29, సెప్టెంబర్ 2011, గురువారం

ఆంతరంగికం


కారణమేదీ లేకుండానే కలిగే దుఃఖం

ఆవరణలో అది పొగమంచో లేకుంటే అలుముకున్న మేఘమో  
చెరిపేస్తే చెరగదు  ఆపేస్తే ఆగదు

చుట్టూ పలుచని పారదర్శకపు పొర
కురిసీ కురవనట్టుగా కురిసే అతి సన్నని తుంపర
   
ఇది   తడపదు
తడిచి ముద్దవనీదు
ఒకచోట పట్టినిలిపి లోపల పోగుపడినదాన్నంతా
కడిగి పారేసే కుండపోతవదు

సమస్త వ్యాపారాలలో ఉండీ ఉండని స్పృహగా                                                                                                                          
చదివే పంక్తుల నడుమ  విరామమై
నడిచె పాదాలు చేసే ధ్యానమై
అది ఏకాంతమో రాలిపడే పూవు సడిలో నిశ్శబ్ధ  గానమో

ఇది ఎంతకూ తెగదు

ఎడారిలో ఒంటరిచెట్టుకొమ్మ గీచే శూన్యంలా

ఇది సృజన ఇది ప్ర్రాణ సంస్పందనలలో గింగురుమనే మహా నాదం
ఇది అటూ ఇటూ పడిపోకుండా నిలిపే చుట్టకుదురు
                                                                                                     

26, సెప్టెంబర్ 2011, సోమవారం

అసమ్మతి



ఎక్కడో ఇరుక్కొని ఉంటాము

పాతబడి దుమ్ముబారి పెళుసులుగా విరుగుతున్న
గోదుమరంగు పేజీల నడుమ
చిన్నప్పుడెప్పుడో దాచుకున్నవన్నెల  నెమలి కన్నులా

ఎప్పటిదో ఒక పాటలా
గొంతుకలో  ఉండీ ఉండీ ఊరుతుంటాము

సుడి తిరుగుతూ ఒక జీరగా
క్షణ మాత్రమే అయినా అప్పటికది
మన లోపలి బీటలు వారుతున్న ఏకాంత గృహంలో
మనకు తెలియకుండానే  పెరిగి ఒక పలకరింపై
మెల్లగ తలనూచే గడ్డి పువ్వులా

ఏవో  తెలియని గాయాలతో
సంచరిస్తూ ఉంటాము

బొటనవేలు పగిలి
చిత్తడయిన పాదాల ముని వేళ్ళతో
ఒక సలపరాన్ని దారి పొడువునా అద్దుతూ
కొనసాగడమొక్కటే ఉపశమనమై జ్వలించీ జ్వలించీ
నెమ్మదినెమ్మదిగా బూడిదబారే వేయి తలల మహా కేతనంలా

ఎప్పుడూ మనం ఎదురీదుతూనే ఉంటాం

కృతకత్వమొక్కటే క్షణానికొక్క ముఖంగా
జగన్మోహనమై ఎల్లెడలా పరివ్యాపితమయ్యే వేళల
శిథిలమై విరిగిపడే ఒక మహా వృక్షపు
పెళపెళారావంలో లయమొందుతున్న ఆత్మలా

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఒకోసారి


కొత్తవేవీ లేవీ పూటకు
దహించివేసిన కొన్ని ఆనవాళ్ళు తప్ప

అన్నింటినీ వదిలించుకోలేము
శరీరంపై పారాడే సన్నని వణుకులా

ఒకోసారి పడీపడీ నవ్విన వాటినే
మరోసారి పావురాయిలా రెండు అరచేతులకెత్తుకొని బావురుమని రోదిస్తాము

గొంతు తడపడానికి
కాసిని మాటలు తీసుకొని ఎవరైనా వస్తారని ఎదురుచూపు


చాలా సార్లు ఊరకనే దుఃఖిస్తాము
మనిషి మూల వ్యాకరణమని తెలియక







11, సెప్టెంబర్ 2011, ఆదివారం

స్మృతులు


మూడు తరాల జీవితం

కొందరు స్త్రీలు
కొందరు పురుషులు


ఒక్కో  దాన్నీ దాటుకుంటూ
ఊరు వెంట ఊరు
మజిలీ వెంట మజిలీ

జాడలేవీ మిగిలి లేవు
నడచిన దారిని తుడుచుకుంటూ
అడుగు వెంట అడుగు

రోజులు మరుగున పడిన ఙ్ఞాపకాలు
యతలు సుషుప్తిలో జోగుతున్న శకలాలు
మనుషులు ఒకప్పుడు ఎక్కడో
సొంతమన్నది ఏమీ లేక తిరిగి తిరిగి
మట్టి గర్భంలో పొరలు పొరలుగా  మలిగిపోతున్న ఘోషలు

అనామకత్వం
ఎప్పటికీ చెరిగిపోని సంతకం

ఎక్కడా ఒక గుర్తు కూడా లేకుండా చెరిగి పోవడం
ఒక స్మృతి గీతికకు గొంతు కలిపి పాడడం

8, సెప్టెంబర్ 2011, గురువారం

దిమ్మరి


నడిచే పాదాల వెంట తెరుచుకునే దారులేమిటి

ఇక్కడ కరిగి మరెక్కడకో దారితీసే
ఈ క్షణానికి తుది ఏమిటి

రోజూ నడిచే దారులే
అన్నీపరిచయమున్న ముఖాలే

అయినా అడుగు తీసి అడుగు వేసేసరికి
ఎప్పటికప్పుడు నోరు తెరిచే తెలియని కీకారణ్యాలు

ఏది ఎలా రూపొందుతూ ఉంటుందో తెలియదు
కనిపించే రూపం వెనుక తొలచుకుని పెరిగే ఏదో ఊహించని
మాయా మంత్రజాలం

అయినా చివరకు ఏమవుతుంది

ముసిరే దుఃఖం వెనుక మృత్యువు
పగిలే ఒత్తిడి వెనుక మృత్యువు
వీడని అన్వేషణల వెనుక మృత్యువు
సాగే జాడల వెనుక మృత్యువు

సదాసదాసదా మృత్యువుమృత్యువుమృత్యువు

అయినా చివరకు ఇంతకు మించి మరేమవుతుంది

తెలిసిన ముఖాలలో తెలిసిన దారులలో
తెలిసినట్టే ఉండి తెలియని దాన్ని, ముసుగులా కనిపించీ కనిపించనిదాన్ని
ఎప్పటికది భారమై భళ్ళున చేజారుతుందో తెలియనిదాన్ని
నువు ఎలా సంబోధించి, ఏమని పూరిస్తావో కదా ఈరోజుని

ఎల్లెడలా పరివ్యాపితమైన మృత్యువుకు
మనుషులు అనేకానేక నీడలుగా
కవీ దిమ్మరీ
మానవుడా మానవుడా






7, సెప్టెంబర్ 2011, బుధవారం

అందరూ గొప్పవాళ్ళవుతున్నారు


అందరూ అమెరికాకు వెళ్తున్నారు
లేదా వెళ్ళి వస్తున్నారు

ఇంకా ఎప్పుడు నేను వెళ్ళడం


యాంటీ ఇంపీరియలిజమ్ పోయమ్
ఒకటియ్యిరా అని ఫ్రెండ్‍గాడొకటే నస
పాత కాగితాల కట్టలో పనికొచ్చేవేమైనా ఉన్నాయేమో చూసుకోమనాలి
ఎంతైనా అవుటాఫ్ సీజన్ కదా

ముందు అక్కడ మనకు పనికొచ్చే వాళ్ళని పట్టుకోవాలి
అందరూ వెళ్తూ మనమొక్కరమే మడికట్టుకొని
ఎన్నాళ్ళీ ఉపవాసం

ముందు మనం పేర్లోకి రావాలి
మన కులంలో అయినా మనకు పనికొచ్చేవాడెవడైనా తగుల్తాడేమో చూడాలి

ఎన్నాళ్ళు వృధా అయ్యాయో కదా
ఒక పేరూ లేకుండా ఒక అమెరికా లేకుండా

ఇంకా ఎన్నాళ్ళని
ఇలా మూలన పడి ఉండడం
ముందు మనం అమెరికాకు వెళ్ళాలి
ఉద్యమాలూ, తొక్కా రోజూ ఉండేవే కదా
ఈ రోజు కాకపోతే ఇంకో రోజు

ముందు మనం అమెరికాకు వెళ్ళాలి

మద్యలో ఈ ఫ్రెండ్‍గాడొకడు
కవిత్వమో అని మొర పెడుతుంటాడు

వీసా పాస్‍పోర్ట్ అన్నీ లైన్ క్లియర్ చేసుకోవాలి
ముందు మనం అమెరికాకు పోవాలి

సెటిల్‍మెంట్ సంగతి తర్వాత
కనీసం ఒక్క సారన్నా అమెరికాకు వెళ్ళోస్తే కదా
జన్మకింత సార్ధకత

పిల్లలు, కెరియర్
కులం, ఉద్యోగం, అమెరికా అన్నీ సమానార్థాల పద పట్టికలో
ఇంకా ఎందుకు చేర్చరో కదా

,చదువు, అభిరుచి, అవకాశం, మేధో వికాసం, అమెరికా అన్నీ ఒక్కటే కదా

ముందు మనం అమెరికాకెళ్ళాలి
చంకలెగరేసుకుంటూ
రెక్కల్ని మొలిపించుకుంటూ
జెండాల రెపరెపల జ్వాజ్వాల్య ధగధగలను
ఇరుసుగా చేసుకుంటూ, దొళ్ళుకుంటూ
ఎలాగైనా మనం అమెరికాకు వెళ్ళి తీరాలి

ఉండహె,మధ్యలో ఈ ఫోను-

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

నిశ్శబ్ధం


వికసించే
పూవు తాలూకు నిశ్శబ్ధం

అఙ్ఞాత పూల రాతిరిలో
పేరు తెలియని పరిమళం

సన్నని దారులలో
దిసపాదాలను దాటి పై వరకూ అలుముకున్న మట్టి గోరింట

ఏకాంత దీవులలో
చెట్టూ కొమ్మల నడుమ సేద తీరే మలిసంధ్య సూరీడు

కనిపించని చే దీపమై
నడిచినంతమేరా నాతో పాటూ కదిలే
లేలేత చందమామ

అర్థ తాత్పర్యాలూ
విరామ చిహ్నాలతో పని లేని కాసింత కవిత్వం


3, సెప్టెంబర్ 2011, శనివారం

నీకొక కవిత బాకీ


కొన్ని పదాలను పేర్చి వాక్యాల పొత్తిళ్ళలో
ఒక చిన్న మొక్కను
తన లేతపాటి ఆకులతో మృదువుగా చేతులు చాచే ఒక చిన్న మొక్కను నిర్మించగలమా?

బండబారిన ఈ చేతులతో
రోజూవారీ అనేకానేక చర్యలతో పలుమార్లు మృతప్రాయమై
దేహానికి ఇరువైపులా రెండు కట్టెల మాదిరి వేలాడే ఈ చేతులతో
దినానికొక్కతీరై పైపైకి సాగే ఒక చిన్న మొక్కను ఊహించగలమా?

ఎప్పుడో కొన్ని యుగాలకావల
ఙ్ఞాపకాల పొరల లోతుల్లో ఒత్తిగిలి
తన చేతులతో నాటిన ఓ చిన్ని మొక్కను
ప్రతి రోజూ లేచీ లేవగనే పక్కబట్టల మీదనుంచి పైకురికి
తనదైన ఆ చిన్ని అద్భుతం ఆ రోజుకుగాను
పచ్చని పలకరింపై ఏ మేరకు విస్తరించిందోనని
ఎదిగే ఆ పసిమి లోకం ముందర మన్నులో గొంతుకూర్చొని-

ఇప్పుడు ఈ చేతులలో
ఆకుపచ్చనివేవీ  పురుడు పోసుకోవు
నీటితో తడిసి  గాఢతనలుముకునే  మట్టి చారికలేవీ మిగిలిలేవు

ఇది ఒక శుష్క ప్రయత్నం

ఒక బాల్యంలాంటి
అటూ ఇటూ పరిగెత్తుతూ, అప్పుడప్పుడూ పాల తుత్తర తీరని ఏనాటివో స్మృతులతో
అమ్మ పాలిండ్లపై గారాంగా  మెత్తగ తడిమే పాపాయి చేతుల లాంటి
అపురూపమైనవేవీ ఈ కవితలలో పలకవు
చెక్కిళ్ళ మీద జారిన పాలచారికలలాంటి  ఙ్ఞాపకాలనేమీ ఈ పదాలు పుక్కిట పట్టవు

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఇప్పటికి


రాసిన
వాటి మీద
అసంతృప్తినెలా పలకడం

ఒక్కొక్క అక్షరమూ
పొదిగిన వేలి కొసలనెలా తెగ నరకడం

నాలిక మీద
చెమ్మను అరచేతి కలుముకొని
పలక కొసల దాకా
ఆసాంతం తుడిచే పసి బాలుడి ముందు
చేతులు కట్టుక నిలుచున్నాన్నేను