30, ఆగస్టు 2013, శుక్రవారం

దెయ్యాలున్నాయి




పక్కటెముకల నుండి భుజాల మీదగా చేయి కొసల దాకా నొప్పి పాకుతున్నపుడు
ఒక లాంటి  భయం చావులాగా ఒంటి మీదకు పాకి ముచ్చెమటలు పోసేటపుడు
తను నీతో అంటుంది :

అన్నా నన్ను ఇక్కడ నుంచి తీసకపోన్నా -

అందరూ తనతో అంటారు:

అది వొట్టి భ్రాంతి
చనిపోయిన వాళ్ళు ఎక్కడైనా కనపడతారా ?
తిరిగి తిరగాడుతారా ?

మనం ఊహించుకుంటాం ఉత్తినే
పదే పదే ఏదో తలపోస్తాం
చివరకు బుర్రను పాడుచేసుకొని -

తను ఇంకా అంటుంది :

ఇక్కడ నాకు ఊపిరాడదన్నా ఊపిరాడదు
పడి ఉంటానా ఇక్కడ ఒక్కత్తినే
పనులకు పోయి ఆఫీసులకు  బడులకు పోయి తిరిగి తిరిగి ఎప్పటికో వచ్చే వాళ్ళ కోసం
గిర్రున తిరిగే యంత్రం లాగానో వేళకు అన్నీ అమర్చి పెట్టే పనిముట్టులాగానో

అంతా బాగుంటుంది కానీ
అమర్చి పెట్టేందుకు ఎవరూ లేని
చేయడానికి ఇక పనంటూ ఏమీ మిగిలి ఉండని జాములలో

ఆవరణంలో ఏదో కదలాడినట్టు నీ వెనుకే  నీడలా ఎవరో పారాడినట్టు
నువ్వు ముఖాముఖీగా ఎవరినీ చూడక పోయినా నిన్ను ఎవరో తదేకంగా గమనిస్తున్నట్టు
ఒకటే దడగా చెమట చెమటగా
చిత్తడిగా చావులాగా పాకుతుందన్నా నొప్పి

నన్ను ఇక్కడ నుంచి తీసుకపోన్నా-

దిగ్బ్రాంతితో భయంగా వింటాను
కాసేపటికి తేరుకొని ఏమై ఉంటుందని తర్కించుకుంటాను

భ్రాంతిని నిజంగా భావించకూడదని చెబుతారు
కానీ నిజం భ్రాంతిలా కూడా ఉంటుందా?






 
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి