23, ఫిబ్రవరి 2013, శనివారం

నగరానికి ప్రయాణం




నగరానికి అతను బయలు దేరి వెళుతున్నప్పుడు తన భార్య, తల్లి అనేకమార్లు పదే పదే ఒక ప్రాధేయ పూర్వకమైన స్వరంతో  వెళ్ళకతప్పదా అని బతిమాలుతున్నప్పుడు  నిశ్చయంగా తను "అవును" అని అంటాడు

దారిలో  జరిగి పోయిన సంఘటనలను ఒక్కొక్కదానిని  పేగులను బయటకు తీసినట్టుగా  ఒకింత నిట్టూర్పుతో  నిదుర పోని  ఆ రాత్రిలో నిశ్చిత స్థితితోనే  అయినా ఎక్కడో గుబులు గొలిపే గగుర్పాటు స్పర్శతో తనకు మాత్రమే తెలిసే ఒక నొప్పితో అతడు పదే పదే పరికిస్తాడు

అతనిది వరమో శాపమో  ఎవరమూ ఒక్క మాటతో చెప్పలేము

కలను మెలకువనూ దాటి ఒక దానిలోంచి మరొక దానిలోనికి జారి  చాలా సార్లు తనతో తానే చావు వాసనను భవిష్య వాణిగా చెప్పుకొనేవాడు

 అతను ఆ వ్యక్తులను లేదా సంఘటనలను తన స్మృతి జాలకంలో చిక్కులు పడిన ఒక్కో పొరనూ తరచిచూసి
కల వాస్తవికతల నడుమ చెరిగి పోతున్న సరిహద్దులలో నిలబడి దారితప్పి తడబడుతూ తను ఎక్కడ ఉన్నదీ ఆట్టే పోల్చుకోలేకపోయేవాడు

ఒక సారి ఇది కల అనేవాడు
ఇంకొక సారి ఎక్కడో అదాటు పడిన సంఘటనగా తలఫోసి  ఙ్ఞాపకాల పుటలలో వెర్రిగా వెతికే వాడు

ఒకోసారి నిలబడిన చోటును తట్టి లేపుతూ ఇదిగో ఇక్కడే రెండు హత్యలు
ఒకదానొకొకటి  వ్యతిరేకంగా ప్రతీకారంగా జరిగాయి నీకు తెలుసా అనేవాడు
ముఖాలలో మాటలలో కదులుతున్న దేహాలలో సంసారాలలో చదువులలో పిల్లలలో వర్ధిలుతున్న కుటుంబాలలో పిగులుతున్న చావును ఇదిగో ఇదే ఇదే అని మొరపెట్టుకునే వాడు

తనను  వెర్రివానిగానో దారుల వెంట వ్యామోహంతో తిరుగుతున్న దిమ్మరిగానో పిలిచినప్పుడు, తను వాళ్ళకు మీరు రాజ్యమనే మాటను తెలుసుకోలేక పోతే మరేమీ తెలుసుకోలేరు అని చెప్పాలనుకునే వాడు

చాలా రోజుల తర్వాత అతను నగరానికి బయలుదేరి ఒకకలలోకో వాస్తంలోకో తెలియక  జారి పడి పోతూ కిక్కిరిసిన కదిలే  రైలులో ఎక్కడకు పోతున్నామో తెలియని జనం  కాళ్ళ మధ్యన కక్కాసు సందులలో ఎక్కడన్నా పేపరు పరుచుకొని పడుకోవడానికి లేదా కనీసం కూర్చోడానికి చోటు వెతుకుతూ -




15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

పాతనేరస్తుడు




గుర్తుందా నీకు

మోకాళ్ళ వరకూ మట్టి కొట్టుకపోయిన కాళ్ళతో గొంతు కూర్చొని ఉన్న వసివాడని పిల్లల నడుమ దిస మొలతో
అర చేతులలో లావు పాటి లాఠీలు విరిగి తునాతునకలవుతున్నప్పుడు ఒడ్డున పడిన చేప పిల్లల వలే గిజగిజలాడి బాధతో వణుకుతున్నఆ లేత వేళ్ళతో
కాళ్ళ వెంట ఉచ్చ,  దేహం యావత్తూ ఒక్కలా ప్రసరించే భయంతో

మట్టిలో నేలపై ఆ పిల్లలతో కలిసి హత్తుక కూర్చొని ఉన్న రోజు

సంవత్సరాలు గడచినా చెరగని అదే నిందితుని ముద్ర
 ఊహించగలవు నువ్వు కన్న ఊరిని విడిచి  అయిన వాళ్లను విడిచి  రెక్కలు తెగిన పక్షివై  యుగాల దూరంలో తిరుగాడుతున్నప్పుడు కూడా కశ్మీర్ నాగా  ఇంకా పేరు తెలియని అనేకానేక ఆదిమజాతుల వలే నువ్వొక నేరస్తునివని

 తప్పించుకోజాలని పవిత్ర నిఘా డేగ చూపులు నీ చుట్టూ
పగిలిన అద్దంలో ఒకదానికొకటి సరిపోలని ముక్కలుగా విడివడినా నువ్వు నేరస్తునివి నేరస్తునివి వొట్టి నేరస్తునివి

ఇంకా నిన్ను నీవు  సంకేతాత్మకంగా ఇలా పోల్చుకోవచ్చు
(శ్రీనగర్ పండ్ల మార్కెట్ అలాంటిదేనా?)

