1
ఎటు వైపునుండయినా దీనిని మొదలు పెట్టవచ్చునని తెలిసాక
అటూ ఇటూ కదలజాలక బంధితమై ఉన్న చోటునుండీ ఇంటినుండీ కరుడుకట్టిన నిశ్చలప్రవాహాలలాంటి రోడ్లమీదకు ఉరకాలనుకునే నిస్సహాయపు రాత్రి నుండీ
కొంచెం భయంతో మరికొంచెం ఆసక్తితో మరణాన్ని తప్ప మరొకదాన్ని ఆవాహన చేయజాలని
రోజుల గుండెలమీద నెమ్మదిగా కదలాడుతున్న ఒకానొక పురా భారము నుండీ
నుదుటి మీద నీకోసం కేటాయించిన వరుస సంఖ్యను సదా ఊహిస్తూనే ఉంటావు
2
రోజులు నీలాగే వొట్టిపోతున్నపుడు లేదా నీవే రోజులన్నింటిలాగా వొట్టిపోతున్నపుడు
జీవితం అర్ధాంతరమని గీతగీసి మరీ చెప్పడానికి
ఇంటిలో నీ తల్లో ఎవరో మరెవరో ఒక ఆడకూతురు నీ ఎదురుగానే తిరగాడుతున్నప్పుడు
బిడ్డల చావుని తప్ప మరేదీ నమ్మనంత ధ్యానంగా వారు మృత్యువుని మోసుక తిరుగుతున్నప్పుడు
నువ్వు వాళ్ళని ఊరకే అలా చూస్తూ ఉండలేవు
ముఖాల మీద కదిలీ కదలాడని ఒక పలుచని తెరలాంటి దాన్ని చదవకుండానూ ఉండలేవు
3
ముందుగానే తెలిసిపోయే భవిష్యత్తులాంటి
లేదా ఇంతకు ముందెప్పుడో సరిగ్గా అలాంటిదాన్నే అనుభూతి చెందిన పీడకలల ప్రయాణపు దారిలాంటి
చంచలిత దృశ్యాదృశ్యాల కలయికలలో
ఇదేరోజున నిన్ను జీలం నదీ శీతలజలాల చెవియొగ్గిన చప్పుళ్ళలో
ఇంకా రాళ్ళను విసిరేందుకు ఏరుతున్న రహదారులమంటల కశ్మీర్ లోయలలో
దుఃఖించినట్టూ గుండెలవిసేలా బాదుకున్నట్టూ
కాకుండా ఇక ఎలా రాయగలవూ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి