31, డిసెంబర్ 2011, శనివారం

రోజులు



ఒక విరామం తర్వాత

       * * *  
కొన్ని పశ్చాత్తాపాలు, కొద్దిగా దుఃఖం
విలాపాల దఖలు పడి నలిగిన కాలపు గురుతులు

కొంచెం సంతోషం
కొన్ని పొంగులు వారిన ఉద్విగ్నతలు

ఒకరి మాటలకు మరొకరు లతాంత దీపికా సౌరభాలుగా గుప్పుమని
మనుషులు స్నేహమాలికలై అల్లుకున్న క్షణాలు

ద్వేషమొక్కటే ఆహార్యమై
ఆవిరులెత్తే మాటల ఈటెల గురిచూస్తూ
పగబూని, నీ దాపుకు మరెవ్వరూ చోరరాని మంటల వలయాలను ఊపిరిగా శ్వాసించిన ఙ్ఞాపకాలు

చెరిగి పోని కొన్ని చావులు, చేతులు చాచి చివురులెత్తిన ఆశలు
సదా నీ నడకలలో కరిగి పోతపోసుకొనే నువ్వు నడచిన దారులు
మిత్రులు, శత్రులు, ప్రేయసులు

రూపొందే
ఆకృతికి ఆకరాలు

 


     

28, డిసెంబర్ 2011, బుధవారం

అక్షర పయనం


కాగితం మీదకు కొన్ని అక్షరాలను వదిలాను
చిన్ని పడవలుగ చేసి

తొణకిసలాడే నిశ్చల ప్రవాహ సడిలో
వూపిరి గమనంతో మెల్లిగ కదులుతూ పడవ
వేలి కొసల వెలిగి కార్తీక దీపమయింది

దీపపు కంటి కొసల మిరుమిట్లు కిరణాల వెంట
నెమ్మదిగా కొన్ని అడుగులేశాను

అడుగు అడుగుకూ ఒక చిన్ని పూవు పూసింది

రేకుల కొసల విప్పారిన పరాగ ధూళి
నక్షత్ర లోకాల నిబిడాంతర మహా పుంజమై పరిఢవిల్లింది

ఒక్కొక్క పూవునూ కోసి సుతారంగా దోసిళ్ళకెత్తాను
అలలు చాచిన ఘోష ముఖానికి తగిలింది

తలవొంచి ఆ కడలిలో మునిగి లేచాను

కను కొలుకు చివరలో
సన్నని ముత్యమొకటి గురుతుగా మిగిలింది

25, డిసెంబర్ 2011, ఆదివారం

వెతుకులాట


చితికిన రెక్కలతో ప్రాణం రెపరెపలాడే పక్షి

అది ఎగరదు
ఎగరకుండానూ ఉండదు

ఉపమానాల కంచెకు ఆవల
ఒక్కడే తాను-

తన కొసమే నేను ఎదురు చూస్తుంటాను
తన జాములకై  ఆలోచనల దొంతరను ఖాళీ చేసి
ఒక ఖాళీ పాత్రనై ఒదిగి నిలబడతాను

తను మాట్లాడడు
మాట్లాడకుండానూ ఉండడు

రెండు కొసలనూ దాటుకొని పారే
బరువైన భాషా సంచయమొకటి ఎప్పుడూ తన భుజాలపై

మాట్లాడనపుడు కరగని శిలా సదృశ్యమై
నోరు తెరిస్తే  కిర్రున తెరుచుకొనే శిథిల ద్వారావశేషమై

ఆ తేడా ఏదో కావాలి నాకు
కొద్దిగ గడప దాటితే ఒక కొత్త లోకానికి దారి తెరుచుకొనే
ఆ పలుచని పొర ఏమిటో తెలియాలి నాకు

ఒక మనిషి తనకు తాను తునకలై
వాటన్నింటినీ కలిపే సూత్రమెక్కడో మరచి-

నిజంగా తను లేకపోతే
నిస్తేజమైన జీవితపు నిత్య రద్దీలో అగ్గి పిడుగులవంటి తన అడుగులు లేకపోతే

నన్ను నేను కనుగొనే తోవ ఏది?

లయగీతమై, వాదర చివరల విచ్చుకొనే గాయపు పువ్వై
అడుగుల సవ్వడికి తెరచుకొనే బాటల సంకేత లిపియై

దూరాలను చెరుపుకుంటూ దిక్సూచిలాగా అక్కడ తను లేకపోతే
ఈ జీవికిక ఏది ముక్తి, విశ్రాంతి?






ఇగ్జాగరేషన్


రాసిన ప్రతీ అక్షరమూ
సదా అర్థాన్ని సూచించదు

క్షణాల ఒరిపిడిలో నలిగే కాలం
కాగితం మీద రాసీ, కొట్టేసీ
ఎక్కడో ఒక ఖాళీకి తగులుకొని ఎంతకూ ఊడి రాక
ఉండీ ఉండీ ఒక సన్నని బొట్టుగ నుదుటిపై రాలుతుంది

అక్కడ
ఏదీ ఉన్నట్టూ కాదు
ఏమీ లేనట్టూకాదు

ఒక విరామంలో
కవిత కాసేపు నిదురిస్తుంది

అప్పుడప్పుడు
కవికి
ఇగ్జాగరేషన్ స్పురించదు సుమీ

22, డిసెంబర్ 2011, గురువారం

తొలి అక్షరాలు


నల్లటి పలక మీద
ఎవరో కాసిని నవ్వులు రాల్చి పోయారు

ఒక దోబూచులాటలా
పిడికిలి బిగించి చూపుడు వేలితో
ఏవో సంకేతాలు కొన్ని అస్పష్టంగా వదిలి పోయారు

దబ దబా పరిగెత్తే పాదాలు
అడుగు పెట్టిన ప్రతి చోట అద్భుతాలు కురిపించే పాదాలు

బడిలో నేనొక్కడినే
ఆ పాదాల సవ్వడి వింటూ పలక మీదకు వంగి చూస్తుంటాను

తెల్లగ గీచిన గీతల నడుమ
ఎవరిదో నడకలు నేర్వని అడుగొకటి
రెల్లు పువ్వయి నవ్వి ప్రేమగ నా చెంపలు సవరిస్తోంది



20, డిసెంబర్ 2011, మంగళవారం

చివరకు


ఎక్కడని మొదలు పెడదాం?

ఇద్దరు మనుషులు ఎక్కడైనా ఒకే సమయాన్ని పంచుకోవలసి రావడం-

నిజానికి
మనుషుల మధ్య ఏముంటాయి?

ఇంతకూ ఉన్నది ఇద్దరు మనుషులేనా?
గతాను గతమై ఎక్కడెక్కడకో కలిపే మహాసమూహమై
ఊర్లూ పేర్లూ అన్నీ కలగలిసి

కాలం హద్దులు చెరిగి
కొరుక్కు తినే పుండు రసిగా ధార కట్టడం ఇద్దరికీ తెలియడం లేదూ?

ఇద్దరు మనుషులు ఎక్కడైనా ఒకే సమయాన్ని పంచుకోవలసి రావడం
నిజంగా ఎంత యుద్ధం?
 
ఈ యుద్ధం ముగిసాక
లేదా కనీసం ముగిసిందని అనుకున్నాక

ఇక అక్కడ ఉండేదెవరు?

ఒదిగి ఒదిగి మడుగులొత్తే ఒక బానిస
బానిస తలపై ముడ్డి మోపిన ఒక యజమాని




19, డిసెంబర్ 2011, సోమవారం

ఎక్కడ



అగాథపు నీలిమ
సుడులు తిరిగి నీ అక్షరాలలోనికి వొంగుతున్నప్పుడు

జీవితపు రణగొణల
చప్పుళ్ళ నడుమ బొగిలిపోయి ధూళిలో కలిసిపోయిన
ఒక ఆక్రందన నీ గొంతులో ఇంకుతున్నప్పుడు

ఒకడు
మనిషిగ కాగోరి చిద్రిత దేహాన్ని
ఆకాశానికి ఊతగ నిలబెట్టినప్పుడు


నువ్వు ఎక్కడున్నావు
నువ్వు ఎక్కడున్నావు






16, డిసెంబర్ 2011, శుక్రవారం

ఆ పిల్ల వరీనియా


బతకడానికెంత ప్రేమ కావాలి?
దోసిళ్ళకొద్దీ జీవితానికి ఒక సన్నని హసనపు రేఖలా
నిజంగా బతకడానికి -

బతకడం అంటే ఏమిటో
అతనికి లాగే ఆమెకూ తెలుసు

లేత వెన్నేల రాత్రుల్లో మెల్లగ తాకే చిరుగాలిలా
ఒకింత మాలిమికే సంతుష్టి చెందే బుజ్జి కుక్క పిల్లలా
ఆమెకు జీవితాన్ని ప్రేమించడం తెలుసు

ఆమె శాత గంభీర ముద్రతో
జీవితం ముందు వినయంగా నిలబడేది
జీవితమిచ్చిన దానికి పదింతలుగా
తిరిగి జీవితాన్ని ప్రేమించేది

అతడూ అంతే
మంద్ర ఉచ్చ్వాస మాలికలతో
జీవితాన్ని సున్నితంగా స్పృశించి పలకరించేవాడు
ముని వేళ్ళ కొసలతో ప్రాణ దీప్తిని
తన చుట్టూ నులి వెచ్చగా అలంకరించేవాడు

జీవితం అతనికి వరీనియానిచ్చింది
వరీనియా అతనికి-

పవిత్ర రోమ్ సామ్రాజ్యపు దరహం మీద
వారిద్దరూ తమ కాలానికి గొప్ప తావినద్దారు

అవేవీ రోమ్‍కు తెలియవు

చేయి చాచినప్పుడల్లా
నెత్తురూ నాగరికతా కలగలిపి
నేలకు పులిమి రొమ్ము విరుచుక నడిచే రోమ్‍కు అవేవీ తెలియవు

రోమ్ సరిగ్గ ఇప్పటి హైటెక్ సిటీలా ఉండేది
అంగుళం అంగుళం ధ్వంసించుకొని
విదేశీ పెట్టుబడులతో తనను తాను పునర్నిర్మించుకొనే
"విజన్ ముంబాయ్"లాగా ఉండేది
మల్టీ లైన్ రహదారులతో
భయద గంభీరంగా నిలబడే మహా నగరాల్లా ఉండేది

అయినా వాళ్ళిద్దరూ లేకపోతే
రోమ్ రోమ్‍లా ఉండేది కాదు

వాళ్ళ లాంటి మనుషులూ వారి వారి ప్రేమలూ లేకపోతే
రోమ్ కేవలం ఒక దిష్టి బొమ్మ

పురా కాలపు ప్రాణ రహిత సరీసృపం

వాళ్ళు రోమ్‍ను ద్వేషించీ ప్రేమించీ
ధ్వంసించీ తిరిగి నిర్మించీ మహా ప్రళయమై విరుచుక పడి
రోమ్ నాగరిక చిహ్నాలుగా శిలువపై వేలాడి

ఒక దీర్ఘ కాలపు వ్యధను చరిత్ర ముఖం పైన
ప్రేమగా అద్ది పోయారు

వాళ్ళ లాగే వరీనియా-

రోమ్ ఖడ్గ చాలనపు పదునంచు కొసలపై
అతడూ అతని పరివారమూ నెత్తుటి ముద్దలుగ
ధూళిలో కలిసాక కూడా

ఆమె అతడిని ప్రేమించింది

అతడిని ప్రేమించినట్లుగానే
వినయంగా జీవితం ముందర నిలబడి
జీవితమిచ్చిన దానికి తిరిగి పదింతలుగా
జీవితాన్ని ప్రేమించింది

రేపటికి రూపు కట్టి
గొప్ప దయతో అతడిని మన ముందు వదలి పోయింది



  

14, డిసెంబర్ 2011, బుధవారం

దిమ్మరి ౨


రాసి అనేకమార్లు చెరిపేసినందుకు సంతోషిస్తాను

పని లేని పనికి మాలిన వాళ్ళు
నా మీదా, నాకవిత్వం మీదా
గోతు తడుపుకొని బతికే వీలు లేకుండా చేసినందుకు

నన్ను ఒక ఊరూ పేరుకూ కట్టి పడేయకుండా
ఊరూరూ తిరిగి  పెద్ద చేసిన మా పెద్దలందరికీ పేరుపేరునా  నమస్కరిస్తాను

చచ్చిన పీనుగల్లా గుంతకు అంటిపెట్టుకుని
కాలం వెల్లబుచ్చకుండా చేసినందుకు

ప్రత్యేకించి
నాకొక సమాధి కట్టనందుకు నా బిడ్డలకు నేను ఋణపడి ఉంటాను

నాలుగు గడ్డి పరకలు నాపైనా మొలిచి ఈ మట్టిలో కలగలిసే భాగ్యం కలిగించినందుకు




6, డిసెంబర్ 2011, మంగళవారం

ఒక రోజుకు


రాయాల్సినదింకా మిగిలే ఉండడం చేతకానితనమే కావచ్చు

అయితే అది ఒక్కటే  కొన్నిరోజులకు
ఒక ఊరటగా, ఇన్నాళ్ళ నీ ఉనికికి
కొద్దికొద్దిగా రోజుకింతని దాచుకున్న సంచయమనీ
నువ్వు గుర్తించే రోజులు బహుశా ముందే ఉండి ఉండవచ్చు

కొన్నాళ్ళకు నీవు ప్రదర్శించిన రంగులన్నిటి పైనా విసుగు చెంది
తరుచూ ఒక బోలు స్వరమై తేలిపోయే నీ గొంతుకపైనే నువ్వు శుష్కంగా పిడికిళ్ళు విసిరుతూ
వొంటిపై ఒక్క గాయపు గురుతూ లేక
ఒక్కడివై హృదార్తంగా విలపించే క్షణాలూ ఆసన్నమవవచ్చు

ఇంకా నువ్వు అనేకానేకాలుగా చెదరి పోయి
పూట కొక్క వేషమై మాటకొక్క గొంతుకై                      
చివరకు ఎక్కడ నువ్వో తెలియక
వెతికి వెతికి అలసి  ఏ దుఃఖిత ఏకాంత గానంలోనో
నిన్ను నీవు స్వవచో వ్యాఘాత పరుచుకుని, తీరని కసితో
 కన్నీళ్ళను తాగుతూ కనీసం ఆ రాతిరిలోనైనా-




3, డిసెంబర్ 2011, శనివారం

not a poem


సగం కొరుక్క తిన్న జామకాయ

మధ్యలో కంత ఉన్న ఇనుప బిళ్ళ(దేనికి వాడతారో తెలియదు), నొక్కులు నొక్కులుగా పగిలిన గాజు గోళి( ఆటలో అచ్చొచ్చిన గోళీ అని సమాచారం),
మందపాటి ఒక దారపు తుంట

నీ జేబులోనో నా జేబులోనో ఉండవు కదా ఇవన్నీ

దేనికది
అన్నీ చేతితో తాకగానే కదిలే ప్రాణమున్న వస్తువులు

ముట్టుకొని, అనుభవించి, వేలి కొసలతో సంధించి
వాడు వాటన్నింటితో మాట్లాడగా చూసాను
తానై వాటన్నింటికీ ప్రాణ ప్రతిష్ట చేసి, తిరిగి వాటి మధ్యన నిలబడి,  దొర్లుకుంటూ నృత్యం చేసే రంగుల గోళీ అవడం
ఈ రోజు చూసాను

వాడి పడేయడం మాత్రమే మనకు తెలుసు

ఒక దాన్ని సేకరించి, అపురూపం చేసి భద్రపరచి
తరవాతి నాటికి ఒకటి రెండవుతాయని
చదువుకున్న మనుషులం మనం ఊహించలేం కదా

ఊహకు ఈ లోకం చాలకపోవడం ఈ రోజే చూస్తున్నాను


పుస్తకాలను ఇటుకలుగా చేసి కట్టిన బంధిఖానా గోడలపై ఆడే నా సీతాకోకా

మెడకు తగిలించుకొచ్చే నీ సంచిలో
బందులు ఊడిపోయిన బోడి పలక మాటున ఏముందో
నన్నెప్పుడు చూడనిస్తావు?


26, నవంబర్ 2011, శనివారం

సంబోధన


కొన్నిసార్లు చెప్పేందుకేమీ ఉండదు

మండే దివిటీలా  దేహన్ని మార్చి
వెతకడం తప్ప

ఏదీ వ్యక్తం చేయలేని సమయంలా అది లోలోపల భగ్గున మండుతుంటుంది

కత్తిమొన  కుత్తుకలో పదునుగా దించినపుడు
చిందే నెత్తుటి ధారలా ప్రాణం కోసుక పోయే ఆరాటమై ఉంటుంది

చాలా మరణాలు ముందే తెలిసిపోతాయి
జవజవలాడే నిలువెత్తు జీవితం గప్పున ఆరిపోవడం నీవు ఊహించగలవు

ఒక్కొక్కటీ కదలబారి మసక మసకగా వెనుకకు జారిపోతూ
గతంలో కరిగి పోవడం
కాలానికి ఒక బీభత్స మాపని

కొన్ని సార్లు ఏమీ చెప్పలేకపోవడం
చెప్పిన దానికన్నా అర్థవంతంగా ఉంటుంది





18, నవంబర్ 2011, శుక్రవారం

ఎక్కడైనా


అక్షరాలు కొన్ని

వేలికొసలు తెగి నెత్తురు గోరింటలో స్నానమాడే
మేలిమి ముత్యాలని పిలుస్తాను


పదాలు కొన్ని

రోదించడానికి కూడా అశక్తుడవై నిస్సహాయంగా నిలబడిన వేళలలో
నీ ముఖం మీద రాలి పడే వాన చినుకులంటాను

వాక్యాలు కొన్ని

పెగలని గొంతుకతో డగ్గుత్తిక కత్తి కొనయై
నాభికొసల వరకూ దిగి ప్రాణం ఆర్చుకపోతూ
ఒక కొస దాకా నిన్ను రాసుకుంటూ పోయే పేర్పులా తలపోస్తాను

కవితలు కొన్ని

చెంపలపై
ఇక్కడ ఇంకిన చారికలకు
మరెక్కడో టీకా తాత్పర్యాలు రాసే
విశ్వ వ్యాకరణమని భావిస్తాను


17, నవంబర్ 2011, గురువారం

రోడ్డు మీద


రాలినపూవుల నేరుతూ
శూన్యపు గీతాలను మాలగా అల్లి
బరువుతనాన్ని దిక్కులకు వేలాడదీసేవాడా

రెమ్మల నుండి వేరయిన ఆకుల
నిశ్శబ్ధ పతనానికి  ఊర్పుల లయను జతచేసి
ఒక చెమ్మగా  నేలకురాలి, ధూళిలో ఒదిగి
జ్ఞాపకమై కరిగి పోయేవాడా 

తిరుగాడిన ఒక్కోక్క చోటుకు ఒక్కొక్క గుర్తును
సున్నిత స్పర్శగ
వీడని జలదరింపయి మేనిపై మోసుక తిరిగేవాడా
                                
కదిలే నీ దృశ్యాల పొందికలో
విచ్చిన్నతయే అవిచ్చిన్నమై
అవిభాజ్యత అనేక శకలాలుగా సాక్షాత్కారమై

చేయి చాచిన ప్రతిసారీ జవజవలాడి
నిలువునా ఒక తీరని మహోగ్రమై నిను ముంచెత్తీ

ఏమయితేనేం ఇక-

నడిచే పాదాలలో ఉన్మాదం వరదలెత్తి
ప్రపంచం తుడిచి పెట్టనీ

పెగలని మాటల వెతుకులాటలో 
ఊపిరి ఆడని అంతిమక్షణ శ్వాసల పెనుగులాటగా
గడవనీ రోజులన్నీ



     

11, నవంబర్ 2011, శుక్రవారం

రంగులొద్దు


ఒక భ్రాంతి కావాలి
కోరి కోరి ఒక కొరుక్క తినే దుఃఖం కావాలి
జీవితాన్ని అద్దంలో చూసుకోవడానికి ఒక శతృవు కావాలి
తెలిసి తెలిసి ఒక ఎక్‍స్‍ట్రీమ్ ఎండ్‍కు లాగడానికి ఏదో ఒక మత్తు కావాలి ప్రభో మత్తు కావాలి

అర్థం కాని వాస్తవానికి అవాస్తవమైనా సరే
అయితే తెలుపు లేదా నలుపు
రంగునలిమిన ఒక ఊరట కావాలి

ఊహించడానికి స్వప్నించడానికి
రమించడానికి విశ్రమించడానికి
రంగులేవీ చోరరాని మహా దుర్గమొకటి కావాలి నాయనా దుర్గమొకటి కావాలి

తెలుపో నలుపో
జీవితం కాకుండా
ఏదో ఒకే ఒక్కటి కావాలి









6, నవంబర్ 2011, ఆదివారం

సదా



జ్ఞాపకం ఒకటి రూపొందడం నీకు తెలుసా?

నాయన చావుగానో, వాము దొడ్లలో ఒంటరిగా
మోకాళ్ళ సందున బాల్యం తలకాయ నిరికించుకొని గీసిన గీతల శూన్యంగానో,
ఉన్మత్తమై భాషకు ఊపిరి ఆడక నీవు రాసిన పిచ్చి రాతలుగానో

అన్నీ పైపైకి  కాల గమనంలో
ఎప్పటివో చెదరిన గురుతులు

కానీ ఙ్ఞాపకం అంటే అంతేనా?

మనిషి కాలాతీతమై లేదా హద్దులు చెరిగిన మహా ప్రవాహమై
ఒక బిందువు వద్ద ఘనీభవించి లేదా కాలం నుదుటన పచ్చబొట్టై -

ఙ్ఞాపకం అంటే అంతేనా?

నీకు నీవే విచ్చుకొనే కొత్త చూపై
పరచుకొనే దృశ్యంలో కాంతులీనడం

నీ చుట్టూ నీవు గీసుకొన్న వలయంలో మహాద్భుత పుంజమై గిరికీలు కొట్టడం

తృటిపాటులో నిన్ను నీవు రగిలించుకొని
ఒక కాలం యావత్తూ విద్యుల్లతయై వ్యాపించి తిరిగి నిన్ను నీవు ఆవిష్కరించుకోవడం

ఙ్ఞాపకం బుగిలిపోయిన కాగితాలలో
పాతగ వాసనలు కొట్టే శకలం కాదు

నడిచే దారిలో
నీ ఎత్తు కొలమానం

నీ ఙ్ఞాపకాలలో తిరిగి తిరిగి నీవే రూపొందుతుండడం నీకు తెలియదూ?















1, నవంబర్ 2011, మంగళవారం

దారిలో


సర్దుకొని అంతా
ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఏమి మిగిలిందో చెప్పు


ఎలుకలు కొరకగా
మిగిలిన కొన్ని సుప్త కంకాళాలు
పుస్తకాలు

అద్దం పగిలి
ఎప్పటిదో గురుతుగా అమ్మ నిన్ను ఎత్తుకున్నందుకు గాను
నీ కూతురుకి చూపేందుకని తెచ్చిపెట్టుకున్న ఫొటో

గది నిండా రాసి కొట్టేసిన కవిత్వ పంక్తుల కాగితాలు

దేన్నీ దాచిపెట్టుకోనవసరం లేని పయనంలో నీవు

31, అక్టోబర్ 2011, సోమవారం

గడాఫీ


ఎటువంటి కాలం ఇది?

తగలరాని చోట బలమైన గాయమేదో తగిలి
జుట్టు పట్టుకొని నిన్ను బలంగా ఈడుస్తున్నప్పుడు
ముఖమంతా నెత్తుటి చారికలతో
జరుగుతున్నదేమిటో గుర్తించేలోగా
దెబ్బ మీద దెబ్బ మీద విసురుగా తగులుతున్నప్పుడు

అనేకసార్లు
ముఖంమీద ధారలు కట్టే నెత్తుటి కన్నా

నీ మస్థిష్క మూలలలో ఒక సంభ్రమానుభూతియై
ఒత్తుకపోయే మృత్యువుకన్నా

వెగటుగ భయం కలిగించే ప్రశ్న ఒకటి
తలెత్తుతూనే ఉంటుంది

నీ చుట్టూ అల్లబడిన కంచెలో
నువ్వొక చిన్న గొర్రెపిల్లవు

నోటికంది వచ్చే నాలుగు గడ్డి పరకలు తప్ప
ఇంకేదీ పట్టని నీ తెలివికి హద్దు ఫలానా అని
తెలుసుకొనేలోగా నువ్వొక బందీవి

నీ చుట్టూ ఊపిరాడకుండా పేర్చిన వార్తల దొంతరలు

నువ్వు తలెత్తి చూసేలోగా నీ మీద నీకే
అనుమానం కలిగించే ప్రతికథనాలు

నిజమే
ఇది దూరాలు కరిగి దగ్గరవుతున్న కాలం
సముద్రాల కావల చిన్న అలికిడికే
పడకటింట్లో ఉలిక్కి పడి లేచే కాలం

కానీ నీ ఇంట్లో జరుగుతున్నదేమిటో నీకు తెలిసేలోగా
ఒకదానికొకటి పొంతన లేని నాలుగు రకాల కథనాలు

సత్యాసత్యాల విచికిత్సలో
సమస్తమూ రద్దయి
కథకుడొక్కడే త్రివిక్రముడై సమస్త లోకాలనూ ఆవహిస్తున్న కాలం

మనుషుల చావుల కన్నా
ఊహించని ఓటముల కన్నా
ఒక భయద వాస్తవమై ఇప్పుడు నాలికలు చాస్తున్న
ఈ యుద్ధం పేరు విశ్వాసాల విధ్వంసం

ఇది నమ్మకంగా
అపనమ్మకాలను పేని
నీ మెడను కాలం కోట గుమ్మానికి ఒక గురుతుగా వేలాడదీస్తున్న కాలం


25, అక్టోబర్ 2011, మంగళవారం

రీస్టోరింగ్ పాయింట్

అపురూపమైనవి ఎలా రూపొందుతాయి?

ఒక ప్రత్యూషానికి ముఖం ఎదురు చేసి
కొద్ది కొద్దిగా విచ్చుకునే లోకపు
రంగులలో నీవు

లేదా నీవే నీకు తెలియకుండా కొన్ని తుషార బిందువులను
దేహంపై విప్పారే రెక్కలుగ చేసుకొని
మెలమెల్లగ రేకులు విచ్చుకునే అనుభూతి

కొన్ని గులాబీ వర్ణపు కలలను
తన చేతి వేళ్ళ కదలికలతో సుతారంగా నీ చుట్టూ మంత్రించి రాసే
అప్పుడే పుట్టిన పసికందు

లేదా సున్నితమైనవేవో నీలోనే మెదలి
నీ చుట్టూ నీవు కొన్ని కొల్పోయినవాటినేవో తలచి, తలపోసి
ఒక ఆలంబన కోసం వెతుకుతూ

మళ్ళీ మళ్ళీ నీవు నీలోంచీ పుట్టుక రావడం



 

16, అక్టోబర్ 2011, ఆదివారం

నీ పేరు

ఒక సంశయం

కూర్చిపెట్టుకున్న పదాలలో
ఎక్కడైనా ఈ క్షణం ఒదుగుతుందా?

ఊహించిన భావ చిత్రాలతో
వాస్తవం రక్తి కడుతుందా?

సున్నితమనుకున్నవి కర్కశ పాషాణస్పదమై
నిన్ను తునాతునకలు చేయలేదా?

బండ రాతి మూలలలో
ఒక పుష్ప రాగమేదో గోచరమై నిన్ను కన్నీటి మడుగును చేయలేదా?

అనేకానేకాలుగా పగిలిన తునకలలో
నిన్ను నీవు ఏరుకునే ప్రయత్నం వేలి కొసలు తెగి
రక్తాలాపనలుగా నిన్ను నీవు తాత్కాలికంగానైనా శాంత పరుచుకోలేదా?

ఒక పదం ఎదిగి
పొరలు పొరలు నీ ముందర
శత పుష్పదళమై
ఫణి శిరసున మణియై
అనేకానేక చీలికల నాలికై
జఠరాంతర్గత నాళికలలో కాలకూట విషమై
ఒక్క ముఖమా నీది?

ఇంతకూ ఈ ఫూట నీ పేరేమిటి?


11, అక్టోబర్ 2011, మంగళవారం

జాడలు


తెలియనిదేదో మార్గం

దారి పొడవునా అతడు ఒక్కో విత్తును జారవిడుస్తూ పోయాడు


ఒక్కో విత్తూ ఒక్కో మొక్కయింది

మొక్కలు ఎదిగి
పుష్పించి ఫల భరితమయ్యాయి

నడచిపోయిన మనిషి తిరిగి రాలేదు

కానీ వేసిన ప్రతీ అడుగూ
ఒక ఆకుపచ్చని కవిత్వమయింది

9, అక్టోబర్ 2011, ఆదివారం

ఒక రోజు గడవడం


౧.ఎప్పటిలాగే  ఉదయం :
 నిర్ణయాలన్నీ ఎప్పటికప్పుడు ఎలా తారుమారవుతాయో ఆలోచిస్తూ ఉండగనే
 చేజారి భళ్ళున ఎక్కడో బద్దలవుతుంది

 ఊపిరి వెన్నులో గడ్డకట్టి
తీగలు తెగిపోతూ మిగిలిన శబ్ధ స్థంబన ఒక్కటే ఇక దేహమంతా

ప్రేమలు లేవు
లేత రంగుల అల్లికతో గాఢంగా పెనవేసుకునే సంస్పందనల
ఉదయాస్తమయ జమిలి మేలిమి అనుభూతులు లేవు
సున్నితమైనవన్నీ ఒక్కొక్కటీ
రెక్కలు విరిగి -

ఈ క్షణం ఇది  మూలాల కుదుళ్ళను
తలకిందులు చేసి సుడివేగంతో ఎక్కడికో విసిరివేసే పెను ఉప్పెన

మనుషులు ఎందుకింత యాతన పడాలో
ఈ శాపాన్ని తలదాల్చి ఎన్నాళ్ళు ఇలా మోయాలో

౨.పగటి పూట :
ఈ దారులకు అలవాటయిన పాదాలు

ఎక్కడికెక్కడికో కొనిపోతూ; నువ్వు నడుస్తున్నప్పుడు ఎచటికో తెలియని నీ పయనాన్నీ,నిన్నూ అన్నీ తెలిసిన ఒక తల్లి, బిడ్డను తన  చేతులలోకి సుతారంగా తీసుకున్నట్టుగా
తన లోనికి, తన శరీరంలో శరీరంగా తనలోనికి తీసుకొని దారులన్నీ నీతో నడుస్తూ ఉన్నప్పుడు -

కాసేపు నువ్వు వెక్కివెక్కి ఏడ్చే చంటి బిడ్డవు. తెలియని దన్ను ఏదో  ఒక ఎరుకగా నీలో నీకే పొటమరించిన తల్లి చన్నయినపుడు నువ్వే ఒక ఓదార్పు మాటవు. నీ చుట్టూ నువ్వే అనేక యుద్ధాలను అల్లుతూ, ఉన్నవి  నీకు రెండు చేతులేనని  సమయానికి గుర్తురాక చివరకు వేసటపడీ, అలసీ,నీ  నీ పైన నువ్వే గురి చూసుకొనే నిర్ధాక్షణ్యతవు

౩.రాత్రి :
ఉన్నది ఇక కేవలం అలసట

గుడ్డి దీపం వెలిగించిన ఒక గుహ-
నెత్తురు కరుడు కట్టి కొసలపై తడి ఆరని రాతి ఆయుధాల చీకటి కారడివి-
ఏ యుగమో తెలియదు
ఈ రాతిరికిక ఈ ఆదిమ మానవుడు నిదురించాలి  


 

8, అక్టోబర్ 2011, శనివారం

జ్వరస్థితి

లోలోపల ఏమవుతుందో తెలియదు
కొన్నాళ్ళపాటా లేకుంటే కొన్ని రోజులా?

చేతనం సందిగ్ధమై ముందుకూపోకా వెనుకకూ రాకా
ఒక లోలోతులలో పొరలు పొరలుగా కాగే సన్నని మంట
దేహపు ఆవరణలో ఎవరో ఏదో వైనవైనాలుగా హడావిడీ పడుతున్నసవ్వడి

వినిపించీ వినిపించనట్టు ఒకమూల ఒక నేపథ్యానికి
ఒకింత ఓరిమితో ఒక అలవాటయిన స్థితిలో
కంగారూ కాకుండా నిర్లిప్తమూ కాకుండా
తెలియని సన్నద్ధత ఏదో కవచధారియైనిలుచునే  వేళ

ఏకాంత దీపాల వెలుగులో
రణగొణ ధ్వనులను విడిచి కించిత్ కాలాతీతమై
రెండు చేతులనూ చాచీ అలసిన దేహంతో

నువు మూగన్నుగా పడుకొని
మెలకువకూ నిద్దురకూ నడుమ నేడూ రేపులలాగే
సన్నని కంచెను అల్లుతుంటావు

 

5, అక్టోబర్ 2011, బుధవారం

కవిత్వం

ఎగిరే సీతా కోక చిలుకల రెక్కల చప్పుడు
ఏకాంతం


దిగంతాలకు విస్తరించిన  కనుదోయి చూపు
పాట


చెట్లు గుబురులెత్తే కాలంలో గాలిలో కలగలసిన సుతిమెత్తని ఆకుపచ్చ పరిమళం 
ఊహ


అనంత దూరాల యానంలో నిరంతరమూ సాగే కాంతి వేగాల జలపాత ఉరవడి
కవిత


రాలి పడిన పూవుల దుఃఖాన్ని వేలి కొసలకెత్తి దేహానికలుముకునే గంథలేపనం
మనిషి

29, సెప్టెంబర్ 2011, గురువారం

ఆంతరంగికం


కారణమేదీ లేకుండానే కలిగే దుఃఖం

ఆవరణలో అది పొగమంచో లేకుంటే అలుముకున్న మేఘమో  
చెరిపేస్తే చెరగదు  ఆపేస్తే ఆగదు

చుట్టూ పలుచని పారదర్శకపు పొర
కురిసీ కురవనట్టుగా కురిసే అతి సన్నని తుంపర
   
ఇది   తడపదు
తడిచి ముద్దవనీదు
ఒకచోట పట్టినిలిపి లోపల పోగుపడినదాన్నంతా
కడిగి పారేసే కుండపోతవదు

సమస్త వ్యాపారాలలో ఉండీ ఉండని స్పృహగా                                                                                                                          
చదివే పంక్తుల నడుమ  విరామమై
నడిచె పాదాలు చేసే ధ్యానమై
అది ఏకాంతమో రాలిపడే పూవు సడిలో నిశ్శబ్ధ  గానమో

ఇది ఎంతకూ తెగదు

ఎడారిలో ఒంటరిచెట్టుకొమ్మ గీచే శూన్యంలా

ఇది సృజన ఇది ప్ర్రాణ సంస్పందనలలో గింగురుమనే మహా నాదం
ఇది అటూ ఇటూ పడిపోకుండా నిలిపే చుట్టకుదురు
                                                                                                     

26, సెప్టెంబర్ 2011, సోమవారం

అసమ్మతి



ఎక్కడో ఇరుక్కొని ఉంటాము

పాతబడి దుమ్ముబారి పెళుసులుగా విరుగుతున్న
గోదుమరంగు పేజీల నడుమ
చిన్నప్పుడెప్పుడో దాచుకున్నవన్నెల  నెమలి కన్నులా

ఎప్పటిదో ఒక పాటలా
గొంతుకలో  ఉండీ ఉండీ ఊరుతుంటాము

సుడి తిరుగుతూ ఒక జీరగా
క్షణ మాత్రమే అయినా అప్పటికది
మన లోపలి బీటలు వారుతున్న ఏకాంత గృహంలో
మనకు తెలియకుండానే  పెరిగి ఒక పలకరింపై
మెల్లగ తలనూచే గడ్డి పువ్వులా

ఏవో  తెలియని గాయాలతో
సంచరిస్తూ ఉంటాము

బొటనవేలు పగిలి
చిత్తడయిన పాదాల ముని వేళ్ళతో
ఒక సలపరాన్ని దారి పొడువునా అద్దుతూ
కొనసాగడమొక్కటే ఉపశమనమై జ్వలించీ జ్వలించీ
నెమ్మదినెమ్మదిగా బూడిదబారే వేయి తలల మహా కేతనంలా

ఎప్పుడూ మనం ఎదురీదుతూనే ఉంటాం

కృతకత్వమొక్కటే క్షణానికొక్క ముఖంగా
జగన్మోహనమై ఎల్లెడలా పరివ్యాపితమయ్యే వేళల
శిథిలమై విరిగిపడే ఒక మహా వృక్షపు
పెళపెళారావంలో లయమొందుతున్న ఆత్మలా

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఒకోసారి


కొత్తవేవీ లేవీ పూటకు
దహించివేసిన కొన్ని ఆనవాళ్ళు తప్ప

అన్నింటినీ వదిలించుకోలేము
శరీరంపై పారాడే సన్నని వణుకులా

ఒకోసారి పడీపడీ నవ్విన వాటినే
మరోసారి పావురాయిలా రెండు అరచేతులకెత్తుకొని బావురుమని రోదిస్తాము

గొంతు తడపడానికి
కాసిని మాటలు తీసుకొని ఎవరైనా వస్తారని ఎదురుచూపు


చాలా సార్లు ఊరకనే దుఃఖిస్తాము
మనిషి మూల వ్యాకరణమని తెలియక







11, సెప్టెంబర్ 2011, ఆదివారం

స్మృతులు


మూడు తరాల జీవితం

కొందరు స్త్రీలు
కొందరు పురుషులు


ఒక్కో  దాన్నీ దాటుకుంటూ
ఊరు వెంట ఊరు
మజిలీ వెంట మజిలీ

జాడలేవీ మిగిలి లేవు
నడచిన దారిని తుడుచుకుంటూ
అడుగు వెంట అడుగు

రోజులు మరుగున పడిన ఙ్ఞాపకాలు
యతలు సుషుప్తిలో జోగుతున్న శకలాలు
మనుషులు ఒకప్పుడు ఎక్కడో
సొంతమన్నది ఏమీ లేక తిరిగి తిరిగి
మట్టి గర్భంలో పొరలు పొరలుగా  మలిగిపోతున్న ఘోషలు

అనామకత్వం
ఎప్పటికీ చెరిగిపోని సంతకం

ఎక్కడా ఒక గుర్తు కూడా లేకుండా చెరిగి పోవడం
ఒక స్మృతి గీతికకు గొంతు కలిపి పాడడం

8, సెప్టెంబర్ 2011, గురువారం

దిమ్మరి


నడిచే పాదాల వెంట తెరుచుకునే దారులేమిటి

ఇక్కడ కరిగి మరెక్కడకో దారితీసే
ఈ క్షణానికి తుది ఏమిటి

రోజూ నడిచే దారులే
అన్నీపరిచయమున్న ముఖాలే

అయినా అడుగు తీసి అడుగు వేసేసరికి
ఎప్పటికప్పుడు నోరు తెరిచే తెలియని కీకారణ్యాలు

ఏది ఎలా రూపొందుతూ ఉంటుందో తెలియదు
కనిపించే రూపం వెనుక తొలచుకుని పెరిగే ఏదో ఊహించని
మాయా మంత్రజాలం

అయినా చివరకు ఏమవుతుంది

ముసిరే దుఃఖం వెనుక మృత్యువు
పగిలే ఒత్తిడి వెనుక మృత్యువు
వీడని అన్వేషణల వెనుక మృత్యువు
సాగే జాడల వెనుక మృత్యువు

సదాసదాసదా మృత్యువుమృత్యువుమృత్యువు

అయినా చివరకు ఇంతకు మించి మరేమవుతుంది

తెలిసిన ముఖాలలో తెలిసిన దారులలో
తెలిసినట్టే ఉండి తెలియని దాన్ని, ముసుగులా కనిపించీ కనిపించనిదాన్ని
ఎప్పటికది భారమై భళ్ళున చేజారుతుందో తెలియనిదాన్ని
నువు ఎలా సంబోధించి, ఏమని పూరిస్తావో కదా ఈరోజుని

ఎల్లెడలా పరివ్యాపితమైన మృత్యువుకు
మనుషులు అనేకానేక నీడలుగా
కవీ దిమ్మరీ
మానవుడా మానవుడా






7, సెప్టెంబర్ 2011, బుధవారం

అందరూ గొప్పవాళ్ళవుతున్నారు


అందరూ అమెరికాకు వెళ్తున్నారు
లేదా వెళ్ళి వస్తున్నారు

ఇంకా ఎప్పుడు నేను వెళ్ళడం


యాంటీ ఇంపీరియలిజమ్ పోయమ్
ఒకటియ్యిరా అని ఫ్రెండ్‍గాడొకటే నస
పాత కాగితాల కట్టలో పనికొచ్చేవేమైనా ఉన్నాయేమో చూసుకోమనాలి
ఎంతైనా అవుటాఫ్ సీజన్ కదా

