జ్ఞాపకం ఒకటి రూపొందడం నీకు తెలుసా?
నాయన చావుగానో, వాము దొడ్లలో ఒంటరిగా
మోకాళ్ళ సందున బాల్యం తలకాయ నిరికించుకొని గీసిన గీతల శూన్యంగానో,
ఉన్మత్తమై భాషకు ఊపిరి ఆడక నీవు రాసిన పిచ్చి రాతలుగానో
అన్నీ పైపైకి కాల గమనంలో
ఎప్పటివో చెదరిన గురుతులు
కానీ ఙ్ఞాపకం అంటే అంతేనా?
మనిషి కాలాతీతమై లేదా హద్దులు చెరిగిన మహా ప్రవాహమై
ఒక బిందువు వద్ద ఘనీభవించి లేదా కాలం నుదుటన పచ్చబొట్టై -
ఙ్ఞాపకం అంటే అంతేనా?
నీకు నీవే విచ్చుకొనే కొత్త చూపై
పరచుకొనే దృశ్యంలో కాంతులీనడం
నీ చుట్టూ నీవు గీసుకొన్న వలయంలో మహాద్భుత పుంజమై గిరికీలు కొట్టడం
తృటిపాటులో నిన్ను నీవు రగిలించుకొని
ఒక కాలం యావత్తూ విద్యుల్లతయై వ్యాపించి తిరిగి నిన్ను నీవు ఆవిష్కరించుకోవడం
ఙ్ఞాపకం బుగిలిపోయిన కాగితాలలో
పాతగ వాసనలు కొట్టే శకలం కాదు
నడిచే దారిలో
నీ ఎత్తు కొలమానం
నీ ఙ్ఞాపకాలలో తిరిగి తిరిగి నీవే రూపొందుతుండడం నీకు తెలియదూ?
సరిగ్గా నేను ఎలాంటి కవిత్వాన్ని యిష్టపడతానో అలానే ఉంటున్నాయి మీ కవితలు. అభినందనలు. రాస్తూ ఉండండి.
రిప్లయితొలగించండి