31, జనవరి 2015, శనివారం

ముద్ద


   
1

తన తోకను తానే తింటూ ఉంటాయి పాములు

చుట్టలు చుట్టలుగా సున్నాలు సున్నాలుగా



రోజులకు అవల పాడుతోన్న గొంతుకతో

ముడతలు దేలిన దేహపు ఒకలాంటి వాసనతో జేజి అంటోంది కదా

కాలచక్రమిది నాయనా తిరిగి తిరిగి వచ్చు మలిగిన ఎముకల లోకపు ఊపిరి దారుల

కొత్తగ చక్ర గతిని –


2

బొత్తిగా చదువన్నదే లేని సాధారణ స్త్రీ



ఏళ్ళ తరబడి శ్రమలో కొద్ది కొద్దిగా నడుం వంగుతూ

ఒక ఆవిరిలాగా  ఆవరణంలో కలగలిసి తను తిరిగిన ఊళ్ళూ, తన పాదాల కింద

పచ్చబారి పండి ఒరిగిన నేల, స్తన్యంలోని సారంలా బొట్లుబొట్లుగా శరీరం

నుండి   ఎదిగి విస్తరించిన ఆమె సంతానం-అంతా ఒక ఙ్ఞాపకంలా నెమ్మది

నెమ్మదిగా  కరుగుతున్న నేపథ్యం

తను పాడుకున్న పాటలాగా తనను దాటి ఒంటరిగా సుదూరాలకు  విశ్వ అవనికపై

ఒక్కడినై తిరుగుతుంటాను



పయనిస్తున్న దారిలో చేరాల్సిన చోటును మరచిన తడబాటులాగా

నిశ్చేష్టత ముప్పిరిగొని కాసేపు ఊరికే అలా వొట్టిగా నిలుచుంటాను



స్థల కాలాల కొలమానాల వెలుతురులో నన్నూ నా చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ

కొలిచి లెక్కలుగట్టి మరీ ఇచ్చినదెవరా అని తేరిపార పసి పిల్లవాడికళ్ళతో

సంభ్రమగా చూసుకుంటాను


3

ఈ లోకం ఒక ముద్ద

జీవితపు తొట్టతొలి ఉనికి కదలబారి

తొణకిసలాడుతూ తన కొసల చివర మృత్యువును రాసుకొని తిరిగి తనలోకే ముడుచుకుంది



ఈ రోజు కురిసిన చావు నిజంగా ఈరోజుదేనా అని అనుమానం కలిగించేలా

ఎప్పటిదో ఆ మేఘం ఒక తండ్రి దుఃఖంలాగా ఇవాళ కూడా అదేమాదిరిగా ఆవరించి ఆకాశమయి ఉంది



అతి దగ్గర నుంచి గురిచూసి కాల్చిన తల, బయొనెట్ పదునంచుకొసలపై దూసిన గడ్డి పూవు



ఉండి ఉండి వీస్తున్న ఇప్పటి గాలిలో అదే అనాది ప్రాణం మెసలిన చప్పుడు



నడుస్తున్న దారికి వేలాడుతున్న శిలువలా  అంతా ఒక్కలా అలుముకపోయి మేకులు

దిగుతున్నప్పటి  శరీరపు జలదరింపు


4

తరుచూ చప్పున పేర్లు  గుర్తుకు రానట్టుగానే

ఈ రోజేమిటని ఎవరన్నా అడిగినపుడు కూడా అంతా అయోమయమే ఎప్పుడూ నాకు



మరచి పోవడంలోని కాలిక స్పృహను మాత్రమే గొంతుకు బిగించి ఉంచి

ప్రాణం కొడిగట్టుకపోయేలా అంతా ముద్దలా అలుముక పోవును గాకాయని

ఎవరో నన్ను బహు కక్షగా  శపించారు



ఇక ఎప్పటికయినా నేను ఇలా మాత్రమే రాయగలను-



“అతడు రేపు చనిపోయాడు”

“నేను నిన్న ఒక్కడినై తిరుగుతాను”

1 కామెంట్‌:

  1. ఆది శేషయ్య31 జనవరి, 2015 9:24 PMకి

    సార్,

    ఇదో గాడత కల్గిన ఆలోచనల ముద్ద. దీనిని అర్థం చేసుకోవడానికి నా అవగాహన, అనుభవం సరిపడవు. ఎందుకైనా మంచిది. మీ రాతలను అనుసరిస్తూ ఉంటాను. ఏదో నాకు తెలియని తాత్వికత ఈ రచనలో ఉంది. అభినందనలు

    ఆది శేషయ్య, తిరుపతి.

    రిప్లయితొలగించండి