26, జులై 2013, శుక్రవారం

ఇద్దరు





ఒక సాయంత్రపు వేళ ఊళ్ళ మీదగా అనేక చోట్ల మీదగా పయనిస్తున్నప్పుడు
చెమ్మగిల్లిన గది గోడలమీద ముసిరిన గురుతులను కనుకొసల తుడుచుకుంటూ
ఒంటరిగా ఆ ఇద్దరు

మోకాళ్ళలో భరింపరాని నొప్పి.  గుండెలలోకి పాకి సలుపుతున్నప్పుడు ఏ లేపనమూ మాయము చేయజాలని
దుఃఖిత శూన్యంతో ఖాళీ అయిన తన అర చేతులను ఒడిలో ఉంచుకొని
ఒక దాని వెంట మరొకటిగా సున్నాలను చుడుతూ, గీతలు గీస్తూ ఆమె అతనికి మాత్రమే అవగతమయ్యే గాద్గదిక మౌన భాషలో తనలో తాను
తలపోస్తూ:

కొన్ని ఉత్తినే అలా ఙ్ఞాపకాలుగా రోజుల వెనుక మరుగున పడి ఉండవు
సంభాషణలలోనికి సందర్భాలలోనికి
మరుగున పడిన శిథిల లేఖనాలను దాటి, కట్టుకున్నస్మృతి చిహ్నాలను దాటి 

ఖండిత అంగాలతో గాయపడి చిద్రమైన శరీరాలతో
మరణోన్ముఖ క్షణాలను నెమ్మదిగా తుడుచుకుంటూ
భయాలనూ, ఓటములనూ  కాసేపాయినా నింపాది లేక అంతర్ బహిర్ యుద్ధాలలో కాగి ఆవిరయిన సన్నివేశాలను నింపాదిగా దాటుకుంటూ
ఒక్కొక్కటిగా అవి మన సమయాలలోనికి లేచి వస్తాయి

ఒంటరిగ పడి ఉన్న నాలుగు గోడల శరీరాలలో ముసురు పట్టి ఎవరికి వారు ఒంటరులయి గాయాల సలుపుతో సతమతమవుతున్నపుడు
ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క చోటుగా, గుంపులు గుంపులుగా

బయొనెట్ దెబ్బకు పాదము తెగి చిత్రహింసల సుడిలో  ఎండుటాకులా పడి నలిగి,
తెలియని ఉన్మత్తత చావుకు ఎదురు నిలిపినపుడు జేబులో అప్పుడే నేర్చుకుంటున్న అక్షరాల  తడి నెత్తురుగా కరుడుకట్టి-

నడిచే పాదాల కింద  ఇంకిన నెత్తురులేవని మసక బారుతున్న కన్నులతో ఆమె తడిమి తడిమి చూస్తున్నపుడు
నోరు తెరచి బావురు మంటున్న ఖాళీ దేహంతో  అతడు ఇక దుఃఖించలేడు

రోజుల శరీరాలపై  ఓడుతున్న చావులను పలుచని బట్ట వలె పక్కకు తప్పించి
ముఖంలో ముఖం పెట్టి  అదే పనిగా ఆమె పేరుపేరునా సంబోధించి మాటాడుతున్నప్పుడూ అతడు
బోలుగా సర్వమూ ఇగిరి  ఊరకే అలా -

ఆమె అతని దుఃఖం
అతడు- 






24, జులై 2013, బుధవారం

మరణానంతర జీవితం





కొందరు మనుషులు అనుకోకుండా వస్తారు

రోజుల పెళుసుబారిన పెదాలమీద మండే ఎర్రని నెత్తురు చినుకులుగా కురిసి
కాసింత మెత్తదనపు స్పందనను అరువుగా అద్దిపోతారు

గడచిన దినాల దారులలో కలసి నడచినందుకో
అర్ధాంతరంగా విడివడి ఒంటరి సౌధాలలో సాలోచనగా ఒక విరామాన్ని పాటిస్తున్నందుకో

ఎంతకూ విడవని నొప్పిలాంటి అపరాధభావనను
పక్కటెముకలలో సలిపే జ్వాలలా నాటిపోతారు

తమ కోసం ఒక తలపును  తీగకొసలలోనికి ఒంపి శబ్ధాన్ని సారిస్తున్నపుడో
అక్షరాల ఆసరా తప్ప మరేవీ నీ వద్ద లేక ఒంటరిగా నిలబడి విలపిస్తున్నపుడో

చాచిన చేతుల చివరల జారిపోయే అసహాయత లాంటి నిష్పల యత్నమై పలకని గొంతుకలాంటి వ్యగ్రతను
దేహపు చాలులలో పశ్చాత్తాపంలా రాజేసిపోతారు

తమ మరణాంతర జీవితాలతో  ఎరుకలా నొప్పిలా దుఃఖంలా
కొందరు మనుషులు అనుకోకుండా వస్తారు







12, జులై 2013, శుక్రవారం

నడక



సన్నని తుంపరలో నీరెండ కరిగి కురుస్తున్నపుడు

గడ్డిపరకపై సన్నగ నవ్వే మెరుపులాంటి ఆకుపచ్చని భాష


తడిసి ముద్దయిన దారుల గుండా

కోరికోరి అనాచ్చాదితమైన దిసపాదాలతో-



గుప్పిట పట్టిన పాదాల కింద సన్నని జారికతో దారులు కరుగుతున్న మెత్తని స్పర్శ


ఒక గడ్డిపోచలా మారి

నిజంగానే కొన్నింటిని కోరి కోరి కావలించుకుంటాం


ఇరు కొసలకు ముడి వేసి

విచ్చిన మన దోసిలిలో మనమే మెరెసే నీరెండగానూ

సన్నగ కురిసే చిరువానగానూ మారతాం


చేతులు చాచి చుట్టూ పరుచుకున్న అడివిలా

నడిచే పాదాల కింద కదులుతున్న దార్లలా విస్తరిస్తాం


ఎక్కడ నుండో వినపడే అఙ్ఞాత గొంతుకల స్వర కంపనాలలో

మెదిలే ఏదో తెలిసీ తెలియని సంకేతమై రెపరెపలాడతాం


నిజంగానే కొన్నింటిని కొన్నిసమయాలలో

కోరికోరి కావలించుకుంటాం

 

 

 

 

 

 

 



 

6, జులై 2013, శనివారం

కొన్ని రోజుల తర్వాత




ఉద్వేగ రహిత మృత్యు సమానమైన కొన్ని రోజుల తర్వాత
తిరిగి లేచిన అతనిని

గడ్డ కట్టుక పోయిన రోజుల గురించి
రోజుల లోతులలో ఇరుక్కపోయిన శిలాజ సదృశ సందర్భాల గురించి
సందర్భాలలో మిణుక్కున మెరిసే
ఉద్వేగ సంబంధిత సజీవ సంస్పందనల గురించి వాళ్ళు తరచి తరచి అడిగారు

ప్రతీ ప్రశ్నకూ అతను మౌనాన్ని సమాదానంగా చెబుతూ
తనలో తను:

కొన్ని రోజులను మనము నిజంగానే మరణంలా, ఆభరణంలా ధరించాలి
రణగొణ ధ్వనుల జీవితం నుండి, మందమెక్కిన వ్యక్తులు, వ్యక్తీకరణలనుండి
దూరంగా ఉండాలి

సర్వమూ పరిత్యజించిన బైరాగిలా సంచరిస్తూ అన్నింటిలోనూ ఉంటూ
దేనిలోనూ లేకుండా చివరకు కవిత్వం నుండి
నిన్ను కవీ అని పేరు పెట్టి పిలిచే వాళ్ళ నుండి కూడా దూరంగా, బహు జాగ్రత్తగా ఉండాలి

కనీసం కొన్ని రోజుల దూరం

నీ నుండి నీవు అలా ఎడంగా నడుచుకుంటూ నీ చుట్టూ పేరుకున్న దానిని
ఒక్కొక్కటిగా చెడిపేసుకుంటూ
నిజంగానే మరణాన్ని, మరణంలాంటి స్తబ్దతనీ, నిశ్చల గంభీరతనూ
చేయి చాచిన కొలదీ విచ్చుకునే మాంత్రిక శూన్యతనూ నీవు నిలువెల్లా తలదాల్చకపోతే

నీకు నీవు లభ్యం కావు
నీ అక్షరాలలో పెళుసులు బారి మసి కమ్మిన శైథిల్యత
జీవితం జీవితమూ కాక మరణం మరణమూ కాక గొంతుకకడ్డం పడిన పెను ఆర్తనాదం

వూరకనే అలా ఉండడమెలానో నేర్చుకొనేందుకు
కొన్ని రోజులను మనం మరణానికి
మరణ సదృశ్యమైన నిశ్శబ్ధానికీ అంకితమివ్వాలి

ఒక ప్రశ్న



తన పాదాలను ముఖంతో క్షాళనం చేస్తున్నప్పుడు

కలిగే సన్నని గిలిగింతల మెలకువతో నన్ను తనలోకి హత్తుకొని
తిరిగి ఎక్కడో తనలో  ఒక ఎరుక-


యుగాల నాటిది  సదా తొలుచుకపోయే గాయమై సలిపే  స్పర్శతో
రెప్పల వాదరకు చిప్పిల్లిన దుఖాశ్రువుగా  తను ఇలా అన్నది :


చిన్నా,  మీ ప్రేమ,ఇంకా అప్పుడప్పుడూ ఇలా ఉక్కిరిబిక్కిరి చేసే మీ
భక్తీ, మీ కోర్కె నన్ను ఎంత వివశను చేస్తాయో  తిరిగి అంతగా భయపెడతాయి


నువ్వు నన్ను హత్తుకున్నప్పుడు,
ఒక మానవోద్వేగానికి ఉన్మత్తతను తొడిగి
నా దేహం చుట్టూ ప్రాకృతిక గాథలనూ అల్లి  సేదతీరుతున్నప్పుడు,
గొప్ప సృజనతో ప్రేమ గురించి కవిత్వం రాస్తున్నప్పుడూ

ఒక కంట ఉప్పొంగుతూ మరొక కంట భయదనై ఒదిగి ఒదిగి నాలో నేను బంధీనవుతాను



ఒకటి రెండు అవయవాల చుట్టూ, కాకుంటే ఒక దేహం చుట్టూ
ఇంత పారాలౌకికత ఎలా పొదగబడిందో నువ్వూ ఆలోచించి ఉండవు


ఇదిగో చూడు: రక్త సంస్పందనమై మామూలుగా,
నిజంగా మామూలుగానే అవయవాలలో అవయవాలై కదలాడే వీటిని చూడు

యోనిగా,వక్షోజాలుగా అతిమామూలుగా శరీరంలో శరీరమైన వీటిని చూడు



ఎన్ని గాథలు, ఎన్ని ప్రాకృతిక, పారాలౌకిక పోలికలు
ఎంత చరిత్ర,ఎన్ని సంస్కృతులు
మనిషి సృజన, మనిషి కాలం యావత్తూ
ఒక్క దేహం చుట్టూ మోహరించడం అందరికీ ఆశ్చర్యం కలుగవచ్చును గానీ


నాకు మాత్రం నిజంగానే ఊపిరి ఆడడం లేదు చిన్నా
ఒదిగి ఒదిగి లోనికి కూరుక పోతూ చివరికి నాలోని ఆఖరి  కణాన్నయినా

నేను మిగుల్చుకోగలనో లేదో అన్న అనుమానంతో బిగుసుక పోయి బతుకుతున్నాను

ఒక అవయవం శరీరంలో శరీరం కానప్పుడు
ఒక మనిషి మనిషిగా కనబడనప్పుడు
భక్తితో ప్రేమ పుష్పాలు ఎలా మాలకడతారో
అంతే ద్వేషంగా తాగి పడేసిన సీసాలనూ యోనులలో జొరుపుతారు


మీ యుద్ధాలలో, మీమీ ఆధిపత్యపు పోరాటాలలో
మీ స్త్రీలకు అపురూపమైన పారవశ్యాలను కానుకలుగా ఇచ్చినట్లే,
మరొకరికి ఆక్రమణల పైశాచిక అనుభవాలనిస్తారు



మీమీ మానవాతీత ప్రేమలతో,
మానవాతీత ద్వేషాలతో కాలపు రేకులపై
మార్మిక రంద్రాంశాలను గురించి అమానుషంగా మాత్రమే రాస్తారు


చిన్నా,

నిజంగానే బతిమాలి అడుగుతున్నాను
నన్ను మనిషిగా ఎప్పుడు భావిస్తావు?