27, నవంబర్ 2014, గురువారం

కడుపులో నులిపురుగులు

పెచ్చులు పెచ్చులు రాలి ముఖం నున్నటి గుండ్రాయి అరచేతిలో గీతలరిగి పెద్దమ్మ నిశానీకీ పనికిరాక వింటూ ఉన్నప్పుడు అలవాటుగా గడ్డానించుకొనే అరచేయి ఇక ఎక్కడ ఉంచుకోనూ?


వొంగి వొంగి దాగి చూసి అదిగో అదిగోర్రా పాము అబ్బా ఎంత పెద్దదో జబ్బు ముదిరిన క్యాన్సరాసుపత్రి నాయన పొంగుకొచ్చిన వొంటిమీద గడ్డలు అనుకున్నట్టుగానే తననుకున్నట్టుగానే చావన్నా దెంకపోదని జబ్బు మెదడుకూ పాకి నిజంగానే బతుకును చావునాకొడకాని నా నెత్తిన బోర్లించి పోయినవా నాయనా

నీడ మీద కూర్చోలేను మధ్యాహ్నపేళ సూరీళ్ళయి నడినెత్తిన మండాలేనూ ఉండు పుట్టి గిట్టి రెప్పమాటు వెతల బతుకు ఆదమరచి ఉండు ఎక్కడైనా ఒక తత్వం దొరుకుతుందేమో వెతుకుతా ఒక్క పాటైనా పాత గుడ్డల చుట్టిన పొత్తిళ్ళగ పాడతా బాలింతరాలి వాసనలో మూడుసార్లు ముక్కు పట్టుక మునుగుత


(కడుపులో నులిపురుగులు సన్నని గుడ్లను పగలగొట్టుకొనే మొనలాంటి సూదుల జాములలో

                                        ముడ్డిలో జిబజిబా దురద పెడుతున్న వేళ రాసుకున్న కవిత)

రెండు పాదాల కవిత

వొచ్చీరానీ అక్షరాలను కూడబలుక్కొని
ఆ రెండు పాదాలూ నువ్వు రాస్తున్నప్పుడు నేను నీ పక్కనే కూర్చొని ఉన్నాను
అప్పుడు చుట్టూ రాబందుల రెక్కల చప్పుడు

ఆ రెండు పాదాలే పుంఖానుపుంఖమై రోజుల నిర్దాక్షణ్యతను తొలుచుకుని బారులు సాగుతునప్పుడు-
“కవిత్వమా అది”- అనే కదా నేనడుగుతాను

అప్పుడు జల్లెడలా తూట్లు పడి దేహమంతా తడిసి ముద్దయి బహుశా నొప్పితోనే కాబోలు
వణుకుతున్న చేతితో జేబులో నుండి తడిసిన ఆ కాగితాన్ని ఒక చిన్ని మిణుగురులా బయటకు తీసి
ఒక్కసారి చూసుకొని తిరిగి జేబులో దాచుకుంటున్నావు

చావును బతుకును కలుపుతూ వంతెనలా నువ్వు
వెలుగుకు చీకటికి నడుమ పలుచని వెలుతురులా నీ జేబులోని వొచ్చీ రానీ ಆకవిత్వమూ

ఆ వెలుతురులో ఆ వంతెన మీదుగా అటునుండీ ఇటూ ఇటునుండీ అటూ పిచ్చి పట్టినట్టూ తిరుగుతున్నప్పుడు
చేయి పట్టుక పక్కన కూర్చోబెట్టుకొని అప్పుడు నువ్వే ఇలా అంటున్నావు

బహుశా ఒక అమరగీతం రాసే ఉంటావు నువ్వు, తుంటరి దొంగ సుమా వీడు -
దొరికినదంతా దోచుక పోగలడు
తాగి తాగి వొదురుతూ రాసిన మీ అక్షరాల మీద ఒంటేలు పోసి పళ్ళికలించగలడు

ఒక మనిషి ఎప్పుడు ఎలా పరిణమించగలడోనని మీరు ఆసక్తిగా చూస్తుంటారు
కానీ అటూ ఇటూ చెదరని నిశ్చితాల మీదనే మీ గురి-

కొత్త బట్టలేసుక రోడ్డు మీద తిరుగుతున్నందుకు గుడ్డలిప్పదీయించిన పెద్దమనిషి
తుపాకీ ముందర చేతులుకట్టుకొని “అనా, అనా” అని వొరపోతున్నప్పుడు లోపల ఎట్టా కుతకుతమంటదో మీరూహించగలరు గానీ

పక్కన ఎప్పుడూ ఊహించనంత డబ్బు
ఎటు పక్కనించీ ఏ పోలీసొస్తాడోనన్న భయం
భుజాలనొరుసుకుంటూ మావో నిలిపిన ఆదర్శం-

రోట్లో వేసి కలిపి దంచినట్టూ మనసు ఎన్ని పరిపరి విధాలుగా పోగలదో మీరూహించలేరు
చోరజాలని ఇరుకిరుకు సందులలో మురికి పెంటల మీదగా జీవితం ప్రవహించడం మీరు చూడలేరు -

తలెత్తిన ఆకాశంలో మేఘాల పరిభ్రమణంలా గిర్రున తిరుగుతూ తన లోతులలోనికి చేయి పుచ్చుకొని ఈడ్చుక పోతున్నపుడు
తనను ముట్టుకొని అలా వెళ్ళిన వాడివి మరలా ఎందుకిలా తిరిగి వచ్చావు అని అడగాలనుకున్నాను

తిరిగి తను అర్థాంతరంగా వదిలేసిన పాదాలే -

ఒకటి మరొక దానిని కలుపుతూ ఒక దృశ్యాన్ని విడదీస్తుంటుంది
మొదటిది రెండవ దాని నుండి విడిపోతూ ఒక భావాన్ని నెలకొలుపుతుంది.



13, ఆగస్టు 2014, బుధవారం

పాలస్తీనా





నిదుర రాని రాత్రి ఒకలాంటి జీరబోయిన గొంతుకతో
వొడుస్తున్న గాయం మాదిరి, పోరాడే పాడే గాయం మాదిరి
నిస్పృహ, చాందసం ఆవల
ఎక్కడో ప్రవాసంలో తన దాయాదులనుద్దేశిస్తూ నిరాఘాటంగా దార్వేష్ పాడుతూ  ఉన్నాడు

అతడి పాట చెవిని తాకి నెమ్మదిగా లోలోనికి  చురకత్తిలా  దిగుతున్నప్పుడు
తనలాంటి, తన కవిత్వంలాంటి ఒక తల్లి
తన తొలిప్రాయపు బిడ్డను కోల్పోయిన దుఃఖంలా
వేలి కొసలకు ఎన్నటికీ చెరగిపోని నెత్తుటి మరక

సమయం ఉపవాస మాసపు తెల్లవారుజాము-
మసీదు గోపురం చివర నుండి సన్నని వొణుకుతో జాగోమని జాగురూకపరిచే సుపరిచిత గొంతుక

ఈ రోజు ఎందుకో నా ముస్లీం మిత్రులను పేరుపేరునా కలవాలనిపిస్తోంది

ఒక వ్యధామయ ప్రయాసను దాటబోతున్న వాళ్ళలా
మృగ సదృశ్య సాయుధ హస్తం ముందర నిలబడి మరేమీ లేక వుత్తిచేతులతో తలపడబోతున్నవాళ్ళలా
ఒక్కొక్కరినీ పొదువుకొని ముఖంలో ముఖం పెట్టి పుణికి పుణికి చూడాలనిపిస్తోంది

ఒకరు పుడుతూనే పరాయితనాన్నిమోస్తున్న వాళ్ళు
వేరొకరు కాలుమోపడానికి కూడా చోటులేని  శాపగ్రస్తులు

నిర్నిద్రితమైన  దేహంతో కనలుతూ  రాకాసిబొగ్గులా  ఎగపోసుకుంటూ తెల్లవారుతున్న ఈ రాత్రి
రెండు సాదృశ్యాల నడుమ రెండు ఉనికిల నడుమ అగ్ని గోళంలా దహించుకపోతున్నప్పుడు
సింగారించిన నాలుగు అక్షరాలను కాగితాలమీద చిలకరించి  కవిత్వం రాయబోను

ఉదయాలు మరణంతో కొయ్యబారి ఆకాశానికి చావు వాసన పులుముకుంటున్నట్టూ
ఒక రోజునుంచీ ఇంకో రోజుకు దాటడానికి ఎన్ని దేహాలు కావాలో లెక్కకట్టి
ఒకానొక దానిని ఇది తొలి వికెట్టని ప్రకటించినట్టూ మాత్రమే  రాస్తాను

సరిగ్గా ఇలాంటి వేకువ జాములలోనే మొస్సాద్-రా మన ఇంటి తలుపు తట్టి
ఉమ్మడి దాడులలో  పెడరెక్కలు విరగదీసి  తలకిందులుగా వేలాడదీస్తారని రాస్తాను

గాజా - కశ్మీర్  తరుచూ పొరపడే పేర్లుగా నమోదు చేస్తాను

నేల మీద యుద్ధం తప్పనిదీ, తప్పించుకోజాలనిదీ అవుతున్న వేళలలో
విరుచుకపడే ధిక్కారాన్నే పుడమికి ప్రాణదీప్తిగా పలవరిస్తాను


3, ఆగస్టు 2014, ఆదివారం

ఊరికనే




వస్తూ వస్తూ జ్వరంతో వస్తాయి అక్షరాలు

రాత్రిని భోంచేసి మూతి తుడుచుకుంటున్న
పిల్లి ఒకటి ఊరకే అలా పడుకొన్నది

ఎవరూ అడగని వాటిని గురించి ఇక్కడ  సంసిద్ధత

నీకు కలలే రావు కదా ఇక  కవిత్వం ఎలా రాస్తావూ
అని అడుగుతారనే భయం లేదు

అంతా  పద్ధతి ప్రకారమే కదా జరగుతోంది

తెలిసిన నిశ్చింతత పుటం కట్టి మానని గాయమై
తనలోనికి తాను కళ్ళు పెట్టి చికిలించుకొని చూసుకుంటున్నప్పుడు
కలుక్కుమని విరిగిన ఒక కవితా పాదం ముందుకు కదలక మరో పాదంతో
ఇల్లా అంటూందట:

ప్రేయసీ, ఇక్కడ మరీ అంత ఏమీ లేదు

కొన్ని దుఃఖించే హృదయాలున్నట్టుగానే వేడుకగా సింగారించుకొన్న అనేక ఆర్థ్రభాష్ప బిందువులున్నాయి
తెగిపడిన రుధిర చారికలు కొన్ని లాగా వొళ్ళంతా పులుముకున్న పులిపులి వేషగాళ్ళ వొంటి మచ్చలు చాలానే ఉన్నాయి
 తెలిసిన విశ్వాసపు కొద్ది ఆకాశాల వెనుక తెలియని ప్రశ్నల లక్షోపలక్షల సమాంతర విశ్వాలున్నాయి

విరామంలాంటి నిశ్శబ్ధత నీకూ నాకూ మధ్య వ్యూహాత్మకంగా పరుచుకుంటున్నప్పుడు
నుదుటి మీద వానచినుకై చిప్పిల్లే ఒక ముద్దు నీకొక బాకీగా ఇంకా మిగిలే ఉన్నప్పుడు

బొత్తిగా కాలు సాగని ఈ రోజును రికామిగా పిలుద్దాం
ముఖాల మీద తోలు వొలుచుకొని బోలుతనాన్నే పోతపోద్దాం





23, జులై 2014, బుధవారం

పావురాళ్ళ గూడు

తమంతట తాము కనుగొని కుదుర్చుకున్న గూటిలో ఒక పావురాల జంట

పగలంతా ఎక్కడెక్కడికో తిరిగి తిరిగి తమ విశ్రాంతి వేళలలో లేదా బయటకెక్కడకూ పోజాలని ఇలాంటి దుర్మార్గపు మిట్టమధ్యాహ్నపు జాములలో అవి ఇక్కడ చేరతాయి

వాటి కోసం కాసిని నీళ్ళను గిన్నెలో పోసి కొద్దిగా గింజలను ఇక్కడ చల్లి ఉంచుతాను

గూటిలో వాటి జీవితం ఏమిటా అని అప్పుడప్పుడు ఆలోచిస్తాను

అలాగే అవి క్రితం రోజుల నాటివా లేక కొత్తవా అని కూడా –

తేడా ఆట్టే కనిపెట్ట లేను కానీ, అవి అక్కడే కొనసాగుతూ పిల్లలను పొదిగి భారమైన రోజులను దాటుకొని తమలో కొన్ని శిథిలమైపోగా, ఆ ఎముకల చితుకులలో ఒక్కో సారి ఒంటరిగా కూడా తారాడడం –

ఒక లాంటి నిర్లిప్తతతో తన రెక్కలను ముక్కుతో తుడుచుకుంటూ గడిపిన రోజులనూ గుర్తుకు తెచ్చుకుంటాను

ఈ కాసిని నీళ్ళనూ, గింజలనూ ఇక్కడ ఉంచుతున్న ప్రతీసారీ

గూటిలోని ఆ జంట వీటిని గుర్తించి తమ దేహార్తిని బాపుకుంటాయా లేదోనని కనీసం నీడ కూడా దొరకని ఈ రోజులను తలుచుకుని దిగులు పడతాను

పావురాలుగా పావురాల గూడుగా ఎండిన ఎముకల చితుకులలో ఒలికిన ఒక లాంటి దిగులు పువ్వులా

తిరిగి అవి విరిసి విచ్చుకొని సుతిమెత్తని సవ్వడులై కదలాడే చిన్నిచిన్ని పిట్టలుగా

ఎండాకాలపు ఆవరణంలో సందిగ్ధపు ఉద్విగ్నతను పులుముకొని అప్పుడే ఉంచిన కాసిని నీళ్ళూ గింజలులా

ఒక్కో సారి ఒక్కోలా ముక్కలుగా విడిపోతున్న ఉనికి సంరంభాన్ని ఒకింత ఆశ్చర్యంతో అవలోకిస్తాను

తిరిగి నెమ్మదినెమ్మదిగా కదులుతూ అన్నీ కలగాపులగమయ్యే దృశ్యపు దేహమై
నన్ను నేను కనుగొంటాను

13, జులై 2014, ఆదివారం

అబద్దం




యమునా నది ఒడ్డున తోటి పిల్లలతో కిష్నుడు ఆడుతున్నాడు

తల మీది నెమలి పించంతో పక్షులలో పక్షిలా
రెక్కలు చాచుకొని పొదలలో చెట్ల నడుమ మాలిమి కాని చిన్ని జంతువులా వాడు తిరుగుతున్నాడు

నదీ తీరం వాడి విహారస్థలం

కాసేపు మాయలా కాసేపు వాస్తవంలా
వాడు లాఘవంగా అటూ ఇటూ  కలయదిరుగుతూ ఉంటే చుట్టూ ఉన్న పిల్లలు
కిష్నా కిష్నా అని వాడినే పలవరిస్తున్నారు

ఆట మధ్యన విఘాతంలా,  చూస్తూ చూస్తూ పాప అడుగుతుంది కదా-

నాన్నా, ఎక్కడైనా పిల్లలు స్కూలుకెళతారు. అదయ్యాక స్టడీ అవర్స్. ఇంటికొచ్చి పుస్తకాల బ్యాగునలా పారేసి ఎవరూ మన రెక్క లాగి అవతల పడేయకపోతే చూసినంత సేపు టీవీ
ఇంకా హోంవర్కూ ట్యూషనూ-

చెప్పు నాన్నా చెప్పూ, ఇదంతా నిజమేనా-?

12, జూన్ 2014, గురువారం

వెన్నల పాపడు



ఆకాశంలో వెన్నెల కింద పాపడు
తన నీడతో తాను ఆడుతున్నాడు

రాగిరంగు జుట్టు కదలుతూ  గాలితో
మేఘాల నవతల తోస్తోంది

ఏ ఆచ్చాదనా లేని వాడి నల్లని దేహం
నెమరి ఈ రాత్రిని స్వాంత పరుస్తోంది

పగలంతా ఎండ కింద కాగిన నేల
తప్పటడుగుల పాదాల వీవెనలతో చల్లగా నిదురకు సిద్ధమవుతోంది

కేరింతలతో ఆడి ఆడి
అలసినా పాపడు అమ్మ పక్కకు చేరి ఆయి తాగుతున్నాడు

ఆనుకుని పడుకునే  వొంటితో
వాడు ఆకాశ విల్లు

పాలు కారిన పెదాలపై
చంద్రుడికి ఇక నుంచి పవళింపు వేళ

11, జూన్ 2014, బుధవారం

పక్షి ఎగిరిన చప్పుడు




దారి చెదరిన ఒక ఒంటరి పక్షి తెల్లని తన రెక్కలు చాచి
చుక్కలు కాసిన ఆకాశంలో వెతుకుతుంటుంది


ఒక దిక్కు మరొక దిక్కులోనికి ముడుచుక పడుకొనే జాము


కలయతిరిగి కలయతిరిగి
ఎక్కడ తండ్రీ నీ గూడు
నీలినీలి చీకటిలో ఎక్కడ తండ్రీ నీ తెన్ను


పగటి ఎండలో దూసర వర్ణపు వేడిలో వొదిగి వొదిగి దేహాన్ని ఏ చెట్టుకొమ్మకో వేలాడదీసి
క్రమంగా వివర్ణితమై ఒక కెంజాయ ముఖాన్ని చరుస్తున్నపుడు
నీకు గూడు గురుతుకొస్తుంది
దిగ్మండలం మీద చెదురుతున్న పొడలా  దారి గురుతుకొస్తుంది


ఆకాశపు నీలిమ కింద
చుక్కల లే వెలుతురు క్రీనీడల కింద
నీ పూర్వీకులు తిరిగిన జాడల వాసన గురుతుకొస్తుంది


నీలాగే ఇప్పటి నీలాగే తిరిగి తిరిగి లోకం ముంగిట ఒక్క స్మృతినీ మిగిల్చుకోని కఠినాతి కఠినమైన మొరటు మనుషులు
ఆకాశం నుండి నేల వరకూ అనేకానేక లోకాలను తమ నిట్టూరుపులపై  నిలబెట్టిన వాళ్ళు


అలుముకపోయిన చీకటిలో ఎక్కడో  వెలుతురు
అలసిన నీ రెప్పల వీవెనల కింద వూటలా  చెమరింపుల చల్లని తడి


తిరిగి తిరిగి ఇక అప్పుడు
దేహపు ఆవరణలలో పసికందులా రాత్రి నిదురపోతున్నప్పుడు
రెక్కల మీద  చేతులు చాచుక ఆకాశం విస్తరిస్తున్నప్పుడు


 కదిలినప్పుడల్లా సలుపుతున్న నొప్పిలా పక్షి ఎగురుతునే ఉంటుంది
 



4, జూన్ 2014, బుధవారం

అసింటా





ఈ ఎండా కాలపు రోజులలో ఏం చేసినానూ?

ఒక నిశ్చితార్థంతో తెలిసిన విషయాన్నే తిరిగి తిరిగి తెలుసుకుంటూ మిట్టమధ్యాహ్నపు నిప్పుల కుంపటిలో నాలోనికి నేను చొరబడి కొద్దికొద్దిగా నన్ను నేను  కొరుక్కతింటూ సుప్తావస్థలో పవళించినాను

చూడు చూడు వీడు అధ్వైతం బోధించువాడు, మోడీ ముందొక పరవశ గీతమై సాగిల పడుతున్నాడు చూడుడని,  ధిక్కారపు చాటింపులో వీధివీధికీ దోసిళ్ళ కొలదీ    మైకాన్ని తాగి తాగి వొదిరినాను

కొన్ని పనులను చేసి మరికొన్నింటిని ఇష్టంగా పక్కనపెట్టి తిరగని దారులలో తల చెడినట్టుగా తిరిగినాను

కొందరిని ఇంపితంగా గారాము చేసి మరికొందరిని పక్కకవతలనెట్టి మాటకు మాట మహా పెడసరంగా చెప్పకనే చెప్పినాను

బతికి ఉన్న వాళ్ళందరికీ దణ్ణం పెట్టి చచ్చిన వాళ్ళనందరినీ వాటేసుకొనీ బోరుబోరున ఏడ్చినాను

ఒకానొక మహానుబావుడు చారెడు మందు పోయిస్తానని  మాటవరసకు ఎప్పుడో అనినందుకు వుట్టి మాటలేనాని మహా తాగుబోతు మాదిరి నీలిగి నీలిగి దెప్పినాను

కాసింత అసింటా జరిగి వెలుతురు దార్లనొదిలి చీకటి పీలికలనొకదానికొకటి ముడివేసి జీవితం ఒంటిస్థంబపు మర్యాదల మేడ దాటుకొచ్చాను

19, ఏప్రిల్ 2014, శనివారం

చేపలు



ఆదిలో ఆమె నిడుపాటి వేలి కొసలను
తునకలుగా కత్తిరించి  నీటిలో వదిలినప్పుడు

ఒక్కొక్కటీ ఒక్కో చిన్ని చేపగా మారి
సన్నని జీరలుగా  ఎరుపింకిపోతూ అల్లిబిల్లి కదలికలతో కలసి ఆడుతుండేవి

 నెత్తురు కలగలసిన భయంకరమైన బాధే అయినా తన దేహంలో దేహమే కదా
మాలిమితో కూడిన ప్రేమ కదా

ఏమి పేరు పెడదాం వీటికీ?
అని ఆమె అనుకుంటుంది

చుట్టూ ఇసుక తుఫానులాంటి  నల్లని పరదాలు కమ్ముకొస్తున్న జాములలో
తనతో తాను మాటాడుకుంటున్నంటుగా
ఖండితమయి మోడువారిన చిన్ని కొమ్మల్లాంటి తన వేళ్ళను చూసుకుంటూ
ఇవి భయం,  పాపం, దేవుడు, శాపం, చావు -

తను ఇంకెవరితోనో మరో స్త్రీతో,  ఒక స్త్రీ మరొక స్త్రీ మాత్రమే చెప్పగలిగినంత లోగొంతుకతో ఒక మంంత్రోచ్చారణలా భాషిస్తూ వాటిని  దోసిళ్ళలోనికెత్తుకొని
తన ఉమ్మనీటిలో పొదువుకొంటుంది

నెత్తుటి ప్రవాహ గతిలో ప్రాణవాయువును కొద్దికొద్దిగా తోడి
ఒక్కో గుక్కా పాలులా పట్టిస్తుంది

చేపలు పెరుగుతాయి

పెరిగి పెరిగి పెరగడమే తమ వ్యాపకమై విలయంలాగా మరణ సదృశమైన మహా ఆక్రమణలాగా
అవి పెరుగుతాయి

ముందుగావాటిని ఆమె చిన్ని తొట్టిలో ఉంచుతుంది
ఆ తరువాత ఒక వాగులో ఆ తరువాత నదిలో

అంతకంతకూ  పెరుగుతున్న ఆ చేపలు
ఏ రోజుకారోజు తమ చోటు ఎక్కడాని అడుగుతూనే ఉంటాయి

చివరకు  ఒకింత విసుగుతో
సన్నగ కంపితమవుతున్న దేహముతో ఆమె అంటుంది కదా

ఇదిగో ఆకాశమయి విస్తరించి సముద్రపు లోతులుగా తొణకిసలాడే ఈ దేహపు గూడు
ఇక వచ్చి చేరండి -

అనాది గాధను  నిదురలేపే  డగ్గుత్తికతో
ఒక స్త్రీ తనలాంటి మరొకరితో  వెతుకులాటులో తడబడుతూ మోకరిల్లే శరణు కోరికలాగా
పదే పదే భయం,  పాపం, దేవుడు, శాపం, చావులను చెప్పడాన్నితొలిసారి విన్నప్పుడు
నీ దేహంలో సన్నని ప్రకంపన









31, మార్చి 2014, సోమవారం

మోడిఫికేషన్



ఒక మిట్ట మధ్యాహ్నపు ఎండలో
ఆకాశానికి కాషాయం పులుముతూ అంతా  వీరంగం వేస్తున్నప్పుడు

త్రిశూలపు  పదునుటంచుల కొసలలో
బలవంతంగా పెకలించిన గర్భస్త శిశువుల జాడ-

తొణికిన ఒక్క ఉమ్మ నీటి చుక్కయినా ముఖాలకు ఉప్పెనయి తాకకపోతుందాని
 దారుల వెంట నువ్వు ఉన్మత్తుడవై వెతుకుతావు

బలిసిన ధనాగారపు ఖార్ఖానాల దోసిళ్ళలో కొన్ని కలలను టోకుగా తయారుచేసి
ఊళ్ల మీదకు రంగులురంగులుగా చిలకరిస్తున్నప్పుడు

అధికారాలలో, మతాలలో
అంచెలు అంచెలుగా అలుముకున్న ఆధిపత్యపు ఉన్మాదాలలో దేశమంటే మగతనమయి
నిటారుగా లేపుక నిలుచున్న శిశ్నాలలో  పొగలు కక్కుకునే విద్వేషం దేశభక్తయి
చివరకూ ఎంతకూ కుతి తీరక యోనులలో తాగి పడేసిన సీసాలను జొనిపి -

అది నెత్తురో, కరిగి పారుతున్న దేహమో తెలియక
మండుతున్న దిసపాదాలతో అవే అవే అవే మాటలను పిచ్చిగా వదురుతూ
కనపడని ఆ జాడల వెంట ఒక ప్రళయంలా తిరిగిన చోట్లలో మళ్ళీమళ్ళీ తిరుగుతావు

ఎక్కడా దారి దొరకదు

ఎవ్వరూ ఒక్క మాటను కూడా ఆశ్వాసనగా
జ్వలిస్తున్న నీ దేహంపై కప్పరు

రాలిన పూవుల కోసం పిచ్చిగా కవితలల్లి
వాడిన ఆకులపై అదే పనిగా ఎక్కడెక్కడివో జీవజలల జాడలు వెతికి
పలవరించి మరీ మాట్లాడే పుణ్యాత్ములు ఒక్కరూ నోరు విప్పరు

అవును ప్రభూ
అంబానీలు మెచ్చినవాడూ, జనాన్నంతటినీ మూకుమ్మడిగా ఏకతాటిపై నడిపించెడివాడూ, మాయలఫకీరు వంటి వాడూ అయిన నాయకుని కోసం నా దేశమిప్పుడు కలవరిస్తోంది