http://magazine.saarangabooks.com/2015/05/28/%E0%B0%86-%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A6%E0%B1%86%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF/
ఆ ఇంటి గురించి వాకబు చేసినపుడు అన్నింటి కన్నా ఆమెకు ముందుగా తెలిసిన విషయం, ఆ ఇంట్లో దెయ్యముందని.
ఇదేమిట్రా నాయనా అనుకొని, ఆ పక్కనే
ఉంటోన్న తెలిసిన టీచరునొకాయన్ని అడిగితే ఆయన అన్నాడు గదా-” మేడం,
నాలుగైదేళ్ళ నించీ ఆ ఇల్లు ఖాళీగా ఉందన్నది మాత్రం వాస్తవం. ఇంతకు ముందు
అద్దెకు ఉన్న ఆమె అక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందంట. అదికూడా
అనుకుంటుంటే విన్నదే గానీ వాస్తవం మాత్రం మనకు తెలియదు. అయినా
దెయ్యాల్లాంటివి ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు? ఇల్లు మాత్రం ఏ ఇబ్బందీ
లేకుండా అన్ని విధాలుగా మీకు బాగుంటుంది” అన్నాడు.
దెయ్యాలంటే నమ్మకమా అపనమ్మకమా అన్న మీమాంసలో పడేంత సమయం అప్పుడు
లేకపోయింది తనకు. వొచ్చి ఇల్లు చూడడం, చేరిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.
అయితే ఆ ఇంట్లో చేరిన నెల రోజుల వరకూ చుట్టు పక్కల వాళ్ళంతా తన
గురించే అనుకుంటూ ఉన్నారు. నాలుగైదు రోజులుండి ఖాళీ చేసి పోతుందిలే
అనుకన్నారు. ఈ విషయాలన్నీచాలారోజుల తర్వాత పక్కింటామె చెప్పింది తనకు.
ఉండగా ఉండగా తనకు తెలిసి వొచ్చిన విషయం ఏమిటంటే నమ్మకమైనా,
అపనమ్మకమైనా అవి అనుభవం మీదనే తేలతాయి. ఆ అనుభవం కూడా మనమున్న స్థితిని
బట్టే ఉంటుంది. అందునా, ఇప్పుడు అనిపించిన విషయాలు రేపటికి కూడా ఇట్టానే
అనిపించాలని లేదు. ఇలాంటి తెలివిడి తనకు ఆ ఇంటి నుండే వొచ్చింది.
ఇప్పటికిప్పుడు ఎవరైనా తనను ఆ ఇంట్లో నిజంగా దెయ్యముందా అనడిగితే ఫలానా అని
ఖచ్చితంగా చెప్పలేదు. ఒకోసారి ఉంటుంది, ఒకోసారి ఉండదు అని మాత్రమే
చెప్పగలదు.
చాలా సార్లు ఆ ఇంటి గురించి ఆలోచిస్తుంటే అది ఆ ఇంటి గురించి కాక తన
గురించి, తన ఆంతరంగిక విషయాల గురించి తరచి తరచి చూసుకున్నట్టుగా ఉంటుంది
ఆమెకు .
అట్లా తరచి చూసుకోవడం ఒకోసారి తనకు తెలియకుండానే ఇష్టంగా ఉంటుంది.
మరోసారి అసలు ఆ ఇంటి నుంచీ, చివరకు తన ఉనికి నుంచే తప్పించుకొని ఎక్కడకయినా
పారిపోదామా అన్నంత భయం గొలిపేదిగా కూడా ఉంటుంది.
****
*****
****
ఆలోచనలు అనేక విధాలుగా కదులుతూ అదుపు తప్పి పోతున్నాయి. అట్లా కావడం
ఎంతమాత్రమూ మంచిది కాదని డాక్టర్ హెచ్చరించడం తను గుర్తు చేసుకున్నది.
అట్లా కాకూడదు, అట్లా కాకూడదు అని తనను తాను సంభాళించుకొనేందుకు
ప్రయతించింది. కాసేపు వేరే విషయాల మీదకు దృష్టి మళ్ళించేందుకు చూసింది.
చెట్టు కింద అరుగు మీద కూర్చున్నదే కానీ ఎండ సెగ తెలుస్తూనే ఉంది.
బయటి సెగకు తోడు లోపలి సెగ కూడా జతయి నోరంతా పిడచగట్టుక పోతున్నట్టుగా
అనిపిస్తోంది. పెదాలను నాలుకతో తడుపుకొని, బాటిల్‍లోని నీళ్ళను లోపలికి
వొంపుకున్నది. దాహమయితే తీరింది కానీ నోరంతా ఏదో చేదుగా అనిపించింది.
కాసేపటికి పి.ఎచ్. సి లోనించి “సరోజక్కా” అని పిలుస్తూ తన దగ్గరికొచ్చింది నీలిమ.
వొచ్చీ రాగానే ,”వొంట్లో వుషారుగా ఉందా, జెరం తగ్గి పోయిందా” అని అడిగింది. అలా అడుగుతూనే చొరవగా నుదురు మీద చేయి వేసి చూసింది.
బదులుగా- ” నయమే లేవే, మరీ నిన్నటంత లేదు గానీ” అనింది తను.
