3, ఏప్రిల్ 2015, శుక్రవారం

అతను వొస్తే బాగుండు

http://patrika.kinige.com/?p=5360



కొండ మీద సన్నని మంట పాకుతా ఉంది. ఎర్రగా కాలుతూ, దారంటా పాకుతూ ఉండడం తను అదే పనిగా కిటికీలోంచి చూస్తున్నాడు.

వారం రోజుల నించి, తను గది దాటి బయటకు రాలేదు. ఈ వారం రోజులూ మంచం మీద అంటుక పోయి నిద్ర పొగలిగినంత సేపూ నిద్ర పోయాడు. నిద్ర పోని సమయాల్లో అలా కూర్చుండీ, పడుకొనీ, మెసల్లాడుతూ, ఊరకే రెప్పలల్లార్చుతూ అలా చూస్తూ ఉండిపోయాడు. ఒక్కొక్కసారి తినగలిగిన దాని కన్నా ఎక్కువే తిన్నాడు. ఇక ఏమీ తినలేననిపించిన పూట వుట్టి కడుపుతోనే ఉండిపోయాడు. చదవాలనిపించినంత సేపూ పుస్తకాలు విడుపు లేకుండా చదివాడు. చేత కానప్పుడు అడ్డదిడ్డంగా పేరుకపోయి, బూజు పట్టుకపోయిన పుస్తకాల అరల కేసి చూస్తూ కూచున్నాడు.

బయట హాల్లో టీవీ మోగుతా ఉంది. టీవీకి ఎదురుగా పాప కూర్చొని ఉంటుంది. స్కూలు నుంచి వచ్చీ రావడంతోనే పుస్తకాల సంచిని పక్కన పారేసి, ఇక నిద్ర పోయిందాకా దానికి అదే పని. ఏం చూస్తున్నామన్న దానితో పనిలేదు. బొమ్మలొస్తుంటే చాలు. వంట గదిలో పాత్రలు కడుగుతున్న చప్పుడు వినపడతా ఉంది.
“ఊరకే అట్లా పైకప్పుకేసి చూసుకుంటా కూచ్చునే బదులు కాసేపు పిల్లను హోంవర్కు చేయిస్తే ఏమీ?” – పాత్రల చప్పుడులో ఆమె గొంతు కలగలిసి పోయింది.
“బడి నుంచి వస్తానే అట్టా గాడిద మాదిరిగా టీవి ముందు కూచ్చుంటావేమే” – వంట గదిలోనుండే పిల్లను గదమాయించింది.

పిల్ల నిదానంగా లేచి తను ఉన్న గదిలోకి పోవడం చూసి ఆమె కాస్త నెమ్మదించింది. కానీ మళ్ళీ గదిలో ఊరకే కూర్చుంటుందేమోనని అనుమానంతో, “పుస్తకాలు తీస్తున్నావామ్మాయ్” – అని కేకేసింది.

“లెక్కలు చేసుకుంటున్నాను” – అని పాప అనేసరికి ఆమె హమ్మయ్య అనుకునింది. పిల్ల పుస్తకాలు ముందేసుకొని లెక్కలు చేసుకుంటోంది. పిల్లను కాసేపు తదేకంగా చూసాడు తను. రాసుకుంటూ ఎందుకో ఆ పిల్ల తలెత్తి, కాసేపు నాన్న వైపు చూసింది.

“నాన్నా, ‘యూనివర్స్’ అని అంటారు కదా. అవి ఒకటే ఉన్నాయా? లేకుంటే సోలార్ సిస్టం లాగా అవి కూడా చాలానే ఉంటాయా?” అని అడిగింది.

ప్రశ్న విని జవాబు చెప్పడానికి ఏమీ తోచలేదు తనకి. కాసేపు పాప వైపే అట్లాగే చూసి, దీనికి కూడా తనలాగే అబ్‍స్ట్రాక్ట్ ఆలోచనలొస్తుంటాయేమో అనుకున్నాడు. ఒక సారి ఇట్లానే ‘మార్స్’ గురించి ఏదో ప్రస్తావన వచ్చినపుడు, విశ్వంలోని పదార్ధాల మధ్య ఉండే దూరాల గురించి చాలా చాలా అడిగింది. నాలగవ తరగతి చదివే పిల్లలకు సౌర వ్యవస్థ గురించే సరిగా తెలియదు. ఇక నక్షత్రాలు, వాటి వ్యవస్థలు, దూరాల గురించి ఏమి అర్థమవుతుంది అనుకుంటూనే తటపటాయిస్తూ చెబుతూ వచ్చాడు. ఆపిల్ల ఆరోజంతా ఏమిటేమిటో అడుగుతూనే ఉంది.

“రాసుకుంటూన్నావమ్మాయ్” – వంట గదిలోనించి మళ్ళీ ప్రశ్న. ఆమె ఒక పనిలోనుండీ ఇంకో పనిలోకి మారుతున్నప్పుడల్లా హెచ్చరికలాగా ఆమె అరుస్తూనే ఉంటుంది.

పిల్ల రాసుకునే వైపు నుండి దృష్టి మరల్చుకొని, ఏదో గుర్తుకొచ్చిన వాడిలా, అతనితో ఈరోజు మాట్లాడాలి – అనుకున్నాడు. ఇలా మాట్లాడాలనుకోవడం, ఏదో లాగినట్టుగా మాట్లాడడం కోసం ఎదురు చూడడం ఎప్పటి నుండి మొదలయిందో గుర్తు తెచ్చుకొనేందుకు కాసేపు ప్రయత్నించాడు. మాట్లాడడం మొదలు పెట్టిన తొలి రోజులలోనే – అతను – చిత్రంగా అన్నాడు “మనం ఇప్పటి నుంచి కలల గురించి మాట్లాడుకుందాం” అని.

మొదట వినడానికి కొత్తగా, సరదాగా అనిపించినా కొన్ని రోజులు మాట్లాడుకున్నాక తనే అడిగాడు: “కలల గురించే ఎందుకూ?”

అప్పుడు అతను, “ఇప్పటి వరకూ మనం చాలాసార్లు మనవి కాని మాటలు మాటాడుకున్నాం. వాటికి ఒకరికొకరం శ్రోతలమయ్యాం. పరస్పరం అర్థం అవుతున్నట్టుగా నటించాం. ఆ నటనలో మన మాటలను మనమే శరీరం నిండా దట్టించుకొని, అనేక అనుభూతులకు లోనయ్యాం. ఎదటి వారిని మన మాటలతో కమ్మేసాం. ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఇప్పటి వరకూ మనం మాట్లాడుకున్నదంతా వొట్టిదేమో అనిపిస్తుంది,” అన్నాడు.

“నిజంగా వొట్టిదేనా” – మాటల కొసలను వొత్తి పలుకుతూ అడిగాడు తను.

“అవును. మనం చాలా సార్లు మనకి తెలియని విషయాలను తెలిసినట్టుగా ఊహించుకొని వాటినే పదేపదే పలవరించాం. మాటల గూడులను అల్లుకొని వాటిలో చిన్నపిల్లల్లాగా మనలను మనం సాంత్వన పరుచుకుంటూ ఏమేమో చేసాం. ఇన్ని మాటలు, ఇంత సమయం గడిచాక కూడా ఎందుకో మనం నిజంగా సన్నిహితం కాలేదనిపిస్తోంది. ఇంకా ఏదో ఇద్దరి మధ్యా అడ్డంగా వేలాడుతూ ఉందనే అనిపిస్తోంది. నీకెప్పుడూ అలా అనిపించలేదా?” – అడిగాడు అతను.

ఎక్కడో, ఏదో తరచి చూసుకుంటూ, తడబాటుగా తను, “అవును” – అని అనక ముందే, “మనం ఇక ఇప్పటి నుండీ కలల గురించే మాటాడుకుందాం. ఎందుకంటే అక్కడ అబద్దం ఉండదు. అక్కడ మనం నిజంగా నిజమయ్యి ఉంటాం” – అన్నాడు అతడు.

అలా మొదలయ్యింది కలల సంభాషణం. అవి ఒకోసారి స్పష్టంగా, తేటనీటి ప్రవాహంలోని నునుపాటి రాళ్ళలా ఉండేవి. చాలా సార్లు గజిబిజిగా పొందిక లేకుండా కలగాపులగమయ్యి గందరగోళంగా ఉండేవి. వాటిని తిరిగి అనుభవంలోకి తెచ్చుకోవడానికి యమ యాతనయ్యేది. చేతనయ్యేది కాదు. అయినా ఆ ప్రయత్నం ఒక ఆట మాదిరిగా, చిక్కు ముడులను విప్పుకుంటూ తనలోకి తాను తరచి చూసుకొనే లోచూపులా గోచరమవుతుండేది.

2

“రాసుకోవడం అయిందా?” – అంటూ, కాఫీ గ్లాసులతో లోపలికొచ్చింది ఆమె. ఒక గ్లాసు తన చేతికిచ్చి, పిల్ల పక్కనే చతికిలబడి కూర్చుంది. కాఫీ తాగుతూనే, పిల్ల చేసిన లెక్కాలు హోంవర్క్ ఎంతవరకూ సరిగా ఉందో చెక్ చేస్తా ఉంది. కాఫీ గ్లాసు పట్టుకొని తను కాసేపు ఆమె వైపు చూసాడు. తను అలా పిచ్చి చూపులు చూస్తుండడం తెలిసిన దానిలాగా, తలెత్తకుండా, యధాలాపంగానే అడిగిందామె.

“ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇంటి కాడనే, షాపుకు పోకుండా?”

తన దగ్గర జవాబు లేదు.

“అందరూ అడుగుతున్నారు. నీకు వొంట్లో బాగాలేదాని? అంతా బాగానే ఉందని అంటే – అట్లయితే మరి, షాపుకు ఎందుకు పోవడం లేదని వంద రకాల కూపీలూ.”
“మళ్ళా ఏమన్నా పురుగు తొలిచిందా ఏమి” – అని అందామని ఆమెకు నోటిదాకా వొచ్చిందగానీ, తమాయించుకున్నది. తమాయించుకునే కొద్దీ ఆమెకు దుఃఖం పెగులుకొని వొస్తున్నది.

ఇంతకు మునుపు కూడా ఒక సారి, పుస్తకాలనీ, మీటింగులనీ అటుతిరిగి ఇటుతిరిగి అందరినీ యమ యాతన పెట్టాడు. ఒక రోజు తెల్లవారు జామున పోలీసులు ఇంటి మీదికొచ్చి, నానా గందరగోళం చేసారు. ఉన్న మనిషిని ఉన్నట్టుగా స్టేషనులో పెట్టి, మూడు రోజులు తిప్పలు పెట్టారు. ఆ అనుభవం ఇంట్లో మనుషుల మధ్యన గోడలా నిలబడ్డది. ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. కారణం నువ్వంటే నువ్వని ఏదేదో అనుకున్నారు.

ఆ రోజులు పోయినయని అనుకుంటే మళ్ళీ ఏదో మొదలయిందని అనుకున్నది ఆమె.

తను కాఫీ తాగేసి, అటు పక్కకు తిరిగి పుస్తకంలోకి తల పెట్టుకున్నాడు. ఎందుకో ఆమె తనని కదలించలేకపోతుంది.

3

ఆమె తిరిగి తన పనుల్లోకి వెళ్ళిపోయాక, “నాన్నా, నేను కాసేపు టీవీ చూసొస్తాను. హోంవర్కు కూడా చేసేసాను” అన్నది పాప.

పాప మాటలతో తను మళ్ళీ ఇటు వైపుకొచ్చాడు. పాప పుస్తకాలను పక్కన పడేసి హాల్లోకి పోయింది. ఆ పిల్ల మళ్ళీ టివీ దగ్గరకి రావడం చూసి – “రాసుకోవడం అయిపోయిందా?” అని ఆమె వంట గదిలో నుండే పాపను హెచ్చరించింది. పాప అయిపోయిందనేసరికి ఇక ఏమనాలో తెలియక – “దీనికి ఇరవై నాలుగ్గంటలూ టీవీ రందే, పిల్లని కాసేపు కూచ్చోబెట్టుకొని సదివిచ్చయ్యాంటే, ఈ మనిషేమో ఎంతసేపూ పైకెగ చూసేదే తప్ప ఇంకోటి ఏదీ పట్టించుకోకపాయె,” అని అనుకుంటూ ఆమె తన పనిలోకి మళ్ళీ పడిపోయింది. ఆమె మాటలు వింటా ఊరకే అరచేతులవైపు చూసుకుంటూ కూర్చున్నాడు తను.

ఆమె ఎదురుగా ఉన్నా, ఏదైనా మాటాడుతున్నా బదులు చెప్పడానికి తనకి చేత కాదు. ఆ చేతకాకపోవడాన్ని అయినా ఆమెకు తెలిసేలా చెప్పాలనిపిస్తోంది తనకు. కానీ చేతకావడంలేదు.

ఆమె లోపలికి వొచ్చినపుడు ఏమన్నా అంటూందేమో అనుకుంటాడు తను. అలాంటిదేమీ లేకపోయేసరికి, ఆ గదిలో అటు తిరిగి, ఇటు తిరిగి, ఒక్కడిగా మిగిలి, ఎంతో కష్టంగా అనిపిస్తుంటుంది. భారంగా, ఊపిరాడకుండా ఉండే ఆ వాతావరణంలో, తనకేమవుతుందో గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో తనకి మరలా మరలా గుర్తుకు వొచ్చేవి అతడూ, తనూ ఒకరితో ఒకరు చెప్పుకునే కలలే. వీటికీ, ఇప్పటి తన స్థితికీ ఏమి సంబంధమో అతడు సరిగా పోల్చుకోలేక పోతున్నాడు. కానీ ఎక్కడో ఏదో ఉంది. ఇది బాధగా ఉన్నప్పటికీ, లోకంతో విడదీసి తనను తాను చూసుకునే లోచూపులాగా పదునుగా కూడా ఉంది. ఇవన్నీ బయటకు చెప్పుకోవడానికి తన శక్తి సరిపోవడంలేదు అంతే, అని అనుకుంటాడు తను.

ఒక రోజు తను అతనితో చెప్పాడు. “తనను ఇంటరాగేషన్ చేసిన పోలీసోడు కలలోకొచ్చా”డని. ఆ పోలీసోడు మునపటి అదే దర్పంతో, ముఖంలోకి ముఖం పెట్టి చదవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా, ఉద్యమం, సాహిత్యం లాంటి పదాలను వొత్తి వొత్తి పలుకుతూ ఉన్నాడు. కానీ వెనకటిలాగా తనలో భయం కలగడంలేదు. కల చెదిరి పోతున్నప్పుడు మాత్రం తన పక్కన ఎవరో స్త్రీ. ఆమె స్పర్శ తనకి తెలుస్తున్నట్టుగా అనిపించింది. ఆమె రూపమూ, ఆ సంఘటనా పోల్చుకొనేలోగానే నీటి అలల్లో ప్రతిబింబంలా అంతా కదలిపోయింది.

ఇది అతనికి చెప్పినపుడు ఊరకే నవ్వి – “అయితే ఆ రోజులు మళ్ళీ వొస్తాయంటావా,” అన్నాడు.

కలల ప్రపంచంలో అతడికి ఏదో ప్రత్యేకత ఉంది. అతనివి, తన కలల్లా కాకుండా, అతి మానుష రూపాలు, శక్తులు, దెయ్యాలు, రాక్షసులు, వినడానికే వింతగా ఉంటాయి.

ఒక రోజు అతడు, తనకి – వాళ్ళ అమ్మ చెప్పిన కలని చెప్పాడు. అది ఆమె ఎవరి దగ్గరో వినిందంట.

“ఎక్కడో దూరంగా చాలా చిన్న ఊరంట. పిల్లలు చదువుకునే బడి కావల చింతల తోపంట. మిట్ట మధ్యాహ్నమప్పుడు అక్కడ ఒక దెయ్యం తిరుగుతుందడేదంట. అయితే అది నిజంగా దెయ్యం లాంటిది కాదంట. అందుకే దాన్ని దెయ్యమని అనకుండా అందరూ, లక్ష్మీ – అని పిలిచేవాళ్ళంట. బతికున్నప్పుడు ఆమె కాపోల్ల పిల్లంట. వాళ్ళ నాయిన చానా చానా బీదోడంట. పెద్దగయిన కూతురికి పెండ్లి చేద్దామని ఆ కాపాయన ఎంత పోరాటం చేసినా, ఎంతకూ వొనకూడలేదంట. చివరకు మనిషి కూడా చాలా కుంగి పోయాడంట. నాయిన కష్టం చూసి ఆ పిల్ల కండ్ల నీళ్ళు పెట్టుకునేదంట. చివరకు ఒక రోజు ఎవరూ లేని జామున ఆమె చెంబుకనొచ్చి, చింతల తోపులోని బాయిలో దూకిందంట. చచ్చి పోయింది సుతా, ఆమె ఎవరినీ ఏరకంగా ఇబ్బంది పెట్టలేదంట. కానీ ఇంట్లో ఆడపిల్ల ఎదిగొచ్చి భారంగా తిరుగుతా ఉండే ఇండ్లల్లోని తల్లులకు మాత్రం, లక్ష్మి – బావి గట్టు మీద కూచ్చోని ఏడుస్తా కనిపించేదంట.”

“చెంబుకు పోయిన ఆడోళ్ళు – ‘మ్మేయ్, పలానా వాళ్ళకు లచ్చిమి కనిపించిందంటనే’ అని ఒకళ్ళతో ఒకళ్ళు విదారకంగా చెప్పుకునేవాళ్ళంట.”

ఈ కలని అతను చెప్పినపుడు, “అయితే నువ్వు ఇప్పుడు దెయ్యాలను నమ్ముతున్నావన్నమాట” – అడిగాడు తను.

అప్పుడు అతను అంటాడు – “నమ్మకం, విశ్వాసాలు, సిద్ధాంతాలు ఇవన్నీ బయటి ప్రపంచానికి సంబంధించినవి. నీకు ఓపిక ఉంటే వాటన్నిటి గురించి పెద్ద పుస్తకం రాయి. కానీ ఇది కల. బయటి ప్రపంచంలో నువ్వు చేసే పిచ్చి పనులు కలల ప్రపంచానికి కూడా అద్దినట్లయితే, అది కూడా అబద్దమవుతుంది. అప్పుడు ఇక ఎక్కడా నిజమన్నదే లేకుండా పోతుంది. కానీ అది జరగని పని.”

ఇంకా అతడు ఇలా అంటాడు – “ఒక సారి నువ్వు అన్నావు గుర్తుందా. నీ పక్కింటబ్బాయి చదువుకునే బడిలో ఎవరూ వాడని స్టోరు రూములో దెయ్యముందని అంటున్నాడని. అది ఎప్పుడూ ఊ.. ఊ అని ములుగుతూ ఉంటుందనీ. ఆ మూలుగు, చుట్టూ ఉన్న క్లాసుల్లోని పిల్లలకు కూడా వినపడుతూ ఉంటుందనీ. ఒక సారి ఎవరో అబ్బాయి గదిలోకి తొంగిచూడబోయినపుడు ఆ దెయ్యం వాడి ముఖాన్ని నెత్తురొచ్చేలా పీకిపెట్టిందనీ.”

“పిల్లలు పిల్లలవడం వల్లనే, ఇంకా ఏ మాలిన్యాలూ తాకనందువల్లనే వాళ్ళు బయటి ప్రపంచంలో కూడా ఇలాంటి వాటిని గ్రహించగలరు. కానీ మనం మాత్రం….”

4

పళ్లెంలో అన్నం పెట్టుకొని గదిలోకి తీసుకొని వొచ్చిందామె. పాప అప్పటికే అన్నం తిని పడుకునింది. గ్లాసులో నీళ్ళు పోసి తన ముందుంచింది. తను ఆమె కళ్ళలోకి చూడలేడు. అవి తనకే జవాబు తెలియని ప్రశ్నలు అడుగుతాయి. ఆమె నెమ్మదిగా ఆన్నం కలుపుకొని తింటుంది. ఈ వారం రోజులుకు ముందు ఏం జరుగుతూ వొచ్చిందో తను ఆమెకు చెప్పలేడు. అది తనకే ఏదో కలలా అస్పష్టంగా ఉంటుంది. ఇక మాటలతో ఎలా చెప్పగలగడం. ఇదంతా ఎప్పుడు మొదలయిందో గానీ తను చూస్తున్న మనుషులు, సంఘటనలు, ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్టుగా, విన్నట్టుగా అనిపించేది. ఆ అనుభవాలు రానురాను మరింత తీవ్రమై ఊపిరి సలపనంతగా అనుభవంలోకి రాసాగాయి. మనుషుల ఉద్దేశాలు, ఉద్వేగాలు, వాళ్ళ కదలికలు అంతా తనకు ఇంతకు ముందే తెలిసినట్టుగా అతడిని బలంగా కుదిపి వేసేవి. అంతా, అందరూ, తెలియని దేనికోసమో సంఘర్షించుకుంటూ మరణంలోకి కదలి పోతున్నట్టుగా అనిపించేది. దాన్ని తను ఎవరికీ మాటలలోకి చెప్పలేడు.

ఇలాంటి అనుభూతి నాన్న మరణానికి ముందు, తనకు తొలిసారిగా తెలిసివొచ్చింది. అయితే అది తనంతట తాను కనుగొని తెలుసుకున్నది కాదు. డాక్టరు చెప్పాడు. ఆయన నెలరోజులకు మించి బతకడని. ఆ విషయం తనలో ఎంతగా ముద్ర పడి పోయిందంటే, అది తనకు ఒక్కడికే తెలిసిన విషయంలాగా, మరొకరెవరికీ పంచుకోలేని విషయంలాగా తన లోలోపల నిగూఢంగా ఉండిపోయింది. తను నాన్నను ఊరకే అలా గమనిస్తూ ఉండేవాడు. ఆయన కొన్ని వేళల్లో అంతా బాగానే ఉన్నట్టుగా ఉండేవాడు. డాక్టర్లు కూడా నిన్న సాయంత్రం కంటే కూడా ఇప్పుడు తేటగా ఉన్నాడనే వారు. అంతలోనే ముసురుకొని వొచ్చినట్టుగా అయిపోయేవాడు. ఈ మార్పులు ఊగిసలాటలాగా అటు కదిలి, ఇటు కదిలి చుట్టూ ఉన్న మనుషులు డోలాయమానులై ఉక్కిరిబిక్కిరై పోయేవారు. మొత్తం ఈ గందరగోళంలో తనొక్కడే సర్వమూ తెలిసిన వాడిలాగా నెమ్మదిగా, గమనిస్తూ ఉండిపోయేవాడు. ఆ నెమ్మదితనం లోపలికంటా కోసుకొని పోయేది. తన చుట్టూ ఊగిసలాటలో ఉండే మనుషులకుండే తెరపి, వెసులుబాటు కూడా తనకు ఉన్నట్టుగా తోచేవి కావు.

సరిగ్గా అలాంటి అనుభూతే ఇప్పుడు మరలా మరో రకంగా తనని ఆసాంతమూ కమ్మేసింది. చుట్టూ ఏమి జరుగుతున్నా, తన గ్నాపకాలలో అప్పటికే అది నమోదయినట్టుగా అనిపించేది. మనుషుల మరణాలు – అవి ఎప్పుడో ఇంతకు ముందే ఎప్పుడో జరిగినట్టుగా, ఎప్పుడో జరిగిన వాటినే, తను ఇప్పుడు – తన గ్నాపకాల సంచితాల నుండి తిరిగి బయటకు తీసి చూసుకుంటున్నట్టుగా ఉండేది. ఈ అనుభవం తనని విచలితుడిని చేసేది. కొన్ని సార్లు ఊరకే అలా నిలబడి ఉండిపోయేవాడు. తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ, కవితా పాదాల్లాంటివి ఉచ్చరించుకుంటూ ఉండేవాడు. బొత్తిగా బాహ్య స్పృహ కోల్పోతున్నట్టుగా ఉండేది. ఉండిఉండి షాపుకెళ్ళడం మానేసాడు. ఎవరైనా పలకరిస్తే పలికేది. లేకుంటే లేదు.

ఇదంతా తనకి తెలుస్తూనే ఉండేది. తన చుట్టూ ఉండే వాళ్ళతో తను విడివడిపోతున్నట్టుగా, తను ఒక్కడే ఏదో సుదీర్ఘమైన ప్రయాణంలో పడి పోతున్నట్టుగా అనుకుంటుండేవాడు. ఇవన్నీ – అతనికి – చెప్పాలని ఉంటుంది తనకి.

 బయట అంతా సద్దు మణుగుతూ ఉంది. ఎప్పుడు పడుకునిందో గానీ రోజువారీ బండ చాకిరి అలసటతో ఆమె పాప పక్కన పడుకొని సన్నగా గురక పెడుతూ నిద్రపోతూ ఉంది. తను కూడా కళ్ళు నులుముకుంటూ, అతడు వొస్తే బాగుండునని అనుకున్నాడు.

5

“ఊం.. ఏమిటి సంగతులు” – అంటున్నాడు, అతను. ఏవేవో చెబుతూ, గంభీరంగా ఏదో అంటున్నాడు. మాటల మధ్యలో వోడ్కా తీసి గ్లాసులు తీసుకరమ్మన్నట్టుగా సైగ చేసాడు. పడుకున్న వాళ్ళు లేవకుండా, నెమ్మదిగా వంటగదిలోకెళ్ళి గ్లాసులు, నీళ్ళూ తీసుకొచ్చాడు తను. ఇద్దరూ మాట్లాడుకుంటూ నెమ్మదిగా తాగుతున్నారు. మొదటి సారయితే, వోడ్కాని చూడగానే “ఇదా?” – అన్నాడు తను.

“ఏం ఎప్పుడూ తాగలేదా?”
“లేదు”
“రష్యన్ నవలలూ, అవీ చదివానంటావ్, ఇది తెలియదా నీకు?”

అప్పటి నుంచీ అతను వోడ్కా మాత్రమే తెస్తుండే వాడు. తను దానికి అభ్యంతర పెట్టలేదు.
మాటలు సాగుతున్నాయి. పగలబడి నవ్వుతున్నాడు తను. రాళ్ళలాంటి మాటలు కరిగి అప్పుడప్పుడూ కను కొలుకుల్లో తడి పువ్వులవుతున్నాయి. అంతా కరిగి ప్రవహిస్తున్నట్టుగా ఉంది. ఆ మాటల మధ్యలో – అతను – మత్తుగా నిద్రలో పడిపోయాడు. దుప్పటి కప్పి, తనూ, అతని పక్కనే పడుకున్నాడు.
సగం నిద్రకాడ దుప్పటి కోసం వెతుకుతుంటే తనకి తడి తగిలింది. అతని వైపు నుండి అది చిన్న మడుగులాగా పక్క గుడ్డలన్నిటినీ తడిపి, వాకిలి వైపుకు పోతావుంది. చేసేదేం లేక జరిగి కాస్త ఎడంగా పడుకున్నాడు.

6

 తెల్లారి ఆమె అరుపులకు తనకి అకస్మాత్తుగా మెలకువొచ్చింది.

“ఇప్పటిదాకా పిల్లనే భరించలేక చస్తున్నాను. ఇప్పుడు నువ్వూ మొదలు పెట్టావా ఉచ్చ పొయ్యడం. కంపుకి భరించలేక చస్తున్నాను. ముందా పక్క గుడ్డల్ని మిద్దె మీద ఎండలో ఆరేసి రాపో” – అంటోంది.

దిగ్గున లేచి చూసుకుంటే పక్కన ఎవరూ లేరు.

ఈ సంగతి ఎవరికన్నా తెలుస్తుందేమోన్న కంగారులో గబగబా పక్క గుడ్డల్ని తీసుకొని పైకి పరిగెత్తాడు తను.

*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి