19, డిసెంబర్ 2017, మంగళవారం

బూడిద రంగు దుఃఖం






చేయిచాచిన వొణుకు తన దేహం కావొచ్చు

శరీరంలో నిప్పుకణికలు దాచుకొని కనలి కనలి కాలి
అరిగిన తన అరచేతుల గీతలలాగే
చివరికి పొగధూళిలా  కదలి  ఆమె ఆకాశమై సాగిపోవచ్చు

నలభైల వయసు తన ముందటివాళ్ళ అనేక మరణాలను చూడడానికే కదా సదా సిద్దపడాలి

వాళ్ళు ఒకనాటికి  మరణిస్తారని నిక్కచ్చిగా రాయవొచ్చుకానీ

పదేపదే ధారగా సాగే పలవరింతలాంటి సంభాషణలను
వినేందుకొక మనిషంటూ లేని
బొగిలిపోయి కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్న
నిట్టాడి గుంజలాంటి నిశ్శబ్ధాన్ని మాత్రం ఎప్పటికీ ఊహించలేము

ఏదైనా మాటాడడం, మాటలమధ్యన మనుషులను అనేక చరిత్రలుగా నిటారున నిలబెట్టడం
బహుశా ఆడవాళ్ళకు తెలిసినంతగా మరెవరికీ  తెలియకపోవొచ్చు

ఎటూ కదలికలు లేక చుట్టూ దడికట్టుకపోయేలా పెరిగిన పిచ్చిమొక్కల వంటి జాములలో 
ఎవరు రాక ముసురుకపోయిన ఇలాంటి మధ్యాహ్నపు వేళలలో
అటు ఆకలీ కాక ఇటూ నిద్దురా రాక
పక్కటెముకలలో పొడుచుకవచ్చే నొప్పిలాంటి గ్నాపకాలలో

ఆమె ఒక్కతీ-

ఊరకే అలా పడుకుని ఉన్నానని బదులు చెపుతున్నప్పుడు
కడుపులో చేయిపెట్టి దేవిన కదలికల రంపపు పళ్ళ రాపిడి


వాళ్ళు ఒకనాటికి మరణిస్తారని నిక్కచ్చిగా రాయవొచ్చుకానీ

నిస్సహాయమవుతున్న దేహపు భాగాలతో
తమను తాము పేని  కొండకొమ్మున  వేలాడే తేనెపట్టు లాంటి- నేనును
అందుకోజాలని అతి పలుచని గాద్గదతను మాత్రం - 




2, డిసెంబర్ 2017, శనివారం

విలుప్తం



రె
ప్పలగోడలను తొలుచుకొని
ఎవరో లోపలకు వొచ్చినపుడు తడి వెలుతురు వొకింతైనా లేని
గది కన్నులకు చెవులు లేవు


అది వొట్టి మూగది


నలు చదరాల నిటారు ముంగాళ్ళపై
కూర్చున్నది కూర్చున్నట్టుగానే
కుళ్ళిన జంతు కళేబరంలా
అది ఎప్పుడో చచ్చిపోయింది


అటూ ఇటూ చాచుకొని
విచ్చుకున్న నాళికా సముదాయపు గహనాంతరాల మూలల్లో
జుమ్మురుమని నురగలుకక్కే చీకటి జిగట


వెలుతురు తీగలను మీటి
మిణుగురు రెక్కలను విదిల్చే
జీవులు ఇక్కడ అంతరించి పోయాయి


ఇప్పటికిది
అలికిడులకు మెలకువలు వొదిలి
వొంటికి కాసిన్ని ఇటుకలూ, సున్నమూ గీసుకొని
కుట్టుకొన్న సంస్పందనారహిత్య ఛద్మద్వారం


http://vaakili.com/patrika/?p=15400

9, అక్టోబర్ 2017, సోమవారం

ఒక్కటే

దానిలోనే లేదా దానిగానే ఉండడం


విడివడనిదేదో దుఃఖపు పోగులుగా పేనుతూ పోవడం


గాద్గదత శరీరమయినప్పుడు పొలమారినదంతా ఇక నీ మాట


మరరణం సన్నిధిన గొంతుక కూర్చొని తన తడి చేతులతో పుణుకుతున్నపుడు కలుస్తూ 
విడిపోతూ కన్నీటి చారికల దారి


ఇంకాసిన్ని అక్షరాల చితుకులతో చలి కాచుకుంటున్న చేతులపై విచ్చిపోతూ కొన్ని వీడ్కోలు ముద్దులు


మాటలు పిగిలిపోయి పర్రున హృదయం జారిపోతున్నపుడు భయంబరువుగా తొణకిసలాడే జీవితపు నిండుకుండ


ఇంకా ఎప్పుడైనా ఒకసారి తిరిగి కలుసుకునేందుకుగాను కాలాలకావల గురుతుగా పేర్చుకొన్న రహస్యపు చోటు


చివరాఖరుగా ఇంకా ఎప్పుడైనా ఏదైనా చెప్పుకోవలసి వస్తే చేయెత్తి చూపించవలసిన దేహపు గూడు


చెరిపేసుకోవడమొక్కటే నిక్కమని తెలిసాక బహుశా ఇదే ఇక చివరి మజిలీ