“ఈ రోజు కూడా సెలవు పెట్టాల్సింది. ఈ ఎండకు పడి తిరిగితే లేని రోగం కూడా వొస్తది” హెచ్చరింపుగా అనింది నీలిమ
“కొద్దిగా బాగానే ఉన్నట్టుగా ఉంటే, చిన్నగ బయల్దేరాను లేవే. మరీ
ఇబ్బందిగా ఉంటే ఈ బండ చాకిరీ నేను మాత్ర ఎలా చేయగలను. ఇంతకీ ఇప్పుడు
మీటింగు ఉంటదంటనా, లేదంటనా” అడిగింది తను.
“అందరూ అదే అనుకుంటున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకన్నారు కదా. పాపం
అందరూ ఈ ఎండన పడి వొస్తానే ఉన్నారు. ఇంకాసేపాగితేగానీ ఏమయ్యేదీ తెలియదు”
వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉండగానే చాలా మంది ఏఎన్నెంలు వ్యాక్సిన్
బ్యాగ్‍లు లోపల పెట్టేసి ఒక్కొక్కరుగా చెట్ల కిందకి చేరుతున్నారు.
డిపార్ట్‍మెంట్‍కు సంబంధించిన కబుర్లు, వాళ్ళు పని చేసే ఏరియాలో ఉండే
సమస్యలు – ఇట్లా మాట్లాడేసుకుంటా ఉన్నారు. మరికొంత మంది వాచీలు చూసుకుంటూ
మీటింగు ఉంటుందా, ఉండదాని వాకబు చేస్తున్నారు.
టైం రెండు దాటుతున్నది. కాసేపటికి పిఎచ్‍సి స్టాఫొకరు వొచ్చి “డాక్టరు
గారికి ఏదో ఫోనొచ్చింది. అర్జెంటుగా వెళ్ళి పోయారు. రేపు మీటింగుంటదని
ఇప్పుడే ఫోన్లో చెప్పా”రని అన్నాడు.
“మళ్ళా రేపా “, అన్నారు కొంతమంది. “ఎటూ తప్పేది కాదుగా ఈ రోజుకు
బతికాం” అనుకున్నారు చాలా మంది. ఎవరి దారిన వాళ్ళు ఒక్కొక్కరిగా బయలు
దేరుతున్నారు. తను, నీలిమా కూడా కాంపౌండ్ దాటి బయటకొచ్చారు.
దారిలో, “ఈ ఎండకు ఏం పోతావుగానీ మా ఇంటి కాడికి పోదాంరాక్కా” అనింది నీలిమ.
“లేదే, మా అన్న కాడికి పోయి రావాలి. పొద్దున్నే మా అమ్మ ఫోన్ చేసింది”.
“సరే, అయితే రాత్రికి వొచ్చి తోడు పడుకునేనా. అసలే వొల్లు బాగాలేదు. ఈ
పరిస్థితుల్లో మల్లా ఒక్క దానివే ఉన్నావంటే మీ డార్లింగొచ్చి ఎదురుగా
కూర్చుంటదేమో!”
ఆ పిల్ల డార్లింగన్న పదాన్ని వొత్తి పలికిన తీరుకి చిన్నగా నవ్వుతూ –
“వొద్దులేవే, బాగానే ఉందిగా. పాపం రోజూ నువ్వు మాత్రం ఎక్కడకని వొస్తావు.
అంత ఇబ్బందిగా ఉంటే నేనే ఫోన్ చేస్తాలే” అనింది సరోజ.
****
*****
****
ఎండకు వొళ్ళంతా గుచ్చుక పోతున్నట్టుగా
ఉంది ఆమెకు. ఉదయం పని, ఆ తర్వాత ప్రయాణం- వీటితో వొళ్ళు తూలిపోతున్నట్టుగా
నీరసం అయింది. కాసేపు ఎక్కడన్నా నీడలో ఆగుదామానిపించింది. కానీ
ఇక్కడెక్కడా తను ఆగడానికి లేదు. ఆగితే షాపుల ముందర ఆగాల్సిందే. ఇదంతా
ఎందుకు లెమ్మని ఓపిక తెచ్చుకొని చిన్నగా నడవడానికే ఆమె నిర్ణయించుకున్నది.
ఈ రెండు రోజుల నుంచీ కాసిన జ్వరం తనని బాగా నీరసం చేసేసింది.
ఈ సమయంలో నీలిమ తోడు లేకుంటే ఎలా ఉండేదోననిపించింది తనకు. ఒంట్లో ఏ
కాస్త నలత చేసినా, మనసు కాస్త తేడాగా ఉన్నా, తన బలహీనతలోనించీ “ఆమె” తన
ముందర ప్రత్యక్షమవుతుందేమోనని ఒకోసారి భయం వేస్తుంది.
ఆలోచనల్లో ఉండగానే బస్టాప్ దగ్గరకొచ్చేసింది. బస్సు వొస్తే ఎక్కి
టిక్కెట్ తీసుకొని ఎందుకైనా మంచిదని కిటికీ దగ్గర కూచ్చుంది. ఆలోచనలు వాటి
కొసల నుండీ తిరిగి మళ్ళా మొదలవుతున్నాయి. ఒక ధారలాగా ఎడ తెగకుండా తనను తమ
లోపలికి పీల్చుకుంటున్నాయి.
“ఇలా కాకూడదు” అనుకున్నది తను. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే లేని రోగం కూడా
వొస్తుందన్న సైకియాట్రిస్ట్ హెచ్చరికను గుర్తుకు చేసుకున్నది. ఊరికే అలా
ఆలోచనల్లో పడి లోలకంలా పడి కొట్టుకోకుండా ఏం ఆలోచిస్తున్నావో గమనించు అన్న
ఆయన సలహాను తలుచుకున్నది.
నెమ్మదిగా అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కొక్కటిగా పోగు చేసుకునేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది.
అసలిదంతా అమ్మ ఉదయాన్నే ఫోన్ చేయడంతో మొదలయ్యింది. ఫోన్లో ఆమె ఏడుస్తున్న గొంతుతో “అన్నను పోలీసోల్లు పిలచక పోయార” ని అన్నది.
” ఎందుకు” అని అడిగితే “ఎస్సై గారు పిలచక రమ్మన్నారు. మళ్ళీ పంపిస్తాం “, అని అన్నారంట.
“ఊళ్ళొ ఇంకా మరో ఇద్దర్ని కూడా పిలచక పోయార”ని ఆమె అన్నది.
రెండు రోజుల నుండి డ్యూటీకి సెలవు. ఈ రోజేమో వ్యాక్సినేషన్. నిన్న
సాయంత్రమే తను హాస్పిటల్‍కు ఫోన్ చేసి రేపు వొస్తానని చెప్పింది కూడాను.
ఇప్పుడు తను డ్యూటీకి వెళ్ళక పోతే ఎక్కడిదక్కడ ఆగి పోతుంది. ఏం చేయాలో తోచక
“సాయంత్రానికల్లా ఇంటికొస్తాన”ని అమ్మతో పోన్లో చెప్పింది.
ఎలాగైతే అలాగవుతుందని లోపల్లోపల ధైర్యం చెప్పుకుంటుందేగానీ లోపలి గాబరా ఎంతకీ ఆగడం లేదు.
“ఎక్కడా ఏమీ అలికిడి లేదే. మళ్ళీ ఎందుకని ఇలా వెంటబడుతున్నారు?”
“మళ్ళి ఏమన్నా నెత్తి మీదకు తెచ్చుకున్నాడా?”
చుట్టుపక్కల ఎక్కడా నక్సలైటన్న పేరు వినపడకుండా పోయేదాకా పోలీసులు ఆయనెమ్మటి పడుతూనే ఉన్నారు.
“ఎవరికీ లేని ఖర్మ నీకెందుకురా” అని అమ్మ నెత్తీ నోరూ మొత్తుకుంటే
మౌనమే వాడి సమాధానం. ఇంకా గట్టిగా నిలదీస్తే కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాడు.
ఇట్లా మొత్తుకున్న కొన్ని రోజుల దాకా తగ్గినట్టే తగ్గి ఇక ఏమీ లేదులే
అని అనుకునేటప్పటికీ మళ్ళీ మనకు తెలియకుండానే పీకల్లోతు కూరుకుని పోయేవాడు.
“మీ వాడి పేరు రికార్డుల్లోకి ఎక్కింది. ఎక్కడ ఏమీ జరిగినా మీ వాడినే ముందు తీసుకొని పోయేది”, అనే వాళ్ళు అందరు.
“అట్లా రికార్డుల్లోకి ఎక్కిందాన్నేనా, చుట్టూ ఏమీ లేక పోయినా మళ్ళీ మళ్ళీ పట్టుకొని పోతా ఉంది?” అనుకున్నది తను.
అట్లా అనుకుంటూనే గబగబా తయారయి వ్యాక్సిన్ బ్యాగ్ పికప్ చేసుకుంది.
ఆటో ఎక్కి తను పని చేసే ఊర్లో దిగే సరికే ఎండ దంచేస్తా ఉంది. ఆటోలు ఆగే
దగ్గర ఆశా వర్కర్ రమణమ్మ సిద్ధంగా ఉంది. వ్యాక్సిన్ బ్యాగ్‍ను ఆమె తన
చేతుల్లోకి తీసుకున్నది.
గబగబా నడుస్తూ చిన్నబడి దగ్గరికొచ్చేసరికి వాళ్ళకు సుమారు ఒక పది మంది
డ్రస్సుల్లో, తుపాకులతో ఎదురయ్యారు. ఊహించని ఈ సన్నివేశానికి తనకు
ఒక్కసారిగా ఊపిరాడనంత పనయ్యింది. ఒక్క క్షణం వాళ్ల వైపు చూస్తూ నిలబడింది.
వాళ్ళు గబగబా వరుసగా ఒకళ్ళ వెనుక ఒకళ్ళుగా తమను దాటి మెయిన్ రోడ్‍కు అవతల
ఉన్న గుట్టల వైపు పోతున్నారు.
లోపల తను ఆలోచిస్తున్న దానికి, బయట తను చూస్తున్న దానికీ సంబంధం
ఏమయినా ఉందేమోనని ఆమె కాసేపు సంకోచపడింది. తను మాట్లాడేది వాళ్ళకు
వినపడుతుందేమోనన్న భయంతో , ” రమనమ్మా, ఏందీ వీళ్ళూ?” అని చిన్నగా అడిగింది.
“ఎర్ర సెందనం కోసమంటమ్మా. అడివిలోకి ఎవురూ కూడా పోవడానికి బయపడి సస్తా
ఉండారు. మొన్న తిరపతి కాడ కట్టె కొట్టడానికి పోయినోళ్ళను కూడా సంపిండ్రంట
గదా. మనకెల్లంతా కూడా అడవడివీ గాలిస్తా ఉండారు”
ఒక్క క్షణం నింపాదిగా గాలి పీల్చుకున్నది తను. అంగన్‍వాడీ సెంటర్
దగ్గరికొచ్చేసరికి అప్పటికే బాలింతలు చంటిబిడ్డల్ని తీసుకొని తన కోసం ఎదురు
చూస్తున్నారు. వాళ్ళను ఒక్కొక్కళ్ళనూ పలకరిస్తూ పనిలో పడింది తను.
****
*****
****
తిరిగి వొస్తున్నప్పుడు దారిలో అటో
తోలుతున్న చాకలి గురవయ్య అంటున్నాడు. “పెద్ద పెద్ద వాళ్ళను వొదిలేసి సన్నా
సపకా వాళ్ళను చంఫుతున్నారు మేడం”.
ఆ మాటలు తనకు తగలాలనే, తనను ఉద్దేశించే అంటున్నాడు.
అయినా తనకు తెలియకుండానే, “ఆఁ” అన్నది తను.
తను “ఆఁ” అనడం అతనికి ఎలా తోచిందో గానీ దారి పొడగునా వొదురుతానే ఉన్నాడు.
“ఎప్పటికయినా సన్నా సపకా వాళ్ళకేనంట నెత్తి మీదికొచ్చేది”.
“ఈ చుట్టు పక్కల తలకాయ ముదిరిన ప్రతీ వాడూ ఎర్ర చందనం డబ్బు ఏదో రకంగా తిన్నవాడేనంట”.
“మొన్న ఎలక్షన్లో ఇప్పటి ఎమ్మెల్యేని గెలిపించింది కూడా ఆ డబ్బులేనంట”.
“ఇట్టాంటి డబ్బు తినడానికి ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదంట.”
“కట్టె కొట్టబోయిన తన లాంటి వాళ్ళకు మాత్రం తన్నులూ, కోర్టు కేసులూ, చావులూనంట”.
“అట్టాంటి కేసుల్తోనే సంవత్సరంగా డబ్బులు పోసుకుంటా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడంట”.
చాకలి గురవయ్య మాటల్లో కసంతా తన మీదకే కొడతా ఉంది. అది తనకు తగలాలనీ, తనను బాధ పెట్టాలనీ ఉద్దేశించినట్టుగానే ఉంది.
ఒక్క క్షణం తనకు అతనితో, ’నేనూ నీ లాంటి దాన్నే” అని
చెప్పాలనిపించింది. ’నాకూ నీకూ ఎడంలేదు. నీది బయటకు కనపడే బాధ. నాది బయటకు
కనపడనిది. నీలా చెప్పుకోలేనిది” అని అనాలనిపించింది. “కానీ అది ఆయనకు
అర్థమవుతుందా”?
“అయినా ఇప్పుడు తను ఈ మాటల్నీ, మాటలతో సలపరించే తన గతాన్నీ
తవ్వుకుంటూ కూర్చోలేదు. అది తనని ఇంకా ఇంకా పాతాళానికి తోసేస్తుంది. తను
దాన్నించీ తప్పుకోవాలి. బతకాలి”. లోపలికి గట్టిగా గాలిపీలుస్తూ అనుకుంటూ
ఉండిదామె.
****
*****
****
బస్సు దిగి ఇంటి దగ్గరకొచ్చేసరికి అన్న వొచ్చేసి ఉన్నాడు. తను
ఇంట్లోకడుగు పెట్టేసరికి మొగరానికానుకొని గిట్టకాళ్ళమీద కూర్చొని తనని
చూసి పలకరింపుగా నవ్వాడు. అమ్మ పొయికాడ రొట్టెలు చేస్తా ఉంది. అన్న
తాగుతున్న బీడీని పక్కన పారేసి గ్లాసు తీసుకొని టీ పోయించుకరాను
బయలుదేరాడు.
“ఇప్పుడెందుకులేన్నా”, అంటే , “పోనీలేవే, కాసింత రొట్టె తిన్నాక టీ తాగడం నీకిష్టమేగా” అన్నది అమ్మ.
అన్న బయటికెలితే ఆ సమయంలో ఏదన్నా మాటాడొచ్చని ఆమె ఆలోచన.
అన్న గ్లాసు తీసుకొని బయటకు పోగానే అమ్మ చెప్పడం మొదలు పెట్టింది.
“ఊళ్ళలో ఉండే అన్న లాంటి వాళ్ళందరినీ మళ్ళా పోగేసి మాట్లాడానికి
పిలిపిచ్చిండ్రంట. ఆప్పుడప్పుడూ అట్టా పిలిపిచ్చి మాట్టాడితే గానీ
బయ్యముండదని ఇదంతా చేస్తా ఉన్నారంట. రేపు మార్కాపురం డీఎస్పీ కాడికి కూడా
అందరూ పోయి రావాల్నంట”.
“మళ్ళీ రేపు కూడానా” , అన్నది తను.
“ఏం చేస్తాం. అందరూ బాగానే ఉండారు. మా కర్మే ఇట్టా కాలబన్నది”, పుల్లవిరుపుగా అన్నది వొదిన.
తను వొచ్చిన దగ్గర నుండీ ఆమె ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాటాడలేదు.
