19, ఏప్రిల్ 2014, శనివారం

చేపలు



ఆదిలో ఆమె నిడుపాటి వేలి కొసలను
తునకలుగా కత్తిరించి  నీటిలో వదిలినప్పుడు

ఒక్కొక్కటీ ఒక్కో చిన్ని చేపగా మారి
సన్నని జీరలుగా  ఎరుపింకిపోతూ అల్లిబిల్లి కదలికలతో కలసి ఆడుతుండేవి

 నెత్తురు కలగలసిన భయంకరమైన బాధే అయినా తన దేహంలో దేహమే కదా
మాలిమితో కూడిన ప్రేమ కదా

ఏమి పేరు పెడదాం వీటికీ?
అని ఆమె అనుకుంటుంది

చుట్టూ ఇసుక తుఫానులాంటి  నల్లని పరదాలు కమ్ముకొస్తున్న జాములలో
తనతో తాను మాటాడుకుంటున్నంటుగా
ఖండితమయి మోడువారిన చిన్ని కొమ్మల్లాంటి తన వేళ్ళను చూసుకుంటూ
ఇవి భయం,  పాపం, దేవుడు, శాపం, చావు -

తను ఇంకెవరితోనో మరో స్త్రీతో,  ఒక స్త్రీ మరొక స్త్రీ మాత్రమే చెప్పగలిగినంత లోగొంతుకతో ఒక మంంత్రోచ్చారణలా భాషిస్తూ వాటిని  దోసిళ్ళలోనికెత్తుకొని
తన ఉమ్మనీటిలో పొదువుకొంటుంది

నెత్తుటి ప్రవాహ గతిలో ప్రాణవాయువును కొద్దికొద్దిగా తోడి
ఒక్కో గుక్కా పాలులా పట్టిస్తుంది

చేపలు పెరుగుతాయి

పెరిగి పెరిగి పెరగడమే తమ వ్యాపకమై విలయంలాగా మరణ సదృశమైన మహా ఆక్రమణలాగా
అవి పెరుగుతాయి

ముందుగావాటిని ఆమె చిన్ని తొట్టిలో ఉంచుతుంది
ఆ తరువాత ఒక వాగులో ఆ తరువాత నదిలో

అంతకంతకూ  పెరుగుతున్న ఆ చేపలు
ఏ రోజుకారోజు తమ చోటు ఎక్కడాని అడుగుతూనే ఉంటాయి

చివరకు  ఒకింత విసుగుతో
సన్నగ కంపితమవుతున్న దేహముతో ఆమె అంటుంది కదా

ఇదిగో ఆకాశమయి విస్తరించి సముద్రపు లోతులుగా తొణకిసలాడే ఈ దేహపు గూడు
ఇక వచ్చి చేరండి -

అనాది గాధను  నిదురలేపే  డగ్గుత్తికతో
ఒక స్త్రీ తనలాంటి మరొకరితో  వెతుకులాటులో తడబడుతూ మోకరిల్లే శరణు కోరికలాగా
పదే పదే భయం,  పాపం, దేవుడు, శాపం, చావులను చెప్పడాన్నితొలిసారి విన్నప్పుడు
నీ దేహంలో సన్నని ప్రకంపన