ముందు అక్కడ మనకు పనికొచ్చే వాళ్ళని పట్టుకోవాలి
అందరూ వెళ్తూ మనమొక్కరమే మడికట్టుకొని
ఎన్నాళ్ళీ ఉపవాసం

ముందు మనం పేర్లోకి రావాలి
మన కులంలో అయినా మనకు పనికొచ్చేవాడెవడైనా తగుల్తాడేమో చూడాలి

ఎన్నాళ్ళు వృధా అయ్యాయో కదా
ఒక పేరూ లేకుండా ఒక అమెరికా లేకుండా

ఇంకా ఎన్నాళ్ళని
ఇలా మూలన పడి ఉండడం
ముందు మనం అమెరికాకు వెళ్ళాలి
ఉద్యమాలూ, తొక్కా రోజూ ఉండేవే కదా
ఈ రోజు కాకపోతే ఇంకో రోజు

ముందు మనం అమెరికాకు వెళ్ళాలి

మద్యలో ఈ ఫ్రెండ్‍గాడొకడు
కవిత్వమో అని మొర పెడుతుంటాడు

వీసా పాస్‍పోర్ట్ అన్నీ లైన్ క్లియర్ చేసుకోవాలి
ముందు మనం అమెరికాకు పోవాలి

సెటిల్‍మెంట్ సంగతి తర్వాత
కనీసం ఒక్క సారన్నా అమెరికాకు వెళ్ళోస్తే కదా
జన్మకింత సార్ధకత

పిల్లలు, కెరియర్
కులం, ఉద్యోగం, అమెరికా అన్నీ సమానార్థాల పద పట్టికలో
ఇంకా ఎందుకు చేర్చరో కదా

,చదువు, అభిరుచి, అవకాశం, మేధో వికాసం, అమెరికా అన్నీ ఒక్కటే కదా

ముందు మనం అమెరికాకెళ్ళాలి
చంకలెగరేసుకుంటూ
రెక్కల్ని మొలిపించుకుంటూ
జెండాల రెపరెపల జ్వాజ్వాల్య ధగధగలను
ఇరుసుగా చేసుకుంటూ, దొళ్ళుకుంటూ
ఎలాగైనా మనం అమెరికాకు వెళ్ళి తీరాలి

ఉండహె,మధ్యలో ఈ ఫోను-

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

నిశ్శబ్ధం


వికసించే
పూవు తాలూకు నిశ్శబ్ధం

అఙ్ఞాత పూల రాతిరిలో
పేరు తెలియని పరిమళం

సన్నని దారులలో
దిసపాదాలను దాటి పై వరకూ అలుముకున్న మట్టి గోరింట

ఏకాంత దీవులలో
చెట్టూ కొమ్మల నడుమ సేద తీరే మలిసంధ్య సూరీడు

కనిపించని చే దీపమై
నడిచినంతమేరా నాతో పాటూ కదిలే
లేలేత చందమామ

అర్థ తాత్పర్యాలూ
విరామ చిహ్నాలతో పని లేని కాసింత కవిత్వం


3, సెప్టెంబర్ 2011, శనివారం

నీకొక కవిత బాకీ


కొన్ని పదాలను పేర్చి వాక్యాల పొత్తిళ్ళలో
ఒక చిన్న మొక్కను
తన లేతపాటి ఆకులతో మృదువుగా చేతులు చాచే ఒక చిన్న మొక్కను నిర్మించగలమా?

బండబారిన ఈ చేతులతో
రోజూవారీ అనేకానేక చర్యలతో పలుమార్లు మృతప్రాయమై
దేహానికి ఇరువైపులా రెండు కట్టెల మాదిరి వేలాడే ఈ చేతులతో
దినానికొక్కతీరై పైపైకి సాగే ఒక చిన్న మొక్కను ఊహించగలమా?

ఎప్పుడో కొన్ని యుగాలకావల
ఙ్ఞాపకాల పొరల లోతుల్లో ఒత్తిగిలి
తన చేతులతో నాటిన ఓ చిన్ని మొక్కను
ప్రతి రోజూ లేచీ లేవగనే పక్కబట్టల మీదనుంచి పైకురికి
తనదైన ఆ చిన్ని అద్భుతం ఆ రోజుకుగాను
పచ్చని పలకరింపై ఏ మేరకు విస్తరించిందోనని
ఎదిగే ఆ పసిమి లోకం ముందర మన్నులో గొంతుకూర్చొని-

ఇప్పుడు ఈ చేతులలో
ఆకుపచ్చనివేవీ  పురుడు పోసుకోవు
నీటితో తడిసి  గాఢతనలుముకునే  మట్టి చారికలేవీ మిగిలిలేవు

ఇది ఒక శుష్క ప్రయత్నం

ఒక బాల్యంలాంటి
అటూ ఇటూ పరిగెత్తుతూ, అప్పుడప్పుడూ పాల తుత్తర తీరని ఏనాటివో స్మృతులతో
అమ్మ పాలిండ్లపై గారాంగా  మెత్తగ తడిమే పాపాయి చేతుల లాంటి
అపురూపమైనవేవీ ఈ కవితలలో పలకవు
చెక్కిళ్ళ మీద జారిన పాలచారికలలాంటి  ఙ్ఞాపకాలనేమీ ఈ పదాలు పుక్కిట పట్టవు

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఇప్పటికి


రాసిన
వాటి మీద
అసంతృప్తినెలా పలకడం

ఒక్కొక్క అక్షరమూ
పొదిగిన వేలి కొసలనెలా తెగ నరకడం

నాలిక మీద
చెమ్మను అరచేతి కలుముకొని
పలక కొసల దాకా
ఆసాంతం తుడిచే పసి బాలుడి ముందు
చేతులు కట్టుక నిలుచున్నాన్నేను