ఇలాంటి సమయాల్లో ఆమె మూతి ముడుచుకోని ఉంటుందని తనకి తెలుసు. ఆమెలో ఏదో
కోపం. ఎవరి మీద చూపాలో తెలియని కోపం.
ఆమె కోపం ఉదయం తను చూసిన చాకలి గురవయ్య లాంటిదేనని అనిపించింది తనకు.
కానీ ఆమె కోపము, ఆ పుల్లవిరుపు వైఖరి తనను ఎంతకూ కుదురుగా ఉండనీయడంలేదు.
” ఎవ్వరి బతుకులు మాత్రం బాగున్నాయి. తను కూడా ఆమె లాగా, చాకలి
గురవయ్యలాగా ఈసురోమనే కదా బతుకుతున్నది. పైకి మాత్రం ఇదిగో, మంచిగా కనపడే
గుడ్డలు కట్టుకొని, భుజానికి హ్యాండ్ బ్యాగ తగిలించుకొని తెల్లపుల్లగా
కనపడుతున్నాను గానీ, నా బతుకు కూడా తగలబడి పోతుందని ఈమెకు తెలియదా?
వీళ్ళకన్నా ఏడ్చుకోవడానికి ఉంది. నేను మాత్రం ఈ తెల్లపుల్లని గుడ్డల మాటున
శిధిలమైపోతున్నాను” అని గట్టిగా అరవాలనిపించింది.
“కానీ తనకు తెలుసు. మనుషుల మధ్యన ఉండే దూరాలు, ఎత్తు పల్లాలు మనుషులను
ఎంతకీ దగ్గర కానీవు. ఎంత మొత్తుకున్నా ఒకరికొకరు అర్థం కానీయవు.
ఒకరికొకరు కాస్త దగ్గరకొచ్చినట్టుగా అనిపించినా అది కాసేపే. తిరిగి మళ్ళీ
మనుషుల మధ్య గోడలు పైకి లేస్తాయి. పైకి లేచిన గోడల మధ్యన మనుషులు
జంతువుల్లాగా బంధీలై గాలిలోకి కాళ్ళూ చేతులూ విసురుతూ మొత్తుకోవాల్సిందే.”
“లేకుంటే తను ఏమి చేసామని వొదిన తనతోనూ, అమ్మతోనూ సరిగా మాటాడదు?
ఏదన్నా అంటే, ఈ కొంపలో నా కర్మ కొద్దీ వొచ్చి పడ్డానంటుంది. ఆమె ఈ
ఇంటికొచ్చిన దగ్గరనించీ ఇదే తంతు. అంతా అయిపోయీ, అన్న ఇక ఎటూ పోకుండా ఇంటి
కాడే ఉండేంత వరకూ ఇట్లాగే కక్షగా ఉండేది ఆమె.”
“తనకూ, మొగునికీ పడక గొడవలై, ఇక కలిసి ఉండలేక వొక్కతిగా
ఉండాల్సొచ్చినపుడు అన్నా, వొదిన, అమ్మ తన దగ్గరకు వొచ్చి రెండు
రోజులున్నారు. ఆ రెండు రోజులూ మాత్రమే వొదిన మునపటి కన్నా నెమ్మదిగా,
మెత్తగా మాటాడింది. ఆ నెమ్మదితనం, మెత్తదనం చూసి తనే ఆమెను దూరం నుంచీ చూసి
అర్థం చేసుకున్నానేమో అనుకున్నది. కానీ ఈ రోజు, ఈ సంఘటనతో మళ్ళీ తనకు
తెలిసిన వొదిననే చూస్తున్నది తను”.
కళ్ళలో నీళ్ళు మెదలుతున్నాయి తనకు. అన్న వొస్తూ వొస్తూ పిల్లల్ని కూడా
పిలుచుకొని వొచ్చాడు. వొస్తూనే వాళ్ళూ “అత్తా” అని మీద పడిపోయారు. హ్యాండ్
బ్యాగ్ లోనుండీ కొనుక్కోవడానికి వాళ్ళకు డబ్బులు తీసిచ్చింది.
అన్న తెచ్చిన టీ తాగుతూ, “అయితే రేపు కూడా పోవల్నా” అని అడిగింది తను.
“అవును ఉత్త పున్నేనికే తిప్పుతా ఉండారు”, అన్నాడు ఆయన.
ఇంకేం మాటాడడానికి తోచలేదు తనకు.
టీ ఊదుకుంటా తాగుతా ఉంటే అన్న మొకం కెల్లి చూసింది. మొకమంతా
డొక్కుపోయినట్టుగా ఉంది. రెక్కల కష్టంతో దేహం ఎండిపోయి కంప మాదిరిగా
తయారయ్యింది. ” తనకున్న రెండెకరాల చేను పీల్చి పిప్పి చేస్తున్నది”
అనుకున్నది తను.
ఈ నిశ్శబ్ధంలో కాసేపు ఆగి అటూ ఇటూ తిరుగుతూ బోకులు సర్దుకుంటున్న
వొదిననూ, పిల్లలనూ, అమ్మనూ మార్చి మార్చి చూసింది. వాళ్ళు కూడా అన్న లాగే
ఎండిపోయి వొట్టి చేపలల్లే ఉన్నారు. ఒకే ఇంటిలో ఒకే రకమైన కష్టాలతో
ఒకరినొకరు ముమ్మూర్తులా పోలి ఉన్నారు.
