15, అక్టోబర్ 2015, గురువారం

గోమూత్రము మరియు దేశభక్తి పురాణము





పొద్దున్నే లేచి పవిత్రముగా శిరముపై ఆవ్వుచ్చ చిలకరించుకొని కూర్చొని ఉంటాను


గోవు మన తల్లి, ఆమె  భరత మాత వంటిది. గోమాతకు హాని తలపెట్టినయేని యది గన్నతల్లికి కీడుసేయ సమమని చదువుకొని, దానిని కన్నులకద్దుకొని, మరియొక పెద్ద లోటాడు నీరు త్రావి  ఇంకొకపరి మల విసర్జనమునకై వేచివేచి నటునిటు కాసేపు తిరుగుతాను


ఈయొక మల బద్దకమ్మునకు మన గోమాతా వైభవములో ఏమైనా యుపాయము రాసియున్నదేమో అడిగి తెలుసుకుందుముగాకా యని యనుకొని, యంతలో కడుపావురించుకొ్నెడి ఒత్తిడితో తొక్కిసపడి తటాలున  మరుగు దొడ్డికి పరుగులెడతాను


అటుపై సకలమునూ మూసుకొని యోగాధ్యానాదుల నొనర్చి,  కన్నులు తెరిచిన వాడనై, సకల విశ్వమునకునూ ఙ్ఞానప్రదాతయైన ఈయమకు తక్క  యన్యులకు ఇసుమంటి విద్యలు తెలియనేరవు కదాయని అరమోడ్పు కన్నుల ఆనందపరవశుడనవుతాను


ఆ తల్లి  ముద్దుబిడ్డడినయినందులకు కించిత్ గర్వపడి, ఆపై యామె ఋణమ్మును యెటుల తీర్చుకొందునాయని యోచించి,  ఆయొక్క గోమాతా వైభవమ్మను పవిత్ర గ్రంథ రాజమ్మును ఇంచుక పేజీలను ద్రిప్పి  సకల దేవతలకునూ  సాక్షాత్నిలయమ్మయిన యా దేహమే ఈ దేశము గదాయని కైతలుప్పొంగగ కరముల మోడ్చి సాగిలపడతాను


నుదుట తిలకమ్ము ధరించుట  హిందూ ధర్మమని  దెలుసుకొని, అటుపై రోజుకొక్క గంటతూరి స్వచ్చ భారతం, వారానికి రెండు సార్లు జెండావందనం,  నెలకొకమారు మన్‍కీ బాత్, రాత్రి పొద్దుపోయిందాకా దేశభక్త పురాణ పఠనం- అయ్యా నేను బాపనోన్ని కాదు-  మరింత హిందువగుటనెట్లో చెప్పండయా

సాధులూసాధ్వులూసన్యాసులూమఠాధిపతులూయోగిమహరాజ్‍‍లూఆవులూబర్రెలూకుక్కలూపందులూశాఖాహారమాంసాహారమత్స్యాహారధ్యానయోగకర్మ- అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నానయా- కులం తక్కువ వాడ్ని


పిల్లల గలవాణ్ణి. మరీ ముఖ్యంగా ఆడపిల్లల తండ్రిని. నన్నుకరుణించి మరి కాసింత మంచి హిందువును చేయండయా!
*

14, జూన్ 2015, ఆదివారం

అరుణా షాన్‍బాగ్



ఇంకా నేను అమ్మ కడుపులో రూపు దాల్చక ముందు
ఎక్కడో ఉమ్మ నీటి సముద్రాలకావల  ఊహామాత్రపు జీవిగా సంచరిస్తున్న వేళలలో

నువ్వు ఒక అమాయక జీవితానికి తెర దించి
అక్కడి జనారణ్యపు మారుమూల
కళ్ళను తొలుచుకపోయే వెలుతురులోకి అనేకానేక  బాధలలోకి ప్రవేశించడాన్ని నేను ఊహిస్తాను

బహుశా అది ఒక చిన్న గది కావొచ్చు
కానీ అది నీ అనుభవాల గూడు

అక్కడ నువ్వు నేలకూ ఆకాశానికీ  మధ్య
చావుకూ బతుకుకూ నడుమ
నీ దేహాన్ని వేలాడదీసి కొత్త సంగతులేవో  రచిస్తూ ఉండి ఉంటావు


అప్పుడు అందరి శ్వాసలలో కాలం స్తంభించి సుషిప్తిలోనికి జారుతున్నప్పుడు
నువ్వొక్క దానివే నెగుడువై జ్వలిస్తూ నీ చుట్టూ పరిభ్రమిస్తున్న లోకానికి కావలి కాస్తూ ఉండి ఉంటావు

ఇంకా అందరూ నీ గురించి మాటాడుకుంటున్నప్పుడు
నినాద పరిభాషలో నిన్ను తలపోసుకుంటున్నప్పుడు

నెమ్మదిగా చప్పుడు కాకుండా నీ దేహంలాంటి నీ గదిలోనికి  మునివేళ్ళపై నడుస్తూ వొచ్చి
నీ ముఖంలోనికి తొంగి చూసినపుడు

వారికి నువ్వు దేహం గురించి, దేహ రాజకీయాల గురించి
హింస గురించి చావు బతుకుల గురించి పదే పదే గుర్తు చేసే ఉంటావు

నీ తలుపులు తెరుస్తూ మూస్తూ
దశాబ్ధాల తరబడి నీ లోనికి వొస్తూ పోతూ ఉన్న వారికి

అందరూ ఆపేసే చోటే
ఒకోసారి అసలు జీవితం మొదలవుతుందని చెప్పడం కోసం

కొద్ది కొద్దిగా నీ జీవన పరిమళం, నీ ఆశ , ఎక్కడో లోతు అంచుల్లో దరులకు కొట్టుకొనే నీ శ్వాసల సవ్వడిని
గురుతులుగా తుంచి ఇచ్చే ఉంటావు

ఇన్నేళ్ళ జీవితం తర్వాత
లేదా ఇప్పుడు "ముగింపు" అని చెప్పుకుంటున్న దానికి కాస్త ముందర
కొద్దికొద్దిగా నీలోనుండి నువ్వు మరలి పోతూ

నువ్వొక్కదానివే ఎందుకింత భారాన్ని మోయాల్సి వొచ్చిందో 
బహుశా నీ చుట్టూ తిరిగే వారినైనా అడిగే ఉంటావు








మాతృక పత్రిక- జూన్-2015  ప్రచురితం

1, జూన్ 2015, సోమవారం

ఆ ఇంట్లో దెయ్యముంది

http://magazine.saarangabooks.com/2015/05/28/%E0%B0%86-%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A6%E0%B1%86%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF/



 ఆ ఇంటి గురించి వాకబు చేసినపుడు అన్నింటి కన్నా ఆమెకు ముందుగా  తెలిసిన విషయం, ఆ ఇంట్లో దెయ్యముందని.
 
ఇదేమిట్రా నాయనా అనుకొని, ఆ పక్కనే ఉంటోన్న తెలిసిన టీచరునొకాయన్ని అడిగితే ఆయన అన్నాడు గదా-” మేడం, నాలుగైదేళ్ళ నించీ ఆ ఇల్లు ఖాళీగా ఉందన్నది మాత్రం వాస్తవం. ఇంతకు ముందు అద్దెకు ఉన్న ఆమె  అక్కడే ఆత్మహత్య చేసుకొని  చచ్చిపోయిందంట. అదికూడా అనుకుంటుంటే విన్నదే గానీ వాస్తవం మాత్రం మనకు తెలియదు. అయినా దెయ్యాల్లాంటివి ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు? ఇల్లు మాత్రం ఏ ఇబ్బందీ లేకుండా అన్ని విధాలుగా మీకు బాగుంటుంది” అన్నాడు.
దెయ్యాలంటే నమ్మకమా అపనమ్మకమా అన్న మీమాంసలో పడేంత సమయం అప్పుడు లేకపోయింది తనకు. వొచ్చి ఇల్లు చూడడం, చేరిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.
అయితే ఆ ఇంట్లో చేరిన నెల రోజుల వరకూ చుట్టు పక్కల వాళ్ళంతా తన గురించే అనుకుంటూ ఉన్నారు.  నాలుగైదు రోజులుండి ఖాళీ చేసి పోతుందిలే అనుకన్నారు. ఈ విషయాలన్నీచాలారోజుల  తర్వాత పక్కింటామె చెప్పింది తనకు.
ఉండగా ఉండగా తనకు తెలిసి వొచ్చిన విషయం ఏమిటంటే నమ్మకమైనా, అపనమ్మకమైనా అవి అనుభవం మీదనే తేలతాయి. ఆ అనుభవం కూడా మనమున్న స్థితిని బట్టే ఉంటుంది. అందునా, ఇప్పుడు అనిపించిన విషయాలు రేపటికి  కూడా ఇట్టానే అనిపించాలని లేదు. ఇలాంటి తెలివిడి తనకు ఆ ఇంటి నుండే వొచ్చింది. ఇప్పటికిప్పుడు ఎవరైనా తనను ఆ ఇంట్లో నిజంగా దెయ్యముందా అనడిగితే ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేదు. ఒకోసారి ఉంటుంది, ఒకోసారి ఉండదు అని మాత్రమే చెప్పగలదు.
చాలా సార్లు ఆ ఇంటి గురించి ఆలోచిస్తుంటే అది ఆ ఇంటి గురించి కాక తన గురించి, తన ఆంతరంగిక విషయాల గురించి తరచి తరచి చూసుకున్నట్టుగా   ఉంటుంది ఆమెకు .
అట్లా తరచి చూసుకోవడం ఒకోసారి తనకు తెలియకుండానే ఇష్టంగా ఉంటుంది. మరోసారి అసలు ఆ ఇంటి నుంచీ, చివరకు తన ఉనికి నుంచే తప్పించుకొని ఎక్కడకయినా పారిపోదామా అన్నంత భయం గొలిపేదిగా కూడా ఉంటుంది.
****                                                                              *****                                                             ****
ఆలోచనలు అనేక విధాలుగా కదులుతూ అదుపు తప్పి పోతున్నాయి. అట్లా కావడం ఎంతమాత్రమూ  మంచిది కాదని డాక్టర్ హెచ్చరించడం తను గుర్తు చేసుకున్నది. అట్లా కాకూడదు, అట్లా కాకూడదు అని తనను తాను సంభాళించుకొనేందుకు ప్రయతించింది. కాసేపు వేరే విషయాల మీదకు దృష్టి మళ్ళించేందుకు చూసింది.
చెట్టు కింద అరుగు మీద కూర్చున్నదే కానీ  ఎండ సెగ తెలుస్తూనే ఉంది. బయటి సెగకు తోడు లోపలి సెగ కూడా జతయి నోరంతా పిడచగట్టుక పోతున్నట్టుగా అనిపిస్తోంది. పెదాలను నాలుకతో తడుపుకొని, బాటిల్‍లోని నీళ్ళను లోపలికి వొంపుకున్నది. దాహమయితే తీరింది కానీ నోరంతా ఏదో చేదుగా అనిపించింది.
కాసేపటికి పి.ఎచ్. సి లోనించి “సరోజక్కా” అని పిలుస్తూ తన దగ్గరికొచ్చింది నీలిమ.
వొచ్చీ రాగానే ,”వొంట్లో వుషారుగా ఉందా, జెరం తగ్గి పోయిందా” అని అడిగింది.  అలా అడుగుతూనే చొరవగా నుదురు మీద చేయి వేసి చూసింది.
బదులుగా- ” నయమే లేవే, మరీ నిన్నటంత లేదు గానీ” అనింది తను.
“ఈ రోజు కూడా సెలవు పెట్టాల్సింది. ఈ ఎండకు పడి తిరిగితే లేని రోగం కూడా వొస్తది” హెచ్చరింపుగా అనింది నీలిమ
“కొద్దిగా బాగానే ఉన్నట్టుగా ఉంటే, చిన్నగ బయల్దేరాను లేవే. మరీ ఇబ్బందిగా ఉంటే ఈ బండ చాకిరీ నేను మాత్ర ఎలా చేయగలను. ఇంతకీ ఇప్పుడు మీటింగు ఉంటదంటనా, లేదంటనా” అడిగింది తను.
“అందరూ అదే అనుకుంటున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకన్నారు కదా. పాపం అందరూ ఈ ఎండన పడి వొస్తానే ఉన్నారు. ఇంకాసేపాగితేగానీ ఏమయ్యేదీ తెలియదు”
వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ  ఉండగానే చాలా మంది ఏఎన్నెంలు వ్యాక్సిన్ బ్యాగ్‍లు లోపల పెట్టేసి ఒక్కొక్కరుగా చెట్ల కిందకి చేరుతున్నారు. డిపార్ట్‍మెంట్‍కు సంబంధించిన కబుర్లు, వాళ్ళు పని చేసే ఏరియాలో ఉండే సమస్యలు – ఇట్లా మాట్లాడేసుకుంటా ఉన్నారు. మరికొంత మంది వాచీలు చూసుకుంటూ మీటింగు ఉంటుందా, ఉండదాని వాకబు చేస్తున్నారు.
టైం రెండు దాటుతున్నది. కాసేపటికి పిఎచ్‍సి స్టాఫొకరు వొచ్చి “డాక్టరు గారికి ఏదో ఫోనొచ్చింది. అర్జెంటుగా వెళ్ళి పోయారు. రేపు మీటింగుంటదని ఇప్పుడే ఫోన్లో చెప్పా”రని అన్నాడు.
“మళ్ళా రేపా “, అన్నారు కొంతమంది. “ఎటూ తప్పేది కాదుగా ఈ రోజుకు బతికాం” అనుకున్నారు చాలా మంది. ఎవరి దారిన వాళ్ళు ఒక్కొక్కరిగా బయలు దేరుతున్నారు. తను, నీలిమా కూడా కాంపౌండ్ దాటి బయటకొచ్చారు.
దారిలో, “ఈ ఎండకు ఏం పోతావుగానీ మా ఇంటి కాడికి పోదాంరాక్కా” అనింది నీలిమ.
“లేదే, మా అన్న కాడికి పోయి రావాలి. పొద్దున్నే మా అమ్మ ఫోన్ చేసింది”.
“సరే, అయితే రాత్రికి వొచ్చి తోడు పడుకునేనా. అసలే వొల్లు బాగాలేదు. ఈ పరిస్థితుల్లో మల్లా ఒక్క దానివే ఉన్నావంటే మీ డార్లింగొచ్చి ఎదురుగా కూర్చుంటదేమో!”
ఆ పిల్ల డార్లింగన్న పదాన్ని వొత్తి పలికిన తీరుకి చిన్నగా నవ్వుతూ – “వొద్దులేవే, బాగానే ఉందిగా. పాపం రోజూ నువ్వు మాత్రం ఎక్కడకని వొస్తావు. అంత ఇబ్బందిగా ఉంటే నేనే ఫోన్ చేస్తాలే” అనింది సరోజ.
****                                                                         *****                                                                               ****
ఎండకు వొళ్ళంతా గుచ్చుక పోతున్నట్టుగా ఉంది ఆమెకు. ఉదయం పని, ఆ తర్వాత ప్రయాణం- వీటితో  వొళ్ళు తూలిపోతున్నట్టుగా నీరసం అయింది. కాసేపు ఎక్కడన్నా నీడలో ఆగుదామానిపించింది. కానీ ఇక్కడెక్కడా తను ఆగడానికి లేదు. ఆగితే షాపుల ముందర ఆగాల్సిందే. ఇదంతా ఎందుకు లెమ్మని ఓపిక తెచ్చుకొని చిన్నగా నడవడానికే ఆమె నిర్ణయించుకున్నది.  ఈ రెండు రోజుల నుంచీ కాసిన జ్వరం తనని బాగా నీరసం చేసేసింది.
ఈ సమయంలో నీలిమ తోడు లేకుంటే ఎలా ఉండేదోననిపించింది తనకు. ఒంట్లో ఏ కాస్త నలత చేసినా, మనసు కాస్త తేడాగా ఉన్నా, తన బలహీనతలోనించీ “ఆమె” తన ముందర ప్రత్యక్షమవుతుందేమోనని  ఒకోసారి భయం వేస్తుంది.
ఆలోచనల్లో ఉండగానే బస్టాప్ దగ్గరకొచ్చేసింది. బస్సు వొస్తే ఎక్కి టిక్కెట్ తీసుకొని ఎందుకైనా మంచిదని కిటికీ దగ్గర కూచ్చుంది. ఆలోచనలు వాటి కొసల నుండీ తిరిగి మళ్ళా మొదలవుతున్నాయి. ఒక ధారలాగా ఎడ తెగకుండా తనను తమ లోపలికి పీల్చుకుంటున్నాయి.
“ఇలా కాకూడదు” అనుకున్నది తను. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే లేని రోగం కూడా వొస్తుందన్న సైకియాట్రిస్ట్ హెచ్చరికను గుర్తుకు చేసుకున్నది. ఊరికే అలా ఆలోచనల్లో పడి లోలకంలా పడి కొట్టుకోకుండా ఏం ఆలోచిస్తున్నావో గమనించు అన్న ఆయన సలహాను తలుచుకున్నది.
నెమ్మదిగా అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కొక్కటిగా పోగు చేసుకునేందుకు  ప్రయత్నం మొదలు పెట్టింది.
అసలిదంతా అమ్మ ఉదయాన్నే ఫోన్ చేయడంతో మొదలయ్యింది. ఫోన్లో ఆమె ఏడుస్తున్న గొంతుతో “అన్నను పోలీసోల్లు పిలచక పోయార” ని అన్నది.
” ఎందుకు” అని అడిగితే “ఎస్సై గారు పిలచక రమ్మన్నారు. మళ్ళీ పంపిస్తాం “, అని అన్నారంట.
“ఊళ్ళొ ఇంకా మరో ఇద్దర్ని కూడా పిలచక పోయార”ని ఆమె అన్నది.
రెండు రోజుల నుండి డ్యూటీకి సెలవు. ఈ రోజేమో వ్యాక్సినేషన్. నిన్న సాయంత్రమే తను హాస్పిటల్‍కు ఫోన్ చేసి రేపు వొస్తానని చెప్పింది కూడాను. ఇప్పుడు తను డ్యూటీకి వెళ్ళక పోతే ఎక్కడిదక్కడ ఆగి పోతుంది. ఏం చేయాలో తోచక “సాయంత్రానికల్లా ఇంటికొస్తాన”ని అమ్మతో పోన్లో చెప్పింది.
ఎలాగైతే అలాగవుతుందని లోపల్లోపల ధైర్యం చెప్పుకుంటుందేగానీ లోపలి గాబరా ఎంతకీ ఆగడం లేదు.
“ఎక్కడా ఏమీ అలికిడి లేదే. మళ్ళీ ఎందుకని ఇలా వెంటబడుతున్నారు?”
“మళ్ళి ఏమన్నా నెత్తి మీదకు తెచ్చుకున్నాడా?”
Sketch18116461చుట్టుపక్కల ఎక్కడా నక్సలైటన్న పేరు వినపడకుండా పోయేదాకా పోలీసులు ఆయనెమ్మటి పడుతూనే ఉన్నారు.
“ఎవరికీ లేని ఖర్మ నీకెందుకురా” అని అమ్మ నెత్తీ నోరూ మొత్తుకుంటే మౌనమే వాడి సమాధానం. ఇంకా గట్టిగా నిలదీస్తే కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాడు.
ఇట్లా మొత్తుకున్న కొన్ని రోజుల దాకా తగ్గినట్టే తగ్గి ఇక ఏమీ లేదులే అని అనుకునేటప్పటికీ మళ్ళీ మనకు తెలియకుండానే పీకల్లోతు కూరుకుని పోయేవాడు.
“మీ వాడి పేరు రికార్డుల్లోకి ఎక్కింది. ఎక్కడ ఏమీ జరిగినా మీ వాడినే ముందు తీసుకొని పోయేది”, అనే వాళ్ళు అందరు.
“అట్లా రికార్డుల్లోకి ఎక్కిందాన్నేనా, చుట్టూ ఏమీ లేక పోయినా మళ్ళీ మళ్ళీ పట్టుకొని పోతా ఉంది?” అనుకున్నది తను.
అట్లా అనుకుంటూనే గబగబా తయారయి వ్యాక్సిన్ బ్యాగ్ పికప్ చేసుకుంది. ఆటో ఎక్కి తను పని చేసే ఊర్లో దిగే సరికే ఎండ దంచేస్తా ఉంది. ఆటోలు ఆగే దగ్గర  ఆశా వర్కర్ రమణమ్మ సిద్ధంగా ఉంది. వ్యాక్సిన్ బ్యాగ్‍ను ఆమె తన చేతుల్లోకి తీసుకున్నది.
గబగబా నడుస్తూ చిన్నబడి దగ్గరికొచ్చేసరికి వాళ్ళకు సుమారు ఒక పది మంది డ్రస్సుల్లో, తుపాకులతో ఎదురయ్యారు. ఊహించని ఈ సన్నివేశానికి తనకు ఒక్కసారిగా ఊపిరాడనంత పనయ్యింది. ఒక్క క్షణం వాళ్ల వైపు చూస్తూ నిలబడింది. వాళ్ళు గబగబా వరుసగా ఒకళ్ళ వెనుక ఒకళ్ళుగా తమను దాటి మెయిన్ రోడ్‍కు  అవతల ఉన్న గుట్టల వైపు పోతున్నారు.
లోపల తను ఆలోచిస్తున్న దానికి, బయట తను చూస్తున్న దానికీ సంబంధం ఏమయినా ఉందేమోనని ఆమె కాసేపు సంకోచపడింది. తను మాట్లాడేది వాళ్ళకు వినపడుతుందేమోనన్న భయంతో , ” రమనమ్మా, ఏందీ వీళ్ళూ?” అని చిన్నగా అడిగింది.
“ఎర్ర సెందనం కోసమంటమ్మా. అడివిలోకి ఎవురూ కూడా పోవడానికి బయపడి సస్తా ఉండారు. మొన్న తిరపతి కాడ కట్టె కొట్టడానికి పోయినోళ్ళను కూడా సంపిండ్రంట గదా. మనకెల్లంతా కూడా అడవడివీ గాలిస్తా ఉండారు”
ఒక్క క్షణం నింపాదిగా గాలి పీల్చుకున్నది తను. అంగన్‍వాడీ  సెంటర్ దగ్గరికొచ్చేసరికి అప్పటికే బాలింతలు చంటిబిడ్డల్ని తీసుకొని తన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళను ఒక్కొక్కళ్ళనూ పలకరిస్తూ పనిలో పడింది తను.
****                                                                        *****                                                                                         ****
తిరిగి వొస్తున్నప్పుడు దారిలో అటో తోలుతున్న చాకలి గురవయ్య అంటున్నాడు. “పెద్ద పెద్ద వాళ్ళను వొదిలేసి సన్నా సపకా వాళ్ళను చంఫుతున్నారు మేడం”.
 
ఆ మాటలు తనకు తగలాలనే, తనను ఉద్దేశించే అంటున్నాడు.
అయినా తనకు తెలియకుండానే, “ఆఁ” అన్నది తను.
తను “ఆఁ” అనడం అతనికి ఎలా తోచిందో గానీ దారి పొడగునా వొదురుతానే ఉన్నాడు.
“ఎప్పటికయినా సన్నా సపకా వాళ్ళకేనంట నెత్తి మీదికొచ్చేది”.
“ఈ చుట్టు పక్కల తలకాయ ముదిరిన ప్రతీ వాడూ ఎర్ర చందనం డబ్బు ఏదో రకంగా తిన్నవాడేనంట”.
“మొన్న ఎలక్షన్లో ఇప్పటి ఎమ్మెల్యేని గెలిపించింది కూడా ఆ డబ్బులేనంట”.
“ఇట్టాంటి డబ్బు తినడానికి ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదంట.”
“కట్టె కొట్టబోయిన తన లాంటి వాళ్ళకు మాత్రం తన్నులూ, కోర్టు కేసులూ, చావులూనంట”.
“అట్టాంటి కేసుల్తోనే సంవత్సరంగా డబ్బులు పోసుకుంటా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడంట”.
చాకలి గురవయ్య మాటల్లో కసంతా తన మీదకే కొడతా ఉంది. అది తనకు తగలాలనీ, తనను బాధ పెట్టాలనీ ఉద్దేశించినట్టుగానే ఉంది.
ఒక్క క్షణం తనకు అతనితో, ’నేనూ నీ లాంటి దాన్నే” అని చెప్పాలనిపించింది. ’నాకూ నీకూ ఎడంలేదు. నీది బయటకు కనపడే బాధ. నాది బయటకు కనపడనిది. నీలా చెప్పుకోలేనిది” అని అనాలనిపించింది. “కానీ అది ఆయనకు అర్థమవుతుందా”?
“అయినా ఇప్పుడు తను ఈ మాటల్నీ,  మాటలతో సలపరించే తన గతాన్నీ తవ్వుకుంటూ కూర్చోలేదు. అది తనని ఇంకా ఇంకా పాతాళానికి తోసేస్తుంది. తను దాన్నించీ తప్పుకోవాలి. బతకాలి”. లోపలికి గట్టిగా గాలిపీలుస్తూ  అనుకుంటూ ఉండిదామె.
****                                                                                      *****                                                                              ****
బస్సు దిగి ఇంటి దగ్గరకొచ్చేసరికి అన్న వొచ్చేసి ఉన్నాడు. తను  ఇంట్లోకడుగు పెట్టేసరికి మొగరానికానుకొని గిట్టకాళ్ళమీద కూర్చొని తనని చూసి పలకరింపుగా నవ్వాడు. అమ్మ పొయికాడ రొట్టెలు చేస్తా ఉంది. అన్న తాగుతున్న బీడీని పక్కన పారేసి గ్లాసు తీసుకొని టీ పోయించుకరాను బయలుదేరాడు.
“ఇప్పుడెందుకులేన్నా”, అంటే , “పోనీలేవే, కాసింత రొట్టె తిన్నాక టీ తాగడం నీకిష్టమేగా” అన్నది అమ్మ.
అన్న బయటికెలితే ఆ సమయంలో ఏదన్నా మాటాడొచ్చని ఆమె ఆలోచన.
అన్న గ్లాసు తీసుకొని బయటకు పోగానే అమ్మ చెప్పడం మొదలు పెట్టింది.
“ఊళ్ళలో ఉండే అన్న లాంటి వాళ్ళందరినీ మళ్ళా పోగేసి మాట్లాడానికి పిలిపిచ్చిండ్రంట. ఆప్పుడప్పుడూ అట్టా పిలిపిచ్చి మాట్టాడితే గానీ బయ్యముండదని ఇదంతా చేస్తా ఉన్నారంట. రేపు మార్కాపురం డీఎస్పీ కాడికి కూడా అందరూ పోయి రావాల్నంట”.
“మళ్ళీ రేపు కూడానా” , అన్నది తను.
“ఏం చేస్తాం. అందరూ బాగానే ఉండారు. మా కర్మే ఇట్టా కాలబన్నది”, పుల్లవిరుపుగా అన్నది వొదిన.
తను వొచ్చిన దగ్గర నుండీ ఆమె ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాటాడలేదు. ఇలాంటి సమయాల్లో ఆమె మూతి ముడుచుకోని ఉంటుందని తనకి తెలుసు. ఆమెలో ఏదో కోపం. ఎవరి మీద చూపాలో తెలియని కోపం.
ఆమె కోపం ఉదయం తను చూసిన చాకలి గురవయ్య లాంటిదేనని అనిపించింది తనకు. కానీ ఆమె కోపము, ఆ పుల్లవిరుపు వైఖరి తనను ఎంతకూ కుదురుగా ఉండనీయడంలేదు.
” ఎవ్వరి బతుకులు మాత్రం బాగున్నాయి. తను కూడా ఆమె లాగా, చాకలి గురవయ్యలాగా ఈసురోమనే కదా బతుకుతున్నది. పైకి మాత్రం ఇదిగో, మంచిగా కనపడే  గుడ్డలు కట్టుకొని, భుజానికి హ్యాండ్ బ్యాగ తగిలించుకొని తెల్లపుల్లగా కనపడుతున్నాను గానీ, నా బతుకు కూడా తగలబడి పోతుందని ఈమెకు తెలియదా? వీళ్ళకన్నా ఏడ్చుకోవడానికి ఉంది. నేను మాత్రం ఈ తెల్లపుల్లని గుడ్డల మాటున శిధిలమైపోతున్నాను” అని గట్టిగా అరవాలనిపించింది.
“కానీ తనకు తెలుసు. మనుషుల మధ్యన ఉండే దూరాలు, ఎత్తు పల్లాలు మనుషులను ఎంతకీ దగ్గర కానీవు.  ఎంత మొత్తుకున్నా ఒకరికొకరు అర్థం కానీయవు. ఒకరికొకరు కాస్త దగ్గరకొచ్చినట్టుగా అనిపించినా అది కాసేపే. తిరిగి మళ్ళీ మనుషుల మధ్య గోడలు పైకి లేస్తాయి. పైకి లేచిన గోడల మధ్యన మనుషులు జంతువుల్లాగా బంధీలై గాలిలోకి కాళ్ళూ చేతులూ విసురుతూ మొత్తుకోవాల్సిందే.”
“లేకుంటే తను ఏమి చేసామని  వొదిన తనతోనూ, అమ్మతోనూ సరిగా మాటాడదు? ఏదన్నా అంటే, ఈ కొంపలో నా కర్మ కొద్దీ వొచ్చి పడ్డానంటుంది. ఆమె ఈ ఇంటికొచ్చిన  దగ్గరనించీ ఇదే తంతు. అంతా అయిపోయీ, అన్న ఇక ఎటూ పోకుండా ఇంటి కాడే ఉండేంత వరకూ ఇట్లాగే కక్షగా ఉండేది ఆమె.”
“తనకూ, మొగునికీ పడక గొడవలై, ఇక కలిసి ఉండలేక వొక్కతిగా  ఉండాల్సొచ్చినపుడు  అన్నా, వొదిన, అమ్మ తన దగ్గరకు వొచ్చి రెండు రోజులున్నారు.  ఆ రెండు రోజులూ మాత్రమే వొదిన మునపటి కన్నా నెమ్మదిగా, మెత్తగా మాటాడింది. ఆ నెమ్మదితనం, మెత్తదనం చూసి తనే ఆమెను దూరం నుంచీ చూసి అర్థం చేసుకున్నానేమో అనుకున్నది. కానీ ఈ రోజు, ఈ సంఘటనతో మళ్ళీ తనకు తెలిసిన వొదిననే చూస్తున్నది తను”.
కళ్ళలో నీళ్ళు మెదలుతున్నాయి తనకు. అన్న వొస్తూ వొస్తూ పిల్లల్ని కూడా పిలుచుకొని వొచ్చాడు. వొస్తూనే వాళ్ళూ “అత్తా” అని మీద పడిపోయారు. హ్యాండ్ బ్యాగ్ లోనుండీ  కొనుక్కోవడానికి వాళ్ళకు డబ్బులు తీసిచ్చింది.
అన్న తెచ్చిన టీ తాగుతూ, “అయితే రేపు కూడా పోవల్నా” అని అడిగింది తను.
“అవును ఉత్త పున్నేనికే తిప్పుతా ఉండారు”, అన్నాడు ఆయన.
ఇంకేం మాటాడడానికి తోచలేదు తనకు.
టీ ఊదుకుంటా తాగుతా ఉంటే అన్న మొకం కెల్లి చూసింది. మొకమంతా డొక్కుపోయినట్టుగా ఉంది. రెక్కల కష్టంతో దేహం ఎండిపోయి కంప మాదిరిగా తయారయ్యింది. ” తనకున్న రెండెకరాల చేను పీల్చి పిప్పి చేస్తున్నది” అనుకున్నది తను.
Sketch18116461
ఈ నిశ్శబ్ధంలో కాసేపు ఆగి అటూ ఇటూ తిరుగుతూ బోకులు సర్దుకుంటున్న వొదిననూ, పిల్లలనూ, అమ్మనూ మార్చి మార్చి చూసింది. వాళ్ళు కూడా అన్న లాగే ఎండిపోయి వొట్టి చేపలల్లే ఉన్నారు. ఒకే ఇంటిలో ఒకే రకమైన కష్టాలతో ఒకరినొకరు ముమ్మూర్తులా పోలి ఉన్నారు.
కానీ వాళ్లందరినీ విడగొడుతున్నదీ, ఒకరంటే ఒకరికి ద్వేషాన్నీ, కోపాన్నీ కలిగించేదీ ఏదో అక్కడే మెసల్లాడుతున్నట్టూగా తోచింది. అది గాలిలాగా అక్కడే తిరుగుతూ ఉన్నది. వొంటికి తాకుతూ ఉంది. అక్కడక్కడే తిరుగుతూ మనుషుల్ని నిస్సహాయుల్ని చేసి దిక్కుకొకరుగా ఈడ్చుక పోతూ ఉంది. అది తనకు తెలుస్తూ ఉంది అనుకున్నది తను.
ఉండి ఉండీ కాసేపటికి, “నిన్న స్టేషను కాడ మీ లాయరు మాట్లాడిండు” అన్నాడు అన్న.
తను ఏమీ మాటాడలేదు.
ఏమయినా మాటాడితే అది ఆ ఇంట్లో మరో విస్పోటనంగా పని చేస్తుందని తనకు తెలుసు. అందుకే తను ఏమీ మాటాడలేదు.
కానీ అమ్మ అందుకోనే అందుకున్నది. అది నెమ్మది నెమ్మదిగా మొదలై తిట్లు, శాపనార్ధాలకు చేరుకుంటున్నది.
****                                                              *****                                                                                                 ****
అందరిలాగే తన బతుకూ ఉంటుదనుకున్నది తను.  పెళ్ళయిన కొన్నేళ్ళ దాకా బాగానే ఉన్నాడు  భర్త వెంకట రమణ. ఉద్యోగస్తుడు కాకపోయినా దగ్గరి సంబంధం బాగుంటుందని చేసారు. కానీ మూడేళ్ళు దాటిన దగ్గర నుంచీ మొదలయ్యిందీ నరకం. పిల్లలు పుట్ట లేదని అత్త, మామా సణుగుడు. దానికి తోడు తను చేసే ఉద్యోగం మీద ఏవేవో సూటిపోటి మాటలు. తన రాకపోకల మీద భరించరాని ఆంక్షలు. కాసింత ముందుగా బయల్దేరినా, కాస్త లేటుగా వొచ్చినా ఎంతదాకా మాటలు పడాల్సొస్తుందోనని గుండెలు బితుకు బితుకు మనేవి.
ఇది చాలదన్నట్టుగా ఎట్టా తగులుకున్నాడోగానీ రాజకీయ నాయకులెమ్మటి తిరగడం, ఎమ్డీవో, ఎమ్మార్వో ఆఫీసులెమ్మటి మరిగి ఊళ్ళో వాళ్లకి పనులు చేపించడం , దానికి గాను ఆఫీసర్లకింత ఇప్పించి తనూ కొంత దండుకోవడం.
“ఎందుకయ్యా ఈ తిరుగుళ్ళు, ఉన్న కాస్త పొలమూ చూసుకోక”, అంటే “తిరుగుతున్నాను కాబట్టే లోకం తెలుస్తుందం”టాడు.
ఇది ఎంత దాకా వొచ్చిందంటే చుట్టూ పక్కల ఏ పనొచ్చినా ఆయన కన్ను దాటి పోని పరిస్థితి.
ఆయన చేసే పనులు వింటుంటే ఒకోసారి తనకే ఆశ్చర్యం వేసేది. హైస్కూలు చదువు దాటని మనిషి ఇన్ని రకాలుగా చేయగలగడం నమ్మశక్యం అయ్యేది కాదు. ఇదంతా తన అన్న నడిచే దిశకు వ్యతిరేకంగా సాగడంగా తనకు అర్థమయ్యేది. ఇది ఇంట్లో ఇంకా ఇంకా హింసకు దారి తీసేది. అన్న జీవితంలో ఎదురయ్యే మలుపులు, ఇబ్బందులు రోజుకొక్క రకంగా తనకు దెబ్బలై తాకడం తనకు తెలుసు.
ఇందులో తన ప్రమేయం ఎక్కడా లేదు. కానీ ఇదీ అని చెప్పలేదు గానీ లోపల మాత్రం తనకు తెలియకుండానే తన మొగ్గు అన్న వైపే ఉన్నట్టుగా కనపడుతుండేది.
మొగుడు మొకాన్నే అనేవాడు, “నీకు ఇదంతా యాడ నచ్చుద్ది లేవే,  గుట్లమ్మటీ, అడువులమ్మటీ తిరుగుతుంటే నచ్చుద్దీ గానీ” అని. అన్న ఇబ్బందులకు గురి కావడం, కేసుల పాలయిన సందర్భాల్లో అయితే ఇక ఆ ఇంట్లో లేకుండా ఉంటే పీడా పోతుందనుకునేది.
ఇదంతా ఏళ్ల పాటు గడిచింది. అన్న జీవిత ఇక ఒక స్తబ్ధ స్థితికి చేరుకుంటున్నదనుకునే సమయానికి తన జీవితం ఇంకో ఇబ్బందిలోకి కూరక పోయింది.
వెంకట రమణ   ఎర్ర్ర చందనం కొట్టించడం మొదలు పెట్టాడు.  మొదట తను ఇది విన్నప్పుడు, ” ఇది, ఇక్కడా” అని ఆశ్చర్య పోయింది. ప్రకాశం, కడప జిల్లాల సరిహద్ధుల్లో ఇది సాధ్యమేనా అనుకున్నది.  కానీ తర్వాత్తర్వాత ఇది నిజమేనని తెలుసుకున్నది. ఫారెస్టోల్లూ, పోలీసుల గొడవ మళ్ళీ తన జీవితంలో మరో విధంగా మొదలయింది. కానీ అవి తన భర్తను బతక నేర్చిన వాడిగా, పలుకుబడి గలిగిన వాడిలాగా నిలబెట్టేందుకే దోహద పడ్డాయి. కేసులూ, రైడింగులూ అన్నీ అయ్యాయి గానీ అవన్నీ ఆయనని మరింత ఎత్తుకు చేర్చేందుకే ఉపయోగ పడ్డాయి.  ఇట్టాంటి డబ్బే కిందటి ఎలక్షన్లల్లో ఏరులై పారిందంట. చివరకు వెంకట రమణ పంచాయితీ సర్పంచ్ కూడా అయ్యాడు.
వీటన్నింటికీ తోడు తను ఇక తట్టుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరైన విషయం వెంకట రమణ  ఒంగోలులో ఎవరితోనో కాపురం పెట్టడం.  ఇది తన సహనానికి ఉన్న ఆఖరి హద్దును కూడా పూర్తిగా చెరిపేసింది.
****                                                            *****                                                                                          ****
బస్సెక్కి తిరిగి ఊరు చేరుకొనేసరికి ఎనిమిది దాటుతుంది. బస్సు దిగగానే పర్సులోనించీ సెల్లు బయటకు తీసి చూసుకుంది. నీలిమ నుంచీ రెండు మిస్‍డు కాల్స్.
తిరిగి ఆ నెంబరుకి కాల్ చేయబోయింది కానీ ఎందుకో ఒక్క క్షణం ఆగి మానేసింది. ఈ క్షణంలో ఆమె ఏది మాట్లాడించబోయినా  తను మాటాడగల స్థితిలో లేదు.
బస్టాప్ నుంచీ ఇంటి దాకా కూడా నడవడానికి ఓపికగా ఉన్నట్టు అనిపించడంలేదు. దగ్గర ఉన్న ఆటో ఒక దాన్ని ఆపి ఇంటి అడ్రస్సు చెప్పి ఎక్కి కూచ్చునింది.
బస్సు ఎక్కినప్పటి నుండే తల ఊరకే కదిలి పోతున్నట్టుగా అనిపిస్తోంది. కడుపులో ఒక పక్కగా మొదలైన మంట రొమ్ము దగ్గరకు పాకుతూ వొస్తుంది. అది ఇప్పుడు మరింత ఎక్కువై నోట్లో నీళ్ళు ఒకటేమైన ఊరుతున్నాయి. ముక్కుతో గాలిని నిండుగా పీల్చుకుంటూ నెమ్మదిగా వొదులుతూ నియంత్రించుకునేందుకు ప్రయత్నించింది. కానీ లోపలి నుంచీ వొస్తున్న హోరును ఆపుకోలేక పోతుంది. ఆటోలో నుండే భళ్ళున వాంతి చేసుకున్నది. నోరు, ముక్కు, కళ్ళ నిండా సుళ్ళు తిరిగుతూ ఒక్క క్షణం ఊపిరి ఆగినట్టుగా అయింది.
ఆటో నడిపే అతను ఆటోను ఒక పక్కన ఆపి, పుక్కిలించుకోవడానికి నీళ్ళు అందిస్తున్నాడు.
****                                                              *****                                                                                   ****
శరీరాన్ని చిన్నగా ఈడ్చుకుంటూ,  మెట్లెక్కి పై దాకా వొచ్చింది కానీ తాళం తీసుకొని ఇంట్లోకి అడుగు పెడదామనుకునేసరికి వొళ్ళంతా భయంతో జలదరించింది. శరీరమంతా చెమటతో తడిచి ముద్దయింది. చేతులూ, కాళ్ళూ వొణుకుతూ ఉన్నాయి.  ఆ క్షణం  అక్కడ నుంచీ దూరంగా ఎక్కడకన్నా పారి పోదామా అనిపించింది. తాళం తీయాలనే ఆలోచన పక్కన పెట్టి మెట్ల మీద అలాగే కూర్చుండి పోయింది.
 
వొళ్ళూ, మనసూ పుండు మాదిరిగా సలుపుతున్న ఈ స్థితిలో ఇంట్లోకి అడుగు పెట్టడమన్న అలోచనే ఆమెకు ఊపిరి ఆడనీయడంలేదు.
తలుపు తీసి లోపలికెళితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. అక్కడ “ఆమె” ఉంటుంది. ఇట్టాంటి సందర్బాల్లో ఆమె ఖచ్చితంగా తనకెదురుగా వొచ్చి నిలబడుతుంది.
ఆమె తనను ఏమీ అనదు. ఊరకే అలా చూస్తూ కూర్చుంటుంది. ఎటు కదిలితే అటు తన కళ్లను తిప్పి అదే పనిగా చూస్తుంటుంది. పారదర్శకమైన ఆ దేహాన్ని తను మొదట ఆ ఇంట్లోనే చూసింది. చూడగానే  మ్రాన్పడిపోయింది. తను చూస్తున్నదేమిటో అర్థమవగానే గబగబా అక్కడ నుంచీ పారిపోయింది.
ఇట్టాంటి అనుభవం తన చదువుకూ, తను చేసే పనికీ వ్యతిరేకంగా తోచింది కానీ త్వరలోనే ఆ పారదర్శకమైన దేహం వెనుకా, ఆ చూపుల వెనకా ఆకర్షణీయమైనదేదో ఉన్నట్టుగా తనకి అనిపించింది. అందులో ఏదో మార్మికమైనదేదో ఉన్నట్టుగా తోచేది. అది తనకు మాత్రమే అర్థమవుతున్నట్టుగా అనిపించేది.
“ఎవరు ఆమె?”
“మొగుడు రైల్వేలో ఉద్యోగమంట.”
“కొత్తగా పెళ్ళయిందంట.”
“అయితే ఈమె మాత్రం మంచిది కాదంట.”
“మొగుడు బయటికి పోగానే ఎప్పుడు మిద్దె మీదే అటూ ఇటూ తిరగతా ఉంటదంట.”
“ఏమయిందో ఏమో గానీ చివరకు ఆమె ఫ్యానుకు ఉరేసుకున్నదంట”
“చంపిండ్రో, ఆమే చచ్చి పోయిందో ఎవ్వరికీ తెలియదంట”.
“చివరకి, అద్దెకిచ్చినోళ్ళక్కూడా తెలియకుండా గప్‍చిప్‍గా బాడీని జీపులో వేసుకొని పోయిండ్రంట”.
“అభాగ్యురాలు పాపం. కానీ చావు ఎంత అదృష్టం”
“చావూ, చావూ  ఆడవాళ్ళంటే ఎందుకు నీకంత ప్రత్యేకమైన ఇష్టం?”
పక్కింట్లో నుండి ఏదో దైవ స్తుతి శ్లోకాలుగా వినవొస్తుంది. రాత్రి ఏడు గంటలకల్లా కల్లా తిని ఎనిమిదిన్నరకల్లా ఇట్టాంటి శ్లోకాలు, ప్రార్థనలు వింటూ అటువంటి ప్రశాంతత ఇచ్చే రక్షణలో సుఖంగా నిద్రపోయే ఆన్నీ అమరిన సుభద్రమైన సంసారం.
“అందరికీ హాయినీ, రక్షణనూ ఇచ్చే దేవుడు తన సంసారాన్ని మాత్రం ఎందుకనీ ఇలా చేసాడు?”
“ఈ రకంగా అలమటిస్తుంటే ఒక్క నాడన్నా తనని పట్టించుకోని గుడ్డి నాబట్ట కాదా వాడు.”
****                                                           *****                                                                                                      ****
మెట్ల సందుల్లోనించీ ఆకాశం చంద్రుని లేత వెలుతురులో సన్నగా మెరుస్తా ఉంది. అలసట తీరినట్టుగా అనిపించింది కానీ జంకు వల్ల కలిగిన అలజడి మాత్రం శరీరంలో ఇంకా ఉన్నట్టుగానే అనిపిస్తొంది
  తన కతంతా చెప్పినపుడు సైకియాట్రిస్టు చెప్పిన మాటలను ఆమెకు గుర్తుకొస్తున్నాయి.
“ఆ ఇంట్లో దెయ్యం ఉండడమా, లేకుంటే ఉండకపోవడమా అనేది మీ చుట్టు పక్కల వాళ్ళకు ఒక నమ్మకం కావొచ్చు. కాకుంటే ఒక భ్రాంతీ అయి ఉండవచ్చు. అంతకు మించి వాళ్ళ అనుభవంలోగానీ, అనుభూతుల్లోగానీ మరేమీ లేదు”.
” కానీ మీ అనుభవంలో మాత్రం ఇది  ఒంటరితనానికీ, జీవితంలోని స్తబ్ధతకు బదులుగా చావు పట్ల మీరు పెంచుకున్న ఆకర్షణగా నాకు తోస్తున్నది.”
“దెయ్యం పేరుతో ఉన్న ప్రతీ అనుభవంలోనూ మీరు ఆత్మహత్యతో తలపడుతున్నట్టుగానే నాకు అనిపిస్తోంది. అది కాసేపు మిమ్మల్ని భయ పెడుతోంది. మరి కాసేపు మిమ్మల్ని ఆకర్షిస్తోంది.  ఈ ఘర్షణ ఇట్లాగే సాగడం మీకు మంచిది కాదు. నిజంగా అట్టాంటి సంఘర్షిత క్షణాలే ఎదురైనప్పుడు వాటిలో ఊరకే పడి కొట్టుక పోకుండా  అదేమిటో తేల్చుకోవడమే బాగుంటుంది….”
ఫోన్ మోగుతోంది.
అవతల నీలిమ.
“రాత్రికి తోడుగా వొచ్చి పడుకునేనా”, అని అడుగుతున్నది.
తను ఇక నిశ్చయించుకోవాల్సిన సమయం వచ్చింది.
బదులుగా, ” పర్వాలేదులే” అని నచ్చచెప్పింది తను.
నీరసంగా అనిపించినా, నింపాదిగా తాళం తీసి లోపలికి అడుగు పెట్టింది.
లైట్ వెలిగించి, కిందింటి పిల్లాడ్ని పిలిచి, నాలుగిడ్లి కట్టించుకరమ్మని డబ్బులిచ్చి పంపింది.

3, ఏప్రిల్ 2015, శుక్రవారం

అతను వొస్తే బాగుండు

http://patrika.kinige.com/?p=5360



కొండ మీద సన్నని మంట పాకుతా ఉంది. ఎర్రగా కాలుతూ, దారంటా పాకుతూ ఉండడం తను అదే పనిగా కిటికీలోంచి చూస్తున్నాడు.

వారం రోజుల నించి, తను గది దాటి బయటకు రాలేదు. ఈ వారం రోజులూ మంచం మీద అంటుక పోయి నిద్ర పొగలిగినంత సేపూ నిద్ర పోయాడు. నిద్ర పోని సమయాల్లో అలా కూర్చుండీ, పడుకొనీ, మెసల్లాడుతూ, ఊరకే రెప్పలల్లార్చుతూ అలా చూస్తూ ఉండిపోయాడు. ఒక్కొక్కసారి తినగలిగిన దాని కన్నా ఎక్కువే తిన్నాడు. ఇక ఏమీ తినలేననిపించిన పూట వుట్టి కడుపుతోనే ఉండిపోయాడు. చదవాలనిపించినంత సేపూ పుస్తకాలు విడుపు లేకుండా చదివాడు. చేత కానప్పుడు అడ్డదిడ్డంగా పేరుకపోయి, బూజు పట్టుకపోయిన పుస్తకాల అరల కేసి చూస్తూ కూచున్నాడు.

బయట హాల్లో టీవీ మోగుతా ఉంది. టీవీకి ఎదురుగా పాప కూర్చొని ఉంటుంది. స్కూలు నుంచి వచ్చీ రావడంతోనే పుస్తకాల సంచిని పక్కన పారేసి, ఇక నిద్ర పోయిందాకా దానికి అదే పని. ఏం చూస్తున్నామన్న దానితో పనిలేదు. బొమ్మలొస్తుంటే చాలు. వంట గదిలో పాత్రలు కడుగుతున్న చప్పుడు వినపడతా ఉంది.
“ఊరకే అట్లా పైకప్పుకేసి చూసుకుంటా కూచ్చునే బదులు కాసేపు పిల్లను హోంవర్కు చేయిస్తే ఏమీ?” – పాత్రల చప్పుడులో ఆమె గొంతు కలగలిసి పోయింది.
“బడి నుంచి వస్తానే అట్టా గాడిద మాదిరిగా టీవి ముందు కూచ్చుంటావేమే” – వంట గదిలోనుండే పిల్లను గదమాయించింది.

పిల్ల నిదానంగా లేచి తను ఉన్న గదిలోకి పోవడం చూసి ఆమె కాస్త నెమ్మదించింది. కానీ మళ్ళీ గదిలో ఊరకే కూర్చుంటుందేమోనని అనుమానంతో, “పుస్తకాలు తీస్తున్నావామ్మాయ్” – అని కేకేసింది.

“లెక్కలు చేసుకుంటున్నాను” – అని పాప అనేసరికి ఆమె హమ్మయ్య అనుకునింది. పిల్ల పుస్తకాలు ముందేసుకొని లెక్కలు చేసుకుంటోంది. పిల్లను కాసేపు తదేకంగా చూసాడు తను. రాసుకుంటూ ఎందుకో ఆ పిల్ల తలెత్తి, కాసేపు నాన్న వైపు చూసింది.

“నాన్నా, ‘యూనివర్స్’ అని అంటారు కదా. అవి ఒకటే ఉన్నాయా? లేకుంటే సోలార్ సిస్టం లాగా అవి కూడా చాలానే ఉంటాయా?” అని అడిగింది.

ప్రశ్న విని జవాబు చెప్పడానికి ఏమీ తోచలేదు తనకి. కాసేపు పాప వైపే అట్లాగే చూసి, దీనికి కూడా తనలాగే అబ్‍స్ట్రాక్ట్ ఆలోచనలొస్తుంటాయేమో అనుకున్నాడు. ఒక సారి ఇట్లానే ‘మార్స్’ గురించి ఏదో ప్రస్తావన వచ్చినపుడు, విశ్వంలోని పదార్ధాల మధ్య ఉండే దూరాల గురించి చాలా చాలా అడిగింది. నాలగవ తరగతి చదివే పిల్లలకు సౌర వ్యవస్థ గురించే సరిగా తెలియదు. ఇక నక్షత్రాలు, వాటి వ్యవస్థలు, దూరాల గురించి ఏమి అర్థమవుతుంది అనుకుంటూనే తటపటాయిస్తూ చెబుతూ వచ్చాడు. ఆపిల్ల ఆరోజంతా ఏమిటేమిటో అడుగుతూనే ఉంది.

“రాసుకుంటూన్నావమ్మాయ్” – వంట గదిలోనించి మళ్ళీ ప్రశ్న. ఆమె ఒక పనిలోనుండీ ఇంకో పనిలోకి మారుతున్నప్పుడల్లా హెచ్చరికలాగా ఆమె అరుస్తూనే ఉంటుంది.

పిల్ల రాసుకునే వైపు నుండి దృష్టి మరల్చుకొని, ఏదో గుర్తుకొచ్చిన వాడిలా, అతనితో ఈరోజు మాట్లాడాలి – అనుకున్నాడు. ఇలా మాట్లాడాలనుకోవడం, ఏదో లాగినట్టుగా మాట్లాడడం కోసం ఎదురు చూడడం ఎప్పటి నుండి మొదలయిందో గుర్తు తెచ్చుకొనేందుకు కాసేపు ప్రయత్నించాడు. మాట్లాడడం మొదలు పెట్టిన తొలి రోజులలోనే – అతను – చిత్రంగా అన్నాడు “మనం ఇప్పటి నుంచి కలల గురించి మాట్లాడుకుందాం” అని.

మొదట వినడానికి కొత్తగా, సరదాగా అనిపించినా కొన్ని రోజులు మాట్లాడుకున్నాక తనే అడిగాడు: “కలల గురించే ఎందుకూ?”

అప్పుడు అతను, “ఇప్పటి వరకూ మనం చాలాసార్లు మనవి కాని మాటలు మాటాడుకున్నాం. వాటికి ఒకరికొకరం శ్రోతలమయ్యాం. పరస్పరం అర్థం అవుతున్నట్టుగా నటించాం. ఆ నటనలో మన మాటలను మనమే శరీరం నిండా దట్టించుకొని, అనేక అనుభూతులకు లోనయ్యాం. ఎదటి వారిని మన మాటలతో కమ్మేసాం. ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఇప్పటి వరకూ మనం మాట్లాడుకున్నదంతా వొట్టిదేమో అనిపిస్తుంది,” అన్నాడు.

“నిజంగా వొట్టిదేనా” – మాటల కొసలను వొత్తి పలుకుతూ అడిగాడు తను.

“అవును. మనం చాలా సార్లు మనకి తెలియని విషయాలను తెలిసినట్టుగా ఊహించుకొని వాటినే పదేపదే పలవరించాం. మాటల గూడులను అల్లుకొని వాటిలో చిన్నపిల్లల్లాగా మనలను మనం సాంత్వన పరుచుకుంటూ ఏమేమో చేసాం. ఇన్ని మాటలు, ఇంత సమయం గడిచాక కూడా ఎందుకో మనం నిజంగా సన్నిహితం కాలేదనిపిస్తోంది. ఇంకా ఏదో ఇద్దరి మధ్యా అడ్డంగా వేలాడుతూ ఉందనే అనిపిస్తోంది. నీకెప్పుడూ అలా అనిపించలేదా?” – అడిగాడు అతను.

ఎక్కడో, ఏదో తరచి చూసుకుంటూ, తడబాటుగా తను, “అవును” – అని అనక ముందే, “మనం ఇక ఇప్పటి నుండీ కలల గురించే మాటాడుకుందాం. ఎందుకంటే అక్కడ అబద్దం ఉండదు. అక్కడ మనం నిజంగా నిజమయ్యి ఉంటాం” – అన్నాడు అతడు.

అలా మొదలయ్యింది కలల సంభాషణం. అవి ఒకోసారి స్పష్టంగా, తేటనీటి ప్రవాహంలోని నునుపాటి రాళ్ళలా ఉండేవి. చాలా సార్లు గజిబిజిగా పొందిక లేకుండా కలగాపులగమయ్యి గందరగోళంగా ఉండేవి. వాటిని తిరిగి అనుభవంలోకి తెచ్చుకోవడానికి యమ యాతనయ్యేది. చేతనయ్యేది కాదు. అయినా ఆ ప్రయత్నం ఒక ఆట మాదిరిగా, చిక్కు ముడులను విప్పుకుంటూ తనలోకి తాను తరచి చూసుకొనే లోచూపులా గోచరమవుతుండేది.

2

“రాసుకోవడం అయిందా?” – అంటూ, కాఫీ గ్లాసులతో లోపలికొచ్చింది ఆమె. ఒక గ్లాసు తన చేతికిచ్చి, పిల్ల పక్కనే చతికిలబడి కూర్చుంది. కాఫీ తాగుతూనే, పిల్ల చేసిన లెక్కాలు హోంవర్క్ ఎంతవరకూ సరిగా ఉందో చెక్ చేస్తా ఉంది. కాఫీ గ్లాసు పట్టుకొని తను కాసేపు ఆమె వైపు చూసాడు. తను అలా పిచ్చి చూపులు చూస్తుండడం తెలిసిన దానిలాగా, తలెత్తకుండా, యధాలాపంగానే అడిగిందామె.

“ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇంటి కాడనే, షాపుకు పోకుండా?”

తన దగ్గర జవాబు లేదు.

“అందరూ అడుగుతున్నారు. నీకు వొంట్లో బాగాలేదాని? అంతా బాగానే ఉందని అంటే – అట్లయితే మరి, షాపుకు ఎందుకు పోవడం లేదని వంద రకాల కూపీలూ.”
“మళ్ళా ఏమన్నా పురుగు తొలిచిందా ఏమి” – అని అందామని ఆమెకు నోటిదాకా వొచ్చిందగానీ, తమాయించుకున్నది. తమాయించుకునే కొద్దీ ఆమెకు దుఃఖం పెగులుకొని వొస్తున్నది.

ఇంతకు మునుపు కూడా ఒక సారి, పుస్తకాలనీ, మీటింగులనీ అటుతిరిగి ఇటుతిరిగి అందరినీ యమ యాతన పెట్టాడు. ఒక రోజు తెల్లవారు జామున పోలీసులు ఇంటి మీదికొచ్చి, నానా గందరగోళం చేసారు. ఉన్న మనిషిని ఉన్నట్టుగా స్టేషనులో పెట్టి, మూడు రోజులు తిప్పలు పెట్టారు. ఆ అనుభవం ఇంట్లో మనుషుల మధ్యన గోడలా నిలబడ్డది. ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. కారణం నువ్వంటే నువ్వని ఏదేదో అనుకున్నారు.

ఆ రోజులు పోయినయని అనుకుంటే మళ్ళీ ఏదో మొదలయిందని అనుకున్నది ఆమె.

తను కాఫీ తాగేసి, అటు పక్కకు తిరిగి పుస్తకంలోకి తల పెట్టుకున్నాడు. ఎందుకో ఆమె తనని కదలించలేకపోతుంది.

3

ఆమె తిరిగి తన పనుల్లోకి వెళ్ళిపోయాక, “నాన్నా, నేను కాసేపు టీవీ చూసొస్తాను. హోంవర్కు కూడా చేసేసాను” అన్నది పాప.

పాప మాటలతో తను మళ్ళీ ఇటు వైపుకొచ్చాడు. పాప పుస్తకాలను పక్కన పడేసి హాల్లోకి పోయింది. ఆ పిల్ల మళ్ళీ టివీ దగ్గరకి రావడం చూసి – “రాసుకోవడం అయిపోయిందా?” అని ఆమె వంట గదిలో నుండే పాపను హెచ్చరించింది. పాప అయిపోయిందనేసరికి ఇక ఏమనాలో తెలియక – “దీనికి ఇరవై నాలుగ్గంటలూ టీవీ రందే, పిల్లని కాసేపు కూచ్చోబెట్టుకొని సదివిచ్చయ్యాంటే, ఈ మనిషేమో ఎంతసేపూ పైకెగ చూసేదే తప్ప ఇంకోటి ఏదీ పట్టించుకోకపాయె,” అని అనుకుంటూ ఆమె తన పనిలోకి మళ్ళీ పడిపోయింది. ఆమె మాటలు వింటా ఊరకే అరచేతులవైపు చూసుకుంటూ కూర్చున్నాడు తను.

ఆమె ఎదురుగా ఉన్నా, ఏదైనా మాటాడుతున్నా బదులు చెప్పడానికి తనకి చేత కాదు. ఆ చేతకాకపోవడాన్ని అయినా ఆమెకు తెలిసేలా చెప్పాలనిపిస్తోంది తనకు. కానీ చేతకావడంలేదు.

ఆమె లోపలికి వొచ్చినపుడు ఏమన్నా అంటూందేమో అనుకుంటాడు తను. అలాంటిదేమీ లేకపోయేసరికి, ఆ గదిలో అటు తిరిగి, ఇటు తిరిగి, ఒక్కడిగా మిగిలి, ఎంతో కష్టంగా అనిపిస్తుంటుంది. భారంగా, ఊపిరాడకుండా ఉండే ఆ వాతావరణంలో, తనకేమవుతుందో గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో తనకి మరలా మరలా గుర్తుకు వొచ్చేవి అతడూ, తనూ ఒకరితో ఒకరు చెప్పుకునే కలలే. వీటికీ, ఇప్పటి తన స్థితికీ ఏమి సంబంధమో అతడు సరిగా పోల్చుకోలేక పోతున్నాడు. కానీ ఎక్కడో ఏదో ఉంది. ఇది బాధగా ఉన్నప్పటికీ, లోకంతో విడదీసి తనను తాను చూసుకునే లోచూపులాగా పదునుగా కూడా ఉంది. ఇవన్నీ బయటకు చెప్పుకోవడానికి తన శక్తి సరిపోవడంలేదు అంతే, అని అనుకుంటాడు తను.

ఒక రోజు తను అతనితో చెప్పాడు. “తనను ఇంటరాగేషన్ చేసిన పోలీసోడు కలలోకొచ్చా”డని. ఆ పోలీసోడు మునపటి అదే దర్పంతో, ముఖంలోకి ముఖం పెట్టి చదవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా, ఉద్యమం, సాహిత్యం లాంటి పదాలను వొత్తి వొత్తి పలుకుతూ ఉన్నాడు. కానీ వెనకటిలాగా తనలో భయం కలగడంలేదు. కల చెదిరి పోతున్నప్పుడు మాత్రం తన పక్కన ఎవరో స్త్రీ. ఆమె స్పర్శ తనకి తెలుస్తున్నట్టుగా అనిపించింది. ఆమె రూపమూ, ఆ సంఘటనా పోల్చుకొనేలోగానే నీటి అలల్లో ప్రతిబింబంలా అంతా కదలిపోయింది.

ఇది అతనికి చెప్పినపుడు ఊరకే నవ్వి – “అయితే ఆ రోజులు మళ్ళీ వొస్తాయంటావా,” అన్నాడు.

కలల ప్రపంచంలో అతడికి ఏదో ప్రత్యేకత ఉంది. అతనివి, తన కలల్లా కాకుండా, అతి మానుష రూపాలు, శక్తులు, దెయ్యాలు, రాక్షసులు, వినడానికే వింతగా ఉంటాయి.

ఒక రోజు అతడు, తనకి – వాళ్ళ అమ్మ చెప్పిన కలని చెప్పాడు. అది ఆమె ఎవరి దగ్గరో వినిందంట.

“ఎక్కడో దూరంగా చాలా చిన్న ఊరంట. పిల్లలు చదువుకునే బడి కావల చింతల తోపంట. మిట్ట మధ్యాహ్నమప్పుడు అక్కడ ఒక దెయ్యం తిరుగుతుందడేదంట. అయితే అది నిజంగా దెయ్యం లాంటిది కాదంట. అందుకే దాన్ని దెయ్యమని అనకుండా అందరూ, లక్ష్మీ – అని పిలిచేవాళ్ళంట. బతికున్నప్పుడు ఆమె కాపోల్ల పిల్లంట. వాళ్ళ నాయిన చానా చానా బీదోడంట. పెద్దగయిన కూతురికి పెండ్లి చేద్దామని ఆ కాపాయన ఎంత పోరాటం చేసినా, ఎంతకూ వొనకూడలేదంట. చివరకు మనిషి కూడా చాలా కుంగి పోయాడంట. నాయిన కష్టం చూసి ఆ పిల్ల కండ్ల నీళ్ళు పెట్టుకునేదంట. చివరకు ఒక రోజు ఎవరూ లేని జామున ఆమె చెంబుకనొచ్చి, చింతల తోపులోని బాయిలో దూకిందంట. చచ్చి పోయింది సుతా, ఆమె ఎవరినీ ఏరకంగా ఇబ్బంది పెట్టలేదంట. కానీ ఇంట్లో ఆడపిల్ల ఎదిగొచ్చి భారంగా తిరుగుతా ఉండే ఇండ్లల్లోని తల్లులకు మాత్రం, లక్ష్మి – బావి గట్టు మీద కూచ్చోని ఏడుస్తా కనిపించేదంట.”

“చెంబుకు పోయిన ఆడోళ్ళు – ‘మ్మేయ్, పలానా వాళ్ళకు లచ్చిమి కనిపించిందంటనే’ అని ఒకళ్ళతో ఒకళ్ళు విదారకంగా చెప్పుకునేవాళ్ళంట.”

ఈ కలని అతను చెప్పినపుడు, “అయితే నువ్వు ఇప్పుడు దెయ్యాలను నమ్ముతున్నావన్నమాట” – అడిగాడు తను.

అప్పుడు అతను అంటాడు – “నమ్మకం, విశ్వాసాలు, సిద్ధాంతాలు ఇవన్నీ బయటి ప్రపంచానికి సంబంధించినవి. నీకు ఓపిక ఉంటే వాటన్నిటి గురించి పెద్ద పుస్తకం రాయి. కానీ ఇది కల. బయటి ప్రపంచంలో నువ్వు చేసే పిచ్చి పనులు కలల ప్రపంచానికి కూడా అద్దినట్లయితే, అది కూడా అబద్దమవుతుంది. అప్పుడు ఇక ఎక్కడా నిజమన్నదే లేకుండా పోతుంది. కానీ అది జరగని పని.”

ఇంకా అతడు ఇలా అంటాడు – “ఒక సారి నువ్వు అన్నావు గుర్తుందా. నీ పక్కింటబ్బాయి చదువుకునే బడిలో ఎవరూ వాడని స్టోరు రూములో దెయ్యముందని అంటున్నాడని. అది ఎప్పుడూ ఊ.. ఊ అని ములుగుతూ ఉంటుందనీ. ఆ మూలుగు, చుట్టూ ఉన్న క్లాసుల్లోని పిల్లలకు కూడా వినపడుతూ ఉంటుందనీ. ఒక సారి ఎవరో అబ్బాయి గదిలోకి తొంగిచూడబోయినపుడు ఆ దెయ్యం వాడి ముఖాన్ని నెత్తురొచ్చేలా పీకిపెట్టిందనీ.”

“పిల్లలు పిల్లలవడం వల్లనే, ఇంకా ఏ మాలిన్యాలూ తాకనందువల్లనే వాళ్ళు బయటి ప్రపంచంలో కూడా ఇలాంటి వాటిని గ్రహించగలరు. కానీ మనం మాత్రం….”

4

పళ్లెంలో అన్నం పెట్టుకొని గదిలోకి తీసుకొని వొచ్చిందామె. పాప అప్పటికే అన్నం తిని పడుకునింది. గ్లాసులో నీళ్ళు పోసి తన ముందుంచింది. తను ఆమె కళ్ళలోకి చూడలేడు. అవి తనకే జవాబు తెలియని ప్రశ్నలు అడుగుతాయి. ఆమె నెమ్మదిగా ఆన్నం కలుపుకొని తింటుంది. ఈ వారం రోజులుకు ముందు ఏం జరుగుతూ వొచ్చిందో తను ఆమెకు చెప్పలేడు. అది తనకే ఏదో కలలా అస్పష్టంగా ఉంటుంది. ఇక మాటలతో ఎలా చెప్పగలగడం. ఇదంతా ఎప్పుడు మొదలయిందో గానీ తను చూస్తున్న మనుషులు, సంఘటనలు, ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్టుగా, విన్నట్టుగా అనిపించేది. ఆ అనుభవాలు రానురాను మరింత తీవ్రమై ఊపిరి సలపనంతగా అనుభవంలోకి రాసాగాయి. మనుషుల ఉద్దేశాలు, ఉద్వేగాలు, వాళ్ళ కదలికలు అంతా తనకు ఇంతకు ముందే తెలిసినట్టుగా అతడిని బలంగా కుదిపి వేసేవి. అంతా, అందరూ, తెలియని దేనికోసమో సంఘర్షించుకుంటూ మరణంలోకి కదలి పోతున్నట్టుగా అనిపించేది. దాన్ని తను ఎవరికీ మాటలలోకి చెప్పలేడు.

ఇలాంటి అనుభూతి నాన్న మరణానికి ముందు, తనకు తొలిసారిగా తెలిసివొచ్చింది. అయితే అది తనంతట తాను కనుగొని తెలుసుకున్నది కాదు. డాక్టరు చెప్పాడు. ఆయన నెలరోజులకు మించి బతకడని. ఆ విషయం తనలో ఎంతగా ముద్ర పడి పోయిందంటే, అది తనకు ఒక్కడికే తెలిసిన విషయంలాగా, మరొకరెవరికీ పంచుకోలేని విషయంలాగా తన లోలోపల నిగూఢంగా ఉండిపోయింది. తను నాన్నను ఊరకే అలా గమనిస్తూ ఉండేవాడు. ఆయన కొన్ని వేళల్లో అంతా బాగానే ఉన్నట్టుగా ఉండేవాడు. డాక్టర్లు కూడా నిన్న సాయంత్రం కంటే కూడా ఇప్పుడు తేటగా ఉన్నాడనే వారు. అంతలోనే ముసురుకొని వొచ్చినట్టుగా అయిపోయేవాడు. ఈ మార్పులు ఊగిసలాటలాగా అటు కదిలి, ఇటు కదిలి చుట్టూ ఉన్న మనుషులు డోలాయమానులై ఉక్కిరిబిక్కిరై పోయేవారు. మొత్తం ఈ గందరగోళంలో తనొక్కడే సర్వమూ తెలిసిన వాడిలాగా నెమ్మదిగా, గమనిస్తూ ఉండిపోయేవాడు. ఆ నెమ్మదితనం లోపలికంటా కోసుకొని పోయేది. తన చుట్టూ ఊగిసలాటలో ఉండే మనుషులకుండే తెరపి, వెసులుబాటు కూడా తనకు ఉన్నట్టుగా తోచేవి కావు.

సరిగ్గా అలాంటి అనుభూతే ఇప్పుడు మరలా మరో రకంగా తనని ఆసాంతమూ కమ్మేసింది. చుట్టూ ఏమి జరుగుతున్నా, తన గ్నాపకాలలో అప్పటికే అది నమోదయినట్టుగా అనిపించేది. మనుషుల మరణాలు – అవి ఎప్పుడో ఇంతకు ముందే ఎప్పుడో జరిగినట్టుగా, ఎప్పుడో జరిగిన వాటినే, తను ఇప్పుడు – తన గ్నాపకాల సంచితాల నుండి తిరిగి బయటకు తీసి చూసుకుంటున్నట్టుగా ఉండేది. ఈ అనుభవం తనని విచలితుడిని చేసేది. కొన్ని సార్లు ఊరకే అలా నిలబడి ఉండిపోయేవాడు. తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ, కవితా పాదాల్లాంటివి ఉచ్చరించుకుంటూ ఉండేవాడు. బొత్తిగా బాహ్య స్పృహ కోల్పోతున్నట్టుగా ఉండేది. ఉండిఉండి షాపుకెళ్ళడం మానేసాడు. ఎవరైనా పలకరిస్తే పలికేది. లేకుంటే లేదు.

ఇదంతా తనకి తెలుస్తూనే ఉండేది. తన చుట్టూ ఉండే వాళ్ళతో తను విడివడిపోతున్నట్టుగా, తను ఒక్కడే ఏదో సుదీర్ఘమైన ప్రయాణంలో పడి పోతున్నట్టుగా అనుకుంటుండేవాడు. ఇవన్నీ – అతనికి – చెప్పాలని ఉంటుంది తనకి.

 బయట అంతా సద్దు మణుగుతూ ఉంది. ఎప్పుడు పడుకునిందో గానీ రోజువారీ బండ చాకిరి అలసటతో ఆమె పాప పక్కన పడుకొని సన్నగా గురక పెడుతూ నిద్రపోతూ ఉంది. తను కూడా కళ్ళు నులుముకుంటూ, అతడు వొస్తే బాగుండునని అనుకున్నాడు.

5

“ఊం.. ఏమిటి సంగతులు” – అంటున్నాడు, అతను. ఏవేవో చెబుతూ, గంభీరంగా ఏదో అంటున్నాడు. మాటల మధ్యలో వోడ్కా తీసి గ్లాసులు తీసుకరమ్మన్నట్టుగా సైగ చేసాడు. పడుకున్న వాళ్ళు లేవకుండా, నెమ్మదిగా వంటగదిలోకెళ్ళి గ్లాసులు, నీళ్ళూ తీసుకొచ్చాడు తను. ఇద్దరూ మాట్లాడుకుంటూ నెమ్మదిగా తాగుతున్నారు. మొదటి సారయితే, వోడ్కాని చూడగానే “ఇదా?” – అన్నాడు తను.

“ఏం ఎప్పుడూ తాగలేదా?”
“లేదు”
“రష్యన్ నవలలూ, అవీ చదివానంటావ్, ఇది తెలియదా నీకు?”

అప్పటి నుంచీ అతను వోడ్కా మాత్రమే తెస్తుండే వాడు. తను దానికి అభ్యంతర పెట్టలేదు.
మాటలు సాగుతున్నాయి. పగలబడి నవ్వుతున్నాడు తను. రాళ్ళలాంటి మాటలు కరిగి అప్పుడప్పుడూ కను కొలుకుల్లో తడి పువ్వులవుతున్నాయి. అంతా కరిగి ప్రవహిస్తున్నట్టుగా ఉంది. ఆ మాటల మధ్యలో – అతను – మత్తుగా నిద్రలో పడిపోయాడు. దుప్పటి కప్పి, తనూ, అతని పక్కనే పడుకున్నాడు.
సగం నిద్రకాడ దుప్పటి కోసం వెతుకుతుంటే తనకి తడి తగిలింది. అతని వైపు నుండి అది చిన్న మడుగులాగా పక్క గుడ్డలన్నిటినీ తడిపి, వాకిలి వైపుకు పోతావుంది. చేసేదేం లేక జరిగి కాస్త ఎడంగా పడుకున్నాడు.

6

 తెల్లారి ఆమె అరుపులకు తనకి అకస్మాత్తుగా మెలకువొచ్చింది.

“ఇప్పటిదాకా పిల్లనే భరించలేక చస్తున్నాను. ఇప్పుడు నువ్వూ మొదలు పెట్టావా ఉచ్చ పొయ్యడం. కంపుకి భరించలేక చస్తున్నాను. ముందా పక్క గుడ్డల్ని మిద్దె మీద ఎండలో ఆరేసి రాపో” – అంటోంది.

దిగ్గున లేచి చూసుకుంటే పక్కన ఎవరూ లేరు.

ఈ సంగతి ఎవరికన్నా తెలుస్తుందేమోన్న కంగారులో గబగబా పక్క గుడ్డల్ని తీసుకొని పైకి పరిగెత్తాడు తను.

*

13, మార్చి 2015, శుక్రవారం

ఈ వెన్నెల సదా ఇలాగే వర్షించును గాక



దూరంగా ఎక్కడో
వెలిసిపోతున్న రంగు దీపాలకావల

పాదాల కింద నెమ్మదిగా కదిలి
అడుగుల ముద్దరయ్యే మట్టి అలల మీద

కాళ్ళ చుట్టూ పసిదానిలా పారాడుతూ
 నేలంతా లేలేత వెన్నెల
 
      1
పరవాలేదు
మనం ఇంకా బతికే ఉన్నాం
     
ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆకులు రాల్చుకొంటూ
కొత్త చివురుల కోసం
ఒక్కొటొక్కటిగా సిద్ధమవుతున్న చెట్టుకొమ్మల  నీడల కింద నిలబడి


నెమ్మదిగా తల  పైకెత్తి చూసినప్పుడు
ఆకాశంలో అంతటా పరుచుకున్న నునులేత కాంతి
     2
పరవాలేదు
ఇంకా మనం బతికే ఉన్నాం

దిగంతాల జలతారు కదలికల మీద
పారాడే చుక్కల మిణుగురులను లెక్క పెట్టుకుంటూ

ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకోవచ్చు

      3

తిరిగి వస్తున్న దారిలో
రోడ్డు పక్కన కతవా మీద

పక్కనే ఓ  నీళ్ళబుడ్డీ పెట్టుకొని
ఏనాటిదో పాత టిపినీలో తన చేతిని ముంచి
అన్నం ముద్దగా చేసుకొని
నెమ్మదిగా ఎవరో దిమ్మరి ఆరగిస్తున్నప్పుడు

తన ఐదు వేళ్ళకూ అంటుకున్న ఆ మెత్తటి తడి
 అచ్చం ఈ వెన్నెలలాగే ఉంది

4
పరవాలేదు
మనం ఇంకా బతికే ఉన్నాం

మిగిలి ఉన్న రోజుల పుటల మీద
అలవాటుగా కొంచెం నాలుక తడిని వేలి కొసలకద్దుకొని
పక్క పేజీలోనికి ప్రవేశించడానికి

31, జనవరి 2015, శనివారం

ముద్ద


   
1

తన తోకను తానే తింటూ ఉంటాయి పాములు

చుట్టలు చుట్టలుగా సున్నాలు సున్నాలుగా



రోజులకు అవల పాడుతోన్న గొంతుకతో

ముడతలు దేలిన దేహపు ఒకలాంటి వాసనతో జేజి అంటోంది కదా

కాలచక్రమిది నాయనా తిరిగి తిరిగి వచ్చు మలిగిన ఎముకల లోకపు ఊపిరి దారుల

కొత్తగ చక్ర గతిని –


2

బొత్తిగా చదువన్నదే లేని సాధారణ స్త్రీ



ఏళ్ళ తరబడి శ్రమలో కొద్ది కొద్దిగా నడుం వంగుతూ

ఒక ఆవిరిలాగా  ఆవరణంలో కలగలిసి తను తిరిగిన ఊళ్ళూ, తన పాదాల కింద

పచ్చబారి పండి ఒరిగిన నేల, స్తన్యంలోని సారంలా బొట్లుబొట్లుగా శరీరం

నుండి   ఎదిగి విస్తరించిన ఆమె సంతానం-అంతా ఒక ఙ్ఞాపకంలా నెమ్మది

నెమ్మదిగా  కరుగుతున్న నేపథ్యం

తను పాడుకున్న పాటలాగా తనను దాటి ఒంటరిగా సుదూరాలకు  విశ్వ అవనికపై

ఒక్కడినై తిరుగుతుంటాను



పయనిస్తున్న దారిలో చేరాల్సిన చోటును మరచిన తడబాటులాగా

నిశ్చేష్టత ముప్పిరిగొని కాసేపు ఊరికే అలా వొట్టిగా నిలుచుంటాను



స్థల కాలాల కొలమానాల వెలుతురులో నన్నూ నా చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ

కొలిచి లెక్కలుగట్టి మరీ ఇచ్చినదెవరా అని తేరిపార పసి పిల్లవాడికళ్ళతో

సంభ్రమగా చూసుకుంటాను


3

ఈ లోకం ఒక ముద్ద

జీవితపు తొట్టతొలి ఉనికి కదలబారి

తొణకిసలాడుతూ తన కొసల చివర మృత్యువును రాసుకొని తిరిగి తనలోకే ముడుచుకుంది



ఈ రోజు కురిసిన చావు నిజంగా ఈరోజుదేనా అని అనుమానం కలిగించేలా

ఎప్పటిదో ఆ మేఘం ఒక తండ్రి దుఃఖంలాగా ఇవాళ కూడా అదేమాదిరిగా ఆవరించి ఆకాశమయి ఉంది



అతి దగ్గర నుంచి గురిచూసి కాల్చిన తల, బయొనెట్ పదునంచుకొసలపై దూసిన గడ్డి పూవు



ఉండి ఉండి వీస్తున్న ఇప్పటి గాలిలో అదే అనాది ప్రాణం మెసలిన చప్పుడు



నడుస్తున్న దారికి వేలాడుతున్న శిలువలా  అంతా ఒక్కలా అలుముకపోయి మేకులు

దిగుతున్నప్పటి  శరీరపు జలదరింపు


4

తరుచూ చప్పున పేర్లు  గుర్తుకు రానట్టుగానే

ఈ రోజేమిటని ఎవరన్నా అడిగినపుడు కూడా అంతా అయోమయమే ఎప్పుడూ నాకు



మరచి పోవడంలోని కాలిక స్పృహను మాత్రమే గొంతుకు బిగించి ఉంచి

ప్రాణం కొడిగట్టుకపోయేలా అంతా ముద్దలా అలుముక పోవును గాకాయని

ఎవరో నన్ను బహు కక్షగా  శపించారు



ఇక ఎప్పటికయినా నేను ఇలా మాత్రమే రాయగలను-



“అతడు రేపు చనిపోయాడు”

“నేను నిన్న ఒక్కడినై తిరుగుతాను”

22, జనవరి 2015, గురువారం

కుక్క అంటే ఏమిటి?






1

ఈ నడుమ మా చిన్ని పాప తరుచూ ప్రతీ దానికీ కుక్క అనే పదాన్ని చేరుస్తుంది

మూడేళ్ళ పిల్ల, బొత్తిగా భాషాపాటవం తెలియనిది

ఇప్పుడిప్పుడే బడికి పోతూనో (హతవిధీ) పోబోతూనో

పోలేకనో, పోకుండా ఉండలేకనో ( దాని చేతుల్లో ఏముంది ) కింద పడి దొర్లి, కాళ్ళూ చేతులను నునుపాటి గట్టి గ్రానైట్ బండ మీద

ఇష్టారాజ్యంగా తపతపా విదిలించి కొడుతూ ఎక్కడ దెబ్బ తగులుతుందేమోనని గుండెలదరింపజేస్తూ

తన రోజు వారీ మాటల సమయాలలో అంటుంది కదా-

ఎక్కడికి పోయినావే కుక్కా, కుక్క నాకొడకా-

"ఇంక ఏమి తింటవ్ తల్లీ?"

కుక్క తింట-

"ఇట్లయితే ఎట్లనే?"

కుక్కనే-

2

ఇంతకూ కుక్కా అనేది ఏ భాషావిశేషం?


పదే పదే మాటల తొక్కిసలాటలలో ఇరుక్కపోయిన భాషా క్రీడగానో, క్రీడించే సమయాలోకి సంభాషణగా కరిగే భాషగానో

మాటలుగా, వాక్యాలుగా అర్థాలు చెదిరి, అర్థాలతో పాటుగా సన్నివేశమూ అందలి పాత్రలూ చెదిరి

ఎటూ పొసగనీ లేదా ఇమడని ఉధ్విగ్నతలలోనికి పొగమంచుగా పాకి

విఫల యత్నమై బ్రహ్మ రంద్రాన్నిపగలగొట్టుకొని శూన్యంలోనికి పెగిలే నిట్టూర్పులా ప్రయత్నిస్తున్నపుడు


మనుషుల రణగొణ ధ్వనులలో మాటల బండరాళ్ళపై పడి

నాకూ కాళ్ళూ చేతుల్ని టపటపా కొట్టుకోవాలనిపిస్తుంది


కుక్క మాటలు

కుక్క సంభాషణలు

కుక్క కవిత్వమూ అని రాయాలనిపిస్తుంది

18, జనవరి 2015, ఆదివారం

ఇది ఎప్పుడో ఇంతకు క్రితమే జరిగింది



ఇది ఇప్పుడు జరిగినది కాదు

మనం మన పడక గదుల్లో పిల్లలతో పాటుగా లోకంలో ఉన్న సిలబస్ సమస్తాన్నీ
తిరగేసి మరగేసి కుస్తీపడుతున్నప్పుడు

మనలాగే ప్రపంచమూ, కలలకూ భవిష్యత్తుకూ  కొత్త అర్థాలు తొడుక్కుంటున్నప్పుడు

తుపాకీ కొసల మీద అలుముకుంటున్న ఆకాశపు ఉనికిలా
ఇది ఎప్పుడో ఇంతకు క్రితమే  జరిగింది



ఇది ఇప్పుడు జరిగినది కాదు

బతుకును ఓ  పోటీలా నిర్వచించుకొని
దరిదాపులకు ఎవ్వరూ రానివ్వకుండా చుట్టూ గోడలు కట్టుకొని సాగుతున్నప్పుడు

మనలాగే ఈ లోకమూ ట్రాఫిక్‍లో ఇరుక్కపోయిన స్వప్నంలా ఊపిరాడక అటు ఇటూ మెసలుతున్నప్పుడు

విలువల పదునంచు చివరల వేలాడుతున్న  భూగోళం పువ్వులా
ఇది ఎప్పుడో ఇంతకు క్రితమే జరిగింది


ఇది ఇప్పుడు జరిగినది కాదు

ఒక సంఘటనగా మన కాలంలోనికి చొరబడి
పుస్తకపు పేజీలలో దాచి ఉంచిన నెమలికన్నుల వెంట నెత్తురు వరదలై పోటెత్తి హద్దులను ఊడ్చుకపోతున్నప్పుడు

మనలాగే ఈ చుట్టూ ఉన్న సమస్తమూ దీనినొక నిశ్చితమైన వ్యాఖ్యానాన్ని సిద్ధం చేసుకొని సమాధాన పడుతున్నప్పుడు

తనను తాను పెకలించుకొని తన వేళ్లను చూపెడుతున్న చెట్టు తల్లిలా
ఇది ఎప్పుడో ఇంతకు క్రితమే జరిగింది