12, మార్చి 2016, శనివారం

నీ పేరు



రోహిత్ అని నేను రాస్తున్నప్పుడు

మాటవరుసకు నక్షత్ర ధూళితో పొదిగిన దేహాల గురించి
మాటాడుతుంటావు గానీ
పాలపుంతల పరిధులకు ఆవలి లోకాల దాటి
విశ్వవ్యాపితమయ్యే గానాలవైపుకు
చెవినొగ్గి నెమ్మదిగ నీవు వింటుంటావు

ఒక దారి కొసల కంటా
నువ్వు పయనమై పోతున్నప్పుడూ అంతే -

ఎప్పటిలాగే తెలిసిన భద్రమైన అడుగుల జాడల వెనుక
రేపటికి కొన్ని ప్రశ్నార్ధక చిహ్నాలను ఖాళీలుగా వొదిలి పోతావు

ఎవ్వరి మీద కోపగించలేక నీపైన నీకే అసహనమని అంటున్నప్పుడు
బయటకు కనపడేలా చేసిన యుద్ధాల వెనుక
లోతైన గాయాల ఉప్పెనయ్యే కదూ మమ్మల్ని ముంచి వేసావు?

గాయపడకుండా ప్రేమించలేమని
పొసగని వైరుధ్యాల నడుమ  పుట్టుకని తలుచుకుంటూ
శరీరాన్నొక ఖాళీ పాత్రలా ఇంటి గుమ్మాల ముందర వేలాడదీసి హడావిడిగా వెళ్ళిపోయావు?

 ప్రకృతికీ దుఃఖానికీ భాషకూ దూరమైన మనుషులనూ ప్రేమించకుండా ఉట్టినే విడిచిపోలేని
నీ చివరి సంతకం కింద
నిన్ను దేశ ద్రోహిగా రాసిన రాతలు
నీ పేరు పక్క న గీసిన కొంగిరి గీతలు
మరీ మరీ నువ్వెంత అపురూపమైన  ఊహవో లోకానికి  చాటుతాయి


అబద్దపు అక్షరాల బొక్కసాల కింద ఊపిరాడక కునారిళ్ళుతున్న
మనిషి వ్యక్తీకరణకూ బాధకూ ప్రేమకూ వ్యక్తావ్యక్తమై నీడలను దాటి నక్షత్రాల దిశకు
నీ చివరి మాటలు వొక ఆశ్వాసననిస్తాయి

నిన్ను చదివిన ప్రతీసారీ నేను నీతోపాటుగ మరణించి
పలుమార్లు పుడుతుంటాను




(స్వాప్నికుని  మరణం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి