30, డిసెంబర్ 2012, ఆదివారం

కూతురు ప్రశ్న





ఒక దృశ్యానికేసి చూపుతూ మర్మాంగమంటే ఏమిటని
ఏడేళ్ళ కూతురు అడిగిన ప్రశ్నకు
దూరంగా ఉదయం నుండి తిరుగుతున్నాను

ఒక్కో పూవునూ ఏరి కూర్చి కథా మాలికలను
దిగంతాలకు పరిచినట్టో

ఒక దృగ్విషయపు లోతులకు దూకి
పొరలను తొలుచుకొని కాంతియానం చేసినట్టో కాదు కదా

అదే పనిగా ఎవరూ చెప్పకపోయినా
సరిగా కూర్చోవాలనీ దాచ్చుకున్నట్టుగా తిరగాలనీ తన చుట్టూ ఉన్న వారిలోనే తప్పుక తప్పుక తిరుగుతూ
జీవన క్రియలనూ జీవితాన్నీ సాగించాలనీ
నేర్చుకుంటున్న నా బిడ్డ అడిగిన ప్రశ్నకు నా దగ్గర మాటలు లేవు

దుఃఖం కూడా స్థంభించి లోపలి అరలలో దగ్ధమవుతున్న మంట
పేగులు తెగి దేహం ఒరుసుకపోతూ స్థల కాలాదులను అధిగమించి విస్తరించే గాయపు స్పృహ

మెదడు రసి కారుతున్న పుండులా జిగటలు వారుతోంది

ఈ రోజును పెగల్చుకపోయే ఒకలాంటి మౌనంతో మూసి ఉంచగలను గానీ
బహుశ కొన్నాళ్ళకు ఆమెకు ఇలా చెబుతాను

తల్లీ,  ఇది పవిత్ర భూమి
అయితే ఇక్కడ యోనులలో తాగి పడేసిన సీసాలను జొనుపుతారు

 స్త్రీలను తల్లిగా చెల్లిగా పూజించడంతో పాటుగా
మర్మాంగాలను కర్రలు, కడ్డీలు పెట్టి తిప్పినా కుతి తీరని మార్మిక రంద్రాంశాలుగా తలపోస్తారు

గఢీలలో తెలియని కోటగోడల ఆవల

సత్యాహింసలను ప్రబోధించిన మహాత్ముల శిలాహృదయాల ముందర
బరిబాతల భయ విహ్వల విహంగమై ముడుచుక ముడుచుక పోయి నీ దేహం  వందే మాతరమని నినదించి ప్రాధేయపడింది

గుజరాత్ కాషాయపు నడి బజార్లలో కశ్మీర్ ప్రాయపు విచ్చిత దేహాంగాలలో తలవొంచని ఈశాన్యపు గాలులలో
దేశభక్తి మువ్వన్నెల జెండాగ మురిసి మన గగనాలను అలంకరించింది

పట్టెడు మెతుకులు అడిగినపుడో
ఒక విశ్వాసం ఊపిరిగా నిలబెట్టినపుడో పట్టి పట్టి పాలిండ్లను పిసికి బాలింతతనానికి పరీక్షలు పెట్టింది

ఒకటేమిటి, దేశమే ఒక ప్రశ్నగా మారి సందేహం వచ్చిన ప్రతీసారీ
తనను తాను పోల్చుకోవలసివచ్చిన ప్రతి సందర్భమూ
తొడల మధ్యన ఆవిరులెత్తే ఉన్మాదపు మృగయానందమై చిందులు వేసింది

ఒకరిద్దరు  కాదు
ఒక్క సందర్భమూ కాదు

ఈ పూటకు దహించి నిలుచుని చీల్చుక పోయే జీవితపు క్షణాలను అనుభూతికి తెచ్చిన మన సగం ఆకాశమని తనకు జవాబు చెబుతాను

ఒక కాలానికి
రాజ్యమే నగ్నతను సింగారించుకున్న అంగమని తను తెలుసుకుంటుంది



25, డిసెంబర్ 2012, మంగళవారం

గెలుపు మన కాలపు అవసరం




గెలుపు మరీ ముద్దొస్తుంది
మత్తెక్కిన దాని వాసనలో లోకం కవి పులకాంకితమవుతుంది

వేల పరాజయాల నడుమ నువొక్కడివే గెలుపు గుర్రంపై ఊరేగే ఊహ
నిన్ను చిత్తుగా లోబరుచుకొని తన్మయత్వపు డోలికలపై
ఊపుతున్నప్పుడు ఈ కాలానికి ఒకే ఒక్క లక్ష్యం ప్రకటితమవుతున్నది

చావు, హననం, మృత్యు క్రీడ
దౌర్భాగ్యుల ప్రారబ్ధం

గెలవడమెట్టాగో చూడు
ఒక్కో గెలుపు కథనూ పుక్కిట పట్టు
గెలవడం కల
గెలుపు కళ

ఆవరించుకున్న ఆకాశం దాటి
విస్తరించుక నిలుచున్న దృశ్యాలను దాటి
చెట్టును దాటి చెట్టు కొమ్మలను దాటి
వొంటిగ నిలుచున్న పక్షికన్నును చేధించే
 అర్జునులవడం ఇప్పటి అవసరం

మృత్యువును అవతలికి తొయ్
చేతులకంటిన నెత్తురు కడిగి పారెయ్

గెలిచిన వాళ్ళను కావలించుక తిరగడం
నువ్వే గెలుపయినంత పుణ్యం

వచ్చిపొయ్యి ఒట్టిపోయిన కాలానికి
నువ్వే ఒక మోడీ అవ్వచ్చునో ఏమో

16, డిసెంబర్ 2012, ఆదివారం

దుఃఖపు భాష



ఈ రోజు నీ భాష కొంచెం మృత్యు వాసన వేసింది

కొన్ని పదాలలో లుంగలు చుట్టుక పోయిన నొప్పి

ఆవరణమంతా వ్యాపించి

దిగులు ధూపంలా నన్ను చుట్టుకొని నీ ఉనికిని పదే పదే స్పురణకు తెచ్చింది


కొన్ని సమయాలలో

భాష ఒక్కోలా ఎందుకు ధ్వనిస్తుందో ఒక్కో తావిని తన చుట్టూ ఎందుకు అద్దుకుంటుందో

నేను చెప్పలేను బహుశా నీవు కూడా


ఒక కాలం మనుషులను కలిపే వంతెనగ మారి

ఒక దుఃఖం నీకూ నాకూ సామూహిక చిరునామాగా నిలచి

పెగలని మాట, వొడలని అశాంతి

ఉనికిగా ఎందుకు రాజిల్లుతుందో మనం చెప్పలేం


ఎవరు ఎప్పుడు ఊహించడం మొదలు పెట్టారో తెలియదు గానీ

ఒక బాధాకర క్షణానికి తెగిపడే ముగింపుగా చావును


మనుషులు చావును ఏ స్వరంతో కోరుకున్నా

ఏ ఙ్ఞాని ఏ విధంగా అంతాన్ని వర్ణించి చెప్పినా


తెలియని ఆ ఉద్విగ్నత

ఎప్పడూ  జీవితాన్నే చూపుడు వేలుగా నిలబెడుతుంది



ఎల్లెడలా అలుముకపోయిన

అపసవ్యపు భారం

భుజాలమీద మోయలేనిదిగా చిత్తరువు కడుతుంది

 

