చితికిన రెక్కలతో ప్రాణం రెపరెపలాడే పక్షి
అది ఎగరదు
ఎగరకుండానూ ఉండదు
ఉపమానాల కంచెకు ఆవల
ఒక్కడే తాను-
తన కొసమే నేను ఎదురు చూస్తుంటాను
తన జాములకై ఆలోచనల దొంతరను ఖాళీ చేసి
ఒక ఖాళీ పాత్రనై ఒదిగి నిలబడతాను
తను మాట్లాడడు
మాట్లాడకుండానూ ఉండడు
రెండు కొసలనూ దాటుకొని పారే
బరువైన భాషా సంచయమొకటి ఎప్పుడూ తన భుజాలపై
మాట్లాడనపుడు కరగని శిలా సదృశ్యమై
నోరు తెరిస్తే కిర్రున తెరుచుకొనే శిథిల ద్వారావశేషమై
ఆ తేడా ఏదో కావాలి నాకు
కొద్దిగ గడప దాటితే ఒక కొత్త లోకానికి దారి తెరుచుకొనే
ఆ పలుచని పొర ఏమిటో తెలియాలి నాకు
ఒక మనిషి తనకు తాను తునకలై
వాటన్నింటినీ కలిపే సూత్రమెక్కడో మరచి-
నిజంగా తను లేకపోతే
నిస్తేజమైన జీవితపు నిత్య రద్దీలో అగ్గి పిడుగులవంటి తన అడుగులు లేకపోతే
నన్ను నేను కనుగొనే తోవ ఏది?
లయగీతమై, వాదర చివరల విచ్చుకొనే గాయపు పువ్వై
అడుగుల సవ్వడికి తెరచుకొనే బాటల సంకేత లిపియై
దూరాలను చెరుపుకుంటూ దిక్సూచిలాగా అక్కడ తను లేకపోతే
ఈ జీవికిక ఏది ముక్తి, విశ్రాంతి?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి