26, మే 2016, గురువారం

సూఫీ నెచ్చెలి రాబియా

సూఫీ నెచ్చెలి రాబియా రాబియా ఒకసారి ఒక చేత నిప్పునూ, మరో చేత నీటినీ పట్టుకొని బజారులో పరిగెడుతున్నదట. నరకంలోని నిప్పును నీటితో ఆర్పుతాననీ, ఆనందంతో ఓలలాడే స్వర్గాన్ని నిప్పుతో దహించి వేస్తాననీ కేకలు వేస్తున్నదట. భగవంతుని పట్ల నిజమైన భక్తితో కాక స్వర్గం పట్ల ఆశతోనో, నరకం పట్ల భయంతోనో దేవుని చెంతకు చేరే వారిపై ఆమె ఆగ్రహ ప్రతిస్పందన అది. అందుకే ఆమె ఇలా అంటుంది. “ప్రభూ , నరకమనే భయంతో నిన్ను ఆరాధించినట్లయితే నన్ను ఆ నరకపు జ్వాలలోనే పడవేయి. స్వర్గపు ఆశతో నిన్ను మ్రొక్కితే , దాని నుండీ నన్ను మినహాయించు కేవలం నీ కొరకే నిన్ను ఆరాధించినట్లయితే మాత్రం ఆద్యంత రహితమైన నీ సౌందర్యదీపం నుండీ నన్ను దూరం చేయకు” ఈ మాటలు మనకు యధాతథంగా రవీంద్రుని గీతాంజలిని గుర్తుకు చేస్తాయి. రాబియా వ్యక్తీకరణ మన అక్కమహాదేవినీ, మీరాని గుర్తుకు తెస్తాయి. రాబియా ఎనిమిదవ శతాబ్ధపు ఇస్లాం ధార్మిక వేత్త. తొలి తరం సూఫీలలో పేరుపొందిన వ్యక్తి. స్త్రీగానూ, అట్టడుగు జీవితపు ప్రతినిధిగానూ ఆమెది ఆశ్చర్యానికి లోను చేసే వ్యక్తీకరణ. తన కాలంలో ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నందువల్లనే ఆమె ప్రజల ఙ్ఞాపకాలలో అద్భుతం, వాస్తవం కలగలిసిన వ్యక్తి అయింది. రాబియా అంటే నాలుగవది అని అర్థమట. ఆమె పుట్టినప్పుడు ఆమె తండ్రి, నవజాత శిశూవుకు కల్పించవలిసిన కనీస వసతులు కూడా కల్పించలేక బోరున విలపించాడట. అప్పుడు మహ్మద్ ప్రవక్త ఆయనకు కలలో కనిపించి ఆమె గొప్ప వ్యక్తి ఆవుతుందని, గొప్ప మార్గదర్శిగా ఎదుగుతుందనీ చెబుతాడట. బాల్యంలోనే తల్లితండ్రులను కోల్పోయి తీవ్రమైన కరువులో, ఆమె పుట్టిన ఊరు బస్రా నుండీ మరో ప్రాంతానికి వలస పోతున్నప్పుడు కొందరు దోపిడీ దొంగలు ఆమెను అపహరించి, ఒక సంపన్నునికి బానిసగా అమ్ముతారట. ఒక వైపు యజమాని చెప్పిన పనులను చేస్తూనే, తీరుబాటుగా ఉన్న రాత్రి సమయాలలో ఆమె భగవత్ ధ్యానాన్నీ, ఉపవాసాలనూ, తీవ్రమైన నియమ నిష్టలనూ పాటించేదట. తన బానిస తీరుబాటు సమయాలలో చేసే పనులను చాటుగా గమనించదలుదుకున్న యజమానికి ఆమె ఒకసారి జ్వాజ్వాల్యమైన ముఖవర్చస్సుతో, అద్భుతమైన కాంతివలయాలతో గోచరమైనదట. ఈ సంఘటనతో భయకంపితుడైన యజమాని ఆమెకు తక్షణం స్వేచ్చనిచ్చి అక్కడ నుంచీ పంపి వేస్తాడట. ఇది ఆమె జీవితానికి సంబంధించిన అద్భుత గాధ. వాస్తవానికీ, కల్పనకూ మధ్య దూరాన్ని చెరిపేసే ఇలాంటి కథనాలతో తన గురువులకు కూడా ఈర్ష్య కలిగించేలా, ఆమె సూఫీలలో అగ్రశ్రేణికెక్కింది. దేశాన్నీ, జాతినీ, మతాన్నీ, దేవుడినీ మెజారిటి ప్రజానీకానికి వ్యతిరేకంగా నిలబెట్టిన మన వర్తమానం నుంచీ రాబియానీ, ఆమె ఎన్నుకున్న సూఫీ మతాన్నీ చదువుతున్నప్పుడు సాంస్కృతిక బాహుళ్యానికి చోటునిచ్చిన వివిధ ధోరణులనూ, మతవిశ్వాసాలనూ కళ్ళకద్దుకోవాలనిపిస్తుంది. రాబియా జీవితం, ఆమె ఆచరణ, కవిత్వం- ఇస్లాం తొలినాళ్ళ సమానత్వాన్ని మళ్ళీ ఉనికిలోకి తేవడానికి ప్రయత్నించిన సూఫీయిజంతోనూ, స్త్రీగా తన కాలపు కుటుంబ సంబంధాల అసమానతలతోనూ ముడిపడి ఉంది. ఎనిమిదవ శతాబ్ధి నాటికి ఇస్లాం ప్రాభల్య ప్రాంతాలలోని పాలక వర్గాలలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, భోగలాలసత పెచ్చుపెరిగాయి. ప్రజల మధ్య అసమానతలు పెరిగి ఇస్లాం మూల సూత్రాలకే తావు లేకుండా పోయింది. ఇలాంటి సామాజిక రాజకీయ పరిస్థితులకు మత సాంస్కృతిక రూపంలో ముందుకొచ్చిన ప్రతిస్పందనే సూఫీయిజం. సూఫీ తాత్వికతను, చాలా మంది “హిందూ” ఉపనిషత్, వేదాంతప్రభావాలతో ముడి వేయడానికి ప్రయత్నిస్తారు. ఇది అంత నిజం కాదు. దీనికి తోడుగా సూఫీయిజాన్ని ఇస్లాంకు దూరంగా చూసే ధోరణులు కూడా ఉన్నాయి. సూఫీయిజాన్ని ఇస్లాం, “హిందూ” మత తాత్వికతలకు కట్టిన అంటుగా భావించడం ఆధిపత్య వైఖరే అవుతుంది. ఇస్లాంలో సూఫీ ధోరణులు ఉనికిలోకి రాక మునుపే మధ్య ఆసియా ప్రాంతం జొరాష్ట్రియన్, క్రైస్తవ, యూదు, ఇస్లామ్, బౌద్ధం, ఉపనిషత్, వేదాంత ధోరణులకు సంగమ స్థలిగా ఉండేది. ఈ భావ సంగమం అటునుండీ ఇటూ, ఇటు నుండీ అటూ అలల మాదిరిగా నిరాఘాటంగా ప్రయాణించేది. ఇలాంటి విభిన్న భావజాల సంగమ నేపథ్యం ఆ కాలపు సామాజిక రాజకియ పరిస్థితులకు తొడై సూఫీ తత్వానికి కారణమయింది. అంతే కాని సూఫీయిజం ఏ ఒక్క మతానికో మరో మతాన్ని అంటుకట్టడం వల్ల ఉనికిలోకి వచ్చింది కాదు. సూఫీయిజంలోని మార్మిక ధోరణులను “హిందూ” తత్వంతో ముడిపెట్టే ధోరణులలాగానే, రాబియా జీవితంపై పుస్తకాన్ని రాసిన మార్గరెట్ స్మిత్ కూడా సూఫీయిజంలోని నిరపేక్షమైన భక్తి భావనని, సమర్పణని క్రైస్తవానికి ముడిపెట్టింది. భావాలు ఉనికిలోకి రావడం వెనుక ఉన్న ఆదానప్రధానాలను, సంఘర్షణలను పరిగణనలోకి తీసుకోని ఇలాంటి అచారిత్రక ధోరణులకు కారణం ఆధిపత్యభావజాలమే. సూఫీయిజం అనేక సుదూర ప్రాంతాలకు పరివ్యాపితమైనప్పటికీ, భారత దేశంలో కాలక్రమేణా అనేక