11, డిసెంబర్ 2012, మంగళవారం

కట్ల పాము స్వప్న వృత్తాంతము




మచ్చల రాత్రులు
తెల్లని పవళ్ళు
చుట్ట చుట్టుకొని పడుకొని ఉంది కట్లపాము

సన్నని కదలిక ఏదో
పారదర్శకమై
పొరల డొంకపై పడి చెల్లాచెదరై

చలివారిన చీకటి జాముకు మూలగ
సన్నని కలుగులో
మెదిలే సుప్త చేతనంలో

తెరలు తొలిగి
దారులు కరిగి
సంకెళ్ళు తెగి
గీతలు దాటి
సంలీనమవుతున్న రంగుల చీకటి

మెలికలు తిరిగిన కలలప్రవాహపు వడిలో
ఎటుపోతున్నదీ ఎరుగని
కట్ల కట్ల కదలిక

చీలిన నాలికల కొసల
చీకటి పాడిన మహత్తర గానం

నిజంగా
ఉన్నది ఒక్కటి కాదు


10, డిసెంబర్ 2012, సోమవారం

జాడ









ఇక్కడ నిన్నుకలుస్తాను



బహుశా ఒకే శిక్షకు గురయిన ఇద్దరు నేరస్తులు మాట్లాడుకుంటున్నట్టుగా, వేళ్ళను కాసింత లోపలికి జొనిపి కొసలకంటిన నెత్తుటిమరకలనూ,కనుకొలుకులలో  ఆరని తడిని ఏదో గొప్ప పనిలో పడి యధాలాపంగా  తుడుచుకుంటున్నట్టుగా



ఇక్కడ నిన్ను కలుస్తాను



మాటలలో పడి,  ఉత్తి మాటలతో మాటాడీ మాటాడీ చివరకు ఎదురుబొదురుగా కూర్చుని అసహాయపునీడ అద్దంలో  ఎవరినివారు చూసుకుంటూ    మోకాళ్ళ నడుమ తలకాయలిరికించుకుని నేలపై వేళ్ళతో ఏవేవో గీతలు గీస్తూ  ఉన్నట్టుండీ దిగ్గున లేచిపోయే ఆ ఇద్దరినీ చూసి పెగిలీపెగలని సన్నని నిట్టూర్పేదో నీకు మాత్రమే తెలిసిన అర్థంతో నీ నుంచీ తొలుచుక వచ్చేందుకు వేదన పడుతున్నప్పుడు



ఇక్కడ నిన్ను కలుస్తాను



కేవలం కవిత్వం  కోసం, కవిత్వం తప్ప మరేమీ కనపడక గుంపులో తల్లి చేతిని విడవకుండా ఒక అప్రమత్తత ఏదో సన్నని వణుకై తన సన్నని లేత  వేళ్ళతో  పట్టుకొనజూసే పిల్లవాడిలాగా ఒకింత బేలగా, ఇంకా నిను కని పెంచిన తల్లి ముందరయినా దిగంబరంగా సాగిలబడగల ధైర్యాన్ని ప్రోది చేసుకుంటూ,  అపుడపుడయినా జీవితం ముందర భుజాల మీద చేతులు వేసుకుని మాటాడే వాడొకడికోసం వెతుకులాడుతూ



ఇక్కడ నిన్ను కలుస్తాను




6, డిసెంబర్ 2012, గురువారం

రాముడిచ్చిన తీర్పు





ఒకసందర్బాన్ని విశ్వరూపవిన్యాసంలాగా నువ్వు ఊహిస్తావు
కొన్నిపదబంధాలతో రూపుకట్టేందుకు గొప్పప్రయత్నం చేస్తావు

దేహాన్ని చుట్లుచుట్టి బంధింపజూసే
కొండచిలువ ఉచ్చ్వాసనిచ్చ్వాసాల ఊపిరివేడిని
బాధిత ముఖంపై జారిపడే మృత్యుధారగా నువ్వు చిత్రిస్తావు

ఆ క్షణంలో నువ్వే ఒక గొర్రెపిల్లవుగానో మరో అల్పాతి అల్పమైన ప్రాణివిగానో
కడగట్టుకపోయే ఊపిరియై అలమటిస్తావు

లిప్తకాలిక ఉద్వేగభరిత భ్రమ

నదులన్నీ సముద్రోపగతమయినట్లూ
జీవితం ఒక్కబాటగ కలగలసి కొనసాగుతున్నప్పుడూ

రాముని ధనుష్టంకారమే లీలగా
కనులముందర  యుగధర్మమై సాక్షాత్కరిస్తున్నప్పుడూ

నువ్వు  నిలుచున్న నేల
నిన్ను ఒక మామూలు చూపుతో అనుమానితునిగా నిర్ధారిస్తున్నప్పుడూ

నీకు అవతలగా నువ్వు ఏది మాత్రం రాయగలవు

ఇది మహాయుద్ధం
నువ్వు ఎక్కుపెట్టిన బాణానికి గురిగా ఎప్పటిలాగే ఇంకో నువ్వు

ఇది నిన్ను నువ్వు ఖండఖండాలుగా తెగనరుకుకొని
తిరిగి మళ్ళీ నెమ్మదినెమ్మదిగా ఒక్కొక్క ముక్కనూ తెచ్చి అతికించుకునే
బీభత్సకర అతి సృజనాత్మక జీవన దృశ్యం

తెలిసితెలిసి ఒక మాటకు ఇంకో మాట బదులిచ్చినంత తేలికగా
ఒక పద్యాన్ని రాయడం -

రాస్తూ రాస్తూ ఉండగానే
ఈ చేయి రెండు పీలికలుగా విడిపోయి నిన్ను నిస్సహాయుడిని చేయడం -

ఇది తరాలతరబడి కొనసాగుతున్న పోరాటం
రాముడు సర్వాంతర్యామియే కాదు
ఆయన బహురూపి

హనుమంతుడి హృదయ పటంపై కొలువుండినట్లుగానే
ఇదిగో ఇక్కడా వాని సంతకం






2, డిసెంబర్ 2012, ఆదివారం

అన్వేషణ




పొరల రాతిరి తిరిగి తిరిగి
దారులన్నీ చెరిగి
కలగలసి కదలని డొంకయి
వెతుకుతామా ఒక తెన్ను కోసం-

దొరకదు
కలిపికుట్టగల మాట
పలుకదు కొసల చివరల చెదిరి కలవని బింబపు ముడి

దృశ్యం విరిగి తునాతునకలై పరిపరి విధాల పగిలిన అద్దంలో
కొంచెం కల కొంచెంవిరామం
సుప్త చేతనం కలవరం భయం వాంచాన్వితం

ఒక చోట మొదలుపెట్టి ఎక్కడికో ఇక తోవ
గిర్ర్రున తిరిగి రంగులు అలుముక పోయిన తెల్లని చీకటి

కళ్ళు వెతుకుతాయి ఇక కనుగుడ్డుని

రాత్రిని వెతుకుతూ
ఒకడు  తనను కోల్పోయాడట

30, నవంబర్ 2012, శుక్రవారం

క్రీడలు




దారిని వెతుకుతూ ఒక విముక్తి కోసం
కాసేపు మాటలననుకుంటాను

అలసటలో కాగి సందర్భోచిత అర్థసమన్వయంతో అరిగిన మాటలకు
విపర్యయంగా కాసేపు  ఒక ఆటను మొదలు పెడతాను
ఒక్కో మాటను జుట్టు పట్టుకొని పైకి లేపి
అది ఇచ్చే అనుభవాల పొరల గొడలకేసి బంతిలా పదేపదే నన్ను నేను బాదుకుంటాను

నడిచే దారులలో పొదిగన ఙ్ఞాపకాల ఒత్తిడిలో
కాసేపు ఉద్వేగపు జ్వాలల గూటిననుకుంటాను

అమరిన అవయవాల పొందికతో వికసించిన జీవితపు చలన క్రమానికి
వ్యతిరేకంగా కాసేపు గుర్రాన్ని బండికి వెనుక కట్టేసి ఉంచుతాను
కదలిక గమ్యంగా ఉనికిని నెరపే ఒక్కో అవయవాన్ని అసంకల్పిత ఉద్ధీపనా భారంతో
ఒత్తి ఒత్తి ఒత్తిడితో కందెనలేని ఇరుసు చక్రంలా మొర్రోమనేలా చేస్తాను

పిచ్చి వాడిని ప్రేమించి దిమ్మరిపై అసూయ పడి
చచ్చి బతికిన వాళ్ళను బతికి కాల్చుక తినే వాళ్ళను తలపోసి వస్తూ పోతూ ఉన్న ప్రాణాన్ని అనుకుంటాను

 దీపమై వెలిగి అలమిన కాంతి ఒక పలకరింతగా స్పృశించి పరవశించి జీవించే క్షణాలను
తిరగతిప్పి బోర్లించి ఉంచిన పాత్రతో కొలిచి మిగిలిందేమిటో తరచి చూస్తాను
బతుకినపుడు చావును చచ్చినపుడు బతుకును
రాస్తూ కొట్టేస్తూ సదా తడుముకుంటూ చెప్పేందుకు చేతకాని వాక్య శకలంలా మిగిలి ఉంటాను










28, నవంబర్ 2012, బుధవారం

మా ఊరి రైల్వే స్టేషన్



బహుశా అని మొదలు పెట్టి
ఇక ఏ రోజుకైనా రాయడానికి దోసిటటిలో విరబూసిన ఒక దిగులు పుష్పంలానో
రెండు దిక్కులకేసి చేతులు చాచి నిలుచున్నపుడు నిన్ను దాటుతూ అటు నుండి ఇటు ఇటు నుండి అటు సాగిపోయే సుపరిచిత ప్రయాణంలానో

నిలుచుని ఉంటుంది మా ఊరి రైల్వే స్టేషన్

సరిగ్గా ఇలాంటి సమయాలలోనే
ఏకాంతపు సాంధ్యలు చలిగీతమై రాజుకునే ఇట్టాంటి వేళలలోనే



కాల రేఖలను దాటి కొద్ది కొద్దిగా రేకులు విప్పుకుని
కూర్చుని ఉన్న సిమెంట్ బేంచీల మీదకు వాలే జొన్న చేల రెపరెపల పచ్చని ఒకలాంటి పరిమళంతో
పురా స్నేహితులను అర్థాంతరంగానే చావును జెండాలా ఎగరేసిపోయిన ఒకరిద్దరు మిత్రులను
ఆలింగనం చేసుకుని మాటాడుతూ ఉంటాను

నేర్చుకున్న తొలి అక్షరాలను అపురూపంగా దిద్ది రాసే
ఒక బాలకుని అబ్బురం వలే మడతలు పెట్టిన కాగితంపై రాసి ఉంచిన కొన్ని పంక్తులుగా

ఇక్కడనే నన్ను నేను తడుముకుంటాను

ఒక పుస్తకం వలే ఎంతకూ వదలని పదబంధం వలే
రూపొందే ఒక విశ్వాసం వలే స్పర్శ వలే నాలో నేను మెదలుతుంటాను

తరగని ప్రవాహ గుణమేదో ముప్పిరిగొని ముసిరే జాములలో
కాలాతీతమై ఒరుసుకొని పారేందుకు ఒడ్డులేవీ లేని తనానికి నాకు  నేనే చుక్కానినయ్యి తలుచుకున్నప్పుడల్లా మా ఊరి రైల్వే స్టేషనుగా ఎదర నిలుచుంటాను

 

 

 

 

 

 

 

 

 

 

 



25, నవంబర్ 2012, ఆదివారం

అకవిత్వం



చాలా రోజుల వరకూ ఈ దారిన రావు నీవు

కొన్ని రోజు వారీ పనులూ, చేయక తప్పనివేవేవో
ఇష్టమయ్యీ ఇష్టం కాకా-


మనుషులతో మాటాడతావు కానీ మాటలు వుత్తి శబ్ధాలను తప్ప మరేమీ పలుకక
వుంటావు వూరికే ఒక పూట గడవడానికి ఒక రోజుకు ఊపిరి సలపని గోరీని తవ్వి పరుండబెట్టడానికి


ఎడతెగని శీతల ముద్ర
గడ్డకట్టుక పోయి నీతోటే నీ కవిత్వమూ


ఒప్పుకోకపొవడానికిక ఏమీ ఉండదు
చెప్పడానికి నొప్పే అయినా మూసుకపోయిన కవాటాల అవతల
కొన్ని యుగాల దూరాన


కవులు చనిపోయీ
కవిత్వం ఇగిరి పోయీ
తిరిగిన దారుల పాడువడి ముళ్ళు కాసీ-


చాలా రోజుల వరకూ ఇటుకేసి రానే రావు నీవు


ఉన్నావని చెప్పడానికి
ఉండడమంటే అన్నిటినీ కూడగట్టుకొని
పూసిన ముళ్ళ చివరల ఒక్కొక్క నీవుగా పూయడానికి


చాలా రోజుల వరకూ ఇటుకేసి రావు కదా నీవు




 

 

 

 

 

 

2, నవంబర్ 2012, శుక్రవారం

ద్రవం


బాధపడటం బాగా నేర్వాలి

కాలాలు కరిగి, తావులు కూలి
లోపల మరుగుతున్నదేహపు జ్వరమానిని

గొడలు వొరుసుకొని, తలుపులు పిగిలి
గాయపు దేహం రబ్బరులా సాగి

ఏ ఔషధ లేపనానికీ
లొంగని మహత్తర మనుషులం కావాలి మనం

ఎలా మొదలెట్టామో తెలీదు కానీ
ఉద్విగ్నపు ఘడియల తొలుచుకొని కరిగి జారి
 ప్రవాహ సదృశమై
 ఉనికి స్థలకాలాతీతం

సర్వవ్యాపితం
సకలాతీతం


29, అక్టోబర్ 2012, సోమవారం

కదలిక



అల వెనుక అల

అక్కడ లేచి
ఇక్కడ అణగి
రెప్పలార్చే కనుల సముద్రంపై -

ఇంతకూ పుట్టిందే మళ్ళీ మళ్ళీ పుడుతుందా?
లేక ఒకటి పోయి మరొకటా-?

అసలు
ఉండడమూ ఉండకపోవడము
గురించి కదా-

తెరుచుకున్నచూపు
దిగంతాలు దాటి
తిరిగి వచ్చే దాకా

వస్తూ పోతూ
స్ఫురణ

చావయ్యీ
బతుకయ్యీ
కవిత్వమయ్యీ

24, సెప్టెంబర్ 2012, సోమవారం

విపర్యయం





అంతగా ఏముంటాయి అనుకుంటాను

ప్రేమలూ దుఃఖాలూ కలవడాలూ విడిపోవడాలూ అన్నీ వస్తూ పోతూ జీవితపు సంరంభంలో కాస్సేపు మెరసి అలా వెళ్ళిపోయేవే కదాని

ఒక ఊహ
కొనసాగించడానికి మాటల ముక్కు మూసి తలకిందులుగా నానా విన్యాసాలు చేసి

ఒకానొక  స్థితిలో నన్ను నేను సరిపుచ్చుకొని-

ఇంతా చేసి చేస్తున్నదేమిటి
తామరాకులనంటిన నీటిబిందువుల అద్దంలో ప్రతిఫలించే ముఖాలను వెర్రిగా మోహించడం
దగ్ధమయ్యేందుకే పునః పునః తలనెత్తడం






13, సెప్టెంబర్ 2012, గురువారం

వ్యాఖ్యానం




మరణం ముంగిటి దుఃఖంలో తడిచి ఉబికిన
దూదిపింజల కన్నుల ముందర నిలుచున్నాను

ముట్టుకున్నపుడు
మాటలు రాని వెల్లువ ఒక్కటే కనుకొసలలో
భాషగా పెల్లుబికినప్పుడు అతనితో కలసి వొక మహాప్రవాహపు సుడిలో
అల్పపు గడ్డి పోచగా మునిగి తలకిందులయ్యాను

ఎవరో ఏదో మాటాడినపుడు
జీవితానికీ మరణానికీ వ్యాఖ్యానపు తొడుగును ధరింపజేస్తున్నపుడు
పరిపరివిధాలుగా మరింత సన్నని తీగపై హద్దులను చెరిపి సరిచేస్తున్నపుడు
కాసేపు అన్నింటినీ పక్కన పెట్టి మోముపై భయ విస్మయ రేఖనయ్యాను

మరణాన్ని
ఒక చివరకు చేరి తీరవలసిన తార్కిక సరిహద్ధుగా ఎవరో ఖండితస్వరంతో పరిచయం చేసినపుడు
సర్వమూ ఖాళీ అయిపోయిన అనుభూతిగా
కొయ్యబారి ఎవరైనా వొక మాటతో  వొక నమ్మకంతో
భుజాన చేయి వేసి ఊరడిల్లజేస్తారని ఎదురు చూసాను

ఎన్నింటినో విని కేవలం మాటలలో మాత్రమే మునిగి తడిసిన ఊహలను దాటి
అనే్క చావులకు చిరునామాగా మిగిలిన దారులలో తిరుగుతూ
వేసిన ఒక్కో అడుగుకూ అంటిన నెత్తుటి శ్వాస పాదాలలో గడ్ద కట్టుకపోయి కాలాన్ని మృత్యు కరస్పర్శగా పరిచయం చేస్తున్నపుడు
ఆ ఎరుకలో తిరిగి తిరిగి రూపొందుతున్నదేమిటో తరచి చూసాను

పండిన వొక ఆకు
గాలిలో సుడులు చుడుతూ నెమ్మదిగా మట్టి తాకిన తన్మయత్మం
వొక పువ్వు ఫలించి నేలకు రాలి ఇంకో జీవితానికి వాగ్ధానమవ్వడము కాక

నిజంగా బతకడం అర్థాంతరంగా ముగిసిపోయే వాక్యశకలమని
ఒక చేయి మరొక చేతితో కలిసే లోగా స్థంభించి పోయే భీతావహ దృశ్యమని సరిపోల్చుకున్నాను



11, సెప్టెంబర్ 2012, మంగళవారం

సభ్య లోకం


కొంత మంది ఎలా వస్తారో తెలియదు (దుర్మార్గంగా)
ముతకగా అభిరుచి అంటూ ఏమీ లేకుండా
(తూ...యాక్) వచ్చి పడతారు సభ్యలోకంలోకి

తన్మయత్మపు మైకమేమీ లేక (ఆర్టంటే ఏమిటో తెలిసి చస్తే కదా)
ఏదో పెనుగాలికి కొట్టుకొచ్చిన అపరిచిత జీవుల్లా
ఉద్యమాల్లోకీ, సాహిత్యంలోకీ గుత్తగా దఖలు పరుచుకున్న రంగుల కలలచిత్రాలలోకి
ఎందుకో(చాలా చాలా దుర్మార్గంగా)

ఉంటారా వీళ్ళు ఉండగలరా వీళ్ళు

సరదాగా మాటాడుకుందాం తూనిక వేసి పడిగట్టు పదాలతో తూగలేని వీళ్ళని
కోల్పోయి తమను నత్తులు కొడుతూ
మాటలలో హింసల కుప్పగా కూరుకొని చివరకు గాలిలో ధూళిలా కలగలసి పోయి (హిహిహి)-

చెరగని చిరకాల ముద్ర (మనదే మనదే)
ఉంటుందని ఒకటి
తెలియక వస్తారు( పాపం) వీళ్ళు నిరక్షర కుక్షుల గర్భశోకాలలోంచీ పొలోమంటూ (పాపం పాపం)

(హుష్)
ఎవరు  గరపగలరు విద్యను వీళ్ళకు మనం కాక ?
భుజస్కందాలపై (కాచిన కాయలు ఎన్నో!)
చరిత్ర మోపిన మరో భారం

మంచి ముడి సరుకు కదా
ఇక ఈ రోజుకు కథో కవిత్వమో -(నుదుటి పై పొటమరించిన చెమట చుక్కలు ఎన్నో చూడు)



 
 

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

చేసిన పాపం



ఉంటామా
పొరలు తొలుచుకొని
దినాల కాంతీ లేని చీకటి పోనీ
యుగాల నగ్నతలపోతగా

ఎవరికీ పట్టని
మూలల శుద్ధ వచనాలకావల

ఉంటామా
మనలో మనం ఉమ్మనీటిలో
స్మృతుల పురామడతలలో తెలియని మూర్చనలలో
ముడుచుక పడుకొని

అకవిత్వపు
అంచుల రాలిన పూవుల శైధిల్యపు ముద్రా ధ్వానం లోపల

ఉంటామా
ఒకటంటూ కాలేక ఒదగలేక తొడుగుల తగిలించుకోక
వేలెత్తి చూపినప్రతిసారీ శాపగ్రస్తులుగా వొదిగి వొకింత తప్పుక తిరుగుతూ

ఖండితాల
నడుమ ఖండితమై మన చుట్టూ మనం అకవులమై
ప్రదక్షణం చేస్తూ మోస్తూ ఈ రక్త కంకాళ జరా మరణ దేహంలో ఈదులాడుతూ


 

28, ఆగస్టు 2012, మంగళవారం

చంద్రునికొక పూల తావి


ఆ పాపకు తన స్నేహితురాలెవరో
ఒక రహస్య సందేశాన్నందించినట్టుగా
మిన్నల్ అంటే చందమామ మరియూ పువ్వు అని రాసి  అతి జాగ్రత్తగా మడత పెట్టి నెమలి కన్నును ఉంచే చోట కాగితం పుటలలో దాచి ఇచ్చింది.

బడి భారాన్ని భుజాల నుండి పక్కకు నెట్టి
కాసేపు టీవీ చానెళ్ళను టకటకా తిప్పేసి
ఏదో గుర్తుకు వొచ్చిన దానిలాగా తనకు ఆ రోజుటికి  వీడ్కోలుగా అందిన ఆ చీటీని ఆత్రంగా బయటకు తీసి
పసి బిడ్డలకు మాత్రమే చేతనయిన ఇంకా వొక పద్ధతికంటూ అలవాటు పడని అక్షరాల పేర్పును కాసేపు తదేకంగా తల పంకించి చదువుకొని
ఆ పాప తిరుగు జవాబుగా ఏదో రాయడం మొదలు పెట్టింది.

కొన్ని స్థితులలో చాపల్యం మాదిరిగా
ఒక్కొక్క పూవునూ జాగ్రతగా ఎంచి ఏరి తీసినట్టుగా పిల్లలకు పేర్లు పెట్టగలం గానీ
అ ಅపురూపమైనదేదో సదా తలదాల్చలేని శాపగ్రస్తులం కదా మనం
ఊహకు ఆవల నిలుచున్న బంధీలం కదా మనం
గీతల నడుమ వొదిగి తల వొంచి అనేకసార్లు గిడస బారిన గూనితో వొదిగిన అక్షరాలుగా పలకరించుకునే మనుషులం కదా మనం


బహుశా తన లేత వేళ్ళతో
తన స్నేహితురాలిలాగే ఇంకా వొదిగీ వొదగని అక్షర పంక్తుల పేర్పుతో తిరిగి ఆ పాప ఇచ్చే జవాబును మనం వొక నాటికైనా ఊహించగలమా
కనీసం ఊహగానైనా


22, ఆగస్టు 2012, బుధవారం

ముఖాలు




రోజులు ఉద్విగ్న క్షణాలుగా చీలి
పదును అంచులతో రాసిన రాతలు ముఖం మీద అనేక గీతలు గీతలుగా మారి

తను తన ఆధారాన్ని తన భర్తను తన శత్రువును
కోల్పోయినాక జీవితంలో ఊహ తెలిసాక
తెలిసి తెలిసి బహుశా తెలియక కూడా
తనను రాటుదేల్చుకున్న యుద్ధాల గురుతులుగా

ఆమె నిలబడి నీకేసి చూసి
రోజుల శూన్యతను కన్నులతో నింపి నీ మీద కుమ్మరించినపుడు

మనుషులు దూరమైనపుడు ప్రేమికులు మిత్రులు శత్రువులు ఆధారమైనవారు
దూరమైనపుడు
పదుల ఏళ్లగా అలవాటైన జీవితం తనకు తాను ఒక కొత్త ముఖంతో తనకెంత మాత్రం సమ్మతం కాని ముఖంతో తన ముందు నిలబడినపుడు
పాలిపోయిన పలుచని పసుపు రంగు ఆమె ముఖం మీద
నీకు మాత్రమే తెలిసిన మృత్యువు నెమ్మది నెమ్మదిగా రూపొందడం చూసి
ఏమని ప్రార్థిస్తావు నీవు

ప్రభూ
ఈవిడకొక విరోధిని ప్రాణశ్వాసగ ఆధారమై నిలిచే వారిని
ఒక తోడును ఆశ్వాసాన్ని మనిషిని ప్రసాదించు



 

19, ఆగస్టు 2012, ఆదివారం

రెండు




ఏదో భయం ఉంటుంది
వోరగ తెరచి ఉంచిన అపరిచిత ప్రపంచపు
ఆహ్వానానికై ఎదురు చూసే పెరపెరా ఉంటుంది

రాతిరి విచ్చుకున్న ఆకాశపు పందిరి కింద
చేతులు చాచుకుని
అగాథపు నీలిమ లోతులలో
పవ్వళించే స్వాప్నికతా ఉంటుంది
ఒక రోజు తొలగి ఇంకొక దానికి దారి చూపే
వేకువలలో  తెలియని సంశయంతో
తనలోకి తానై ఒక శూన్యతగా తారాడే అశక్తతా ఉంటుంది

అలల కదలికల నడుమ
అలకూ అలకూ కలిపి  తేలికగా నాట్యం చేసే తీగలాంటిదేదో ఉంటుంది
మాటకూ మాటకూ నడుమ కృత్యదావస్థ ఒకటి
పెనుగులాటై భుజాన  వేలాడే  భారపుమూటలా
పక్కటెముకలకు రాపెడుతూ ఉంటుంది

సాంద్రమై అన్నింటినీ ఏకమట్టం చేసే
మహాసందోహపు అట్టహాసమూ ఉంటుంది
దూరాన ఎక్కడో మనిగిన
గడ్డి పూవు రెక్కలపై
అల్లాడే గాలి తరగలను కొలిచే
సున్నితపు మాపనీ ఉంటుంది

అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి
యధావిధిగా ఏమీ లేనట్టుగా

16, ఆగస్టు 2012, గురువారం

పరిచయం




నీటి మీద కదలాడే అలలా
నుదిటిపై ఎప్పటిదో
ఇదిగో ఎవరో ఎవరో ఎవరో నడచి వచ్చిన జాడ

కను రెప్పల మీదకి
గాఢమైన భారంతో  కలలా లిఖిస్తూ
వాళ్ళు వస్తారు
నువ్వు మరెవరికీ విప్పి చెప్పజాలని మాటలా

ఒకరిని ఇంకొకరికి పరిచయం చేయజాలని
పక్షుల బిలబిల శబ్ధం

నిద్రాంకితమైన కన్నుల
జేవురించిన నీ కూతురు నిన్ను హత్తుకొని పడుకోబోయే తుది నిముషం

నిన్ను అడుగుతుంది
మనుషులను
నీ ముందర నడచి పోయిన వాళ్ళను

సరళమైన వాళ్లను
గరుకువారిన అరచేతులలో ఘాటైన పుగాకు వాసనతో
విచ్చుకునే మోటు మాటలగాళ్ళను

చెప్పడానికి
కొన్ని పదాలు చేయి చాచి యాచిస్తున్నాను

ఎవరన్నా దయతో -


13, ఆగస్టు 2012, సోమవారం

ఉంది లేదు





వుంది నాలుగక్షరాలే

పాతవి చూసి
ఉన్నవి చూసి
రానివి వేచి అదిగో ఆ ఆసుపత్రిలో లోలో సుడులుతిరిగి
ఒకటె వేదన

అబ్బా చీకటి గయ్యారం
చూసే కనుగుడ్డుకావల ఉన్నది కూడా ఇదేనా
కానరాదు కానరాదు కానరాదు బాబోయ్

ఉన్న ఒక తోవ కూడా పొయ్యి
మాట రాక
మనిషినాసాంతాం గొంతుకలో పూడిపొయ్యి
అటు పోకా ఇటు రాకా


భయం
బిగుసుకపోతూ ఒక చీకటి నీ కండరాలలో ఇక కూర్చోలేవూ నిలబడలేవూ
అన్నీ మూసుకపోతూ చివరికి ఇక
మాటలు
ఇంకిపోయి లోతులనెక్కడొ తగులుకొని రాయు ఖంగుమని
ఇక ఇంతేనా-

12, ఆగస్టు 2012, ఆదివారం

పనుల జాబితా




చేస్తున్న పనుల జాబితానొకదానిని చేత పట్టుకొని
మాటల ఢమఢమలతో  ప్రదర్శనా పూర్వకంగా అతని ముందు నిలబడ్డాను

ప్రశాంత వదనంతో కాసేపు చూసి
కొంచెం నవ్వుతో ఏమీ చేయకుండా ఎప్పుడైనా ఉండి ఉన్నావా-
అతను

రోజుల కీళ్ళు సడలి వదలని చీడతో
కునారిల్లుతున్నపుడు అకస్మాత్తుగా మళ్ళీ అతడే

ఏమీ చేయని నిరామయ విరామమై
క్రియా పూరక సమయాలకు అలవాటుగా కూరిన చర్యా ప్రతి చర్యల శృంఖలాలలో
అనేక పొరలుగా పొటమరించే అర్థాలేమిటో విప్పిచెప్పగల
నిశ్శబ్ధంగా వికసించే పువ్వు ఒకటి
ఎప్పటికైనా ఇక నాలో ?

11, ఆగస్టు 2012, శనివారం

జ్వరస్థితి



లోలోపల ఏమవుతుందో తెలియదు
కొన్నాళ్ళపాటా లేకుంటే కొన్ని రోజులా?

చేతనం సందిగ్ధమై ముందుకూపోకా వెనుకకూ రాకా
ఒక లోలోతులలో పొరలు పొరలుగా కాగే సన్నని మంట

దేహపు ఆవరణలో ఎవరో ఏదో వైనవైనాలుగా హడావిడీ పడుతున్నసవ్వడి

వినిపించీ వినిపించనట్టు ఒకమూల ఒక నేపథ్యానికి
ఒకింత ఓరిమితో ఒక అలవాటయిన స్థితిలో
కంగారూ కాకుండా నిర్లిప్తమూ కాకుండా
తెలియని సన్నద్ధత ఏదో కవచధారియైనిలుచునే వేళ

ఏకాంత దీపాల వెలుగులో
రణగొణ ధ్వనులను విడిచి కించిత్ కాలాతీతమై
రెండు చేతులనూ చాచీ అలసిన దేహంతో

నువు మూగన్నుగా పడుకొని
మెలకువకూ నిద్దురకూ నడుమ నేడూ రేపులలాగే
సన్నని కంచెను అల్లుతుంటావు

10, ఆగస్టు 2012, శుక్రవారం

పిల్లలు





పిల్లలు భలే తమాషా అయిన వాళ్ళు

పాపం వాళ్ళు
లోకం లోని పువ్వుల మాదిరి పిట్టల మాదిరి
అపురూపమైన దాన్నేదో
తలపై నెమలి పించంలా ఆరోపించుకొని
మన కళ్ళ ముందర బుడి బుడి అడుగులతో తిరుగుతుంటారు

ఈ లోకానికి వచ్చింది మొదలు
చుట్టూ ఉన్న మకిలిలో పడి మాయమయ్యే వరకూ
మనం పోగొట్టుకుంటున్న దానికి
ఒక పూరకంగా నిలబడి తమకు తెలియకుండానే మనకొక ఆశ్వాసననిస్తారు

కాసేపు కవిత్వమవుతారు

మరి కాసేపు ఒక కలలా తమ సుతారపు రెక్కలను విదిల్చి ఎవరికి వారు పాడుకునే
మహేంద్ర్రజాలపు  మాయా వేణుగానమవుతారు

కాలానికి ఒక కొసన మనలను నిలుచుండబెట్టి
తామే ఒక మహాద్భుత ఆలంబనమై
పారాడే ప్రతి శిశువూ భూగోళాన్ని తమ నును లేత పిరుదులపై నిలుచుండబెడతారు

ఎవడైనా ఒక కవి అర్భకంగా తమవైపు నోరు తెరచి చూసినపుడు
పురా కాలపు స్వప్నాన్నొకదాన్ని తమపైకి నెట్టి బతికే
మనుషుల మాయను జాలిగా క్షమించి
బోసిగా నవ్వుతూ చెక్కిళ్ళ వెంట కారే అమృతంతో
బతుకుపోండ్రా అని మనలని దీవిస్తారు




9, ఆగస్టు 2012, గురువారం

ఆంతరంగికం




కారణమేదీ లేకుండానే కలిగే దుఃఖం

ఆవరణలో అది పొగమంచో లేకుంటే అలుముకున్న మేఘమో 
చెరిపేస్తే చెరగదు  ఆపేస్తే ఆగదు

చుట్టూ పలుచని పారదర్శకపు పొర
కురిసీ కురవనట్టుగా కురిసే అతి సన్నని తుంపర

ఇది  తడపదు
తడిచి ముద్దవనీదు
ఒకచోట పట్టినిలిపి లోలోపల పోగు పడిన దానినంతా
కడిగి పారేసే కుండపోతవదు

సమస్త వ్యాపారాలలో ఉండీ ఉండని స్పృహగా                                                                                                                          
చదివే పంక్తుల నడుమ  విరామమై
నడిచే పాదాలు చేసే ధ్యానమై
అది ఏకాంతమో రాలిపడే పూవు సడిలో నిశ్శబ్ధ  గానమో

ఇది ఎంతకూ తెగదు

ఎడారిలో ఒంటరిచెట్టుకొమ్మ గీచే శూన్యంలా

ఇది సృజన
ప్ర్రాణ సంస్పందనలలో గింగురుమనే మహా నాదం
అటూ ఇటూ పడిపోకుండా నిలిపే చుట్టకుదురు

కవిత్వం




ఎగిరే సీతా కోక చిలుకల రెక్కల చప్పుడు

ఏకాంతం



దిగంతాలకు విస్తరించిన కనుదోయి చూపు

పాట



చెట్లు గుబురులెత్తే కాలంలో గాలిలో కలగలసిన సుతిమెత్తని ఆకుపచ్చ పరిమళం

ఊహ



అనంత దూరాల యానంలో నిరంతరమూ సాగే కాంతి వేగాల జలపాత ఉరవడి

కవిత



రాలి పడిన పూవుల దుఃఖాన్ని వేలి కొసలకెత్తి దేహానికలుముకునే గంథలేపనం

మనిషి

5, ఆగస్టు 2012, ఆదివారం

చరిత్రలు





ఈ రోజు నేనొక గాథను విన్నాను

తొణకిసలాడే ఒక స్త్రీ ఒక్కో పూసను కూర్చుతూ
మూడూ తరాల మనుషులు
స్త్రీలు పురుషులు పిల్లల పిల్లలను అల్లడం విన్నాను

మాటల నడుమ
గడచిన కాలపు దుఃఖపు మూలల వెంట
ఆయత్తమై లయాన్విత అశ్ర్రు ఖేద ధూళిగా రాలి కలిసాను

తెలియని ఆగ్రహపు కొనల కొక్కేనికి
శిడి వేలాడి ఉన్మాదపు శాంతినై నన్ను నేను గాయ పరుచుకున్నాను

ఉద్వేగపు ప్రవాహ ఉరవడిలో
రాలిపడిన పువ్వునై రేకులు విరిగి గింగిర్లు కొట్టి
తెలియని దిగంతాల అంచులకు ఈడ్చుక పోయాను

తెలిసిన మాటలు తెలియని కోణాలు
విడి విడి కథనాల నడుమ మనుషులు చీలిపోవడం చూసి
ఒక పరిశోధక విద్యార్థినై నన్ను నేను తరచి చూసుకున్నాను

వినడమొక  పూరణగ మారి
కాలపు రేఖల అవధులు దాటి అనేక చరిత్రల ఆలవాలమై
ఒక నేను అనేక నేనులుగా
ఆమె నేనుగా నేను ఆమెగా




4, ఆగస్టు 2012, శనివారం

మమ్చి వాడి బాధ



రాయడం సమస్య కాదు రాయాల్నకున్నది రాయడం­-

చిరిగిన నిక్కరులోంచి కదిలే
కర్రి పిర్రల వాడిననుకొని
తలుపులు తెరుస్తూ వచ్చీ పోయే చినుకుల మృత్యు శీతల స్పర్శ

కదలాడుతున్నది ఇక్కడ
అతిశయానికి బదులు కాళ్ళంట సుర్రుమనే భయముచ్చ

మొదలెట్టి ఒక్కటే కడదాకా లాగలేకపోవటం
అహో ఆటలో నారి సారిస్తూ నారి పొంగిన ఆ-
నా బలమో బలహీనతో- మళ్ళీ అదే ఈ సారీ, తెలియడం లేదు

కుదురుగా పారే ప్రవాహనికి ఒక్కటే జాలు
చెదిరే జల్లుల తడిఉనికికి
స్పృశించి పలవరించే వేన వేల ముఖాలు

కవిత్వమని కూర్చోని
చివరాఖరుదాకా  రాయలేక పోవడం
మమ్చి వాళ్ళ బాధ చెడ్డ వాళ్ళ గాథ

నిజంగా చెప్పాలంటే
నిజం నిజంగా కవి సూక్తి ముక్తావళి కర్త కాదేమో
మనుషుల గురించి రాయబోయే అమనుజుడతను కానే కాదేమో

3, ఆగస్టు 2012, శుక్రవారం

చీకటికొక వేకువ వేకువకొక చీకటి

ఎక్కడో కలిసి ఉంటాం
ఈదుతూ ఈదుతూ గడ్డి పోచ ఆధారం

రోజులు కాలాలు గడచి పోయాయి
మాట జ్ఞాపకమయింది
రాసిన కవిత కాగితపు మడతల నడుమ
ఒక శీతాకలపు నిద్రగ మారి
చుట్ట చుట్టుక పడుకుంది

లోలోపల కుహరాల్లో ఎక్కడో
లుప్తమవుతూ మెల్లగ ఇంకిపోయే జీవితం

ఖండితమైన తోక కొట్ట కొసల అణగారిపోతూ మొండిగ మిగిలిన బల్లి సంచలిత అనుభవం  కదా కామ్రేడ్

దూరాలను కొలవడానికి ఇంకా మన మధ్య ఏమి మిగిలి ఉంది

నిన్నూ నన్నూ కలిపి
భోంచేసిన కొండచిలువ బొజ్జలో
అంతా ఒక్కటిగ కరిగి పోయే సుఖ శాశ్వత నిద్రల బీభత్స శాంతి
ఇక ఈ రోజుకి  


 

పసి చేతులు



గాలిలో చేతులు చాచి
అడే పసిపాప తన్మయత్వం

దోబూచులాడుతూ
కనరాని పదబంధపరంపరల నడుమ ఒక్కడై
కవి వెతుకులాట

ఒకటి
అల్లి బిల్లిగా చల్లిన చుక్కలను ఒక్కొక్కటీ ఏరి
దండను అల్లడం

మరొకటి
తీరని వ్యామోహ చింతనలో కాలి బూడిదై
తిరిగి లేవడం


 

29, జులై 2012, ఆదివారం

విదళనం




చేతనలనన్నింటినీ
సుషుప్తిలోనికి జార్చి
రాసుకున్న ఒక్కో మాటనీ నిశ్శబ్ధంగా పలక చెరిపేసి
తన లోపల తనే ఎక్కడో మణిగి
ఉండీ ఉండీ విస్పోటనమయి

ఎవడి లోకం వాడిదయిన కాలాలకు కావిలికానిగా
ఒక్కడే తల వాకిటికావల
మట్టి కొట్టుకొని శిరస్సుపై ఖగోళ ధూళితో
విశ్వాంతర్గత రహస్య సంభాషణలకెక్కడో చెవినొగ్గి

తనే ఒక దారిగా విస్తరించి నడుచుక పోయే
మనుజుడొకడున్నాడు నాయనా
మనుజుడొకడున్నాడు

తలుపు తీయ్ కాసింత
అటునూ ఇటూనూ వేరు చేస్తూ పలుచని పొర ఎక్కడుందో వెతకాలి
పగిలిన ఒక్కో ముక్కా కలిపి ఎప్పటికైనా వీలవుతుందేమో అతకాలి

తలుపు తీయ్ నాయనా తలుపు తీయ్

27, జులై 2012, శుక్రవారం

ఒకరోజు

పాపా నిన్ను చూసాను

నల్లని నీ కన్నుల ఆవరణంలో ప్రసరించే తడి వెలుగులో  నిన్ను చూసాను

తేరిపారగ చూసే ఒక పువ్వు
తన లేలేత వేళ్ళతో ముట్టుకొన్నప్పుడు సుతారపు రేకులు రేకులుగా
విప్పారుతూ నిన్ను చూసాను

నీ స్పర్శల పులకింతలో మొలకలెత్తి మన్ను దోసిలి పొరల దాటుతూ నిన్ను చూసాను

వొడలని తేజమేదో నీ చుట్టూ పరిభ్రమిస్తుండగా
మనుషులు చేసే ప్రయాణాలలో తరుచూ ఎందుకంతగా చెరిగిపోతారో తెలియని
సంభ్రమంతో నిన్ను చూసాను

నీ తేజపు సౌందర్య దీప్తిలో
ఒక భాష్పపు దీపమై కరిగి చెంపల జారి నిన్ను చూసాను

పాపా నిన్ను చూసాను




  

15, జులై 2012, ఆదివారం

నిద్రా స్నానం

నిద్రా స్నానం

ఒక రోజు నీలో దగ్ధమై 
తిరిగి మరోసారి కొత్తగా మొలకెత్తడానికి


చాలా సార్లు ఏమీ ఉండదు

ఒక చిన్న ఆధారం ఊతగా
పైకి లేవబోయే పసి బాలకుని ప్రయత్నం అంతే

నిన్న గురించి
మాట్లడడానికి నా దగ్గర ఏమీ మిగిలి లేదు

దాటి వచ్చిన దూరాల కొసల నుంచీ
మరో దూరానికి ప్రయాణం

8, జులై 2012, ఆదివారం

చాన్నాళ్ళకు

జల ఎండిపోయిన
సందేహస్పదుడొకడు ఉబుసు పోక
రాసి చెరిపేసుకున్న కొన్ని వాక్యాలు:

పిల్లలు పెద్ద వాళ్ళను అనుకరిస్తారు

ఒక దారి ఏదో కనుగొనేదాకా
తమ వెనుకటి వారిని కాసేపు గౌరవిస్తారు

పాప అమ్మ నైటీని తొడుగుతుంది
బాబు నాన్నతనాన్ని అనుకరిస్తాడు

కాసేపే అనుకున్నా
వాళ్ళు వాళ్ళ పూర్వికుల శరీరాల్లోకి తప్పొప్పుల మినహాయింపుతో
ఇష్టంగా పరకాయ ప్రవేశం చేసి
కొన్ని విలువైన క్షణాలకు పటం కడతారు

పిల్లలకు కాలంలో వెనక్కి తిరిగి చూసుకోవడానికేమీ
ఉండదు కదా

11, ఫిబ్రవరి 2012, శనివారం

ఇదిగో


నీ తీతువు పిట్ట పాట సంచిలో
మృత్యువు వాసన

దరి చేరని నావకు గురుతుగా
నీ భాషా ప్రాభవం

ఎన్నాళ్ళని రాస్తావు
క్రమ పద్ధతిలో

మోతపెడుతూ ఒక మాట మరో దానిలోనికి దూసుకపోవడం
తెలుసు నీకు

అర్థాలతో ఏమ్పని ?

పుట్టలో చేయి పెడితే ఏ పాము ముందుగా కుట్టిద్దో  తెలుసా నీకు?

ఏదో ఒకటి మొదలు పెట్టు
మోటు పదాన్నొకదాన్ని తొడిగి

దరి చేరడం కాదు
అద్దరులు, ఇద్దరులు లేరు ఇక్కడ
మాటలు గోడలకు డీకొని తలలు పగిలి నెత్తురు కక్కడమొక్కటే కదా సత్యం
దూయి తుణీరాన్ని
తలలెత్తిన పదాల పడగలమీద నీ విన్యాసం

మొదలెక్కడ
కొసలెక్కడ
శరపరంపరపంరపరశ
గురి లేదు, దరి లేదు
లేదు గురి దరి
ప్రేలాపనం
పేలే వ్రణం
దీనికిదే అశాంత శాంతి


28, జనవరి 2012, శనివారం

భయం


కొన్ని పొరల చీకటి వెనకాల తడిమే చేయి
కుబుసం విడుస్తున్న క్షణాల నాలికల చీలికలు, వెన్ను ఆ చివర నుండీ ఈ చివర దాకా పాకే చల్లని జలదరింపు స్పర్శ

కొద్ది కొద్దిగా
ముణగదీసుకొంటూ
మాట్లాడి కొన్ని సార్లు, మాట్లాడక కొన్ని సార్లు
కవిత్వించి, డబ్బులు పోగేసుకొనే పథకాల గురించి ఆలోచించి
భవిష్యత్తు మీద ఏవేవో  రచించి

నాకే కొద్దీ, తరిగిపోతుందన్న దిగులు కొద్దీ
 అరచేతిలో బెల్లం ముక్క
సమకూర్చే తీపి భయం

ఒంటరివి నాయనా
నువ్వు ఒంటరివి, నీ రచనలో నీ చుట్టూ నీవు అల్లుకొనే గూటిలో
నీవు తప్ప నీ పాటలు తప్ప
అన్నీ ఉన్నట్టే ఉండి
నీ చుట్టూ ఆవరించిన మాయామోహమై

భయం కొద్దీ బతుకుతూ
భయం కొద్దీ శ్వాసిస్తూ
ఒద్దికగా, దేన్ని అతిక్రమించక
చుట్టూ బిగించుకున్న గోడల కౌగిలి వెచ్చదనంలో
సౌకర్యంగా సాహసిస్తూ_

రా, రహస్యపు క్షణాల ఏకాంతంలోనైనా
అన్నీ విప్పుకొని కాసేపు ఊపిరి తీసుకొని
మళ్ళీ ఈ శ్లేష్మంలో మునకలేసి తరిద్దువు గానీ

1, జనవరి 2012, ఆదివారం

కొంచెం కొత్తగా


రా ఒక్క సారి బయటకు

ముసుగుపెట్టి చద్ది వారిన కలలతో ఇంకా ఎంత సేపని పడుకుంటావు

ముగ్గులు పెట్టి రంగులుగా అలంకరించిన ఆకాశం మీద పిట్టలెలా ఎగురుతున్నాయో
ఒక్క సారి చూద్దువుగానీ

రా ఒక్కసారి బయటకు

నీ పుస్తకాలలో, కరుడు కట్టుకపోయిన కవిత్వంలో
ఇంకా ఎంతసేపని తల కూరుక పోతావు

కొత్తగ ఈ లోకం దిగివచ్చిన పసిమొగ్గ కాళ్ళూ చేతులూ ఆడించి మరీ ఆశువుగా చెబుతోంది కొత్త తరహా కవిత్వం
ఒక్కసారి విందువుగానీ

రా ఒక్క సారి బయటకు

సుదీర్ఘ నీ నిర్నిద్రాయుత పోరాటాలలో, పుంఖాను పుంఖాలుగా ముసిరే వాదవివాదాలలో
క్షణం తీరిక లేక అలసి ఒకింత గ్లానితో ఒంటరిగా ఎందుకు జుమ్మురుమంటావు

నిన్ను పలకరింప వచ్చిన ఓ కొత్త చిరునవ్వు నీకోసం ఏం మూట కట్టుక తెచ్చిందో
ఒక్క సారి చూసి తరిద్దువుగానీ

రా ఒక్క సారి బయటకు

చివికి పేలికలయిపోయిన నీ దుఃఖాలతో, వేసట బరువుతో ఈడ్చుకపోయే నీ మనోదేహదౌర్భాగ్యంతో
కొద్దికొద్దిగా కవిత్వపు చేదుని మృత్యువుతో కలిపి ఎందుకు తాగుతావు

నీ కోసం పడిగాపులు కాచి నిన్ను ప్రేమించీ ద్వేషించే వేయి కళ్ళు
నీ కోసమే తలపోసి తలపోసి మరీ ఎలా వెతుకుతున్నవో  ఒక్క సారి చూసి నవ్వుకుందువు గానీ

రా ఒక్క సారి బయటకు