ఎటో కొట్టుక పోతున్న వేళలలో నీకొక ఉనికినిచ్చి
నిన్నొక నిందితునిగా లోకానికి పరిచయం చేసే సుపరిచిత ప్రదేశాలతో పాత రోజులతో భయద దుఃఖపు జాములతో
ఎప్పుడో ఒక్కసారి తిరగాడినందుకున తిరిగి తిరిగి నీ రోజులలో సదా మేల్కొని లేచే నిలువెత్తు అనుభవాలతో

నిన్ను నీవు కనుగొనగలడం
కనుగొన్నాననుకొన్న ఉన్మత్తతలో జ్వలిత చంచలితమై మరణించడం
సాదృశాల నడుమ తొణకిసలాడే ఆత్మయై తిరిగితిరిగి జనించి లేవడం

గుర్తుందా నీకు

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

ఊరికే




చెప్పడానికి ఆట్టే ఏమీ లేవు

పొద్దునే లేచి కాసేపు ధ్యానం చేసుకొని కూచుని ఉన్నాను
 నిన్నటి నుండి కడుపులో ఒకటే భారం. ఎంతముక్కినా వచ్చి చావదు.  సుఖ విరేచనానికి మరేదన్నా దారి?
టివిలో ఎవరో ఎవరెవరో సవాళ్ళు విసరుకొని మరీ గెంతుతూ మాటలతో బరుకుతూ మరి కాసేపు దేశభక్తిగా తల బాదుకుంటూ అంతా సుఖ విరోచనానికి ముఖం వాచిన లోకంలా ఉంది.

 సందర్భం ఒకటి కావాలి కదా

నాకు మాత్రం ఏం తెలుసు. రోజూ బడికి పోయి  పిల్లల్ని చావ బాది పుస్తకాల్లో మాటల్ని చిలుకల్లా వల్లింపజేసి కనిస్టీబు బతుకు

దేశమును ప్రేమించి బ్యాలెట్ బాక్స్ ను ప్రేమించి నెల నెలా జీతాన్ని ప్రేమించి ప్రేమించ దగ్గ విషయాల జాబితానొకదాన్ని గుర్తింపు పత్రంగా జేబులో పెట్టుకొని  ముందు జాగ్రత్తతో తిరుగుతున్నాను

పవిత్రమైన దేశంలో పవిత్రమైనవెన్నో పుంఖానుపుంఖంగా కొలువు తీరి కిక్కిరిసి
ఊపిరాడని కాలంలో

చెప్పదగ్గ విషయాలు ఆట్టే ఏమీ లేవు

కొన్ని రోజులు నిప్పులతో  చేయబడతాయి
ఉరి తీసిన రహస్యాలతో రాత్రి కొలిమిలా మండి నిర్నిద్రితమవుతుంది

అంతే
చెప్పడానికి ఆట్టే విషయాలు ఏమీ లేవు









4, ఫిబ్రవరి 2013, సోమవారం

ఉచ్చలు పోసే పిల్ల



చుట్టూ చేతుల హారం వేసి
ఒక నాటి భాషతో అమ్మ పాలిండ్లను తన చిన్ని అరచేతులతో తడుముతూ

తను ఒకింత నమ్మకంగానే చెపుతుంది

అమ్మా, నేను ఈ రోజు నుంచి మంచంలో పాసులు పోయ్యను
మద్దె రాత్రి వస్తే నిన్ను లేపుతాను

కొంచెం భయం స్ఫురిస్తూ మళ్ళీ అంటుంది
అమ్మా, పెద్దయ్యాక కూడా పక్కలో పాసులు పోస్తే బ్యాడ్ అంటారు కదా

బహుశా ఈ క్షణాన్ని చెరిపేసేదేదో  తనలో ఉంది
తెలియని జాములలో మిణుకు మిణుకున మేల్కొని
పెరిగి పెద్దవడంతో ప్రతీదీ నేర్చుకోవడంతో ఒదిగి ఒదిగి రోజులను నియమబద్ధం చేయడంతో పొసగనిదేదో ఉంది

ఇక అప్పుడు తను
తన భయాలను లోకాంగీకృత బాషలలోనికి కాక తనకు తోచిన అర్థాలలోనికి అనువదించుకొని
ఆసాంతమూ మెత్తని అమ్మ పొట్టలోనికి దూరి
బుజ్జికుక్కపిల్లలా పడుకొని తెల్లారాక ఏమీ తెలియని దొంగలా మంచం మీద నుండి లేచి వచ్చినపుడు

తన మహర్జాతకానికి కుల్లుకొని ఏడుస్తావు కదా నువ్వు