బహుశా అని మొదలు పెట్టి
ఇక ఏ రోజుకైనా రాయడానికి దోసిటటిలో విరబూసిన ఒక దిగులు పుష్పంలానో
రెండు దిక్కులకేసి చేతులు చాచి నిలుచున్నపుడు నిన్ను దాటుతూ అటు నుండి ఇటు ఇటు నుండి అటు సాగిపోయే సుపరిచిత ప్రయాణంలానో
నిలుచుని ఉంటుంది మా ఊరి రైల్వే స్టేషన్
సరిగ్గా ఇలాంటి సమయాలలోనే
ఏకాంతపు సాంధ్యలు చలిగీతమై రాజుకునే ఇట్టాంటి వేళలలోనే
కాల రేఖలను దాటి కొద్ది కొద్దిగా రేకులు విప్పుకుని
కూర్చుని ఉన్న సిమెంట్ బేంచీల మీదకు వాలే జొన్న చేల రెపరెపల పచ్చని ఒకలాంటి పరిమళంతో
పురా స్నేహితులను అర్థాంతరంగానే చావును జెండాలా ఎగరేసిపోయిన ఒకరిద్దరు మిత్రులను
ఆలింగనం చేసుకుని మాటాడుతూ ఉంటాను
నేర్చుకున్న తొలి అక్షరాలను అపురూపంగా దిద్ది రాసే
ఒక బాలకుని అబ్బురం వలే మడతలు పెట్టిన కాగితంపై రాసి ఉంచిన కొన్ని పంక్తులుగా
ఇక్కడనే నన్ను నేను తడుముకుంటాను
ఒక పుస్తకం వలే ఎంతకూ వదలని పదబంధం వలే
రూపొందే ఒక విశ్వాసం వలే స్పర్శ వలే నాలో నేను మెదలుతుంటాను
తరగని ప్రవాహ గుణమేదో ముప్పిరిగొని ముసిరే జాములలో
కాలాతీతమై ఒరుసుకొని పారేందుకు ఒడ్డులేవీ లేని తనానికి నాకు నేనే చుక్కానినయ్యి తలుచుకున్నప్పుడల్లా మా ఊరి రైల్వే స్టేషనుగా ఎదర నిలుచుంటాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి