14, జూన్ 2015, ఆదివారం

అరుణా షాన్‍బాగ్



ఇంకా నేను అమ్మ కడుపులో రూపు దాల్చక ముందు
ఎక్కడో ఉమ్మ నీటి సముద్రాలకావల  ఊహామాత్రపు జీవిగా సంచరిస్తున్న వేళలలో

నువ్వు ఒక అమాయక జీవితానికి తెర దించి
అక్కడి జనారణ్యపు మారుమూల
కళ్ళను తొలుచుకపోయే వెలుతురులోకి అనేకానేక  బాధలలోకి ప్రవేశించడాన్ని నేను ఊహిస్తాను

బహుశా అది ఒక చిన్న గది కావొచ్చు
కానీ అది నీ అనుభవాల గూడు

అక్కడ నువ్వు నేలకూ ఆకాశానికీ  మధ్య
చావుకూ బతుకుకూ నడుమ
నీ దేహాన్ని వేలాడదీసి కొత్త సంగతులేవో  రచిస్తూ ఉండి ఉంటావు


అప్పుడు అందరి శ్వాసలలో కాలం స్తంభించి సుషిప్తిలోనికి జారుతున్నప్పుడు
నువ్వొక్క దానివే నెగుడువై జ్వలిస్తూ నీ చుట్టూ పరిభ్రమిస్తున్న లోకానికి కావలి కాస్తూ ఉండి ఉంటావు

ఇంకా అందరూ నీ గురించి మాటాడుకుంటున్నప్పుడు
నినాద పరిభాషలో నిన్ను తలపోసుకుంటున్నప్పుడు

నెమ్మదిగా చప్పుడు కాకుండా నీ దేహంలాంటి నీ గదిలోనికి  మునివేళ్ళపై నడుస్తూ వొచ్చి
నీ ముఖంలోనికి తొంగి చూసినపుడు

వారికి నువ్వు దేహం గురించి, దేహ రాజకీయాల గురించి
హింస గురించి చావు బతుకుల గురించి పదే పదే గుర్తు చేసే ఉంటావు

నీ తలుపులు తెరుస్తూ మూస్తూ
దశాబ్ధాల తరబడి నీ లోనికి వొస్తూ పోతూ ఉన్న వారికి

అందరూ ఆపేసే చోటే
ఒకోసారి అసలు జీవితం మొదలవుతుందని చెప్పడం కోసం

కొద్ది కొద్దిగా నీ జీవన పరిమళం, నీ ఆశ , ఎక్కడో లోతు అంచుల్లో దరులకు కొట్టుకొనే నీ శ్వాసల సవ్వడిని
గురుతులుగా తుంచి ఇచ్చే ఉంటావు

ఇన్నేళ్ళ జీవితం తర్వాత
లేదా ఇప్పుడు "ముగింపు" అని చెప్పుకుంటున్న దానికి కాస్త ముందర
కొద్దికొద్దిగా నీలోనుండి నువ్వు మరలి పోతూ

నువ్వొక్కదానివే ఎందుకింత భారాన్ని మోయాల్సి వొచ్చిందో 
బహుశా నీ చుట్టూ తిరిగే వారినైనా అడిగే ఉంటావు








మాతృక పత్రిక- జూన్-2015  ప్రచురితం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి