19, డిసెంబర్ 2017, మంగళవారం

బూడిద రంగు దుఃఖం






చేయిచాచిన వొణుకు తన దేహం కావొచ్చు

శరీరంలో నిప్పుకణికలు దాచుకొని కనలి కనలి కాలి
అరిగిన తన అరచేతుల గీతలలాగే
చివరికి పొగధూళిలా  కదలి  ఆమె ఆకాశమై సాగిపోవచ్చు

నలభైల వయసు తన ముందటివాళ్ళ అనేక మరణాలను చూడడానికే కదా సదా సిద్దపడాలి

వాళ్ళు ఒకనాటికి  మరణిస్తారని నిక్కచ్చిగా రాయవొచ్చుకానీ

పదేపదే ధారగా సాగే పలవరింతలాంటి సంభాషణలను
వినేందుకొక మనిషంటూ లేని
బొగిలిపోయి కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్న
నిట్టాడి గుంజలాంటి నిశ్శబ్ధాన్ని మాత్రం ఎప్పటికీ ఊహించలేము

ఏదైనా మాటాడడం, మాటలమధ్యన మనుషులను అనేక చరిత్రలుగా నిటారున నిలబెట్టడం
బహుశా ఆడవాళ్ళకు తెలిసినంతగా మరెవరికీ  తెలియకపోవొచ్చు

ఎటూ కదలికలు లేక చుట్టూ దడికట్టుకపోయేలా పెరిగిన పిచ్చిమొక్కల వంటి జాములలో 
ఎవరు రాక ముసురుకపోయిన ఇలాంటి మధ్యాహ్నపు వేళలలో
అటు ఆకలీ కాక ఇటూ నిద్దురా రాక
పక్కటెముకలలో పొడుచుకవచ్చే నొప్పిలాంటి గ్నాపకాలలో

ఆమె ఒక్కతీ-

ఊరకే అలా పడుకుని ఉన్నానని బదులు చెపుతున్నప్పుడు
కడుపులో చేయిపెట్టి దేవిన కదలికల రంపపు పళ్ళ రాపిడి


వాళ్ళు ఒకనాటికి మరణిస్తారని నిక్కచ్చిగా రాయవొచ్చుకానీ

నిస్సహాయమవుతున్న దేహపు భాగాలతో
తమను తాము పేని  కొండకొమ్మున  వేలాడే తేనెపట్టు లాంటి- నేనును
అందుకోజాలని అతి పలుచని గాద్గదతను మాత్రం - 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి