31, జనవరి 2015, శనివారం

ముద్ద


   
1

తన తోకను తానే తింటూ ఉంటాయి పాములు

చుట్టలు చుట్టలుగా సున్నాలు సున్నాలుగా



రోజులకు అవల పాడుతోన్న గొంతుకతో

ముడతలు దేలిన దేహపు ఒకలాంటి వాసనతో జేజి అంటోంది కదా

కాలచక్రమిది నాయనా తిరిగి తిరిగి వచ్చు మలిగిన ఎముకల లోకపు ఊపిరి దారుల

కొత్తగ చక్ర గతిని –


2

బొత్తిగా చదువన్నదే లేని సాధారణ స్త్రీ



ఏళ్ళ తరబడి శ్రమలో కొద్ది కొద్దిగా నడుం వంగుతూ

ఒక ఆవిరిలాగా  ఆవరణంలో కలగలిసి తను తిరిగిన ఊళ్ళూ, తన పాదాల కింద

పచ్చబారి పండి ఒరిగిన నేల, స్తన్యంలోని సారంలా బొట్లుబొట్లుగా శరీరం

నుండి   ఎదిగి విస్తరించిన ఆమె సంతానం-అంతా ఒక ఙ్ఞాపకంలా నెమ్మది

నెమ్మదిగా  కరుగుతున్న నేపథ్యం

తను పాడుకున్న పాటలాగా తనను దాటి ఒంటరిగా సుదూరాలకు  విశ్వ అవనికపై

ఒక్కడినై తిరుగుతుంటాను



పయనిస్తున్న దారిలో చేరాల్సిన చోటును మరచిన తడబాటులాగా

నిశ్చేష్టత ముప్పిరిగొని కాసేపు ఊరికే అలా వొట్టిగా నిలుచుంటాను



స్థల కాలాల కొలమానాల వెలుతురులో నన్నూ నా చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ

కొలిచి లెక్కలుగట్టి మరీ ఇచ్చినదెవరా అని తేరిపార పసి పిల్లవాడికళ్ళతో

సంభ్రమగా చూసుకుంటాను


3

ఈ లోకం ఒక ముద్ద

జీవితపు తొట్టతొలి ఉనికి కదలబారి

తొణకిసలాడుతూ తన కొసల చివర మృత్యువును రాసుకొని తిరిగి తనలోకే ముడుచుకుంది



ఈ రోజు కురిసిన చావు నిజంగా ఈరోజుదేనా అని అనుమానం కలిగించేలా

ఎప్పటిదో ఆ మేఘం ఒక తండ్రి దుఃఖంలాగా ఇవాళ కూడా అదేమాదిరిగా ఆవరించి ఆకాశమయి ఉంది



అతి దగ్గర నుంచి గురిచూసి కాల్చిన తల, బయొనెట్ పదునంచుకొసలపై దూసిన గడ్డి పూవు



ఉండి ఉండి వీస్తున్న ఇప్పటి గాలిలో అదే అనాది ప్రాణం మెసలిన చప్పుడు



నడుస్తున్న దారికి వేలాడుతున్న శిలువలా  అంతా ఒక్కలా అలుముకపోయి మేకులు

దిగుతున్నప్పటి  శరీరపు జలదరింపు


4

తరుచూ చప్పున పేర్లు  గుర్తుకు రానట్టుగానే

ఈ రోజేమిటని ఎవరన్నా అడిగినపుడు కూడా అంతా అయోమయమే ఎప్పుడూ నాకు



మరచి పోవడంలోని కాలిక స్పృహను మాత్రమే గొంతుకు బిగించి ఉంచి

ప్రాణం కొడిగట్టుకపోయేలా అంతా ముద్దలా అలుముక పోవును గాకాయని

ఎవరో నన్ను బహు కక్షగా  శపించారు



ఇక ఎప్పటికయినా నేను ఇలా మాత్రమే రాయగలను-



“అతడు రేపు చనిపోయాడు”

“నేను నిన్న ఒక్కడినై తిరుగుతాను”

22, జనవరి 2015, గురువారం

కుక్క అంటే ఏమిటి?






1

ఈ నడుమ మా చిన్ని పాప తరుచూ ప్రతీ దానికీ కుక్క అనే పదాన్ని చేరుస్తుంది

మూడేళ్ళ పిల్ల, బొత్తిగా భాషాపాటవం తెలియనిది

ఇప్పుడిప్పుడే బడికి పోతూనో (హతవిధీ) పోబోతూనో

పోలేకనో, పోకుండా ఉండలేకనో ( దాని చేతుల్లో ఏముంది ) కింద పడి దొర్లి, కాళ్ళూ చేతులను నునుపాటి గట్టి గ్రానైట్ బండ మీద

ఇష్టారాజ్యంగా తపతపా విదిలించి కొడుతూ ఎక్కడ దెబ్బ తగులుతుందేమోనని గుండెలదరింపజేస్తూ

తన రోజు వారీ మాటల సమయాలలో అంటుంది కదా-

ఎక్కడికి పోయినావే కుక్కా, కుక్క నాకొడకా-

"ఇంక ఏమి తింటవ్ తల్లీ?"

కుక్క తింట-

"ఇట్లయితే ఎట్లనే?"

కుక్కనే-

2

ఇంతకూ కుక్కా అనేది ఏ భాషావిశేషం?


పదే పదే మాటల తొక్కిసలాటలలో ఇరుక్కపోయిన భాషా క్రీడగానో, క్రీడించే సమయాలోకి సంభాషణగా కరిగే భాషగానో

మాటలుగా, వాక్యాలుగా అర్థాలు చెదిరి, అర్థాలతో పాటుగా సన్నివేశమూ అందలి పాత్రలూ చెదిరి

ఎటూ పొసగనీ లేదా ఇమడని ఉధ్విగ్నతలలోనికి పొగమంచుగా పాకి

విఫల యత్నమై బ్రహ్మ రంద్రాన్నిపగలగొట్టుకొని శూన్యంలోనికి పెగిలే నిట్టూర్పులా ప్రయత్నిస్తున్నపుడు


మనుషుల రణగొణ ధ్వనులలో మాటల బండరాళ్ళపై పడి

నాకూ కాళ్ళూ చేతుల్ని టపటపా కొట్టుకోవాలనిపిస్తుంది


కుక్క మాటలు

కుక్క సంభాషణలు

కుక్క కవిత్వమూ అని రాయాలనిపిస్తుంది

18, జనవరి 2015, ఆదివారం

ఇది ఎప్పుడో ఇంతకు క్రితమే జరిగింది



ఇది ఇప్పుడు జరిగినది కాదు

మనం మన పడక గదుల్లో పిల్లలతో పాటుగా లోకంలో ఉన్న సిలబస్ సమస్తాన్నీ
తిరగేసి మరగేసి కుస్తీపడుతున్నప్పుడు

మనలాగే ప్రపంచమూ, కలలకూ భవిష్యత్తుకూ  కొత్త అర్థాలు తొడుక్కుంటున్నప్పుడు

తుపాకీ కొసల మీద అలుముకుంటున్న ఆకాశపు ఉనికిలా
ఇది ఎప్పుడో ఇంతకు క్రితమే  జరిగింది



ఇది ఇప్పుడు జరిగినది కాదు

బతుకును ఓ  పోటీలా నిర్వచించుకొని
దరిదాపులకు ఎవ్వరూ రానివ్వకుండా చుట్టూ గోడలు కట్టుకొని సాగుతున్నప్పుడు

మనలాగే ఈ లోకమూ ట్రాఫిక్‍లో ఇరుక్కపోయిన స్వప్నంలా ఊపిరాడక అటు ఇటూ మెసలుతున్నప్పుడు

విలువల పదునంచు చివరల వేలాడుతున్న  భూగోళం పువ్వులా
ఇది ఎప్పుడో ఇంతకు క్రితమే జరిగింది


ఇది ఇప్పుడు జరిగినది కాదు

ఒక సంఘటనగా మన కాలంలోనికి చొరబడి
పుస్తకపు పేజీలలో దాచి ఉంచిన నెమలికన్నుల వెంట నెత్తురు వరదలై పోటెత్తి హద్దులను ఊడ్చుకపోతున్నప్పుడు

మనలాగే ఈ చుట్టూ ఉన్న సమస్తమూ దీనినొక నిశ్చితమైన వ్యాఖ్యానాన్ని సిద్ధం చేసుకొని సమాధాన పడుతున్నప్పుడు

తనను తాను పెకలించుకొని తన వేళ్లను చూపెడుతున్న చెట్టు తల్లిలా
ఇది ఎప్పుడో ఇంతకు క్రితమే జరిగింది