ఎక్కడో ఇరుక్కొని ఉంటాము
పాతబడి దుమ్ముబారి పెళుసులుగా విరుగుతున్న
గోదుమరంగు పేజీల నడుమ
చిన్నప్పుడెప్పుడో దాచుకున్నవన్నెల నెమలి కన్నులా
ఎప్పటిదో ఒక పాటలా
గొంతుకలో ఉండీ ఉండీ ఊరుతుంటాము
సుడి తిరుగుతూ ఒక జీరగా
క్షణ మాత్రమే అయినా అప్పటికది
మన లోపలి బీటలు వారుతున్న ఏకాంత గృహంలో
మనకు తెలియకుండానే పెరిగి ఒక పలకరింపై
మెల్లగ తలనూచే గడ్డి పువ్వులా
ఏవో తెలియని గాయాలతో
సంచరిస్తూ ఉంటాము
బొటనవేలు పగిలి
చిత్తడయిన పాదాల ముని వేళ్ళతో
ఒక సలపరాన్ని దారి పొడువునా అద్దుతూ
కొనసాగడమొక్కటే ఉపశమనమై జ్వలించీ జ్వలించీ
నెమ్మదినెమ్మదిగా బూడిదబారే వేయి తలల మహా కేతనంలా
ఎప్పుడూ మనం ఎదురీదుతూనే ఉంటాం
కృతకత్వమొక్కటే క్షణానికొక్క ముఖంగా
జగన్మోహనమై ఎల్లెడలా పరివ్యాపితమయ్యే వేళల
శిథిలమై విరిగిపడే ఒక మహా వృక్షపు
పెళపెళారావంలో లయమొందుతున్న ఆత్మలా
అద్బుతంగా ఉంది మిత్రమా
రిప్లయితొలగించండిమంచి కవిత్వం వ్రాస్తున్నారు