కానీ వాళ్లందరినీ విడగొడుతున్నదీ, ఒకరంటే ఒకరికి ద్వేషాన్నీ, కోపాన్నీ
కలిగించేదీ ఏదో అక్కడే మెసల్లాడుతున్నట్టూగా తోచింది. అది గాలిలాగా అక్కడే
తిరుగుతూ ఉన్నది. వొంటికి తాకుతూ ఉంది. అక్కడక్కడే తిరుగుతూ మనుషుల్ని
నిస్సహాయుల్ని చేసి దిక్కుకొకరుగా ఈడ్చుక పోతూ ఉంది. అది తనకు తెలుస్తూ
ఉంది అనుకున్నది తను.
ఉండి ఉండీ కాసేపటికి, “నిన్న స్టేషను కాడ మీ లాయరు మాట్లాడిండు” అన్నాడు అన్న.
తను ఏమీ మాటాడలేదు.
ఏమయినా మాటాడితే అది ఆ ఇంట్లో మరో విస్పోటనంగా పని చేస్తుందని తనకు తెలుసు. అందుకే తను ఏమీ మాటాడలేదు.
కానీ అమ్మ అందుకోనే అందుకున్నది. అది నెమ్మది నెమ్మదిగా మొదలై తిట్లు, శాపనార్ధాలకు చేరుకుంటున్నది.
****
*****
****
అందరిలాగే తన బతుకూ ఉంటుదనుకున్నది తను. పెళ్ళయిన కొన్నేళ్ళ దాకా
బాగానే ఉన్నాడు భర్త వెంకట రమణ. ఉద్యోగస్తుడు కాకపోయినా దగ్గరి సంబంధం
బాగుంటుందని చేసారు. కానీ మూడేళ్ళు దాటిన దగ్గర నుంచీ మొదలయ్యిందీ నరకం.
పిల్లలు పుట్ట లేదని అత్త, మామా సణుగుడు. దానికి తోడు తను చేసే ఉద్యోగం మీద
ఏవేవో సూటిపోటి మాటలు. తన రాకపోకల మీద భరించరాని ఆంక్షలు. కాసింత ముందుగా
బయల్దేరినా, కాస్త లేటుగా వొచ్చినా ఎంతదాకా మాటలు పడాల్సొస్తుందోనని
గుండెలు బితుకు బితుకు మనేవి.
ఇది చాలదన్నట్టుగా ఎట్టా తగులుకున్నాడోగానీ రాజకీయ నాయకులెమ్మటి
తిరగడం, ఎమ్డీవో, ఎమ్మార్వో ఆఫీసులెమ్మటి మరిగి ఊళ్ళో వాళ్లకి పనులు
చేపించడం , దానికి గాను ఆఫీసర్లకింత ఇప్పించి తనూ కొంత దండుకోవడం.
“ఎందుకయ్యా ఈ తిరుగుళ్ళు, ఉన్న కాస్త పొలమూ చూసుకోక”, అంటే “తిరుగుతున్నాను కాబట్టే లోకం తెలుస్తుందం”టాడు.
ఇది ఎంత దాకా వొచ్చిందంటే చుట్టూ పక్కల ఏ పనొచ్చినా ఆయన కన్ను దాటి పోని పరిస్థితి.
ఆయన చేసే పనులు వింటుంటే ఒకోసారి తనకే ఆశ్చర్యం వేసేది. హైస్కూలు
చదువు దాటని మనిషి ఇన్ని రకాలుగా చేయగలగడం నమ్మశక్యం అయ్యేది కాదు. ఇదంతా
తన అన్న నడిచే దిశకు వ్యతిరేకంగా సాగడంగా తనకు అర్థమయ్యేది. ఇది ఇంట్లో
ఇంకా ఇంకా హింసకు దారి తీసేది. అన్న జీవితంలో ఎదురయ్యే మలుపులు, ఇబ్బందులు
రోజుకొక్క రకంగా తనకు దెబ్బలై తాకడం తనకు తెలుసు.
ఇందులో తన ప్రమేయం ఎక్కడా లేదు. కానీ ఇదీ అని చెప్పలేదు గానీ లోపల
మాత్రం తనకు తెలియకుండానే తన మొగ్గు అన్న వైపే ఉన్నట్టుగా కనపడుతుండేది.
మొగుడు మొకాన్నే అనేవాడు, “నీకు ఇదంతా యాడ నచ్చుద్ది లేవే,
గుట్లమ్మటీ, అడువులమ్మటీ తిరుగుతుంటే నచ్చుద్దీ గానీ” అని. అన్న
ఇబ్బందులకు గురి కావడం, కేసుల పాలయిన సందర్భాల్లో అయితే ఇక ఆ ఇంట్లో
లేకుండా ఉంటే పీడా పోతుందనుకునేది.
ఇదంతా ఏళ్ల పాటు గడిచింది. అన్న జీవిత ఇక ఒక స్తబ్ధ స్థితికి చేరుకుంటున్నదనుకునే సమయానికి తన జీవితం ఇంకో ఇబ్బందిలోకి కూరక పోయింది.
వెంకట రమణ ఎర్ర్ర చందనం కొట్టించడం మొదలు పెట్టాడు. మొదట తను ఇది
విన్నప్పుడు, ” ఇది, ఇక్కడా” అని ఆశ్చర్య పోయింది. ప్రకాశం, కడప జిల్లాల
సరిహద్ధుల్లో ఇది సాధ్యమేనా అనుకున్నది. కానీ తర్వాత్తర్వాత ఇది నిజమేనని
తెలుసుకున్నది. ఫారెస్టోల్లూ, పోలీసుల గొడవ మళ్ళీ తన జీవితంలో మరో విధంగా
మొదలయింది. కానీ అవి తన భర్తను బతక నేర్చిన వాడిగా, పలుకుబడి గలిగిన
వాడిలాగా నిలబెట్టేందుకే దోహద పడ్డాయి. కేసులూ, రైడింగులూ అన్నీ అయ్యాయి
గానీ అవన్నీ ఆయనని మరింత ఎత్తుకు చేర్చేందుకే ఉపయోగ పడ్డాయి. ఇట్టాంటి
డబ్బే కిందటి ఎలక్షన్లల్లో ఏరులై పారిందంట. చివరకు వెంకట రమణ పంచాయితీ
సర్పంచ్ కూడా అయ్యాడు.
వీటన్నింటికీ తోడు తను ఇక తట్టుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరైన విషయం
వెంకట రమణ ఒంగోలులో ఎవరితోనో కాపురం పెట్టడం. ఇది తన సహనానికి ఉన్న ఆఖరి
హద్దును కూడా పూర్తిగా చెరిపేసింది.
****
*****
****
బస్సెక్కి తిరిగి ఊరు చేరుకొనేసరికి ఎనిమిది దాటుతుంది. బస్సు దిగగానే
పర్సులోనించీ సెల్లు బయటకు తీసి చూసుకుంది. నీలిమ నుంచీ రెండు మిస్‍డు
కాల్స్.
తిరిగి ఆ నెంబరుకి కాల్ చేయబోయింది కానీ ఎందుకో ఒక్క క్షణం ఆగి
మానేసింది. ఈ క్షణంలో ఆమె ఏది మాట్లాడించబోయినా తను మాటాడగల స్థితిలో
లేదు.
బస్టాప్ నుంచీ ఇంటి దాకా కూడా నడవడానికి ఓపికగా ఉన్నట్టు
అనిపించడంలేదు. దగ్గర ఉన్న ఆటో ఒక దాన్ని ఆపి ఇంటి అడ్రస్సు చెప్పి ఎక్కి
కూచ్చునింది.
బస్సు ఎక్కినప్పటి నుండే తల ఊరకే కదిలి పోతున్నట్టుగా అనిపిస్తోంది.
కడుపులో ఒక పక్కగా మొదలైన మంట రొమ్ము దగ్గరకు పాకుతూ వొస్తుంది. అది
ఇప్పుడు మరింత ఎక్కువై నోట్లో నీళ్ళు ఒకటేమైన ఊరుతున్నాయి. ముక్కుతో గాలిని
నిండుగా పీల్చుకుంటూ నెమ్మదిగా వొదులుతూ నియంత్రించుకునేందుకు
ప్రయత్నించింది. కానీ లోపలి నుంచీ వొస్తున్న హోరును ఆపుకోలేక పోతుంది.
ఆటోలో నుండే భళ్ళున వాంతి చేసుకున్నది. నోరు, ముక్కు, కళ్ళ నిండా సుళ్ళు
తిరిగుతూ ఒక్క క్షణం ఊపిరి ఆగినట్టుగా అయింది.
ఆటో నడిపే అతను ఆటోను ఒక పక్కన ఆపి, పుక్కిలించుకోవడానికి నీళ్ళు అందిస్తున్నాడు.
****
*****
****
శరీరాన్ని చిన్నగా ఈడ్చుకుంటూ,
మెట్లెక్కి పై దాకా వొచ్చింది కానీ తాళం తీసుకొని ఇంట్లోకి అడుగు
పెడదామనుకునేసరికి వొళ్ళంతా భయంతో జలదరించింది. శరీరమంతా చెమటతో తడిచి
ముద్దయింది. చేతులూ, కాళ్ళూ వొణుకుతూ ఉన్నాయి. ఆ క్షణం అక్కడ నుంచీ
దూరంగా ఎక్కడకన్నా పారి పోదామా అనిపించింది. తాళం తీయాలనే ఆలోచన పక్కన
పెట్టి మెట్ల మీద అలాగే కూర్చుండి పోయింది.
వొళ్ళూ, మనసూ పుండు మాదిరిగా సలుపుతున్న ఈ స్థితిలో ఇంట్లోకి అడుగు పెట్టడమన్న అలోచనే ఆమెకు ఊపిరి ఆడనీయడంలేదు.
తలుపు తీసి లోపలికెళితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. అక్కడ “ఆమె” ఉంటుంది.
ఇట్టాంటి సందర్బాల్లో ఆమె ఖచ్చితంగా తనకెదురుగా వొచ్చి నిలబడుతుంది.
ఆమె తనను ఏమీ అనదు. ఊరకే అలా చూస్తూ కూర్చుంటుంది. ఎటు కదిలితే అటు తన
కళ్లను తిప్పి అదే పనిగా చూస్తుంటుంది. పారదర్శకమైన ఆ దేహాన్ని తను మొదట ఆ
ఇంట్లోనే చూసింది. చూడగానే మ్రాన్పడిపోయింది. తను చూస్తున్నదేమిటో
అర్థమవగానే గబగబా అక్కడ నుంచీ పారిపోయింది.
ఇట్టాంటి అనుభవం తన చదువుకూ, తను చేసే పనికీ వ్యతిరేకంగా తోచింది కానీ
త్వరలోనే ఆ పారదర్శకమైన దేహం వెనుకా, ఆ చూపుల వెనకా ఆకర్షణీయమైనదేదో
ఉన్నట్టుగా తనకి అనిపించింది. అందులో ఏదో మార్మికమైనదేదో ఉన్నట్టుగా
తోచేది. అది తనకు మాత్రమే అర్థమవుతున్నట్టుగా అనిపించేది.
“ఎవరు ఆమె?”
“మొగుడు రైల్వేలో ఉద్యోగమంట.”
“కొత్తగా పెళ్ళయిందంట.”
“అయితే ఈమె మాత్రం మంచిది కాదంట.”
“మొగుడు బయటికి పోగానే ఎప్పుడు మిద్దె మీదే అటూ ఇటూ తిరగతా ఉంటదంట.”
“ఏమయిందో ఏమో గానీ చివరకు ఆమె ఫ్యానుకు ఉరేసుకున్నదంట”
“చంపిండ్రో, ఆమే చచ్చి పోయిందో ఎవ్వరికీ తెలియదంట”.
“చివరకి, అద్దెకిచ్చినోళ్ళక్కూడా తెలియకుండా గప్‍చిప్‍గా బాడీని జీపులో వేసుకొని పోయిండ్రంట”.
“అభాగ్యురాలు పాపం. కానీ చావు ఎంత అదృష్టం”
“చావూ, చావూ ఆడవాళ్ళంటే ఎందుకు నీకంత ప్రత్యేకమైన ఇష్టం?”
పక్కింట్లో నుండి ఏదో దైవ స్తుతి శ్లోకాలుగా వినవొస్తుంది. రాత్రి ఏడు
గంటలకల్లా కల్లా తిని ఎనిమిదిన్నరకల్లా ఇట్టాంటి శ్లోకాలు, ప్రార్థనలు
వింటూ అటువంటి ప్రశాంతత ఇచ్చే రక్షణలో సుఖంగా నిద్రపోయే ఆన్నీ అమరిన
సుభద్రమైన సంసారం.
“అందరికీ హాయినీ, రక్షణనూ ఇచ్చే దేవుడు తన సంసారాన్ని మాత్రం ఎందుకనీ ఇలా చేసాడు?”
“ఈ రకంగా అలమటిస్తుంటే ఒక్క నాడన్నా తనని పట్టించుకోని గుడ్డి నాబట్ట కాదా వాడు.”
****
*****
****
మెట్ల సందుల్లోనించీ ఆకాశం చంద్రుని
లేత వెలుతురులో సన్నగా మెరుస్తా ఉంది. అలసట తీరినట్టుగా అనిపించింది కానీ
జంకు వల్ల కలిగిన అలజడి మాత్రం శరీరంలో ఇంకా ఉన్నట్టుగానే అనిపిస్తొంది
తన కతంతా చెప్పినపుడు సైకియాట్రిస్టు చెప్పిన మాటలను ఆమెకు గుర్తుకొస్తున్నాయి.
“ఆ ఇంట్లో దెయ్యం ఉండడమా, లేకుంటే ఉండకపోవడమా అనేది మీ చుట్టు పక్కల
వాళ్ళకు ఒక నమ్మకం కావొచ్చు. కాకుంటే ఒక భ్రాంతీ అయి ఉండవచ్చు. అంతకు మించి
వాళ్ళ అనుభవంలోగానీ, అనుభూతుల్లోగానీ మరేమీ లేదు”.
” కానీ మీ అనుభవంలో మాత్రం ఇది ఒంటరితనానికీ, జీవితంలోని స్తబ్ధతకు బదులుగా చావు పట్ల మీరు పెంచుకున్న ఆకర్షణగా నాకు తోస్తున్నది.”
“దెయ్యం పేరుతో ఉన్న ప్రతీ అనుభవంలోనూ మీరు ఆత్మహత్యతో
తలపడుతున్నట్టుగానే నాకు అనిపిస్తోంది. అది కాసేపు మిమ్మల్ని భయ పెడుతోంది.
మరి కాసేపు మిమ్మల్ని ఆకర్షిస్తోంది. ఈ ఘర్షణ ఇట్లాగే సాగడం మీకు మంచిది
కాదు. నిజంగా అట్టాంటి సంఘర్షిత క్షణాలే ఎదురైనప్పుడు వాటిలో ఊరకే పడి
కొట్టుక పోకుండా అదేమిటో తేల్చుకోవడమే బాగుంటుంది….”
ఫోన్ మోగుతోంది.
అవతల నీలిమ.
“రాత్రికి తోడుగా వొచ్చి పడుకునేనా”, అని అడుగుతున్నది.
తను ఇక నిశ్చయించుకోవాల్సిన సమయం వచ్చింది.
బదులుగా, ” పర్వాలేదులే” అని నచ్చచెప్పింది తను.
నీరసంగా అనిపించినా, నింపాదిగా తాళం తీసి లోపలికి అడుగు పెట్టింది.
లైట్ వెలిగించి, కిందింటి పిల్లాడ్ని పిలిచి, నాలుగిడ్లి కట్టించుకరమ్మని డబ్బులిచ్చి పంపింది.