అందరూ అమెరికాకు వెళ్తున్నారు
లేదా వెళ్ళి వస్తున్నారు
ఇంకా ఎప్పుడు నేను వెళ్ళడం
యాంటీ ఇంపీరియలిజమ్ పోయమ్
ఒకటియ్యిరా అని ఫ్రెండ్‍గాడొకటే నస
పాత కాగితాల కట్టలో పనికొచ్చేవేమైనా ఉన్నాయేమో చూసుకోమనాలి
ఎంతైనా అవుటాఫ్ సీజన్ కదా
ముందు అక్కడ మనకు పనికొచ్చే వాళ్ళని పట్టుకోవాలి
అందరూ వెళ్తూ మనమొక్కరమే మడికట్టుకొని
ఎన్నాళ్ళీ ఉపవాసం
ముందు మనం పేర్లోకి రావాలి
మన కులంలో అయినా మనకు పనికొచ్చేవాడెవడైనా తగుల్తాడేమో చూడాలి
ఎన్నాళ్ళు వృధా అయ్యాయో కదా
ఒక పేరూ లేకుండా ఒక అమెరికా లేకుండా
ఇంకా ఎన్నాళ్ళని
ఇలా మూలన పడి ఉండడం
ముందు మనం అమెరికాకు వెళ్ళాలి
ఉద్యమాలూ, తొక్కా రోజూ ఉండేవే కదా
ఈ రోజు కాకపోతే ఇంకో రోజు
ముందు మనం అమెరికాకు వెళ్ళాలి
మద్యలో ఈ ఫ్రెండ్‍గాడొకడు
కవిత్వమో అని మొర పెడుతుంటాడు
వీసా పాస్‍పోర్ట్ అన్నీ లైన్ క్లియర్ చేసుకోవాలి
ముందు మనం అమెరికాకు పోవాలి
సెటిల్‍మెంట్ సంగతి తర్వాత
కనీసం ఒక్క సారన్నా అమెరికాకు వెళ్ళోస్తే కదా
జన్మకింత సార్ధకత
పిల్లలు, కెరియర్
కులం, ఉద్యోగం, అమెరికా అన్నీ సమానార్థాల పద పట్టికలో
ఇంకా ఎందుకు చేర్చరో కదా
,చదువు, అభిరుచి, అవకాశం, మేధో వికాసం, అమెరికా అన్నీ ఒక్కటే కదా
ముందు మనం అమెరికాకెళ్ళాలి
చంకలెగరేసుకుంటూ
రెక్కల్ని మొలిపించుకుంటూ
జెండాల రెపరెపల జ్వాజ్వాల్య ధగధగలను
ఇరుసుగా చేసుకుంటూ, దొళ్ళుకుంటూ
ఎలాగైనా మనం అమెరికాకు వెళ్ళి తీరాలి
ఉండహె,మధ్యలో ఈ ఫోను-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి