11, ఆగస్టు 2012, శనివారం

జ్వరస్థితి



లోలోపల ఏమవుతుందో తెలియదు
కొన్నాళ్ళపాటా లేకుంటే కొన్ని రోజులా?

చేతనం సందిగ్ధమై ముందుకూపోకా వెనుకకూ రాకా
ఒక లోలోతులలో పొరలు పొరలుగా కాగే సన్నని మంట

దేహపు ఆవరణలో ఎవరో ఏదో వైనవైనాలుగా హడావిడీ పడుతున్నసవ్వడి

వినిపించీ వినిపించనట్టు ఒకమూల ఒక నేపథ్యానికి
ఒకింత ఓరిమితో ఒక అలవాటయిన స్థితిలో
కంగారూ కాకుండా నిర్లిప్తమూ కాకుండా
తెలియని సన్నద్ధత ఏదో కవచధారియైనిలుచునే వేళ

ఏకాంత దీపాల వెలుగులో
రణగొణ ధ్వనులను విడిచి కించిత్ కాలాతీతమై
రెండు చేతులనూ చాచీ అలసిన దేహంతో

నువు మూగన్నుగా పడుకొని
మెలకువకూ నిద్దురకూ నడుమ నేడూ రేపులలాగే
సన్నని కంచెను అల్లుతుంటావు

1 కామెంట్‌:

  1. "నువు మూగన్నుగా పడుకొని
    మెలకువకూ నిద్దురకూ నడుమ నేడూ రేపులలాగే
    సన్నని కంచెను అల్లుతుంటావు"
    ఈ లైన్లు చాలా నచ్చాయండి!

    రిప్లయితొలగించండి