22, సెప్టెంబర్ 2013, ఆదివారం

శిశుర్వేత్తి




దేహాన్ని చేతులతో పైకెత్తినపుడు
ఇంకా సరిగా నిలబడని మెడతో, మోకాళ్ళనలా వేలాడదీసి
చిన్ని కుక్కపిల్లవో లేక పిల్లికూనవో తప్ప నువ్వు మరొకటి కాదు కదా

గాఢమైన నిద్దురలోనూ తడియారని పాల పెదాలతో
తిరిగి తిరిగి ఒకేలా గోడకు వేలాడే రోజుల గడియారపు ముఖమ్మీద
చెరగని ధ్యానమై పాలిండ్లను జుర్రే సుతిమెత్తని నీ కదలిక

విప్పారిన కన్నులలో ఏవో కొన్ని-
బహుశా ఒకటో రెండోనేమో కూడా

అంతకు మించి మరింకేమీ పలుకని నిసర్గ సౌందర్యపు జాలులు
నీవు పరికించినంతమేరా

ఇంకా, నీకే తెలియక మత్తిల్లిన లోకంలో
ఒక నులక మంచపు పట్టెకు
తాడు దుప్పటి చేర్చి ఊయలగా అల్లిన స్వర్గంలో నువ్వు సేద తీరుతూ
చిన్ని బెల్లంతో నీ ఒంటినీ ముఖాన్నీ మూత్రించుకొని
ఈ భూమికి వచ్చిన నాటి కలవరపాటుతో బిగ్గరగా ఏడ్చినపుడు నీ చుట్టూ ఏవేవో నవ్వులు

అనంతరం కొద్ది కొద్దిగా పెరుగుతూ
వద్దని వారిస్తున్నా వినక, ఇంకా ఒకింత చిలిపితనంతో
ఆటబొమ్మలా తదేకంగా నీవు అంగంతో ఆడుతున్నప్పుడు

దారిన పోయే మేధావి ఒకడు
తన సహజ సిద్ధ పైత్యంతో అంటాడు కదా:

"బహుశా అతడు దాని భవిష్యత్ పర్యావసానాలను అవలోకించుచున్నాడు కాబోలు"

21, సెప్టెంబర్ 2013, శనివారం

బ్రేక్ డౌన్



దొరకని కొసలకై వెతుకులాట :

ఎలా చెబుతావు ఇది ఒక యుద్ధమని?

ముడివడి విడివడక మొదలూ కొసా తెలియక
చిట్టచివరల శిఖరాగ్రాల దూకి లయంచెంది
తిరిగి ఇంకో సారి-

ఒక తడుములాట :

మాటల భస్మపు మూటల పైన సుడిగాలి నర్తించినదట కదా
 దేహపు భూమిలో  ఒకటే మెలకువగా  ఈ జాము స్థంభించినదట కదా

ఇక ఆ గొంతుక శిలా దీపమై రాజుకొనినదట కదా


రాసుకున్న మాటలలోనుండి
కొన్నిఅక్షరాలు :

ఙ్ఞానం ఒక శాపం
బతుకు కుక్క పీకులాట
మూకల దొమ్మీల నడుమ పడుతూ లేస్తూ అయినా విరామ ప్రశాంతతను జీవితంగా నెమరవేయగలగడం
అలగా జనం అదృష్టం

అన్నింటికీ కారణం వెతకాల్సి రావడం పెద్ద ప్రారబ్ధం




12, సెప్టెంబర్ 2013, గురువారం

సమైఖ్యగీతిక అనబడు బిస్కెట్టు కవిత




ఈ రోజు  ముఖంలో ముఖం పెట్టి
అంటోంది ప్రేమించవేం ప్రియా ?
"సమైఖ్యం" గా ఉందామని

ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్  గోరటోని లాగా
అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక-

చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ
ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి
ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి బలవంతప్ప్రేమ లాగా

చీచ్చీ ఒళ్ళు తెలియడంలేదు సుమీ
తలుచుకుంటే కొన్ని సార్లు ఒళ్ళు అదుపు తప్పుతుంది సుమీ
ఎండాకాలపు ఒరిపిడిలోనూ ఇగరని జీర పాటల ప్రవాహ సవ్వడి సుమీ తెలంగాణం

స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక! స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక!

నిజంగానే ముఖంలో ముఖం పెట్టి మాటాడుదాం
రావేం ప్రియా అని బతిమాలుడుదాం
విడిపోతే ఎలా మనం అని విరహాలు పాటిద్దాం

కవి గాయక వైతాళికులను రమ్డోయ్ రారమ్డోయ్ అని నినదిద్దాం
ఒక ప్రణయ గీతికను రాయించి నీ కోసం ప్రత్యేకం అని కన్ను గీటుదాం
చెలియలికట్ట దాటకు చెలీ అని గొంతుక మీద కాలునలాగే కొనసాగిస్తూ మురిపెంగా బుజ్జగిద్దాం
అదీ కాపోతే చరిత్ర తెలియదా అని శపిద్దాం
పొంగుకొచ్చే బాన కడుపులను అల్లరిగా కాసేపు దాపెట్టి ఒక్క బిసెట్టు కూడా ముట్టలేదు సుమీ అప్పటి నుండి అని అతిశయంగా గారాలు పోదాం

జనం ఎటూ పైకెగయని గొంతుకలు కదా
గాలి పారాడని ఆవరణంలో ముముక్షువులై ముడుచుక పడుకున్న జెండాలు కదా
పొద్దునే లేచి లెక్కలేసుకొని జీవితాన్ని జేబిలో పొందికగా మడచి పెట్టుకో జూసే అకాల స్వప్నాలు కదా
చదువుకొని శిక్షణలు పొంది కనీస్టూబుల్లలాంటి పంతుల్ల సాంగత్యంలో కారాగారాల్లాంటి కలల్ని కావలించుకొని పడుకొనే అర్భక ప్రాణులు కదా

ఇంకా ఇక  ఉద్యోగాలుండవని అరుద్దాం
నీళ్ళుండవ్ నేలుండదు చివరాఖరుకు గుద్ద మీద గోసి గుడ్డకూడా అని గావు కేకలు పెడదాం
జనం మీద జనాన్ని బంధిఖానా మీద బంధిఖానాను పోటీగా నిలబెడదాం
జారి పోకుందా ఉండేందుకు అందరమూ కలిసి సామూహిక ప్రణయ గీతిక రాద్దామని కాణిపాకం వినాయక సామ్మీద సత్యప్రమాణాలు తీసుకుందాం

నిజంగానే ఒక్క ప్రేమలేఖయినా రాద్దాం
కాలపు రేఖలమీద ఐక్యతను విడగొడుతూ సమైఖ్యతనొక ప్రతీకగా నిలబెడదాం

ఈ రోజుటి ముఖమ్మీద తాగి పడేసిన సీసా గాజుముక్కతో వికృతంగా గజిబిజి ఒక్క ప్రేమ లేఖనయినా-










2, సెప్టెంబర్ 2013, సోమవారం

ఖాళీ




దేహపు గూడు నుండి కొన్నాళ్ళకు పక్షులు ఎగిరిపోతాయి
ఇక అప్పుడు ఎందుకు దుఃఖించిందీ అడిగేందుకు ఎవ్వరూ ఉండరు

గడిచిన కాలపు పద్దుల నుండి
క్షణాల లెక్కన ఒక్కొక్కటిగా అన్నీ తుడిచి పెట్టుక పోతాయి

ఖాళీ అయిన పాత్రతో నడచి వెళుతున్నప్పుడు
నాతో సహా ఇక నన్నెవరూ గుర్తు పట్టలేరు

బతికినందుకు ఏదైనా ఒక దానిని గుర్తుగా ఎందుకు మిగిల్చి పోవాలనే సందిగ్ధతలో

రాసి చించేస్తూ పోగా మిగిలిన
ఒకేఒక్క ఆఖరి పేజీలో
కొట్టకొస పంక్తిని కొట్టేస్తూ-