31, అక్టోబర్ 2011, సోమవారం

గడాఫీ


ఎటువంటి కాలం ఇది?

తగలరాని చోట బలమైన గాయమేదో తగిలి
జుట్టు పట్టుకొని నిన్ను బలంగా ఈడుస్తున్నప్పుడు
ముఖమంతా నెత్తుటి చారికలతో
జరుగుతున్నదేమిటో గుర్తించేలోగా
దెబ్బ మీద దెబ్బ మీద విసురుగా తగులుతున్నప్పుడు

అనేకసార్లు
ముఖంమీద ధారలు కట్టే నెత్తుటి కన్నా

నీ మస్థిష్క మూలలలో ఒక సంభ్రమానుభూతియై
ఒత్తుకపోయే మృత్యువుకన్నా

వెగటుగ భయం కలిగించే ప్రశ్న ఒకటి
తలెత్తుతూనే ఉంటుంది

నీ చుట్టూ అల్లబడిన కంచెలో
నువ్వొక చిన్న గొర్రెపిల్లవు

నోటికంది వచ్చే నాలుగు గడ్డి పరకలు తప్ప
ఇంకేదీ పట్టని నీ తెలివికి హద్దు ఫలానా అని
తెలుసుకొనేలోగా నువ్వొక బందీవి

నీ చుట్టూ ఊపిరాడకుండా పేర్చిన వార్తల దొంతరలు

నువ్వు తలెత్తి చూసేలోగా నీ మీద నీకే
అనుమానం కలిగించే ప్రతికథనాలు

నిజమే
ఇది దూరాలు కరిగి దగ్గరవుతున్న కాలం
సముద్రాల కావల చిన్న అలికిడికే
పడకటింట్లో ఉలిక్కి పడి లేచే కాలం

కానీ నీ ఇంట్లో జరుగుతున్నదేమిటో నీకు తెలిసేలోగా
ఒకదానికొకటి పొంతన లేని నాలుగు రకాల కథనాలు

సత్యాసత్యాల విచికిత్సలో
సమస్తమూ రద్దయి
కథకుడొక్కడే త్రివిక్రముడై సమస్త లోకాలనూ ఆవహిస్తున్న కాలం

మనుషుల చావుల కన్నా
ఊహించని ఓటముల కన్నా
ఒక భయద వాస్తవమై ఇప్పుడు నాలికలు చాస్తున్న
ఈ యుద్ధం పేరు విశ్వాసాల విధ్వంసం

ఇది నమ్మకంగా
అపనమ్మకాలను పేని
నీ మెడను కాలం కోట గుమ్మానికి ఒక గురుతుగా వేలాడదీస్తున్న కాలం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి