3, డిసెంబర్ 2011, శనివారం

not a poem


సగం కొరుక్క తిన్న జామకాయ

మధ్యలో కంత ఉన్న ఇనుప బిళ్ళ(దేనికి వాడతారో తెలియదు), నొక్కులు నొక్కులుగా పగిలిన గాజు గోళి( ఆటలో అచ్చొచ్చిన గోళీ అని సమాచారం),
మందపాటి ఒక దారపు తుంట

నీ జేబులోనో నా జేబులోనో ఉండవు కదా ఇవన్నీ

దేనికది
అన్నీ చేతితో తాకగానే కదిలే ప్రాణమున్న వస్తువులు

ముట్టుకొని, అనుభవించి, వేలి కొసలతో సంధించి
వాడు వాటన్నింటితో మాట్లాడగా చూసాను
తానై వాటన్నింటికీ ప్రాణ ప్రతిష్ట చేసి, తిరిగి వాటి మధ్యన నిలబడి,  దొర్లుకుంటూ నృత్యం చేసే రంగుల గోళీ అవడం
ఈ రోజు చూసాను

వాడి పడేయడం మాత్రమే మనకు తెలుసు

ఒక దాన్ని సేకరించి, అపురూపం చేసి భద్రపరచి
తరవాతి నాటికి ఒకటి రెండవుతాయని
చదువుకున్న మనుషులం మనం ఊహించలేం కదా

ఊహకు ఈ లోకం చాలకపోవడం ఈ రోజే చూస్తున్నాను


పుస్తకాలను ఇటుకలుగా చేసి కట్టిన బంధిఖానా గోడలపై ఆడే నా సీతాకోకా

మెడకు తగిలించుకొచ్చే నీ సంచిలో
బందులు ఊడిపోయిన బోడి పలక మాటున ఏముందో
నన్నెప్పుడు చూడనిస్తావు?


2 కామెంట్‌లు:

  1. back ground మార్చు నాయనా అది కనపడక నిజంగా కవిత కాకుండా ఉండిపోగలదు/.....

    రిప్లయితొలగించండి
  2. అద్బుతమైన కవిత్వం
    మంచి భావుకత
    లోతైన పదచిత్రాలు, అభివ్యక్తి

    అభినందనలు సోదరా
    బొల్లోజు బాబా

    రిప్లయితొలగించండి