రకాలపంథాలుగా, ఇస్లాంకు విపరీతమని అనిపించే అనేక రకాల పద్ధతులకు తావిచ్చినప్పటికీ అది తనను తాను ఎప్పుడూ ఇస్లాంకు దూరంగా ప్రకటించుకోలేదు. విమర్శకులు ఎన్ని విధాలుగా దానిని తన తల్లివేరు నుండి విడదీసి చూడదలుచుకున్నప్పటికీ సూఫి తాత్వికులు తమను తాము భగవంతునికి, ఖురాన్‍కు విధేయులుగానే ప్రకటించుకుంటున్నారు. సూఫీయిజంలోని ప్రతీ పంథా తమ మూలపురుషుల (పీర్లు) మూలాలను ప్రవక్తలోనే చూసుకుంటున్నారు. ఇది సూఫీయిజం ఉనికిలోకి వచ్చినప్పటి నుండీ ఇటీవలి కాలం వరకూ ప్రతీ సూఫీ అన్నింటికన్నా ముందుగా విధిగా నిర్వహిస్తున్న పని. అయితే దీన్ని మత ధార్మికతలోని వివాదాలకు సంబంధించిన చర్చలో భాగంగా కాకుండా, తనలోని మౌలికాంశాలను అట్టే ఉంచుకొని, తను వ్యాపించినంత మేరా స్థలకాలాలకు అనుగుణంగా సూఫీయిజం అవలంభించిన స్థానికానుకూలతగా దీన్ని భావించవలసి ఉంటుంది. ఇటువంటి అనుకూలతను దాని తాత్వికతలో భాగం చేసుకున్నందువల్లనే అది వ్యవస్థీకృత మతాల వలే కాకుండా సామరస్యానికి, ఇచ్చి పుచ్చుకునే ధోరణులతో కూడిన బహుళత్వానికి నిరంతరంగా చోటు ఇవ్వగలిగింది. అందుకే సూఫీ రాబియా ఇలా అనగలిగింది. “ఎక్కడ నేను మోకరిల్లుతానో అక్కడ నా ఆత్మలో ఓ గుడి, ఒక దర్గా, మసీదు, చర్చి ఉంటాయి.” సూఫీగానే కాకుండా ఒక స్త్రీగా ఆమె భగవంతుని సంబోధించే విధానం, తనతో ఆమె ఏర్పరుచుకునే సంబంధం సూఫీలలోనే మకుటాయమైన స్థానం ఏర్పరిచింది. సూఫీలు భగవంతునితో సాన్నిహిత్యాన్ని, అవిభాజ్యమైన స్థానాన్నీ కోరుకుంటారు. కానీ ఆమె ఆయనను ప్రియునిగా సంబోధిస్తుంది. భగవంతునితో దివ్యమైన ప్రేమ బంధాన్ని ఏర్పరుచుకుంటుంది. ఆమె ఇలా అంటుంది. “నేను నిన్ను రెండు రకాలుగా ప్రేమించాను ఒకటి స్వార్థంతో మరొకటి నీకు సరితూగేటంటంతగా మొదటి దానిననుసరించి మిగిలిన వారందరినీ తొలగదోసి నేను నిన్ను ఆక్రమించాను మరో దానిప్రకారం నా మేలిముసుగును నీవు పైకెత్తుతుండగా నేను నిన్ను చూసాను రెంటిలోనూ ఘనత నాదికాదు ఏ ఒక్క దానికైనా నిజమైన ఘనత నీకే చెందాలి” ****** “ప్రేమలో హృదయాల నడుమ ఇక ఏమీ ఉండదు కోరికల నుండి మాటలు పుడతాయి చవి చూసిన వారికి మాత్రమే నిజమైన రుచి తెలుస్తుంది వివరించే వ్యక్తి అబద్ధాలనే చెప్పగలడు నీవు ఎవరి ముందర అస్పష్టమవుతుంటావో ఎవ్వరిలో నీవు ఇంకనూ ఉనికియై ఉంటావో నీ గమ్యపు గురుతుగా సదా ఎవరు నిలిచి ఉంటారో అలాంటి నిజమైన వానిని మరింకే దాని నుండో నీవు ఎలా విడదీసి చెప్పగలవు ?” **** కన్నులు సోలుతున్నాయి నక్షత్రాలు మణుగుతున్నాయి గూళ్ళలోని కువకువలూ , కడలిలోని అతికాయులూ జోగుతున్నారు మార్పు లేకుండడమన్నది తెలిసిన వాడివి నీవొక్కడివే అటూ ఇటూ వొంగడమన్నదే ఎరుగని సమతుల్యత ఇసుమంత దూరమూ జరగని ఆద్యంతరహితమూ నీవే కావలి వాండ్ల పహరాల వెనుక కామందుల తలుపులగడియలు బిగించి ఉన్నవి నిన్ను తలచే వారి కోసం నీ తలుపులొక్కటే తెరచి ఉన్నాయి ప్రభూ ప్రతీ ప్రేమా తన ప్రియునితో ఏకాంతత నొంది యున్నది నేను మాత్రం నీతో ఏకాంతంగా ఉన్నాను ” ***** ఇస్లాం విస్తరించినంత మేరా దాని అభివృద్ధిలో పురుషులతో పాటుగా అనేక మంది స్త్రీలు కూడా పాలు పంచుకున్నారు. ఒక్క మధ్య ప్రాచ్యంలోనే వీరి సంఖ్య మత ధార్మిక వేత్తలుగా ఇంకా వివిధ స్థాయిలలో ప్రభావ శీలమైన వ్యక్తులుగా వేలలో ఉండాలని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ వారి సంఖ్య చరిత్ర గ్రంథాలలో నూ , ఎన్సైక్లోపీడియాలలోనూ చాలా తక్కువగా ఉంది. ఈ వివక్ష సూఫీలలో కూడా ఉన్నప్పటికీ వ్యవస్థీకృత ఇస్లాంతో పోల్చితే ఈ సంఖ్య మెరుగుగానే ఉన్నదని చరిత్రకారులు అంటున్నారు. అయితే ఇలాంటి విచక్షణలలోనూ స్మృతీ-విస్మృతుల ప్రభావాలకావల రాబియా వ్యక్తిత్వం సమున్నతంగా నిలబడి ఉంది. తొలినాళ్ళ సూఫీలు తమకాలపు అసమానతలపై మతతాత్వికతను దన్నుగా చేసుకొని తిరుగుబాటు చేస్తే, స్త్రీ సూఫీగా రాబియా తనకాలపు కుటుంబ వ్యవస్థపై తరుగుబాటు చేసింది. సాధారణ పరిస్థితులలోనే స్త్రీల పరిస్థితి కింది స్థాయిలో ఉంటుంది. సామాజికంగా దిగజారిన సందర్భాలలో స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులనుండే రాబియా తన వ్యక్తీకరణలో సంచలానాత్మకంగా కుటుంబ వ్యవస్థను తృణికరించింది. తన జీవిత కాలమంతటా ఒక్కతిగానే జీవించి, తనకు సరియైన సహచరుడు భగవంతుడు తప్ప మరొకరు కాదని ప్రకటించింది. సరిగ్గా ఇలాంటి ధిక్కారాన్ని మనం ఇక్కడ అక్క మహాదేవీ, మీరా వంటి వారిలో మనం చూస్తాం. ఆ తర్వాత ఇలాంటి ధోరణి మన వద్ద మధురభక్తి పేరుతో లింగ బేధాలను దాటి వ్యాపితమైనా దాని అసలైన వాడిని భక్తి ఉధ్యమ కాలపు స్త్రీల నుండే మనం చవి చూస్తాం. దేవుడొక్కడే అన్న భావనకు , భక్తి ఉద్యమం ప్రతిపాదించిన సమానతలకు ఇస్లాం, సూఫీయిజాలు బలమైన సైద్ధాంతిక ప్రభావాలుగా మన మీద ముద్ర వేసాయి. వీటన్నింటినీ కలగలుపుకొని కుటుంబ వ్యవస్థపై తమ ధిక్కారాన్ని తృణీకారంగా ప్రకటించిన ధోరణులకు మాతృక గా మనకు రాబియా కనిపిస్తుంది.