28, ఆగస్టు 2012, మంగళవారం

చంద్రునికొక పూల తావి


ఆ పాపకు తన స్నేహితురాలెవరో
ఒక రహస్య సందేశాన్నందించినట్టుగా
మిన్నల్ అంటే చందమామ మరియూ పువ్వు అని రాసి  అతి జాగ్రత్తగా మడత పెట్టి నెమలి కన్నును ఉంచే చోట కాగితం పుటలలో దాచి ఇచ్చింది.

బడి భారాన్ని భుజాల నుండి పక్కకు నెట్టి
కాసేపు టీవీ చానెళ్ళను టకటకా తిప్పేసి
ఏదో గుర్తుకు వొచ్చిన దానిలాగా తనకు ఆ రోజుటికి  వీడ్కోలుగా అందిన ఆ చీటీని ఆత్రంగా బయటకు తీసి
పసి బిడ్డలకు మాత్రమే చేతనయిన ఇంకా వొక పద్ధతికంటూ అలవాటు పడని అక్షరాల పేర్పును కాసేపు తదేకంగా తల పంకించి చదువుకొని
ఆ పాప తిరుగు జవాబుగా ఏదో రాయడం మొదలు పెట్టింది.

కొన్ని స్థితులలో చాపల్యం మాదిరిగా
ఒక్కొక్క పూవునూ జాగ్రతగా ఎంచి ఏరి తీసినట్టుగా పిల్లలకు పేర్లు పెట్టగలం గానీ
అ ಅపురూపమైనదేదో సదా తలదాల్చలేని శాపగ్రస్తులం కదా మనం
ఊహకు ఆవల నిలుచున్న బంధీలం కదా మనం
గీతల నడుమ వొదిగి తల వొంచి అనేకసార్లు గిడస బారిన గూనితో వొదిగిన అక్షరాలుగా పలకరించుకునే మనుషులం కదా మనం


బహుశా తన లేత వేళ్ళతో
తన స్నేహితురాలిలాగే ఇంకా వొదిగీ వొదగని అక్షర పంక్తుల పేర్పుతో తిరిగి ఆ పాప ఇచ్చే జవాబును మనం వొక నాటికైనా ఊహించగలమా
కనీసం ఊహగానైనా


22, ఆగస్టు 2012, బుధవారం

ముఖాలు




రోజులు ఉద్విగ్న క్షణాలుగా చీలి
పదును అంచులతో రాసిన రాతలు ముఖం మీద అనేక గీతలు గీతలుగా మారి

తను తన ఆధారాన్ని తన భర్తను తన శత్రువును
కోల్పోయినాక జీవితంలో ఊహ తెలిసాక
తెలిసి తెలిసి బహుశా తెలియక కూడా
తనను రాటుదేల్చుకున్న యుద్ధాల గురుతులుగా

ఆమె నిలబడి నీకేసి చూసి
రోజుల శూన్యతను కన్నులతో నింపి నీ మీద కుమ్మరించినపుడు

మనుషులు దూరమైనపుడు ప్రేమికులు మిత్రులు శత్రువులు ఆధారమైనవారు
దూరమైనపుడు
పదుల ఏళ్లగా అలవాటైన జీవితం తనకు తాను ఒక కొత్త ముఖంతో తనకెంత మాత్రం సమ్మతం కాని ముఖంతో తన ముందు నిలబడినపుడు
పాలిపోయిన పలుచని పసుపు రంగు ఆమె ముఖం మీద
నీకు మాత్రమే తెలిసిన మృత్యువు నెమ్మది నెమ్మదిగా రూపొందడం చూసి
ఏమని ప్రార్థిస్తావు నీవు

ప్రభూ
ఈవిడకొక విరోధిని ప్రాణశ్వాసగ ఆధారమై నిలిచే వారిని
ఒక తోడును ఆశ్వాసాన్ని మనిషిని ప్రసాదించు



 

19, ఆగస్టు 2012, ఆదివారం

రెండు




ఏదో భయం ఉంటుంది
వోరగ తెరచి ఉంచిన అపరిచిత ప్రపంచపు
ఆహ్వానానికై ఎదురు చూసే పెరపెరా ఉంటుంది

రాతిరి విచ్చుకున్న ఆకాశపు పందిరి కింద
చేతులు చాచుకుని
అగాథపు నీలిమ లోతులలో
పవ్వళించే స్వాప్నికతా ఉంటుంది
ఒక రోజు తొలగి ఇంకొక దానికి దారి చూపే
వేకువలలో  తెలియని సంశయంతో
తనలోకి తానై ఒక శూన్యతగా తారాడే అశక్తతా ఉంటుంది

అలల కదలికల నడుమ
అలకూ అలకూ కలిపి  తేలికగా నాట్యం చేసే తీగలాంటిదేదో ఉంటుంది
మాటకూ మాటకూ నడుమ కృత్యదావస్థ ఒకటి
పెనుగులాటై భుజాన  వేలాడే  భారపుమూటలా
పక్కటెముకలకు రాపెడుతూ ఉంటుంది

సాంద్రమై అన్నింటినీ ఏకమట్టం చేసే
మహాసందోహపు అట్టహాసమూ ఉంటుంది
దూరాన ఎక్కడో మనిగిన
గడ్డి పూవు రెక్కలపై
అల్లాడే గాలి తరగలను కొలిచే
సున్నితపు మాపనీ ఉంటుంది

అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి
యధావిధిగా ఏమీ లేనట్టుగా

16, ఆగస్టు 2012, గురువారం

పరిచయం




నీటి మీద కదలాడే అలలా
నుదిటిపై ఎప్పటిదో
ఇదిగో ఎవరో ఎవరో ఎవరో నడచి వచ్చిన జాడ

కను రెప్పల మీదకి
గాఢమైన భారంతో  కలలా లిఖిస్తూ
వాళ్ళు వస్తారు
నువ్వు మరెవరికీ విప్పి చెప్పజాలని మాటలా

ఒకరిని ఇంకొకరికి పరిచయం చేయజాలని
పక్షుల బిలబిల శబ్ధం

నిద్రాంకితమైన కన్నుల
జేవురించిన నీ కూతురు నిన్ను హత్తుకొని పడుకోబోయే తుది నిముషం

నిన్ను అడుగుతుంది
మనుషులను
నీ ముందర నడచి పోయిన వాళ్ళను

సరళమైన వాళ్లను
గరుకువారిన అరచేతులలో ఘాటైన పుగాకు వాసనతో
విచ్చుకునే మోటు మాటలగాళ్ళను

చెప్పడానికి
కొన్ని పదాలు చేయి చాచి యాచిస్తున్నాను

ఎవరన్నా దయతో -


13, ఆగస్టు 2012, సోమవారం

ఉంది లేదు





వుంది నాలుగక్షరాలే

పాతవి చూసి
ఉన్నవి చూసి
రానివి వేచి అదిగో ఆ ఆసుపత్రిలో లోలో సుడులుతిరిగి
ఒకటె వేదన

అబ్బా చీకటి గయ్యారం
చూసే కనుగుడ్డుకావల ఉన్నది కూడా ఇదేనా
కానరాదు కానరాదు కానరాదు బాబోయ్

ఉన్న ఒక తోవ కూడా పొయ్యి
మాట రాక
మనిషినాసాంతాం గొంతుకలో పూడిపొయ్యి
అటు పోకా ఇటు రాకా


భయం
బిగుసుకపోతూ ఒక చీకటి నీ కండరాలలో ఇక కూర్చోలేవూ నిలబడలేవూ
అన్నీ మూసుకపోతూ చివరికి ఇక
మాటలు
ఇంకిపోయి లోతులనెక్కడొ తగులుకొని రాయు ఖంగుమని
ఇక ఇంతేనా-

12, ఆగస్టు 2012, ఆదివారం

పనుల జాబితా




చేస్తున్న పనుల జాబితానొకదానిని చేత పట్టుకొని
మాటల ఢమఢమలతో  ప్రదర్శనా పూర్వకంగా అతని ముందు నిలబడ్డాను

ప్రశాంత వదనంతో కాసేపు చూసి
కొంచెం నవ్వుతో ఏమీ చేయకుండా ఎప్పుడైనా ఉండి ఉన్నావా-
అతను

రోజుల కీళ్ళు సడలి వదలని చీడతో
కునారిల్లుతున్నపుడు అకస్మాత్తుగా మళ్ళీ అతడే

ఏమీ చేయని నిరామయ విరామమై
క్రియా పూరక సమయాలకు అలవాటుగా కూరిన చర్యా ప్రతి చర్యల శృంఖలాలలో
అనేక పొరలుగా పొటమరించే అర్థాలేమిటో విప్పిచెప్పగల
నిశ్శబ్ధంగా వికసించే పువ్వు ఒకటి
ఎప్పటికైనా ఇక నాలో ?

11, ఆగస్టు 2012, శనివారం

జ్వరస్థితి



లోలోపల ఏమవుతుందో తెలియదు
కొన్నాళ్ళపాటా లేకుంటే కొన్ని రోజులా?

చేతనం సందిగ్ధమై ముందుకూపోకా వెనుకకూ రాకా
ఒక లోలోతులలో పొరలు పొరలుగా కాగే సన్నని మంట

దేహపు ఆవరణలో ఎవరో ఏదో వైనవైనాలుగా హడావిడీ పడుతున్నసవ్వడి

వినిపించీ వినిపించనట్టు ఒకమూల ఒక నేపథ్యానికి
ఒకింత ఓరిమితో ఒక అలవాటయిన స్థితిలో
కంగారూ కాకుండా నిర్లిప్తమూ కాకుండా
తెలియని సన్నద్ధత ఏదో కవచధారియైనిలుచునే వేళ

ఏకాంత దీపాల వెలుగులో
రణగొణ ధ్వనులను విడిచి కించిత్ కాలాతీతమై
రెండు చేతులనూ చాచీ అలసిన దేహంతో

నువు మూగన్నుగా పడుకొని
మెలకువకూ నిద్దురకూ నడుమ నేడూ రేపులలాగే
సన్నని కంచెను అల్లుతుంటావు

10, ఆగస్టు 2012, శుక్రవారం

పిల్లలు





పిల్లలు భలే తమాషా అయిన వాళ్ళు

పాపం వాళ్ళు
లోకం లోని పువ్వుల మాదిరి పిట్టల మాదిరి
అపురూపమైన దాన్నేదో
తలపై నెమలి పించంలా ఆరోపించుకొని
మన కళ్ళ ముందర బుడి బుడి అడుగులతో తిరుగుతుంటారు

ఈ లోకానికి వచ్చింది మొదలు
చుట్టూ ఉన్న మకిలిలో పడి మాయమయ్యే వరకూ
మనం పోగొట్టుకుంటున్న దానికి
ఒక పూరకంగా నిలబడి తమకు తెలియకుండానే మనకొక ఆశ్వాసననిస్తారు

కాసేపు కవిత్వమవుతారు

మరి కాసేపు ఒక కలలా తమ సుతారపు రెక్కలను విదిల్చి ఎవరికి వారు పాడుకునే
మహేంద్ర్రజాలపు  మాయా వేణుగానమవుతారు

కాలానికి ఒక కొసన మనలను నిలుచుండబెట్టి
తామే ఒక మహాద్భుత ఆలంబనమై
పారాడే ప్రతి శిశువూ భూగోళాన్ని తమ నును లేత పిరుదులపై నిలుచుండబెడతారు

ఎవడైనా ఒక కవి అర్భకంగా తమవైపు నోరు తెరచి చూసినపుడు
పురా కాలపు స్వప్నాన్నొకదాన్ని తమపైకి నెట్టి బతికే
మనుషుల మాయను జాలిగా క్షమించి
బోసిగా నవ్వుతూ చెక్కిళ్ళ వెంట కారే అమృతంతో
బతుకుపోండ్రా అని మనలని దీవిస్తారు




9, ఆగస్టు 2012, గురువారం

ఆంతరంగికం




కారణమేదీ లేకుండానే కలిగే దుఃఖం

ఆవరణలో అది పొగమంచో లేకుంటే అలుముకున్న మేఘమో 
చెరిపేస్తే చెరగదు  ఆపేస్తే ఆగదు

చుట్టూ పలుచని పారదర్శకపు పొర
కురిసీ కురవనట్టుగా కురిసే అతి సన్నని తుంపర

ఇది  తడపదు
తడిచి ముద్దవనీదు
ఒకచోట పట్టినిలిపి లోలోపల పోగు పడిన దానినంతా
కడిగి పారేసే కుండపోతవదు

సమస్త వ్యాపారాలలో ఉండీ ఉండని స్పృహగా                                                                                                                          
చదివే పంక్తుల నడుమ  విరామమై
నడిచే పాదాలు చేసే ధ్యానమై
అది ఏకాంతమో రాలిపడే పూవు సడిలో నిశ్శబ్ధ  గానమో

ఇది ఎంతకూ తెగదు

ఎడారిలో ఒంటరిచెట్టుకొమ్మ గీచే శూన్యంలా

ఇది సృజన
ప్ర్రాణ సంస్పందనలలో గింగురుమనే మహా నాదం
అటూ ఇటూ పడిపోకుండా నిలిపే చుట్టకుదురు

కవిత్వం




ఎగిరే సీతా కోక చిలుకల రెక్కల చప్పుడు

ఏకాంతం



దిగంతాలకు విస్తరించిన కనుదోయి చూపు

పాట



చెట్లు గుబురులెత్తే కాలంలో గాలిలో కలగలసిన సుతిమెత్తని ఆకుపచ్చ పరిమళం

ఊహ



అనంత దూరాల యానంలో నిరంతరమూ సాగే కాంతి వేగాల జలపాత ఉరవడి

కవిత



రాలి పడిన పూవుల దుఃఖాన్ని వేలి కొసలకెత్తి దేహానికలుముకునే గంథలేపనం

మనిషి

5, ఆగస్టు 2012, ఆదివారం

చరిత్రలు





ఈ రోజు నేనొక గాథను విన్నాను

తొణకిసలాడే ఒక స్త్రీ ఒక్కో పూసను కూర్చుతూ
మూడూ తరాల మనుషులు
స్త్రీలు పురుషులు పిల్లల పిల్లలను అల్లడం విన్నాను

మాటల నడుమ
గడచిన కాలపు దుఃఖపు మూలల వెంట
ఆయత్తమై లయాన్విత అశ్ర్రు ఖేద ధూళిగా రాలి కలిసాను

తెలియని ఆగ్రహపు కొనల కొక్కేనికి
శిడి వేలాడి ఉన్మాదపు శాంతినై నన్ను నేను గాయ పరుచుకున్నాను

ఉద్వేగపు ప్రవాహ ఉరవడిలో
రాలిపడిన పువ్వునై రేకులు విరిగి గింగిర్లు కొట్టి
తెలియని దిగంతాల అంచులకు ఈడ్చుక పోయాను

తెలిసిన మాటలు తెలియని కోణాలు
విడి విడి కథనాల నడుమ మనుషులు చీలిపోవడం చూసి
ఒక పరిశోధక విద్యార్థినై నన్ను నేను తరచి చూసుకున్నాను

వినడమొక  పూరణగ మారి
కాలపు రేఖల అవధులు దాటి అనేక చరిత్రల ఆలవాలమై
ఒక నేను అనేక నేనులుగా
ఆమె నేనుగా నేను ఆమెగా




4, ఆగస్టు 2012, శనివారం

మమ్చి వాడి బాధ



రాయడం సమస్య కాదు రాయాల్నకున్నది రాయడం­-

చిరిగిన నిక్కరులోంచి కదిలే
కర్రి పిర్రల వాడిననుకొని
తలుపులు తెరుస్తూ వచ్చీ పోయే చినుకుల మృత్యు శీతల స్పర్శ

కదలాడుతున్నది ఇక్కడ
అతిశయానికి బదులు కాళ్ళంట సుర్రుమనే భయముచ్చ

మొదలెట్టి ఒక్కటే కడదాకా లాగలేకపోవటం
అహో ఆటలో నారి సారిస్తూ నారి పొంగిన ఆ-
నా బలమో బలహీనతో- మళ్ళీ అదే ఈ సారీ, తెలియడం లేదు

కుదురుగా పారే ప్రవాహనికి ఒక్కటే జాలు
చెదిరే జల్లుల తడిఉనికికి
స్పృశించి పలవరించే వేన వేల ముఖాలు

కవిత్వమని కూర్చోని
చివరాఖరుదాకా  రాయలేక పోవడం
మమ్చి వాళ్ళ బాధ చెడ్డ వాళ్ళ గాథ

నిజంగా చెప్పాలంటే
నిజం నిజంగా కవి సూక్తి ముక్తావళి కర్త కాదేమో
మనుషుల గురించి రాయబోయే అమనుజుడతను కానే కాదేమో

3, ఆగస్టు 2012, శుక్రవారం

చీకటికొక వేకువ వేకువకొక చీకటి

ఎక్కడో కలిసి ఉంటాం
ఈదుతూ ఈదుతూ గడ్డి పోచ ఆధారం

రోజులు కాలాలు గడచి పోయాయి
మాట జ్ఞాపకమయింది
రాసిన కవిత కాగితపు మడతల నడుమ
ఒక శీతాకలపు నిద్రగ మారి
చుట్ట చుట్టుక పడుకుంది

లోలోపల కుహరాల్లో ఎక్కడో
లుప్తమవుతూ మెల్లగ ఇంకిపోయే జీవితం

ఖండితమైన తోక కొట్ట కొసల అణగారిపోతూ మొండిగ మిగిలిన బల్లి సంచలిత అనుభవం  కదా కామ్రేడ్

దూరాలను కొలవడానికి ఇంకా మన మధ్య ఏమి మిగిలి ఉంది

నిన్నూ నన్నూ కలిపి
భోంచేసిన కొండచిలువ బొజ్జలో
అంతా ఒక్కటిగ కరిగి పోయే సుఖ శాశ్వత నిద్రల బీభత్స శాంతి
ఇక ఈ రోజుకి  


 

పసి చేతులు



గాలిలో చేతులు చాచి
అడే పసిపాప తన్మయత్వం

దోబూచులాడుతూ
కనరాని పదబంధపరంపరల నడుమ ఒక్కడై
కవి వెతుకులాట

ఒకటి
అల్లి బిల్లిగా చల్లిన చుక్కలను ఒక్కొక్కటీ ఏరి
దండను అల్లడం

మరొకటి
తీరని వ్యామోహ చింతనలో కాలి బూడిదై
తిరిగి లేవడం