎలా రాస్తావిదంతా

దుఃఖం ఎప్పటికీ దుఃఖమే
అది లోకంతో మనం తీర్చుకోవలసిన పేచీ
ఒకోసారి నీతో నువ్వు కూడా

కొత్త మనిషొకడిని కలలు కనే వాళ్లం కదా మనం
దుఃఖాలను అమ్మ కొంగులా పట్టి పైకెగబాకుతాం

దుఃఖం ఒక చారిత్రక సందర్భానికి గుర్తు
అక్కడ నిన్ను నీవు తెలుసుకుంటావు

ఒక గాఢమయ కవిత్వానికి కొనసాగింపుగా
అతడు ఇంకా ఇలా అంటాడు

పెగలని దుఃఖాశ్రువుల నడుమ ఎవరెవరము
ఎలా కలుసుకునేది తెలుసుకోవాలని కుతూహలం

బహుశా చరిత్ర అక్కడే కదా మొదలయేది
నెత్తురు కురవని దారులకేసి మనం పయనమై పోతుంటాం
ఈ దారి మరీ పాతది
అంతే కొత్తది కూడా

ఇక్కడ ప్రతీ అనుభవానికీ నెత్తురు మూల్యం చెల్లించాలి
చిద్రమైన దేహాలతో పేజీలను పాఠాలుగా నింపాలి
ఇది సుదీర్ఘ కాలపు వేదనల ప్రవాహ గానం
పదును దేల్చే రాపిడుల నడుమ తొణకిసలాడే పురా స్వప్నం

అతడు సన్నని నవ్వుతో ఇంకా ఇలా అంటాడు

తెలుసు కదా కవిత్వం
అది గాయాలకు మొలకెత్తి పూచే వెన్నెలలా
యుద్ధంలో తారసపడే ప్రియురాలి కౌగిలి






1, జనవరి 2013, మంగళవారం

An Epilogue To An Unfinished Journey




వెన్నెల చెక్కిలి మీద
రెల్లు పూల అలికిడితో సాహసి ఒకడూ ఇలా రాస్తుంటాడు

వెన్నెల ఒక అఙ్ఞాతపరిమళం
బయటే కాదు లోలోపల
ఎక్కడో తెలియకుండానే అది విచ్చుకుంటుంది

వీచే గాలి
ఊగే రెల్లు
బండ రాళ్ళ మధ్య ముడుచుక పడుకున్న వాగు
లోపల కూడ  ఉంటాయి

కాలం వేలు పట్టుక నడిపించే మనిషి
మట్టిచాళ్ళలో మొలకెత్తుతాడు


(కొంచె ప్రేమ కొన్ని ఙ్ఞాపకాలు-2004)