దారి చెదరిన ఒక ఒంటరి పక్షి తెల్లని తన రెక్కలు చాచి
చుక్కలు కాసిన ఆకాశంలో వెతుకుతుంటుంది
ఒక దిక్కు మరొక దిక్కులోనికి ముడుచుక పడుకొనే జాము
కలయతిరిగి కలయతిరిగి
ఎక్కడ తండ్రీ నీ గూడు
నీలినీలి చీకటిలో ఎక్కడ తండ్రీ నీ తెన్ను
పగటి ఎండలో దూసర వర్ణపు వేడిలో వొదిగి వొదిగి దేహాన్ని ఏ చెట్టుకొమ్మకో వేలాడదీసి
క్రమంగా వివర్ణితమై ఒక కెంజాయ ముఖాన్ని చరుస్తున్నపుడు
నీకు గూడు గురుతుకొస్తుంది
దిగ్మండలం మీద చెదురుతున్న పొడలా దారి గురుతుకొస్తుంది
ఆకాశపు నీలిమ కింద
చుక్కల లే వెలుతురు క్రీనీడల కింద
నీ పూర్వీకులు తిరిగిన జాడల వాసన గురుతుకొస్తుంది
నీలాగే ఇప్పటి నీలాగే తిరిగి తిరిగి లోకం ముంగిట ఒక్క స్మృతినీ మిగిల్చుకోని కఠినాతి కఠినమైన మొరటు మనుషులు
ఆకాశం నుండి నేల వరకూ అనేకానేక లోకాలను తమ నిట్టూరుపులపై నిలబెట్టిన వాళ్ళు
అలుముకపోయిన చీకటిలో ఎక్కడో వెలుతురు
అలసిన నీ రెప్పల వీవెనల కింద వూటలా చెమరింపుల చల్లని తడి
తిరిగి తిరిగి ఇక అప్పుడు
దేహపు ఆవరణలలో పసికందులా రాత్రి నిదురపోతున్నప్పుడు
రెక్కల మీద చేతులు చాచుక ఆకాశం విస్తరిస్తున్నప్పుడు
కదిలినప్పుడల్లా సలుపుతున్న నొప్పిలా పక్షి ఎగురుతునే ఉంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి