11, జనవరి 2018, గురువారం

వయా యెరుషలేము






1

ఒక కొడుకు తన తల్లితో -
శిలువనెత్తి, ధారలు కట్టిన నెత్తుటి ప్రయాసపు తడబాటులో,
“ఈ రోజు ఒకతల్లి హృదయంలో పదునైన ఖడ్గము నాటబడబోతున్నద”ని చెప్పినపుడు
యెరుసలేమూ
నువ్వొక బాధాకరమైన దారివి
అనేక తల్లుల కడుపుకోతల చరిత్రకు చెక్కిన ఙ్ఞాపకానివి
పురాతన గోడల ప్రాభవాల నీ వెలుగు నీడలలో
మార్మికమైన నీ కరచాలనాలలో
ఇప్పటి లాగే చాళ్ళు పోసి గోడలు కట్టినట్టుగా దోపిడీ, వేదనా ఇరువైపులా మోహరించినప్పుడు
నమ్మకానికే ఊపిరి పోసి రేపటి వైపుకు నడిపించావు

2

ఒక కవి నిరాయుధురాలైన తన నేలతో-
కదలికలను నమోదు చేసే కెమెరాల వెలుగుల నడుమ నిత్యకృత్యమైన దృశ్యాలను గీస్తూ,
“హంతకుని చేతి తుపాకీకి రాయి వేటు దూరంలో ఒక బాలుడు తన నీడలో తాను లయం చెందుతు”న్నాడని చెప్పినపుడు
యెరుషలేమూ
నువ్వు దారుణమైన జాత్యున్మాదానివి
అనేక తల్లుల కడుపు కోతల చరిత్రకు చెక్కిన ఙ్ఞాపకానివి
పెకల్చుకపోయే యుద్ధగాయాలను దాటి నెత్తుటిచారికలకు దిగువన
పచ్చిగ రోదన పెడుతున్న నీ ఉనికి
పాదాలకింద సెగమంటయి తాకుతున్నప్పుడు ఒక ఓదార్పులాగా వాగ్దత్త భూమిలాగా
తిరిగితిరిగి దుఃఖాన్ని తెలిసినదానవవుతావని నీ గురించి ఒక ఊహని రచిస్తున్నప్పుడు
ఎప్పటిలాగే చరిత్ర ఒక వైపుకే ముఖం తిప్పి నడుస్తుందని నువ్వు చెప్పదలుచుకున్నావు

3

యెరుషలేమూ
నువ్వు ఊహల స్వర్గద్వారానికి కడపటి మెట్టువి
నరకలోకపు విద్వేష గీతాల మహత్తర చరిత్రసంగ్రామానివి
నిరంతరం
వేదనల నిప్పులగుండంలో నడిచేదానవు
దుఃఖిత ఆత్మల చిర వ్యాయామానివి
బాధల వేణునాదానివి
యెరుషలేమూ
నువ్వు మరణం లేనిదానవు
మరణాన్ని మరచినదానవు

 http://vaakili.com/patrika/?p=15835

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి